Varaha avatar, Lord Vishnu, Hindu mythology

Spiritual Significance of Varaha Avatar in Hinduism

త్రిమూర్తులయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ సకల చరాచర సృష్టిని నిర్మించి, పాలించి, నిర్మూలించే కార్యాలను నిర్విఘ్నంగా నడిపిస్తూ తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. సృష్టి నడుస్తున్నప్పుడు ఆ నిర్దేశించిన క్రమాన్ని కొనసాగించడంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఆ సృష్టిని కాపాడే బాధ్యత మహావిష్ణువు తీసుకున్నాడు అని, రకరకాల సందర్భాలలో సృష్టిని కాపాడటానికి అవతారపురుషుడిగా వచ్చి ధర్మాన్ని పునరుద్ధరించాడు అని తెలుసుకున్నాము. మహావిష్ణువు ఈ విధంగా ఎత్తిన ప్రతీ అవతారం ఈ విశ్వాన్ని ఒకొక్క భయంకరమయిన ఆపద నుండి గట్టెక్కించడానికి ఉన్నప్పటికీ, వీటి అన్నిటి ముఖ్య ఉద్దేశ్యం, లక్ష్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. 

మనందరం మహావిష్ణువు ఎత్తిన మూడవ అవతారం ఒక రాక్షసుడిని అంతమొందించడానికి ఎత్తినదే అని ఊహించగలం. అయితే ఈ రాక్షసుడు ఆ మహావిష్ణువుకు పరమ భక్తుడు, సేవకుడు అవటం చాలా ఆశ్చర్యకరమయిన విషయం. మరింకెందుకు ఆలస్యం… పదండి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

జయ విజయులు ఎవరు?

హిందూ పురాణాల ప్రకారం, జయ మరియు విజయ ఇద్దరూ మహావిష్ణువు యొక్క నివాసం అయిన వైకుంఠం దగ్గర ద్వారపాలకులు. 

బ్రహ్మాండ పురాణం ప్రకారం, వరుణుడికి అతని భార్య స్తుతకు కలిగిన ఇద్దరు కుమారులే ఈ జయ మరియు విజయ. వీరు ఇద్దరూ నాలుగు చేతులు కలిగి ఉన్నారని చెబుతారు. అంతేకాదు, శ్రీమహావిష్ణువు ధరించిన శంఖం, చక్రం, గద ఆయుధాలను వీళ్ళు కూడా ధరించేవారు. నాలుగవ చేతిలో మహావిష్ణువు పద్మం పట్టుకొని కనిపిస్తే, వీళ్ళు మాత్రం కత్తి ధరించి కనిపిస్తారు. వీరు ఇద్దరూ మహావిష్ణువు చెంత ఉండి, ఆయన నివాసానికి ద్వారపాలకులుగా ఉంటూ, ఆయనను సేవిస్తూ ఉండేవారు. 

ఒకసారి, బ్రహ్మదేవుని మానస పుత్రులయిన సనక, సనాతన, సనందన, మరియు సనత్కుమారులు మహావిష్ణువు దర్శనం చేసుకోవాలని వైకుంఠాన్ని సందర్శిస్తారు. తమ తపశ్శక్తి వలన ఎన్నో సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా వీరు చిన్నవారి లాగా కనిపించేవారు. అక్కడ లోపలికి పోయేటప్పుడు, ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వీరిని అడ్డగిస్తారు. మహావిష్ణువు సేద తీరుతున్నారని, ఈ సమయంలో దర్శనానికి పంపించటం కుదరదని అంటారు. దీనికి కోపగించిన ఆ నలుగురు ఋషులు వీరిద్దరినీ భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామము, క్రోధం మరియు దురాశ దోషాలను అధిగమించి, శుద్ధి అవ్వమని శపిస్తారు. 

ఈ భయంకరమయిన శాపానికి జయవిజయులు భయపడిపోతారు. ఇంతలో అక్కడ ప్రత్యక్షమయిన మహావిష్ణువును ప్రార్ధించి, తమను శాప విముక్తులను చెయ్యమని వేడుకుంటారు. అయితే మహాఋషులు ఇచ్చిన శాపం నుండి విముక్తి ఇవ్వడం అసాధ్యమని మహావిష్ణువు చెబుతాడు. 

అయితే, కొంత ఉపశమనం ఉండే విధంగా వారికి రెండు మార్గాలు చూపిస్తాడు. అందులో మొదటిది విష్ణుభక్తులుగా భూమి మీద ఏడు జన్మలు తీసుకోవడం. ఇక రెండవది విష్ణుద్వేషులుగా మూడు జన్మలు తీసుకోవడం. వీటిలో దేనినైనా ఎంచుకొని అనుభవించిన తర్వాత, వారు తిరిగి వైకుంఠం చేరుకొని తమ స్థానాలలో శాశ్వతంగా ఉండగలరు అని చెప్తాడు. అయితే, మహావిష్ణువుకు దూరంగా ఏడు జన్మలు ఉండటం కన్నా అతనికి శత్రువుగా మూడు జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలని తలుస్తారు. వెంటనే విష్ణువుకు శత్రువులుగా మూడు జన్మలు ఉండేలా అనుగ్రహించమని వేడుకుంటారు. ఈ కోరిక ప్రకారం, వీరు ఇద్దరూ భూలోకంలో మూడు జన్మల పాటు మహావిష్ణువుకు బద్ధ శత్రువులుగా జన్మించినప్పుడు, వీరిని సంహరించడానికి మహావిష్ణువు కూడా మూడు అవతారాలు ఎత్తవలసి వస్తుంది.    

వీరు ఇద్దరూ సత్యయుగంలో హిరాణ్యాక్షుడిగా, హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణులుగా, చివరకు ద్వాపరయుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రునిగా జన్మిస్తారు. అలా జన్మించిన హిరాణ్యాక్షుడిని చంపడానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారమే దశావతారాలలో మూడవదయిన వరాహ అవతారం.

ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఒకొక్క జన్మ ఎత్తిన తరువాత వీరి శక్తి కూడా తగ్గిపోతుంది. మొదటి జన్మలో హిరాణ్యాక్షుడిగా, హిరణ్యకశిపుడిగా జన్మించినప్పుడు వీరు ఇద్దరూ భూలోకం మొత్తాన్నీ పాలించే శక్తి కలిగి ఉంటారు. వీరిని చంపటానికి శ్రీమహావిష్ణువు రెండు అవతారాలు ఎత్తవలసి వస్తుంది. 

ఇక త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణులుగా పుట్టినప్పుడు వీరి శక్తి తగ్గి భూమి మీద కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే పాలించే రాక్షసులుగా పుట్టి శ్రీరాముడి అవతారం చేతిలో ఇద్దరూ మరణిస్తారు. ఈ రెండు జన్మలలో కేవలం వీరిని చంపటం కోసమే శ్రీమహావిష్ణువు అవతారాలు ఎత్తవలసి వచ్చింది. 

ఇక చివరకు ద్వాపరయుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రునిగా జన్మించినప్పుడు వీరు శ్రీకృష్ణుడు చేపట్టిన లోకకళ్యాణ కార్యక్రమంలో మరణించిన ఎందరో దుష్టులలో వీరు కూడా చేరారు. కొన్ని పురాణ కథలలో దంతవక్రుడి పేరు కాకుండా కంసుడి పేరు చెప్పారు. అంతే కానీ కేవలం వీరిని చంపటం కోసమే అన్నట్లుగా శ్రీకృష్ణుడు జన్మించలేదు.

మనందరికీ తెలిసిన తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో, పూరీలోని శ్రీజగన్నాథుని ఆలయంలో, ఇంకా శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఆలయంలో కూడా ఈ జయ-విజయ విగ్రహాలు మనకు ప్రముఖంగా కనిపిస్తాయి.

శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తడానికి వెనుక ఉన్న అసలు కథ గురించి వివరంగా తెలుసుకున్నాము కదా… ఇంకా ఇప్పుడు హిరణ్యాక్షుడు గురించి, అతనిని శ్రీమహావిష్ణువు వరాహ అవతారంలో ఎలా అంతం చేశాడో తెలుసుకుందాము.

ముల్లోకాలను గడగడలాడించిన సోదరులు

జయ విజయులలో విజయుడు హిరాణ్యాక్షుడిగా, జయ హిరణ్యకశిపుడిగా, సోదరులుగా జన్మిస్తారు. సప్తఋషులలో ఒకడయిన కశ్యప మహామునికి, దక్షుడి కుమార్తె అయిన దితికి జన్మించిన కుమారులే వీరు. దితి వీరిని ఇద్దరినీ వంద సంవత్సరాలు తన గర్భంలో పెంచింది. వీరు ఇద్దరూ పుట్టిన సమయంలో చెడుకు సంకేతంగా ఎన్నో ఉపద్రవాలు సంభవించాయి. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, భీకర తుఫానులు, పిడుగులు పడటం, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలైన అనేక సహజ అవాంతరాలు జరిగాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top