Ashta Vakra Katha, Hindu Mythology

Philosophical Significance of Ashta Vakra Katha

పురాణాలలో ఎంతోమంది ఋషుల జీవిత చరిత్రల గురించి విని ఉంటారు.  కానీ, అష్టావక్రుడి గురించి మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే విని ఉంటారు. నిజానికి అష్టావక్రుడు చాలా గొప్ప ఋషి. ఈయన అనేక భౌతిక వైకల్యాలతో జన్మించినప్పటికీ, లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, భగవద్గీతతో సమానమైన అష్టావక్ర గీతని కూడా రచించాడు. ఇంతకీ ఈ అష్టావక్రుడు ఎవరు? ఆయన ప్రత్యేకత ఏమిటి? అష్టావక్రగీత అంటే ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

అష్టావక్రుడు ఎవరు?

అష్టావక్రుడు ఎవరో తెలుసుకోనేముందు తన పుట్టుకకు దారితీసిన విపరీత పరిస్థితుల గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. 

త్రేతాయుగంలో జనక మహారాజు మిథిలా నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో మిథిలకి సమీపంలో ఉద్ధాలకుడు అనే ముని తన శిష్యులకి వేద వేదాంగాలు  బోధిస్తూ ఉండేవాడు. వారి వేదఘోషతో అరణ్యమంతా పులకించిపోయేది. ఆయన దగ్గర ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు కూడా వేదాభ్యాసం చేస్తూ ఉండేవాడు. ఆయనో గొప్ప విద్యావేత్త, మరియు నిరంతర తపోనిరతుడు. అంతేకాదు, ఏకాగ్రతతో ఏకదీక్షతో ఆరు వేదాంగాలతో కూడిన వేదాధ్యయనం చేసాడు. ఏకపాదుని సంకల్పానికి మెచ్చి ఉద్ధాలకుడు తన కూతురు సుజాతనిచ్చి వివాహం చేస్తాడు. 

సుజాత ఎంతో ఉత్తమురాలు. భర్తకెన్నో సపర్యలు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన దగ్గరికి ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేసేవారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు. కొంతకాలానికి సుజాత గర్భవతి అయింది. ఆమె గర్భములో నున్న శిశువు తన తండ్రి చెప్పే వేదాలు నిరంతరం వల్లె వేస్తూ ఉండేవాడు. 

తండ్రి శాపం 

ఏకపాదుడు ఎప్పటిలానే ఓ రోజు వేదం పారాయణం చేస్తుండగా,  ఒక పదాన్ని ఎనిమిదిసార్లు తప్పుగా ఉచ్చరించారు. అయితే, ఈ వేదాలను వింటోన్న గర్భంలో ఉన్న శిశువు… ‘మీరు తప్పుగా ఉచ్ఛరిస్తున్నారు’ అని తన తండ్రితో పలికాడు. 

గర్భంలోని శిశువు తన లోపాన్ని ఎత్తిచూపడంతో ఆగ్రహించిన ఏకపాదుడు ‘నేను ఎనిమిది చోట్ల తప్పు చదివానన్నావు కాబట్టి నువ్వు అష్ట వంకర్లతో జన్మిస్తావు’ అని శపించాడు. అలా తండ్రి శాపం కారణంగా ఆ శిశువు 8 వంకర్లతో జన్మించాడు. 

అయితే,  నిద్రాహారాలు లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని చెప్పటమే కాకుండా, తన వేదోచ్చరణనే తప్పు తప్పుపట్టినాడు కావటం చేత తనకు పుట్టబోయే బిడ్డ దివ్యమహిమలు కలవాడని గ్రహించి ఏకపాదుడు ఎంతగానో సంతోషించాడు. కానీ, తననే తప్పు పట్టాడు కాబట్టి కోపం తట్టుకోలేకపోయాడు. అందుకే శపిస్తాడు. 

తండ్రికి శిక్ష

ఒకరోజు సుజాత తన భర్త అయిన ఏకపాదునితో వంటకి కావలసిన సరుకులు తెమ్మని చెప్తుంది. కానీ, ఆ సమయంలో అతని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటాడు. వాటికోసం బయలుదేరి వెళుతూ ఉండగా… ఒక ఆలోచన తడుతుంది. అది ఏంటంటే… రాజు ఆస్థానంలో పండిత సభలో వాగ్వివాదానికి దిగటం. 

వాస్తవానికి జనకుడు ఎంతో గొప్ప వ్యక్తిత్వం గలవాడు. పేరుకి మహారాజైనా అతడొక వైరాగ్య కామకుడు. ఆత్మజ్ఞ్యానాన్ని  పొందాలనే తపనతో ఉండేవాడు. ఈ విషయంలో అతని ఆకాంక్ష ఎలాంటిదంటే…  ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞ్యానులందరినీ వెతికి మరీ తన సభలో కొలువుతీరేలా చేశాడు. వారందరినీ అతిధి మర్యాదలతో సత్కరించి, వారి  బాగోగులు చూస్తూ, వారిని సభలో ఆధ్యాత్మికతని  బోధించమనేవాడు.

రోజులో ఎక్కువ సమయం వారు చేసే ఆధ్యాత్మిక బోధనలు వింటూ కాలం గడిపేవాడు. మద్య మద్యలో వారితో సంవాదం చేస్తూ… చర్చలు జరుపుతూ… జ్ఞ్యానోదయానికి మార్గాలు అన్వేషించేవాడు.  ఇలా ఆధ్యాత్మిక గ్రంధాలను అవపోశన పట్టిన పండితులతో రోజులు, వారాలు, నెలల తరబడి వారి వాద, ప్రతివాదాలు వింటూ ఆనందించేవాడు. 

ఇక ఈ వాదాలు ముగిసిన తరువాత గెలిచిన పండితుడిని బహుమతులతోను, సంపదతోను సత్కరించి అతడికి  తన సభలో ఒక ఉచిత స్థానం, లేదా పదవి కల్పించేవాడు. అలా ఎంత మందిని తన సభలో చేర్చుకున్నా కూడా ఎవ్వరూ తన జ్ఞ్యాన దాహాన్ని తీర్చలేకపోయారు. 

ఇదే క్రమంలో మళ్ళీ జనక మహారాజు సభలో పండిత సంవాదం జరుగుతూ ఉంటుంది. ఆ వాదంలో వరుణుని కుమారుడైన వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వము ఇస్తానని, ఓడినవారు జలంలో నిమర్జనం అయి ఉండాలని నియమం ఉంటుంది. అది విని, ఎలాగైనా ఆ వాదంలో గెలవాలని నిర్ణయించుకుంటాడు ఏకపాదుడు. 

అనుకున్న ప్రకారమే వందితో వాదానికి దిగుతాడు. కానీ, అతనితో తలపడి గెలవలేక ఓడిపోతాడు. నియమం ప్రకారం జలంలో నిమర్జనం అయి వుండిపోతాడు. 

ఇదికూడా చదవండి: Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology

Nakul Sahadev, the most underrated Pandava
Most Underrated Characters in Mahabharata

అష్టావక్రుని జననం

ఇలా కొంతకాలం గడుస్తుంది. సుజాత ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకర్లు కలిగి ఉంటాడు. అందుకే అతనికి అష్టావక్రుడని పేరు పెడతారు. 

ఇక్కడ అష్ట అంటే ఎనిమిది, వక్ర అంటే వంకర్లు అని అర్ధం. అష్టావక్రుడు అంటే ఎనిమిది వంకర్లు కలిగినవాడు అని అర్ధం. 

సనాతన ధర్మంలో 8 అనే సంఖ్యకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాలైన నుదురు,  ఛాతి, చేతులు, కాళ్లు, మోకాళ్లని ఈ సంఖ్య సూచిస్తుంది. ఈ భాగాలన్నీ సరిగ్గా ఉంటేనే భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయగలం. 

అయితే, ఈ 8 భాగాలు వంకర్లు కలిగి ఉన్నప్పటికీ అష్టావక్రుడు విపరీతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడికే అత్యంత ప్రియమైన వాడిగా మిగిలిపోయాడు. ఈ ఋషి గురించి మహాభారతంలోని అరణ్యపర్వంలో చెప్పబడి ఉంది. 

అష్టావక్రుని వాదన

పెరిగి పెద్దవాడైన అష్టావక్రుడు సకల విద్యలూ నేరుచుకుంటాడు. కొంత కాలానికి అసలు విషయం తెలుసుకొంటాడు. జల నిమర్జనంలో ఉన్న తన తండ్రిని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తల్లి ఆశీర్వాదము తీసికొని బయలుదేరతాడు. 

జనక మహారాజు ఆస్థానానికి వెళ్లబోతుండగా ద్వారము దగ్గర  ద్వారపాలకులు ఇతనిని ఆపేస్తారు. ఇక్కడ వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని చెప్తారు. అప్పుడు అష్టావక్రుడు తన పాండిత్య జ్ఞానంతో అనేక శాస్త్ర విషయాలు తెల్పి దారివ్వమ్మని అడుగుతాడు. ఆయనకున్న పాండిత్య అనుభవాన్ని తెలుసుకొన్న ద్వారపాలకులు మారు మాట్లాడకుండా అతనికి దారిస్తారు. 

అష్టావక్రుడు నేరుగా జనకమహారాజు సభకి వెళ్లి అక్కడ పండితుల సమక్షంలో ఉన్న వందితో తనకి వాదోపవాదాలు ఏర్పాటు చేయమని కోరతాడు. నువ్వు బాలుడవు… వందితో వాదించలేవు… కాబట్టి కుదరదన్నాడు. వెంటనే అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేస్తాడు. దీంతో వాదనకు జనకుడు అంగీకరించక తప్పలేదు. 

ఇక వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వీరి మద్య వాదన సాగుతుంది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ వాదములో చివరకు బాలకుడైన అష్టావక్రుడు వందిని ఓడించాడు. తర్వాత జనక మహారాజు బాలుడైన అష్టావక్రుని కోరిక ఏమిటో చెప్తే తప్పక తీరుస్తానని హామీ ఇస్తాడు. వెంటనే ఇక ఆలస్యం చేయక అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలనిమర్జితుని చేయుమని కోరతాడు. 

తండ్రిని విడిపించుట

ఇచ్చిన మాట ప్రకారం జనకుడు తన తండ్రిని అష్టావక్రునికి అప్పగిస్తాడు. కానీ, ఇక్కడో రహశ్యం దాగి ఉంది. నిజానికి వందితో వాదములో ఓడిన వారందరినీ జలంలో నిమర్జనం చేయాలనేది నియమం కదా! కానీ, ఇక్కడ ఓడిపోయిన వారేవ్వరినీ జల నిమర్జనం చేయలేదు. వారందరిని వంది తన తండ్రైన వరుణుడు చేసే యజ్ఞము దగ్గరికి పంపుతాడు . 

ఈ విషయం తెలుసుకొన్న అష్టావక్రుడు వందిని, మరియు అతని వ్యక్తిత్వాన్ని ఎంతో కీర్తిస్తాడు. దీంతో అష్టావక్రుని మహోన్నత్యం  నలుదిశల వ్యాపిస్తుంది. జనక చక్రవర్తి తండ్రీ కొడుకులైన ఏకపాదుని, అష్టావక్రుని ఇద్దరినీ సత్కరిస్తాడు. ఇంకా అష్టావక్రుని జ్ఞాన బోధనలనుండీ అద్వైత సిద్ధాంత రహస్యములను తెలుసుకొంటాడు. దీంతో అతని జ్ఞాన దాహం తీరిపోతుంది. 

అష్టావక్రుని శాపవిముక్తి

అష్టావక్రుని పితృభక్తికి ఏకపాదుడు ఎంతో సంతోషించాడు. తన కుమారుడి పాండిత్య ప్రతిభని చూసి గర్వపడ్డాడు. సారంగ నదిలో స్నానమాచరిస్తే, తన శరీరంలోని వంకర్లన్నీ పోతాయని వరమిస్తాడు. వెంటనే అష్టావక్రుడు తన తండ్రి కోరిక మేరకు ఆ నదిలో స్నానమాచరించి సుందర రూపంతో బయటికి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితండ్రులకు సేవ చేస్తూ  కాలం గడుపుతాడు. 

అష్టావక్రునికి యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు  అతనికి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటారు. వదాన్య మహర్షి కుమార్తె అయిన సుప్రభను అతనికిచ్చి వివాహము చేస్తారు. వివాహానంతరం అష్టావక్రుడు భార్యతో సహా ఆశ్రమమునకు వచ్చి తపస్సు చేసుకొంటూ ఉండిపోతాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రమం ఎంతో ఆదర్శప్రాయంగా సాగుతుంది. కొంతకాలానికి వీరికి పుత్ర సంతానం కూడా కలుగుతుంది. 

కొంతకాలానికి అష్టావక్రుడు పుష్కర తీర్ధములో తపస్సు చేసుకొంటూ… మనస్సు పరమాత్మ మీద లగ్నం చేసి,  శ్రీకృష్ణుని దర్శించి, ఆయన పాదములపై పడి పరమపదిస్తాడు. అనంతరం అతడు గోలోకానికి వెళ్లి మోక్షము పొందుతాడు. అష్టావక్రుని గురించి ఇంకా అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. 

ఇదికూడా చదవండి: Tulsi Vivah 2023: ఈఏడాది తులసి వివాహ ప్రత్యేకత ఏమిటో తెలుసా!

The Untold Story of Barbarik in Mahabharata
The Unknown Story of Barbarik in Mahabharata

మొదటిది: 

గోపికల పూర్వ వృత్తాంతం

ఒకరోజు అష్టావక్రుడు నదిలో స్నానమాచరిస్తూ ఉండగా… అప్సరసలు అక్కడికి వస్తారు. ఇతని కురూపమును చూసి వారంతా నవ్వుకుంటారు. అది చూసిన అష్టావక్రుడు వెంటనే మీరంతా దొంగలచే పట్టుబడతారని శపిస్తాడు. తమ తప్పు తెలుసుకొని వారంతా పశ్చాత్తాపంతో తమని క్షమించమని వేడుకొంటారు. అంతేకాక, నృత్య గీతాలతో అతనిని  అలరిస్తారు.

అందుకు అష్టావక్రుడు సంతోషించి వారికి ఏమి కావాలో కోరుకోమని చెప్తాడు. అప్పుడు వారంతా విష్ణుమూర్తితో పొందు కావాలని కోరుకుంటారు. అది విన్న  అష్టావక్రుడు, కృష్ణావతారంలో మీరంతా గోపికలై జన్మించి అతనితో సంగమించగలరని చెప్తాడు. 

అష్టావక్రుని అనుగ్రహంతో, అప్సరసలంతా మరుజన్మలో  బృందావనంలో పుడతారు. వీళ్ళు గోపికల రూపంలో కృష్ణుని ఆరాధిస్తూ… చివరికి  ఆయన భార్యలుగా మారతారు. అయితే అష్టావక్రుని శాప కారణంగా, శ్రీ కృష్ణుని నిర్యాణం అనంతరం ద్వారకను సముద్రం  ముంచేస్తున్న తరుణంలో,  కృష్ణుని ఆజ్ఞ మేరకు అర్జునుడు వీరిని సురక్షిత ప్రదేశానికి తీసుకు వెళుతున్నప్పుడు, దొంగలచేత పట్టుబడి సర్వము కోల్పోతారు. శాప ప్రభావం చేత అంత ధీరుడైన అర్జునుడు కుడా ఆ దొంగలను ఏమీ చేయలేక పోతాడు. 

రెండవది:

అష్టావక్రుని పూర్వజన్మ 

అష్టావక్రుడు తన పూర్వ జన్మలో దేవలుడు అనే ఋషి.  దేవలుడు మాలావతి అనే పేరు గల కన్యని వివాహము చేసుకొంటాడు. సంతానము కూడా కలిగిన తర్వాత కొంతకాలానికి వైరాగ్యంతో తపస్సు చేస్తూ ఉంటాడు. 

అతని తపస్సుకు విపరీతమైన వేడిపుట్టి… ముల్లోకాలను బాధిస్తుంది. ఎలాగైనా ఇతని తపస్సుని భగ్నం చేయాలని ఇంద్రుడు అనుకొంటాడు. అందుకోసం వెంటనే రంభను పంపుతాడు. కానీ, ఆతను ఎంతమాత్రం చలించలేదు. కోపంతో రంభ మరుజన్మలో నీవు అష్టావక్రుడవై జన్మించమని శపించింది. 

అనంతరం పశ్చాత్తాపంతో రంభ అతనికి శాపవిమోచనము కూడా తెలియజేసి,  స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. ఆ దేవలుడే… ఈ అష్టావక్రుడు. 

అష్టావక్ర గీత

ష్టావక్ర గీత విషయానికి వస్తే, వేదాంత పరంగా చాలా కీలకమైన అంశాలను ఈ గ్రంధం చర్చిస్తుంది. ఇది అష్టావక్రుడికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునే రాజు జనకునికి మధ్య జరిగిన సంభాషణ యొక్క రూపం. ఇందులో మొత్తం 20 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో అద్వైత సిద్ధాంత పోకడలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. 

దీనిని ఎప్పుడు సంకలనం చేశారనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం. కానీ, భగవద్గీత తర్వాతే దీనిని రచించినట్టు భావిస్తారు.అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను కూడా అష్టావక్రగీత చాలా స్పష్టంగా  తెలియచేస్తుంది. 

ఆత్మజ్ఞానాన్ని అందించే సంకీర్తనము, శాంతి, నిర్వేదము, జీవన్ముక్తి మొదలైన విషయాలపైన ఎన్నో వేదాంత విషయ వివరణలు ఈ గ్రంధములో పేర్కొనబడి ఉన్నాయి. అయితే భారతీయులకి  భగవద్గీత గురించి తెలిసినంతగా ఈ ష్టావక్ర గీత గురించి తెలియకపోవటం నిజంగా దురదృష్టకరం. 

చివరి మాట 

మనకి ఎన్ని వైపల్యాలు ఉన్నా… ఇబ్బందులు ఎదురైనా … కుంగిపోకూడదు. అలాగే ప్రతిభ ఉందని పొంగిపోకూడదు. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యమే గొప్పద్ఫని తెలియచేసేదే ఈ అష్టావక్రుని కథ. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top