చరిత్ర మొదటి నుంచీ గొప్ప గొప్ప వీరుల గురించీ, వాళ్ళు చేసిన వీరోచిత పోరాటాల గురించీ మాత్రమే చెప్తూ వచ్చింది. కానీ, వీర వనితల గురించి ఎక్కువగా చెప్పలేదు. మొదటినుంచీ మన దేశంలో స్త్రీలకి ఓ ప్రత్యేక గౌరవం ఉంది. అలాంటి మన దేశంలో రాజ్యం కోసం వీరోచితంగా పోరాడి, చరిత్రని తిరగ రాసిన ధీర వనిత రాణి దుర్గావతి. ఈమె వ్యక్తిత్వం కేవలం మన దేశానికే కాదు, మొత్తం స్త్రీ జాతికే స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు ఈ ఆర్టికల్ లో అలాంటి గొప్ప యోధురాలు గురించి తెలుసుకుందాం.
రాణి దుర్గావతి ఎవరు?
రాణి దుర్గావతి అక్టోబర్ 5, 1524న కలైంజర్ కోటలో జన్మించింది. ఆమె మహోబా రాజ్యాన్ని పాలించిన చండేలా రాజపుత్ర రాజు శాలివాహన్ కుమార్తె. చండేలా రాజవంశం రాజ్‌పుత్ వంశంలో ఒక భాగం, వీరు 10 నుండీ 13 శతాబ్దాల మధ్య మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని పాలించారు. ఇప్పుడు మనం హిస్టారికల్ ప్లేసెస్ లో ఒకటిగా చెప్పుకొంటున్న ఖజురహోని రాజధానిగా చేసుకొని వీళ్ళు పరిపాలన సాగించారు.
ఈ చండేలా రాజవంశం మొదటినుంచీ మొఘల్ దండయాత్రలని వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ, వీరి వంశంలో చివరకి రాణి దుర్గావతి మాత్రమే శక్తివంతమైన మొఘల్ సైన్యాన్ని ఎదిరించిన నిజమైన వారియర్ గా నిలిచింది.
చిన్నతనంలోనే తన తల్లి మరణించడంతో, శాలివాహనుడు ఈమెని కూతురిలా కాకుండా ఓ కొడుకులా పెంచాడు. అందుకే వివిధ యుద్ధ నైపుణ్యాలలో శిక్షణలు ఇప్పించాడు. అందులో భాగంగానే ఆమె చిన్న వయస్సులోనే గుర్రపు స్వారీ, ఆయుధాల వాడకం, వేటలో శిక్షణ పొందింది. వీటితో పాటు విలువిద్యలో కుడా గొప్ప నైపుణ్యం కలిగి ఉంది.
రాణి దుర్గావతి ఎందుకంత ఫేమస్ అయింది?
రాణి దుర్గావతి 1542లో, గర్హా రాజ్యానికి చెందిన రాజు సంగ్రామ్ షా యొక్క పెద్ద కుమారుడు దల్పత్ షాను వివాహం చేసుకుంది. మహోబాకు చెందిన చండేలాలు, గర్హ-మండ్లా రాజవంశాలకు చెందిన రాజ్‌గోండ్‌లు ఈ వివాహం ద్వారా మిత్రులయ్యారు.
వీరి వివాహం కూడా గోండు పద్ధతిలోనే జరిగింది. వివాహ సమయానికి, దల్పత్ షా వయస్సు 25 సంవత్సరాలు, యువరాణి దుర్గావతి వయస్సు 18 సంవత్సరాలు. 1543లో దుర్గావతి మామగారైన రాజా సంగ్రామ్ షా మరణించాడు, 3 సంవత్సరాల తర్వాత అంటే… 1545లో రాణి దుర్గావతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అతనికి వీర్ నారాయణ్ అని పేరు పెట్టారు.
1550లో, కేవలం 33 సంవత్సరాల చిన్న వయస్సులో ఆమె భర్త దల్పత్ షా కూడా మరణించాడు. దీంతో పెళ్లయిన 8 సంవత్సరాలకే రాణి దుర్గావతి వితంతువు అయింది. దల్పత్ షా మరణించే సమయానికి, ఈమె కుమారుడు వీర్ నారాయణ్ వయస్సు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే! ఒక పక్క మామగారైన సంగ్రామ్ షా, మరోపక్క భర్త దల్పత్ షా మరణం కారణంగా గర్హా రాజ్యం యొక్క పాలనా బాధ్యత మొత్తం రాణి దుర్గావతిపై పడింది.
వాస్తవానికి ఈ గోండు సామ్రాజ్యం 14వ శతాబ్దంలో, జదురాయ్ సింగ్ చేత స్థాపించబడింది. కాలక్రమేణా అది తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోయింది. గోండులు భారతదేశంలోని అతిపెద్ద తెగలలో ఒకరు. ఇంకా గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని కూడా కలిగి ఉన్నారు. ఇప్పటికీ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ తెగ ఉనికిలోనే ఉంది.
ఇదిలా ఉంటే, చండేల్ రాజపుత్ ల వంశంలో జన్మించిన రాణి దుర్గావతి, వ్యూహాత్మకంగా గోండు రాజ్యాన్ని పాలించిన రాజా దల్పత్ షాను వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం కీలకమైన మలుపు తిరిగింది. విషాదకరంగా, దల్పత్ షా యుద్ధంలో మరణించటంతో, ఉన్న ఒక్క కొడుకూ చిన్నవాడు కావటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఈ రాజ్య పాలన చేపట్టక తప్పలేదు.
అప్పటిదాకా రాజ్యంలోని ప్రజల క్షేమం కోరుకొనే ఓ రాణిగా, భర్త బాధ్యతలలో పాలు పంచుకొనే ఓ భార్యగా, కొడుకు ఆలనా పాలనా చూసుకొనే ఓ తల్లిగా మాత్రమే ఉన్న దుర్గావతి… ఎప్పుడైతే, గోండు సామ్రాజ్యానికి మహారాణిగా మారిందో… అప్పటినుండీ ఒక శక్తిగా ఎదిగింది. స్త్రీ నే కదా! అని చిన్నచూపు చూసిన రాజులెందరినో గడగడలాడించింది. చివరిగా మొఘల్ దళాల దండయాత్రను తిప్పి కొట్టినప్పటినుండీ ఆమె మరింత ఫేమస్ అయింది.
బాజ్ బహదూర్‌ను ఓడించడం
కొంత కాలానికి దుర్గావతి కుమారుడు వీర్ నారాయణ పెరిగి పెద్దవాడయ్యాడు. సైనిక నాయకుడుగా మారాడు. రాజ్యం రాజు లేకుండా పోవటంతో శత్రువుల దాడికి గురవుతూ వచ్చింది. ఈ సమయంలో, అన్ని రంగాల్లోనూ ఆరితేరిన రాణి దుర్గావతి గోండు రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. వ్యూహాత్మకంగా ఆమె వెంటనే తన రాజ్య రాజధానిని సింగౌర్‌ఘర్ కోట నుండి చౌరాఘర్‌కు మార్చి వేసింది.
1556లో ఉత్తర భారతదేశం రెండవ పానిపట్ యుద్ధాన్ని చూసినప్పుడు మాల్వా సుల్తాన్ బాజ్ బహదూర్ రాణి దుర్గావతిపై దాడి చేశాడు. కానీ సుల్తాన్ ఆవేశాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది రాణి దుర్గావతి. ఈమె సైన్యం బాజ్ బహదూర్ సైన్యంపై దాడిచేసి భారీ ప్రాణనష్టం జరిగేలా చేసింది.
మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధం
పరాయి దేశపు రాజులతో ఎలాంటి వైరము లేకుండా ఇలా ఐదారు సంవత్సరాల పాటు పరిపాలన సాగించింది రాణి దుర్గావతి. కొంత కాలానికి మొగలాయి రాజైన అక్బరు బాదుషా ఆమె కీర్తివిని, తన రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తాడు.
రెండవ పానిపట్ యుద్ధం తర్వాత మొఘలులు ఢిల్లీతో పాటు, ఉత్తర భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. దాని తరువాత, మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం అక్బర్ ఆధ్వర్యంలో పొరుగు రాజ్యాలను జయించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే మొఘలులు 1562వ సంవత్సరంలో బాజ్ బహదూర్‌ను ఓడించగలిగారు. ఆ తర్వాత గోండు రాజ్యమే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్.