ఒకసారి శ్రీకృష్ణుడు తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాడు. దేవతలు, ఋషులు అందరూ కారణం తెలియక ఆలోచనలో పడ్డారు.
అప్పుడు నారద మహర్షి కృష్ణుడి దగ్గరకి వచ్చి “స్వామీ ఈ నొప్పి మీకు ఎలా తగ్గుతుంది?” అని వినయ పూర్వకంగా అడిగాడు.
అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, “నా నిజమైన భక్తుల కాలి దూళి నా తలపై పడిన వెంటనే ఈ నొప్పి తగ్గుతుంది” అని.
ఈ విషయం విన్న రుక్మిణి, సత్యభామలు చాలా భయపడ్డారు. భగవంతుని తలపై కాళ్ల దూళి వేయడం ఎంతో పాపమని భావించారు.
అలా చేస్తే నరకానికి వెళ్లాల్సి వస్తుందని వారు అనుకున్నారు. అందుకే వారు ఆ పని చేయడానికి ముందుకు రాలేదు.
నారదుడు ఈ విషయం గోకులంలోని గోపికలకు చెప్పాడు. వారు కృష్ణుడి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు.
గోపికలు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే తమ కాళ్ల దూళిని తీసి ఎంతో ప్రేమతో కృష్ణుడికి పంపించారు.
అది చూసిన నారదుడు ఆశ్చర్యపోయి, “మీరు చేసిన ఈ పనికి నరకానికి వెళ్లాల్సి వస్తుందని తెలుసా?” అని అంటాడు
అప్పుడు గోపికలు “మేము నరకానికి వెళ్లినా పర్లేదు. కృష్ణుడు సుఖంగా ఉంటే మాకు చాలు” అని చెప్పారు. వారి సమాధానం అందరినీ కదిలించింది.
అంతటి స్వార్థరహిత భక్తిని చూసి కృష్ణుడు సంతోషించాడు. నిజమైన ప్రేమ అంటే త్యాగం అని ఈ కథ అందరికీ తెలియజేస్తుంది.