హిందూ పురాణాలలో సప్త ఋషుల గురించి మనం విని ఉన్నాం. అలాంటి ఋషులలో ఒకరు జమదగ్ని మహర్షి. ఈయన వేద జ్ఞానాన్ని కలిగి ఉండటమే కాకుండా యుద్ధ నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండేవాడు. ఏకంగా సుర్యుడినే శాసించిన గొప్ప కోపిష్టి మరియు అతి పరాక్రమ వంతుడైన పరశురాముని తండ్రి. ఈ రోజు మనం అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన జమదగ్ని మహర్షి యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
జమదగ్ని జన్మవృత్తాంతం
భాగవత పురాణం ప్రకారం, సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టించిన ప్రజాపతిలలో భృగు మహర్షి ఒకరు. ఈయన వంశానికి చెందిన బుచీకుడనే ఋషి ఉండేవాడు. ఒకసారి ఈ ఋచీకుడు కుశ వంశానికి చెందిన గాధి మహారాజు దగ్గరికి వెళ్ళి, ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరతాడు.
తన కూతురిని ఒక సాదారణ మునికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేని గాధి రాజు ఆయనకో పరీక్ష పెడతాడు. నల్ల చెవులున్న వెయ్యి తెల్ల గుర్రాలను తీసుకురావాలని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే వరుణుడిని ప్రార్ధించి వేయి గుర్రాలని సాధించి సత్యవతిని పెళ్ళిచేసుకుంటాడు ఋచీకుడు.
పెళ్లి తర్వాత, గాధిరాజు దంపతులు పుత్రసంతానం కోసం రకరకాల పూజలు, హోమాలు చేస్తారు. అందులో భాగంగా ఒకరోజు తన కూతురైన సత్యవతి దగ్గరికి వచ్చి, పుత్రుని కోసం బుచీక మహర్షి ఆశీర్వాదం కోరారు. అప్పుడాయన రెండు రకాల హోమ ద్రవ్యాలు తయారు చేస్తాడు. అందులో ఒకటి బ్రహ్మ మంత్రంతోను, మరొకటి క్షత్రియ మంత్రంతోను తయారుచేస్తాడు. వీటిలో బ్రహ్మ మంత్రంతో చేసింది భార్య కోసం, క్షత్రియ మంత్రంతో చేసింది తన అత్తగారి కోసం సిద్ధం చేసి పుణ్యస్నానం చేసేందుకు వెళతాడు.
కానీ, అది తెలియని సత్యవతి ఒకరిది ఒకరికి ఇస్తుంది. జరిగిందంతా దివ్యదృష్టితో గమనించిన బుచీకుడు ఈ పరిణామం కారణంగా తన భార్యకి యోధుడైన కుమారుడు, తన అత్తగారికి సాత్వికుడైన కొడుకు పుడతారని చెప్తాడు.
జమదగ్ని మహర్షి పుట్టుక
సత్యవతి చేసిన పొరపాటు కారణంగా, ఆమెకి జమదగ్ని, గాధిరాజు భార్యకి విశ్వామిత్రుడు పుడతారు. బుచీకుడు చెప్పినట్లే, జమదగ్ని సాత్వికుడే అయినప్పటికీ, మహా కోపిష్టి, యోధుడు అలానే తనకి జన్మించిన పరశురాముడు అతి పరాక్రమ వంతుడు. ఇక విశ్వామిత్రుడు క్షత్రియుడే అయినప్పటికీ, తపశ్శక్తితో బ్రహ్మర్షిగా మారతాడు.
జమదగ్ని మహర్షిని “జమదగ్ని భార్గవ” అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాలలో సప్తఋషులలో ఒకరీయన. జమదగ్నికి పుట్టుకతోనే కోపమెక్కువ. జమదగ్ని పరమశివుని భక్తుడు మరియు గొప్ప ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉన్నాడు.
పెరిగి పెద్దవాడయ్యాక జమదగ్ని కష్టపడి చదివి వేదపఠనంలో పాండిత్యాన్ని సాధించాడు. ఇతను ఎవరి దగ్గరా శిక్షణ పొందకుండా, కేవలం తన తండ్రి మార్గదర్శకత్వంతో ఆయుధ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాడని చెబుతారు. అంతేకాదు, తన తండ్రైన బుచీక మహర్షి నుండి విష్ణువు యొక్క ఖగోళ విల్లు అయిన శారంగను అందుకుంటాడు. ఇంకా ఇప్పుడు ఉనికిలో లేని ‘ఔషనాస ధనుర్వేదం’ అనేది జమదగ్ని మరియు శుక్రాచార్యుల మధ్య యుద్ధం గురించి జరిగిన సంభాషణ.
రేణుకతో వివాహం
ఋషిగా మారిన తరువాత, జమదగ్ని అనేక పవిత్ర స్థలాలను సందర్శించాడు. చివరకు సౌర వంశానికి చెందిన ప్రసేనజిత్ రాజభవనానికి చేరుకున్నాడు. అక్కడ యువరాణి రేణుకను చూడగానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను తనకిచ్చి వివాహం చేయమని రాజును కోరాడు.
అలా రాజు కూతురైన రేణుకాదేవిని వివాహమాడతాడు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు వారందరినీ సమిష్టిగా “పంచపుత్రులు” అని పిలుస్తారు. వీరిలో చిన్నవాడు పరశురాముడు. ఇతను శ్రీమహా విష్ణువు యొక్క దశావతారాలలో 6వ అవతారం.
జమదగ్ని తన కుటుంబంతో కలిసి అడవులలో ఒక ఆశ్రమంలో నివసించాడు. ఆయన ఆశ్రమం నర్మదా నది ఒడ్డున ఉండేది. ఆ నది ఒడ్డునే రోజూ తపస్సు చేసుకొంటూ ఉండేవాడు.
ఇది కూడా చదవండి: Philosophical Significance of Ashta Vakra Katha