Chidambaram Temple, Lord Shiva's Cosmic Dance

Uncovering Chidambaram Temple’s Ancient Secrets

మనదేశ చరిత్ర, సంస్కృతిని ఒకసారి తిరగేస్తే, ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, మరెన్నో పురాతన దేవాలయాలతో నిండి ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక్కో దానికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రదేశాల్లో ఒకటే తమిళనాడులోని చిదంబర నటరాజ స్వామి ఆలయం. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్త్వానికి నిదర్శనం ఈ ఆలయం. శివుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం కూడా ఇదే! అలాంటి ఈ ఆలయంలో నమ్మలేని రహస్యాలెన్నో ఉన్నాయి. ఆ రహశ్యాలేంటో ఈ రోజు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

చిదంబరం అంటే ఏమిటి?

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం అనే ఊరు పేరు చెప్పగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే పేరు అక్కడ పేరుగాంచిన నటరాజ స్వామి ఆలయం. ఈ దేవాలయంలో పంచభూతాలకు అధిపతి అయిన ఆ మహా శివుడు నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అని మనందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా చెప్తుంటారు. కంచిలోని ఏకాంబరేశ్వరుడిని భూమికి ప్రతీకగా చెబుతారు. విచిత్రం ఏంటంటే.. ఈ 3 దేవాలయాలూ కూడా ఒకే రేఖాంశం మీద ఉంటాయి. సైంటిఫిక్ గా  చూస్తే, 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆశ్చర్యకమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు.

తమిళంలో చిదంబరం అంటే అర్ధం ఏమిటి?

చిదంబరం అనే పేరు తమిళ పదం అయిన చిత్రంబలం నుండి వచ్చింది. దీనినే ‘చిత్తంబలం’ అని కూడా పిలుస్తారు. దీనికి “జ్ఞాన వాతావరణం”. అని అర్థం. చిత్తు అంటే “స్పృహ లేదా జ్ఞానం”, ఇంకా అంపలం అంటే “ఆది అంతం కొలవలేని అనంతమయిన ఆకాశం వాతావరణం అని”. ఈ రెండు పదాల కలయికే ఈ చిత్తంబలం. కాలక్రమేణ ఇదే చిదంబరంగా పేరు సంపాదించింది.

చిదంబర రహస్యం అంటే ఏమిటి?

ఇక్కడి శివరూపం ఆకాశానికి ప్రతిబింబం. ఒక విగ్రహం లాగా కాకుండా ఇక్కడ ఆ శివరూపం ఆకాశంలో బిల్వ పత్రాలు ఉన్నట్లు కనిపించడమే ఇక్కడ గొప్ప రహస్యం. నిజంగా ఉన్నట్లు కాకుండా, రూపం లేకుండా ఆకాశంలో ఉన్నట్లు భ్రాంతి కలిగించేలాగా అనుభూతిని కలిగించటమే చిదంబర రహస్యం.

చిదంబరం ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఓ చక్రం ఉంటుంది. ఆ చక్రానికి ముందు వైపున బంగారం రంగులో ఉండే బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే అక్కడి పూజారులు వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం ఆ తెరను తీసేసి భక్తులకు ఆ వేలాడుతున్న బంగారం బిల్వ పత్రాలు చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. 

శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా ఉన్న ఆ మహాదేవుడిని మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించుకుంటూ భక్తితో స్మరిస్తూ ఆ దైవ సన్నిధిని అనుభూతి పొందటమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం. ఆ అనిర్వచనీయమయిన అనుభూతే ఇక్కడ చిదంబర రహస్యమని పండితులు చెబుతారు.

చిదంబరం ఆలయ అద్భుతాలు ఏమిటి?

ఈ చిదంబరం ఆలయం ఎన్నో విశేషాలకు నెలవు. అందులో కొన్ని ఆసక్తికరమయినవి ఇక్కడ తెలుసుకుందాము. 

Bodhidharma's disappearance, mysterious Buddhist legend
Unraveling the Mystery of Bodhidharma’s Disappearance

ఇది కూడా చదవండి: పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..?

  • ఈ దేవాలయం కనీసం 1000-2000 సంవత్సరాల పూర్వం కట్టినదిగా భావిస్తారు. 
  • ఇక్కడ ఉన్న తిరుమూల నాథర్ స్వయంభువు మూర్తి. అయితే, ఇక్కడ భక్తులనుండి పూజలు అందుకునేది మాత్రం నటరాజ రూపంలో ఉన్న విగ్రహం. 
  • ఈ దేవాలయంలో ఆ పరమేశ్వరుడు మూడు రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. మొదటిది అందరికీ కనిపించే నటరాజ స్వరూపం, రెండవది నిర్దిష్టమయిన రూపం లేని అనంత ఆకాశం, ఇక మూడవది ఉండీ ఉండనట్టుగా ఉండే స్ఫటికలింగం ఆకారం. 
  • ఈ దేవాలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు తిల్లై వృక్షాలతో నిండి ఉండేదని అందుకే ఈ దేవాలయానికి తిల్లై అనే పేరు వచ్చిందని అంటారు. ప్రస్తుతం ఇక్కడ ఆ వృక్షాలు లేకపోయినా… ఈ గుడికి ఈశాన్య దిక్కున ఉన్న పిచ్చావరం ప్రాంతం అంతా ఈ చెట్లతో నిండి ఉంటుంది. 
  • ఈ దేవాలయం ప్రాంగణంలో పరమశివుడిని నాట్యం చేయటానికి సవాలు చేసిన కాళి ఆలయం కూడా ఉన్నది. అందుకే ఇక్కడ శివుడు నటరాజ రూపంలో పేరు పొందాడు. 
  • ఈ గుడిలో ఆ పరమశివుడిని దర్శించుకొని పూజిస్తే అన్ని రకాల అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
  • ఎవరైతే ఈ గుడిలో నటరాజ స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఆలయ గోపురం మన వీపు వెనుకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. చిదంబరం ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ సరిగ్గా ఇలాంటి అనుభూతే కలుగుతుంది. 
  • ఈ దేవాలయానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మనషికి ఉండే నవ రంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. 
  • ఈ ఆలయం గోపురం పైన 21,600 బంగారం రేకులతో చేసిన తాపడం చేశారు. ఒక మనిషి ప్రతి రోజూ కనీసం 21,600 సార్లు అంటే – 15 సార్లు x 60 నిముషాలు x  24 గంటలు శ్వాస తీసుకుంటాడని అందుకే 21,600 బంగారం రేకులతో తాపడం చేశారని అంటారు. 
  • ఈ బంగారం రేకులను తాపడం చేయటానికి 72 వేల బంగారం మేకులను కూడా వాడారు. ఈ 72 వేల బంగారం మేకులు మన శరీరంలో ఉండే 72 వేల నాడులను సూచిస్తాయి అంటారు.
  • చిదంబరం ఆలయంలోని నటరాజ స్వామి విగ్రహం కాలి యొక్క బోటన వేలు, భూ అయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువు అని పాశ్యాత్య శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. 
  • ఈ దేవాలయంలో మొత్తం ఐదు మండపాలు ఉన్నాయి… అవి కనక సభ, వెళ్ళి సభ (వెండి ని తమిళంలో వెళ్లి అంటారు), రత్న సభ, తామ్ర సభ, ఇంకా చిత్ర సభ. భక్తులు ఆ స్వామివారిని ఈ కనక సభ ప్రదేశంలో ఉండి దర్శించుకుంటారు.
  • చిదంబరం ఆలయాన్ని పొన్నాంబళం అని కూడా పిలుస్తారు, ఈ గుడిలో ‘పొన్నాంబళం’ ఎడమవైపున ఉంటుంది. ఇది మనిషికి గుండె ఉండే స్థానం. ఇక్కడికి వెళ్లేందుకు ‘‘పంచాక్షర పడి’’ ఎక్కాలి. ఇది న+మ+శి+వా+య పంచాక్షరి మంత్రాన్ని సూచిస్తుంది.
  • ఈ ఆలయంలో ‘‘కనక సభ’’లో ఉన్న నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. 
  • పొన్నాంబళంలో ఉండే 28 స్తంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. 
  • ఈ గుడిలోని తొమ్మది ద్వారాలు పైన ఉన్న తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తులకు ప్రతీకలు. 
  • ఈ గుడిలోని ఒక పక్కగా కనిపించే మంటపంలోని 18 స్తంబాలు మన 18 పురాణాలకు ప్రతీకలు. 
  • ఇక్కడ గుడిలో ఆది శంకరాచార్యులవారు ప్రతిష్టించిన శ్రీచక్రం ఇక్కడ అంబికా దేవి విగ్రహం దగ్గర చూడవచ్చు.
  • నటరాజ స్వామి నాట్య భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు.
  • ఈ ఆలయ గోడల మీద చెక్కిన శిల్పాలు భరత మునిచే చెప్పబడిన నాట్య శాస్త్రం నుండి మొత్తం 108 ముద్రలను వివరంగా చూడవచ్చు. భరతనాట్యం నృత్యానికి ఆ మహాదేవుడి నాట్యమే పునాది అంటారు. 
  • ఈ ఆలయ సముదాయం మొత్తం 51 ఎకరాల్లో విస్తరించి ఉన్నది.

దళితుడిని తనలో ఐక్యం చేసుకున్న మహాదేవుడు 

ఈ దేవాలయానికి సంబందించిన ఒక ఆసక్తికరమయిన కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది. ఆ పరమేశ్వరుడే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా వ్యవహరించి నిర్మలమయిన భక్తికి కులంతో సంబంధం లేదని ప్రపంచానికి తెలియజెప్పాడు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. 

పూర్వకాలంలో ఇక్కడ నందనార్ అనే ఒక దళిత రైతు ఉండేవాడు. అతను పరమ శివ భక్తుడు. ఇతనికి ఈ గుడికి వచ్చి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని తరించాలని ఎప్పటినుండో బలమయిన కోరిక. ఇతను ఒక భూస్వామి దగ్గర పొలంలో రైతుగా పని చేసేవాడు. అయితే, తక్కువ కులం వాళ్లకు గుడికి వెళ్లి స్వామిని దర్శించటం కుదరదని, గుడిలోకి వెళ్ళటానికి అనుమతి లేదని, ఆ యజమాని ఒప్పుకునేవాడు కాదు. 

అయితే ఈ నందనార్ మనసులో కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది…ఎప్పటికయినా ఆ పరమేశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది అనే ఆశతోనే తన పని చేసుకుంటూ ఉండేవాడు.   ఈ విధంగా ప్రతిరోజూ “నాళై పోహలాం” అని అనుకుంటూ తన కోరిక ఎప్పటికయినా తీరుతుందనే ఆశతో ఉండేవాడు. “నాళై పోహలాం” అంటే తమిళ భాషలో “రేపు వెళదాం” అని అర్ధం. 

అలా ఎంతో కాలం తరువాత చివరకు అతనికి చిదంబరం వెళ్లే అవకాశం వస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ స్వామిని దర్శించుకోవడానికి గుడికి వెళ్తాడు. అయితే, తన తక్కువ జాతి కారణంగా గుడి లోపలకు వెళ్లలేకపోతాడు. బయట నుండే ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ నందీశ్వరుడు విగ్రహం అడ్డంగా ఉండి ఆ స్వామిని చూడలేకపోతాడు. తన దురదృష్టానికి బాధపడుతూ అక్కడే ఉండిపోతాడు. 

ఇంతలో ఆశ్చర్యకరంగా ఆ పరమేశ్వరుడు విగ్రహ రూపంలో ఉన్న నందిని పక్కకు తప్పుకొమ్మని చెబుతాడు. అతని ఆజ్ఞ ప్రకారం నందీశ్వరుడు వెంటనే పక్కకు జరిగి ఆ దళిత రైతుకు దర్శనభాగ్యం కలిగిస్తాడు. అక్కడ ఉన్న ఉన్నత కులాల వాళ్లు ఈ సంఘటనకు ఆశ్చర్యపోతారు. వాళ్లకు మరింత ఆశ్చర్యం కలిగే విధంగా అక్కడే బయట ఉన్న ఆ దళిత రైతు వెంటనే అందరూ చూస్తూ ఉండగా… ఆ స్వామిలోకి ఐక్యం అయిపోతాడు. ఊహించని ఈ సంఘటనకి అక్కడ ఉన్న బ్రాహ్మణులూ, ఉన్నత కులాల వాళ్ళు నిస్చేష్ఠులై చూస్తూ ఉండిపోతారు. 

ఈ విధంగా ఆ స్వామి తనకు కులం ముఖ్యం కాదని, అచంచలమయిన భక్తితో తనను ఎవరయినా పూజించవచ్చని, అలాంటి భక్తులే తనకు దగ్గర వారు అవుతారని ప్రపంచానికి తెలియచెప్పాడని కథ.

The Dark Side of Dubai, Human Rights Concerns
Dubai’s Hidden Poverty

చిదంబరం ఆలయ వివాదాలు

ఈ చిదంబరం దేవాలయానికి దీక్షితార్ శైవ బ్రాహ్మణులకు గొప్ప సంబంధం ఉన్నది. తమిళనాడులోని ఇతర దేవాలయాలలో వేరే వేరే అగ్రవర్ణాలకు చెందినవారు ట్రస్టీలుగా ఉన్నప్పటికీ ఈ ఆలయానికి మాత్రం దీక్షితార్ వారు మాత్రమే ట్రస్టీగా ఉంటూ వస్తున్నారు. వీరు కేవలం శివుడిని మాత్రమే పూజిస్తారు. వీరిని ఆ పరమేశ్వరుడే హిమాలయాల నుండి తీసుకువచ్చాడని అంటారు. వీరు అంతా సంగం డైనాస్టీ టైంలో ఏర్పడ్డారని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం చోళుల కాలంలో కట్టబడిందని అంటారు. చోళ రాజులు తమ కుటుంబాలలో ఎటువంటి ముఖ్య విశేషం జరిగినా కూడా ఈ దీక్షితార్ వారి పర్యవేక్షణలో, వారి సూచనల ప్రకారం ఇక్కడ పూజలు చేసేవారని చెబుతారు. 

ఒకప్పుడు ఇక్కడ కనీసం 3000 మంది దీక్షితార్ వారు ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 800 మాత్రమే అంటారు. వీరి సంఖ్య ఇలా తగ్గిపోవడానికి ముఖ్య కారణం వీరు తమలో తామే వివాహాలు చేసుకోవటం. దీని వలన వీరికి సరిగా సంతానం కలిగేవారు కాదు, కాలక్రమేణా ఈ లోపం వలన వీరి సంఖ్యా గణనీయంగా తగ్గిపోయింది. 

1988 సంవత్సరంలో వీరు జరిపించిన సామూహిక బాల్యవివాహాలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. అంతే కాకుండా, మన భారతదేశంలో దేవదాసీ వ్యవస్థ ఈ గుడిలోనే మొదలయ్యిందని అంటారు. ఈ విధంగా ఈ చిదంబరం ఆలయం ఎన్నో వివాదాలకు కూడా కేంద్రబిందువుగా నిలబడింది. 

ముగింపు 

మనిషి జీవితంలో పుణ్యం సంపాదించి మరుజన్మ అంటూ ఉండకుండా మోక్షం పొందాలంటే జీవితంలో కనీసం ఒక్కసారి అయినా ఆ చిదంబరంలో తిరుమూలనాథర్ అయిన ఆ పరమేశ్వరుడిని, ఇంకా నటరాజ రూపంలో కూడా దర్శనమిచ్చే ఆ స్వామిని మనస్సు నిండుగా భక్తితో పూజిస్తే చాలని భక్తుల నమ్మకం. మరింకెందుకు ఆలస్యం… మీరు కూడా ఆ చిదంబరంలో రహస్యాన్ని, ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది జీవితం తరింపచేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top