మన భారతదేశంలోని అనేక దేవాలయాలు ఎన్నో విశిష్టతలను కలిగి ఉన్నాయి. వీటిలో చాలా దేవాలయాలు ఎందరో దేవుళ్ళ శక్తికి ప్రతిరూపాలుగా కూడా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొనే మన దేశంలోనూ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలలోనూ ప్రముఖమయిన దేవాలయాలు దివ్యధామాలుగా, శక్తిపీఠాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాంటి వాటిలో అమ్మవారికి సంబంధించిన శక్తిపీఠాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఒకటయిన కాసర దేవి ఆలయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము.
అసలు ఈ కాసర దేవి ఆలయం ఎక్కడ ఉంది?
భారతదేశానికి ఉత్తర భాగాన ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం ఒక దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఎన్నో ప్రముఖ దేవాలయాలతో నిండి ఉంది. ఈ భూమి శివుడు మరియు అతని భార్య అయిన శక్తి దేవితో ఆశీర్వదించబడిందని భక్తులు నమ్ముతారు. ఈ శక్తి అమ్మవారికి అంకితం చేయబడిన అనేక పూజ్య దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏడాది పొడవునా, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఈ ఆలయాలకు యాత్రికులు తండోపతండాలుగా వస్తారు.
ఈ కాసర దేవి ఆలయం ఉత్తరాఖండ్‌లోని అల్మోరా సమీపంలో ఉన్న గ్రామంలో ఉంది. ఈ దేవి ఆలయం పేరు మీదుగా ఈ ప్రదేశానికి కూడా కాసర గ్రామం అని పేరు వచ్చింది. సముద్ర మట్టానికి సుమారు 2,100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆధ్యాత్మిక గ్రామం హిమాలయాల యొక్క అందాలను వీక్షకులకు అందిస్తుంది. ఈ ఆలయం అల్మోరా నుండి ఉత్తరాన 7 కి.మీ దూరంలో ఉన్న కాషాయ్ కొండలపైన ఉన్నది.
కాసర దేవి ఆలయం ప్రాముఖ్యత
చాలా పురాతనమైన ఈ కాసర దేవి ఆలయాన్ని 2వ శతాబ్దంలో ఒక పర్వత శిఖరంపై నిర్మించారు. దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చే ఈ కాసర దేవి నల్లరాతి విగ్రహం విశేషమయిన ఆభరణాలతో అలంకరించబడి వెలిగిపోతూ ఉంటుంది.
ఉత్తరభారత దేశంలో ఈ కాసర దేవి ఆలయం ఒక అద్భుతమయిన మరిచిపోలేని ప్రదేశం. ప్రతి ఉదయం ఇక్కడ నుండి కనిపించే విశాలమయిన హిమాలయాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. మానసిక ప్రశాంతతను అన్వేషిస్తూ… దేశ విదేశాల నుండి వచ్చే ఎందరో యాత్రికులను ఈ ప్రదేశం ఖచ్చితంగా ఆకర్షిస్తుంది.
ఈ కాసర దేవి ఆలయం కూడా ఒక శక్తిపీఠం అని అంటారు. అయితే చాలా మంది ఈ దేవాలయం శక్తిపీఠం కాదని, దానికి దగ్గరే ఉన్న కాళీమఠ్ ఒక శక్తిపీఠం అని అంటారు. కాళీమఠ్ దేవాలయంలో కాళీదేవి తన సోదరీమణులు అయిన సరస్వతి దేవి మరియు లక్ష్మి దేవి తో కలిసి భక్తులకు దర్శనం ఇస్తుంది.
కాళీమఠ్ మరియు కాసర్ దేవి ఆలయం మధ్య దూరం ఒక కి.మీ కంటే తక్కువగా ఉంటుంది. అందుకనే ఈ సందేహం కాబోలు. వీటిలో ఏ గుడి శక్తిపీఠం? అనే విషయం పక్కన పెడితే, ఈ ప్రదేశాన్ని 108 శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తించారు.
అసలు ఈ శక్తిపీఠాలు ఎన్ని అనే విషయంలో కూడా చాలా గందరగోళం ఉన్నది. రకరకాల పురాణాల ప్రకారం వీటి సంఖ్య మారుతూ ఉన్నది. కొన్ని పురాణాల ప్రకారం, కేవలం నాలుగు ముఖ్యమయిన శక్తిపీఠాలు ఉన్నాయని, మిగతావి ఉప శక్తిపీఠాలని అంటారు. వీటి సంఖ్య కూడా 18, 51, 52, 64, 108 అని వేరు వేరు పురాణాలలో చెప్పారు.
ఇది కూడా చదవండి: Kalabhairavas Connection to Kashi Vishwanath
కాసర దేవి మహిమ
ఈ ఆలయంలో దేవి, శివుడు మరియు భైరవ దేవాలయం యొక్క రెండు వేర్వేరు సమూహాలను కలిగి ఉంటుంది.
రోడ్డు మీద నుండి పైకి ఎక్కినప్పుడు మొదట కనిపించేది కాసర దేవి దేవతకు అంకితం చేయబడిన గులాబీ దేవాలయం. ఆమె శక్తివంతమైన దుర్గా దేవి స్వరూపం. దేవి యొక్క ప్రధాన మందిరం ఒక గుహలో పెద్ద రాళ్లతో ఏర్పడిన విధంగా ఉంటుంది. ఇక్కడే కాసర దేవి ఆలయం పక్కనే స్వామి వివేకానంద ధ్యానం చేసిన ఒక గుహను భారీ రాతిపై చూడవచ్చు.
ఇక కాసర దేవి ఆలయం పైన ఉన్న కొండపై శివాలయం ఉంది. ఇది ఒక దక్షిణ భారతం నుండి వచ్చిన ఒక స్వామిచే స్థాపించబడినదిగా చెప్పబడుతున్నది. అయితే ప్రస్తుతం ఉన్న దేవాలయం భవనం చాలా కొత్తది, 1940లో పునరుద్ధరించబడింది. ఈ శివాలయం పక్కనే చిన్న భైరవ దేవాలయం కూడా ఉంది. శివుడు వినాశనానికి దేవుడు, కాళి శక్తికి దేవత, మరియు భైరవుడు కోపానికి దేవుడు. ఈ మూడు ఒక చోట కలిసి ఉండటం అంటే గొప్ప విశేషమే.
ఇక్కడ ప్రధాన ఆలయంలో అఖండ జ్యోతి ఉంటుంది, ఇది ఎన్నో సంవత్సరాలుగా 24 గంటలు మండుతూనే ఉంటుంది. ఇందులో ధుని కూడా ఉంది. ఇక్కడ చెక్క దుంగలను ఎప్పుడూ కాలుస్తూ ఉంటారు. దీని నుండి వచ్చే బూడిద చాలా శక్తివంతమైనదని నమ్ముతారు, ఈ బూడిద ఎటువంటి మానసిక రోగినైనా నయం చేయగలదు అని విశ్వాసం.
ఈ దేవిని భక్తులు సంతానోత్పత్తి కోసం, ఇంకా భవిష్యత్తు శ్రేష్ఠంగా ఉండటం కోసం, పూజిస్తారని చెబుతారు. ప్రతి సంవత్సరం, కార్తీక పూర్ణిమ సందర్భంగా, కాసర దేవి జాతరకు పూజలు చేయడానికి, ఇంకా ఉత్సవాలు చూడటానికి మన దేశంలోని అనేక రాష్ట్రాల నుండే కాకుండా, విదేశాల నుండి కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.