పురాణాలలో ఎంతోమంది ధీర వనితలు ఉన్నా… వారిలో కేవలం ఐదుగురిని మాత్రమే *పంచకన్యలు* గా చెప్పుకొంటాం. అలాంటి పంచకన్యలలో మండోదరి కూడా ఒకరు. పంచకన్యలు అంటే ఎవరో..! వారి ప్రత్యేకత ఏంటో..! ఈ స్టోరీ ఎండింగ్ లో చెప్పుకొందాం.
ఇక మండోదరి విషయానికొస్తే, ఆమె రావణుడి భార్య అనీ, రాజ వైభోగాలు అనుభవించింది అనీ అనుకొంటాం. కానీ, నిజానికి తన జీవితం ఒక పోరాటంలా సాగిందనీ, పుట్టింది మొదలు… మరణించేంత వరకు తన జీవితమంతా త్యాగాలకే సరిపోయిందనీ మీకు తెలుసా! అంతేకాదు, పార్వతిదేవి శాపానికి ఎందుకు గురయింది? సీతకి, ఈమెకి మద్య గల సంబంధం ఏమిటి? రావణుడు మరణించాక ఈమె ఎవరిని వివాహమాడింది? ఇలాంటి ఎన్నో మండోదరి లైఫ్ సీక్రెట్స్ గురించి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం టాపిక్ లోకి వచ్చేయండి.
పూర్వ జన్మ వృత్తాంతం
మండోదరి జన్మ వృత్తాతo గురించి పురాణాలలో అనేక రకాలుగా వర్ణిస్తూ వచ్చారు. కానీ, వాటన్నిటిలోనూ వాల్మీకి రామాయణం ఒకటే సరైన ఆధారం. దీని ప్రకారం చూస్తే, ముఖ్యంగా 3 కథలు ప్రచారంలో ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఆ కథలని చెప్పుకొందాం.
పార్వతీ దేవి శాపం
పూర్వo దేవలోకంలో మథుర అనే ఓ దేవకన్య ఉండేది. ఆమె చాలా అందాల రాశి. ఒకసారి ఆమె కైలాశానికి వెళుతుంది. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడ ఉండదు. ఇక కైలాశనాథుడిని చూడగానే ఆయనపై మనసు పడుతుంది. ఈమె అందానికి దాసోహమై శివుడు కూడా తన పొందు కోరుకొంటాడు.
ఇంతలో పార్వతి రానే వస్తుంది. రాగానే మథుర శరీరానికి అoటిన విభూతిని చూస్తుంది. పార్వతికి పట్టరాని కోపం వస్తుంది. వెంటనే మథురను బావిలో కప్పగా మారమని శపిస్తుంది. తాను చేసిన తప్పును క్షమించమని ఎంతగానో వేడుకొంటుంది. శివుడు కూడా ఆమెని కరుణించి, శాపాన్ని ఉపసంహరించుకోమని కోరతాడు. అప్పుడు పార్వతి 12 సంవత్సరాలు బావిలో కఠోర తపస్సు చేస్తే, శాప విముక్తి కలుగుతుందని చెబుతుంది.
శాప కారణంగా, మథుర భూలోకమునకు వచ్చి కప్పగా మారి ఒక బావిలో 12 సంవత్సరములు కఠోర తపస్సు చేస్తుంది. అనంతరం ఆమె పసిపాపగా మారుతుంది.
మాయాసురుడి ధ్యానం
పూర్వం మయాసురుడు అనే మహా శిల్పి ఉండేవాడు. అతను మహా మహా నగరాలను సైతం ఎంతో గొప్ప చాతుర్యంతో అద్భుతంగా నిర్మించగలడు. అందుకే అతడికి ‘మయబ్రహ్మ’ అని పేరు. ఇతను విశ్వకర్మ యొక్క కుమారుడు. మయాసురుడి భార్య పేరు హేమ. ఆమె ఓ గంధర్వకాంత.
ఈ దంపతులకి మాయావి మరియు దుందుభి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ ఆడపిల్ల లేదనే చింత వారికి వుండేది. అందుకే రాజ్యానికి దూరంగా వచ్చి ఆ రాజ దంపతులు దైవ ధ్యానం చేసే వారు.
ఒకరోజు వారు తపస్సు చేస్తుండగా, దూరంగా ఉన్న ఓ బావి లోపలి నుండి పసిపాప ఏడుపు వారికి వినిపిస్తుంది. చుట్టూ వెతకగా బావిలోని మథుర అప్పుడే పసిబిడ్డగా మారి ఏడుస్తూ కనిపించింది. చుట్టుప్రక్కల అంతా వెతకగా వారికి ఎవరు కనపడరు. దైవమే తమకు ఆ పాపను ప్రసాదించాడనుకొని వాళ్ళు ఆ పాపను తమ రాజ్యానికి తీసుకొని వచ్చి మండోదరి అనే పేరు పెట్టి పెంచ సాగారు.
పేరు వెనుక ఉన్న రహశ్యం
మండోదరి అనే పదాన్ని మండ + ఉదరి = మండోదరి అని చెప్తారు. ఇక్కడ ‘మండ’ అంటే – మండూకము లేదా కప్ప అని అర్ధం. ‘ఉదరి’ అంటే – ఉదరము లేదా పొట్ట అని అర్ధం. టోటల్ గా మండోదరి అంటే – కప్ప పొట్ట వంటి పొట్ట కలిగినది అని అర్ధం. 12 ఏళ్ల పాటు బావిలో కప్ప రూపంలో జీవించి, ఆ తర్వాత కప్ప లాంటి పొట్ట కలిగిన ఓ శిశువు రూపంలోకి మారటం చేత ఈమెకి ఆ పేరు వచ్చింది.
అంతేకాదు, కప్ప పొట్టవంటి పొట్టను కలిగి ఉండడము మహారాణి లక్షణమని సాముద్రికశాస్తములో చెప్పబడినది. దానికి అణుగుణముగానే మండోదరి త్రిలోక విజేత అయిన రావణాసురునికి పట్టమహిషి అయింది.
రావణుడితో వివాహం
పురాణాలలో అత్యంత అందమైన స్త్రీలుగా చెప్పుకొనే అతి కొద్దిమందిలో మండోదరి కూడా ఒకరు. ఈమె అత్యంత సౌందర్యవతి మాత్రమే కాదు, అత్యంత సుగుణవతి, అత్యంత సౌశీల్యవతి కూడా.
ఒకసారి మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరిస్తున్న సమయంలో, లంకాధిపతి అయిన రావణుడు వేటకై అటు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తన అందచందాలకు ముగ్దుడై… ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొంటాడు.
వెంటనే ఆ విషయాన్ని మయాసురుడితో చెప్పి, తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని కోరతాడు. రావణుడి బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వటానికి ఇష్టపడడు. వాస్తవానికి మొదట మండోదరికి కూడా ఈ వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. కానీ, రావణుడి బలం ముందు తన తండ్రి ఓడిపోతాడని భావించి, ఒప్పుకొంటుంది.