Unknown Vishnu Avatars, Hindu Mythology

Forgotten Vishnu Avatars in Hindu Mythology

ఈ భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీమహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని మనం చెప్పుకొంటూ వచ్చాం. భాగవత పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. వాటిలో మనకి తెలిసింది ఆయన యొక్క దశావతారాలు మాత్రమే! దశావతారాల్లో ఒకటి ఇంకా పుట్టనే లేదు. ఈ కలియుగంలో పుట్టాల్సి ఉంది. ఇక పోతే దశావతారాల్లో చేర్చబడని ఆ మిగిలిన 14 ప్రసిద్ధ అవతారాల గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. 

హయగ్రీవ

హిందూమతంలో, హయగ్రీవ స్వామిని విష్ణువు యొక్క మరొక అవతారముగా భావిస్తారు. హయగ్రీవుడ్ని జ్ఞానానికి, వివేకానికి, వాక్కుకి, బుద్ధికి, ఇంకా అన్ని విద్యలకి దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా కూడా పూజిస్తారు.

ఈ అవతారంలో శ్రీ మహా విష్ణువు గుర్రం తల, మానవ శరీరం కలిగి ఉంటాడు. హయగ్రీవుడు తెలుపు రంగులో ఉంటాడు, అలానే తెల్లని వస్త్రాలను ధరిస్తాడు. హయగ్రీవుడికి ‘హయశీర్ష’ అనే మరో పేరు కూడా ఉంది. సంస్కృతంలో ‘హయ’ అంటే గుర్రం మరియు ‘శీర్షము’ అంటే తల. గుర్రపు  తల కలవాడు కాబట్టే అతనికి హయగ్రీవుడు అని పేరు వచ్చింది. శ్రీమద్ భగవద్ పురాణం ప్రకారం, హయగ్రీవుడిని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి అని కూడా పిలుస్తారు. 

హయగ్రీవ అవతారం మధు మరియు కైటభ అనే ఇద్దరు రాక్షసుల కారణంగా ఉనికిలోకి వచ్చింది. ఈ ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచారు. అప్పుడు బ్రహ్మ  విష్ణువు యొక్క సహాయాన్ని అర్దిస్తాడు. అప్పుడు విష్ణువు ఈ భూమిపై హయగ్రీవుడిగా అవతరించి, మధు మరియు కైటబ్‌లను చంపి, వేదాలను తిరిగి తీసుకువెళతాడు.

వేద వ్యాసుడు

వ్యాసుడు ద్వాపర యుగంలో జన్మించిన అమర ఋషి. అతను హిందూ పురాణాలలోని నాలుగు వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు భారతం, భాగవతంతో పాటు అష్టాదశ పురాణాలను కూడా రచించాడు వ్యాసుడు. 

వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు తన కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ… అందరికీ కర్తవ్యబోధ చేస్తూ… తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు. అందుకే ఆయనని చాలా మంది విష్ణువు అవతారంగా భావిస్తారు.

సనాతన ధర్మంలోని అమూల్యమైన శాస్త్రాలన్నింటినీ ప్రపంచం కోల్పోయినందున విష్ణువు వేదవ్యాసుని  అవతారాన్ని తీసుకుంటాడు. తద్వారా అతను మళ్లీ అన్ని శాస్త్రాలన్నిటినీ తిరగ వ్రాసాడు. యుధిష్ఠిరుడు పుట్టడానికి 600 సంవత్సరాల ముందు వేద వ్యాసుడు జన్మించాడు. అంటే మహాభారతం జరగడానికి దాదాపు 600 సంవత్సరాల ముందే వేదవ్యాసుడు భారతాన్ని తిరిగి రచించారు. వేదవ్యాసుడు ఇప్పటికీ ఈ భూమిపై జీవించే ఉన్నారు. బద్రీనాథ్‌లోని మహా బదరికాశ్రమంలో నివసిస్తున్నారు. అయితే కలియుగంలోని సాధారణ మానవులకు ఈ ప్రదేశం అందుబాటులో ఉండదు.

మహీదాస ఐతరేయ

హిందూ శాస్త్రాల ప్రకారం, మహిదాస ఒక ఋషి కుమారుడు. ఇతను ‘ఐతరేయ బ్రాహ్మణం’ అనే బ్రాహ్మణాన్ని రచించాడు. ఐతరేయ బ్రాహ్మణం అనేది ఋగ్వేద శాఖకి చెందినది. ఇది పురాతన భారతీయ పవిత్ర శ్లోకాల సేకరణ. 

మహిదాస అనే పేరు వెనుక చాలా గొప్ప అర్ధమే ఉంది. ‘మహి’ అంటే భూమి’ ‘దాస’ అంటే దాసుడు లేదా సేవకుడు అని అర్ధం.  మహిదాస అంటే భూమికి సేవకుడు అని అర్ధం. 

మహిదాస శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైనందున  తన సహజ యోగ్యతతో తక్కువ వ్యవధిలో సనాతన ధర్మ శాస్త్రాలన్నింటినీ నేర్చుకున్నాడు. అందుకే మహిదాసుని భారతీయ తత్వశాస్త్రం యొక్క పితామహుడిగా పేర్కొంటారు. 

యజ్ఞం

శ్రీ మహా విష్ణువు యజ్ఞం అని పిలువబడే మరొక అవతారం తీసుకున్నాడు. యజ్ఞానికి యాగం అనే మరొక పేరు కూడా ఉంది. అలానే త్యాగం అనే వ్యక్తిత్వం ఉంది. యజ్ఞం అంటే ఆపద సమయంలో మానవాళిని కాపాడే దేవుడు. అందుకే విష్ణువును త్యాగానికి అధిపతి అని కూడా అంటారు.

యజ్ఞం లేదా యాగం ఇలా ఏ పేరుతో పిలిచినా… ఈ పవిత్రమైన కార్యక్రమం హిందువుల యొక్క ఒక విశిష్టమైన సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడమే ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. యజ్ఞం వల్ల శ్రీహరి దేవతలకి త్రిలోక భయాలను పోగొట్టాడు.

సాధారణంగా యజ్ఞం అనేది హోమం వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో ఏవైతే సమర్పిస్తారో అవన్నీ దేవతలకు చేరుతాయి.

ఇది కూడా చదవండి: Mandodari’s Significance in Hindu Mythology

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top