ఒక్కోసారి మనకో డౌట్ వస్తుంటుంది. అసలీ పురాణాలనేవి నిజంగా ఉన్నాయా అని. ఎందుకంటే పురాణాల పేరుతో మనమంతా ఎంతోకొంత ఆచారాల్ని, పద్ధతుల్ని పాటిస్తున్నాం కాబట్టి . తరచి చూస్తే పురాణాలు, అందులో పాత్రలు మన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి.
అయితే కొందరు హేతువాదులు మాత్రం రామాయణ మహాభారతాలు అసలు జరగలేదని, అవన్నీ ఒట్టి కల్పిత కథలని వాదిస్తారు. ఏది నిజమో? ఏది అబద్ధమో? చెప్పేంత పరిజ్ఞానం మనకి లేకపోయినా, ఈ ఇతిహాసాలు నిజంగా జరిగాయని చెప్పటానికి కావాల్సిన ఆధారాలు, అందుకు బలం చేకూర్చే ప్రదేశాలు, సంఘటనలు మనకు ఈ ప్రపంచంలో ఎన్నో కనిపిస్తాయి. అందుకే ఈ రోజు రామాయణ ఇతిహాసం అసలు నిజమేనా? రామాయణ కథలో మనకు తెలిసిన పాత్రలన్నీ నిజంగానే ఉన్నాయా? లేవా? అనే దాని గురించి తెలుసుకుందాము. మరింకెందుకు ఆలస్యం… రండి!
ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా, ఇంకా మన పక్కనే ఉన్న శ్రీలంకలో కూడా రామాయణ ఇతిహాసం నిజంగానే జరిగింది అని చెప్పే బలమయిన ఆధారాలు మన పురావస్తు శాస్త్రజ్ఞులకు, చరిత్రకారులు ఎన్నో లభించాయి. రామాయణం నిజంగానే జరిగింది అని చెప్పే అలాంటి కొన్ని బలమయిన ఆధారాలను ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాము. ముందుగా అందుకు సంబందించిన కొన్ని ముఖ్యమయిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
Cobra Hood Caves
‘కోబ్రా హుడ్’ అంటే పాము తల ఆకారంలో ఉన్న గుహలు అని అర్థం. శ్రీలంకలోని సిగిరియా ప్రాంతంలో ఉన్న ఈ గుహలు పూర్తిగా సహజంగా ఏర్పడ్డాయని పురావస్తు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఎవరూ చెక్కకపోయినా కూడా ఈ గుహలు పూర్తిగా నాగుపాము తల ఆకారంలో ఏర్పడ్డాయి.
రామాయణ ఇతిహాసం ప్రకారం రావణాసురుడు సీతా దేవిని అపహరించిన తరువాత ఆమెను ముందుగా ఇక్కడికి తీసుకువచ్చాడని కొన్ని కథలలో చెప్పారు. ఈ గుహలలో పైకప్పు మీద ఈ ఆధారాన్ని బలపరిచే విధమయిన ఎన్నో చిత్రాలు ఉన్నాయి.
అంతే కాకుండా, ఈ గుహలో గోడల మీద “Parumaka naguliya lene” అని కూడా చెక్కబడి ఉన్నది. సీతాదేవికి ఇక్కడ కాపలాగా ఉన్న రాక్షసులు ఆమెను “నాగులియా” అని పిలిచేవారు. అంటే నాగలి దున్నేటప్పుడు పుట్టినది అని అర్థం. మనందరికీ తెలుసు సీతాదేవి జనక మహారాజు నాగలి దున్నేటప్పుడు భూమిలో దొరికిందని. అలాగే, శాస్త్రవేత్తలు ఈ ప్రదేశాన్ని పరీక్షించి అక్కడ గోడల మీద, పైకప్పు మీద ఉన్న చిత్రాలు, చెక్కిన పదాలు క్రీస్తు పూర్వ కాలానికి చెందినవని నిర్ధారించారు కూడా.
Sita Kotuwa
‘కోటువ’ అంటే కోట అని అర్ధం. ఆధారాల ప్రకారం ఇది రావణాసురుడి భార్య అయిన మండోదరి భవనం ఉన్న స్థలం. ఈ భవనం ‘గురులుపోత’ అనే ప్రదేశంలో ఉన్నది. దీనికి దగ్గర ఉన్న పేరుగాంచిన పట్టణం హసలక.
ఈ పట్టణం పైన చెప్పుకున్న సిగిరియా ప్రాంతం నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సీతాదేవిని ఎక్కడ ఉంచాలో తెలియక రావణాసురుడు ఆమెను తన భార్య అయిన మండోదరి భవనానికి తీసుకువస్తాడు. ఆమెను అక్కడే ఉంచాలని మండోదరికి చెప్తాడు.
కానీ, ఆమె అందుకు అంగీకరించక, సీతాదేవిని పంపించివేసి రాముడిని శరణు కోరాలని తన భర్తకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. దానికి రావణాసురుడు అంగీకరించక ఆమె మీద ఆగ్రహిస్తాడు. ప్రస్తుత శ్రీలంకలో మనకు ఈ భవనం గురులుపోత ప్రదేశం పక్కనే ఉన్న అడవిలో ఒకటిన్నర కిలోమీటర్లు వెళితే కనిపిస్తుంది. ఈ భవంతి దక్షిణం వైపు నుండి పక్కనే ఉన్న నదిలోకి 50 మెట్లు ఉన్నాయి. సీతాదేవి అక్కడ ఉన్నన్ని రోజులు ఈ నదిలో స్నానం చెయ్యడానికి ఈ దారిలో వచ్చేదని చెప్తారు.
Ashoka Vaatika
శ్రీలంకలో సీతాదేవి చివరిగా చేరుకున్న ప్రదేశం ఈ అశోక వాటిక. దీనినే మనం ‘అశోకవనం’ అంటాము. ప్రస్తుతం ఉన్న శ్రీలంకలో అశోకవనం Hagkala Botanical Gardenలో ఉన్నది.
ఈ ప్రదేశం పైన చెప్పుకున్న Sita Kotuwa నుండి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ అశోక వాటికలో సీతాదేవి శింషాప చెట్టు క్రింద కాలం గడిపింది. హనుమంతుడు మొదటిసారి సీతాదేవిని కలుసుకున్నది ఇక్కడే. ఈ అశోకవనంలోనే హనుమంతుడి పెద్ద పాద ముద్రలు కూడా మనకు కనిపిస్తాయి. రామాయణం నిజంగా జరిగింది అనడానికి ఇది ఒక గొప్ప బలమయిన ఆధారం అని చెప్పవచ్చు. ప్రపంచం నలు మూలల నుండీ ఈ పాదముద్రలు చూడటానికి ప్రజలు తరలి వస్తారు.
Trincomalee
ఈ ప్రదేశంలో పెద్ద కొండ అంచున నిర్మించబడిన ‘తిరు కోనేశ్వరం’ అనే దేవాలయం. పురాణ కథల ప్రకారం, రావణాసురుడి భక్తికి మెచ్చిన పరమ శివుడు అగస్త్య మహామునిని ఇక్కడ గుడి నిర్మించమని కోరాడని చెబుతారు. అలాగే, రాముడు కూడా బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడని కథ ప్రాచుర్యంలో ఉన్నది.
Colombo
శ్రీలంక రాజధాని అయిన కొలొంబోలో కూడా రెండు ప్రసిద్ధ ఆలయాలు రామాయణ ఇతిహాసానికి సంబందించిన ఆధారాలుగా ఉన్నాయి. ప్రపంచంలోనే ఆంజనేయుడు రథం మీద ఉన్నట్లు కనిపించే ఏకైక ఆలయం ఇక్కడ ఉన్నది. ఇంకా ఇక్కడ ఉన్న ‘కెలనియా ఆలయం’ రావణుడి మరణం తర్వాత లంకకు విభీషణుడిని రాజుగా పట్టాభిషేకం చేసిన ప్రదేశంగా నమ్ముతారు.
Nilavarai
జాఫ్నాలోని నీలవరై అనే ఒక చిన్న గ్రామం శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఎప్పటికీ నీరు ఇంకిపోని ఒక నీటి తటాకం ఉంది. దీని లోతు ఎంత ఉందొ ఎవ్వరూ కనుక్కోలేకపోయారని చెబుతారు. రావణుడితో యుద్ధం జరిగే సమయంలో తన వానర సైన్యానికి నీటి సంక్షోభం లేకుండా ఉండటానికి రాముడు భూమిలోకి బాణం వేసి ఈ నీటి తటాకం ఏర్పడేలా చేసాడని నమ్ముతారు.