లోక కళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడని చెప్పుకున్నాము. అవే దశావతారాలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ దేవదేవుడు ఎత్తిన అవతారాలు అన్నీ ఏదో ఒక రకమయిన విశిష్ట సందేశాన్ని ఈ చరాచర సృష్టికి నిగూఢంగా తెలుపుతాయి. ఇక ఈ దశావతారాలలో శ్రీమహావిష్ణువు యొక్క నాలుగవ అవతారం అయిన నరసింహావతారం గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము.
శాపగ్రస్థులయిన జయ విజయులు
బ్రహ్మాండ పురాణం ప్రకారం వరుణుడికి అతని భార్య స్తుతకు కలిగిన ఇద్దరు కుమారులే ఈ జయ మరియు విజయ. వీరు ఇద్దరూ మహావిష్ణువు చెంత ఉండి, ఆయన నివాసానికి ద్వారపాలకులుగా ఉంటూ, ఆయనను సేవిస్తూ ఉండేవారు.
ఒకసారి, బ్రహ్మదేవుని మానస పుత్రులయిన సనక, సనాతన, సనందన, మరియు సనత్కుమారులు మహావిష్ణువు దర్శనం చేసుకోవాలని వైకుంఠాన్ని సందర్శిస్తారు. అక్కడ ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వీరిని అడ్డగిస్తారు. మహావిష్ణువు సేద తీరుతున్నారని, ఈ సమయంలో దర్శనానికి పంపించటం కుదరదని అంటారు. దీనికి కోపగించిన ఆ నలుగురు ఋషులు వీరిద్దరినీ భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపిస్తారు.
ఈ శాపానికి జయవిజయులు భయపడిపోతారు. ఇంతలో అక్కడ ప్రత్యక్షమయిన మహావిష్ణువును ప్రార్ధించి, తమను శాప విముక్తులను చెయ్యమని వేడుకుంటారు. అయితే మహాఋషులు ఇచ్చిన శాపం నుండి విముక్తి ఇవ్వడం అసాధ్యమని, కొంత ఉపశమనం ఉండే విధంగా వారికి రెండు మార్గాలు చూపిస్తాడు. అందులో మొదటిది విష్ణుభక్తులుగా భూమి మీద ఏడు జన్మలు తీసుకోవడం. ఇక రెండవది విష్ణుద్వేషులుగా మూడు జన్మలు తీసుకోవడం.
మహావిష్ణువుకు దూరంగా ఏడు జన్మలు ఉండటం కన్నా అతనికి శత్రువుగా మూడు జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలని తలుస్తారు. ఈ కోరిక ప్రకారం, వీరు భూలోకంలో మహావిష్ణువుకు బద్ధ శత్రువులుగా జన్మించినప్పుడు, వీరిని సంహరించడానికి మహావిష్ణువు కూడా మూడు అవతారాలు ఎత్తవలసి వస్తుంది.
సత్యయుగంలో ఈ జయ విజయులలో విజయుడు హిరాణ్యాక్షుడిగా, మరియు జయుడు హిరణ్యకశిపుడిగా, ఇలా సోదరులుగా జన్మిస్తారు. త్రేతాయుగంలో రావణుడు, మరియు కుంభకర్ణులుగా జన్మిస్తారు. ఇక ద్వాపరయుగంలో శిశుపాలుడు, మరియు దంతవక్రునిగా జన్మిస్తారు. అలా సత్యయుగంలో జన్మించిన హిరాణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని చంపడానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారాలే దశావతారాలలో మూడవదయిన వరాహ, నాలుగవదయిన నరసింహ అవతారాలు.
ముల్లోకాలను గడగడలాడించిన సోదరులు
సప్తఋషులలో ఒకడయిన కశ్యప మహామునికి, దక్షుడి కుమార్తె అయిన దితికి కుమారులుగా వీరు జన్మిస్తారు. దితి వీరిని ఇద్దరినీ వంద సంవత్సరాలు తన గర్భంలో పెంచింది. వీరు ఇద్దరూ పుట్టిన సమయంలో చెడుకు సంకేతంగా ఎన్నో ఉపద్రవాలు సంభవించాయి.
పెరిగి పెద్దయిన ఈ సోదరులు ఇద్దరూ ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తారు. ముల్లోకాలలోనూ వీరి ఆగడాలు భరించలేక దేవతలు, ప్రజలు, మునులు, ఎంతో అల్లాడిపోయేవారు.
వీరి గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము కదా… ఇక హిరణ్యకశిపుడు శ్రీమహావిష్ణువు చేతిలో ఎలా అంతం అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాము.
బ్రహ్మదేవుడి అనుగ్రహంతో మహాశక్తి సంపన్నుడయిన హిరణ్యకశిపుడు
హిరణ్యాక్షుడు మహావిష్ణువు చేతిలో మరణించటంతో హిరణ్యకశిపుడు కోపోద్రిక్తుడవుతాడు. ఎలాగయినా విష్ణువు మీద, ముల్లోకాల మీద ఆధిపత్యం సంపాదించాలని బలంగా అనుకుంటాడు. ఈ కోరికతో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొని అభేద్యమైన వరాలు పొందాలని తపస్సు ప్రారంభిస్తాడు. ఇతని ఘోర తపస్సుకు ముల్లోకాలు గడగడలాడిపోతాయి.
హిరణ్యకశిపుని తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతనిని అనుగ్రహిస్తాడు. బ్రహ్మ హిరణ్యకశిపుని ముందు ప్రత్యక్షమై అతనికి నచ్చిన వరాన్ని కోరుకొమ్మని అంటాడు. హిరణ్యకశిపుడు వెంటనే అమరత్వం కోరతాడు. కానీ పుట్టిన ప్రతి ప్రాణీ మరణించక తప్పదని చెప్పి బ్రహ్మ తిరస్కరిస్తాడు.
అప్పుడు హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి ఒక విచిత్రమయిన కోరిక కోరతాడు. అదేమిటంటే, ముల్లోకాలలో ఏ మానవుల వలన కానీ, రాక్షసుల వలన కానీ, గ్రహాల వలన కానీ, జంతువు వలన కానీ, ఆకాశంలో కానీ భూమి మీద కానీ, ఇంటిలో కానీ, ఇంటి బయట కానీ, ఏ విధమయిన ఆయుధంతో కానీ, పగలు కానీ, రాత్రి కానీ మరణం లేకుండా వరం కోరతాడు. అతని ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు కాదనలేక అతను కోరిన కోరికను అనుగ్రహిస్తాడు.
ఇదే కాకుండా, మహాభారతంలోని అనుశాసన పర్వం ప్రకారం ఉపమన్యు అనే ఋషి శ్రీకృష్ణుడితో హిరణ్యకశిపుడి గురించి చెబుతూ అతను పరమేశ్వరుడి నుండి కూడా గొప్ప వరాలు పొందాడని చెప్పాడు. దీని ప్రకారం, ఇంద్రుడు, కుబేరుడు, యముడు, సూర్యుడు, వాయు, అగ్ని, సోమ, వరుణుడు వంటి దేవతల అందరి శక్తులతో పాటుగా, అనేక అస్త్రశస్త్రాలను ఉపయోగించడంలో అత్యద్భుతమైన పోరాట పటిమను హిరణ్యకశిపునికి పరమేశ్వరుడు ప్రసాదించాడని చెప్పారు.
ఈ వరాల బలంతో హిరణ్యకశిపుడు అపార పరాక్రమవంతుడవుతాడు. మరొక్క పురాణ ఇతిహాసం ప్రకారం, ఒకసారి రావణుడు హిరణ్యకశిపుని చెవిపోగులు ఎత్తడానికి ప్రయత్నించాడని, కానీ అతని శక్తి వాటిని ఎత్తడానికి సరిపోలేదని చెప్పారు. స్కంద పురాణం ప్రకారం ఈ హిరణ్యకశిపుడు విశ్వాన్ని దాదాపు 107.28 మిలియన్ సంవత్సరాల పాటు పాలించాడు.