Abhimanyu in Padmavyuham, Mahabharata war

The Tragic Story of Abhimanyu: How He Got Caught in Padmavyuham

ప్రపంచానికి తెలిసిన పురాణాలు, వాటిలో జరిగిన పోరాటాలలో కురుక్షేత్ర మహా సంగ్రామం చాలా పెద్దది. మనకు తెలిసినంత వరకు ఇంత కన్నా పెద్ద యుద్ధం భూమి మీద ఇప్పటి వరకు జరగలేదు. ఈ యుథ్దాల గురించి మన పాఠ్యపుస్తకాలలో చాలా క్లుప్తంగా మాత్రమే చెప్తారు. అయితే ఇతిహాసాలను వివరంగా చదివితే ఈ యుథ్దాలు ఎలా జరిగాయి, ఎవరెవరు ఎటువంటి యుద్ద తంత్రాలు ప్రయత్నించారు అనే వివరాలు చాలా విపులంగా తెలుస్తాయి. ఇక్కడ యుద్దాలలో పాటించిన ఎన్నో రకాలయిన వ్యూహాలలో పద్మవ్యూహం చాలా ముఖ్యమయినది, కష్టమయినది కూడా. 

దీని గురించి మనం ఎన్నో సందర్భాలలో వినే ఉంటాము. ఈ పేరు మనలో చాలా మందికి తప్పకుండా తెలుసు. కానీ దాని గురించి పూర్తి వివరాలు,  కొద్ది మందికే తెలుసు. ఈ యుద్ధతంత్రం గురించి, దీనికి సంబందించిన పరిజ్ఞానం ఎవరెవరికి ఉంది? ఎవరెవరు దీనిని ఛేదించగలిగిన సామర్ధ్యం పొందారు? అభిమన్యుడు దీనిని ఎందుకు ఎదుర్కొన్నాడు?  లాంటి వాటి గురించి నేను సేకరించిన ఎన్నో ఆసక్తికరమయిన విషయాలు ఈ ఆర్టికల్ లో మీతో షేర్ చేసుకుంటున్నాను. 

ఈ యుద్దతంత్రం గురించి మరింత వివరంగా తెలుసుకునే ముందు అసలు ఇది ఏంటి, దీని గురించి మహాభారతంలో ఎవరెవరికి పరిజ్ఞానం ఉందో తెలుసుకుందాము. 

పద్మవ్యూహం అంటే ఏమిటి?

పద్మవ్యూహం అనేది గొప్ప గొప్ప యుద్ధాలలో శత్రువుని మట్టుబెట్టడాన్ని వాడే ఒక క్లిష్టమయిన వ్యూహం. ఇందులో యోధులు తమ తమ సైన్యాలతో హద్దులు ఏర్పరచి లోపలికి  వచ్చిన శత్రువుకు బయటకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా లోపలే మెరుపు దాడులు చేస్తూ చివరకి మట్టుబెడతారు. 

ఇందులో, ఒకొక్క యోథుడు తన సైన్యంతో పద్మ పుష్పంలోని రేకులలాగా అన్ని వైపుల నుండీ వచ్చి యుద్ధం చేస్తూ శత్రువుకి తనను తాను కాపాడుకునే అవకాశం లేకుండా చేస్తారు. ఈ మొత్తం వ్యూహం లోపలికి వెళ్లే కొద్దీ ఒక విచ్చుకుంటున్న పద్మపుష్పం లాగా ఉంటుంది. ఒకొక్క శ్రేణి దాటుకుంటూ వెళ్తుంటే కొత్త పూరేకులలాగా శత్రువులు కమ్ముకొని వస్తారు. 

ఈ పద్మవ్యూహం అమరికలో ఉన్న యోధులు, సైనికులు బయట నుండి చూస్తే ఈ పద్మవ్యూహం బయట ఉన్న సైనికులతో యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తారు. ఎప్పుడయితే శత్రువు ఈ పద్మవ్యూహం లోపలి వస్తాడో, వెంటనే బయటవారితో యుద్ధం చేస్తున్న యోధులు, సైనికులు అందరూ ఒక్కసారిగా లోపలికి తిరిగి పద్మవ్యూహం లోనికి వచ్చిన శత్రువు మీద మెరుపు దాడి చేస్తారు. అకస్మాత్తుగా జరిగే ఈ దాడిని గమనించే లోపే దాడి చేసి శత్రువును మట్టుబెడతారు. లోపలి వెళ్ళే కొద్దీ పోరాటం చెయ్యటం, అన్ని వైపుల నుండీ వచ్చే శత్రువులను, ఆయుధాలను ఎదుర్కోవటం మామూలు వారికి అసాధ్యం.

పైన నుండి చూస్తే ఈ మొత్తం పద్మవ్యూహం ఒక చక్రం ఆకారంలో కూడా కనిపిస్తుంది. అందుకే దీనిని చక్రవ్యూహం అని కూడా అంటారు. అయితే కొందరు పెద్దలు ఇవి రెండూ వేరు వేరు అని కూడా అంటారు… కానీ ఈ తేడా వివరంగా చెప్పడానికి మన ఇతిహాసాలలో సరయిన సందర్భాలు కానీ, సంఘటనలు కానీ లేవు. అందరికీ తెలిసినంతవరకూ, ఇవి రెండూ ఒకటే.

పద్మవ్యూహం ఎన్ని సార్లు ఏర్పరిచారు

మహాభారత ఇతిహాసానికి సంబందించిన రకరకాల కథలు పరీక్షించి చూస్తే ఈ పద్మవ్యూహం ఎన్ని సార్లు, ఏఏ సందర్భాలలో ఏర్పరిచారో తెలుస్తుంది. మనకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ వ్యూహాన్ని మూడు సార్లు ఏర్పరిచారు. 

పాండవులు విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం పూర్తి చేస్తున్న సమయంలో వారిని బయటకు రప్పించడానికి దుర్యోధనుడి ఆదేశం మేరకు భీష్ముడు ఈ వ్యూహాన్ని ఏర్పరిచాడని చెప్తారు. అయితే అప్పటికే అజ్ఞాతవాసం దిగ్విజయంగా పూర్తి చేయటం వలన అర్జునుడు ధైర్యంగా వచ్చి ఈ వ్యూహాన్ని ఛేదిస్తాడు.

రెండవ సందర్భం కురుక్షేత్ర యుద్ధంలో పదమూడవ రోజున ధర్మరాజుని బంధించడానికి ద్రోణాచార్యుడు ఏర్పరచటం. అయితే, ధర్మరాజుకి బదులు అభిమన్యుడు ఇందులోకి వెళ్లి అన్యాయంగా బలయిపోతాడు. 

ఇక మూడవ సందర్భం కురుక్షేత్ర యుద్ధంలో పద్నాలుగవ రోజు జయద్రథుడిని కాపాడటానికి ద్రోణాచార్యుడు ఏర్పరిచాడు. దీనిని కూడా అర్జునుడు దిగ్విజయంగా ఛేదిస్తాడు. 

పద్మవ్యూహం గురించి ఎవరెవరికి తెలుసు

మహాభారత ఇతిహాసం ప్రకారం, ద్రోణాచార్యుడికి, అర్జునుడికి, శ్రీకృష్ణుడికి, ప్రద్యుమ్నుడికి, భీష్ముడికి  మాత్రమే ఈ వ్యూహం గురించి పూర్తిగా తెలుసు. ద్రోణాచార్యుడి కుమారుడయిన అశ్వథామకు కూడా దీని గురించి తెలుసని చెప్తారు. వీరు కాకుండా అభిమన్యుడికి కూడా ఈ వ్యూహం గురించిన పరిజ్ఞానం కొంత ఉంది. అయితే, అభిమన్యుడికి ఈ వ్యూహంలోకి వెళ్లడమే కానీ ఛేదించి బయటకు రావడం తెలియదు. దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

ఇది కూడా చదవండి: The Untold Story of Karna’s Life and Struggles

పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలుసుకున్న అభిమన్యుడు

పాండవులలో మధ్యముడయిన అర్జునుడికి, శ్రీకృష్ణుడి చెల్లెలు అయిన సుభద్రకు జన్మించినవాడే ఈ అభిమన్యుడు. కొన్ని పురాణాల ప్రకారం, అభిమన్యుడు సుభద్ర కడుపులో ఉన్నప్పుడు ఒకసారి ఆమె అర్జునుడితో యుద్ధవ్యూహాల గురించి చర్చిస్తున్నప్పుడు పద్మవ్యూహం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తుంది. 

అర్జునుడు ఆమెకు దాని గురించి వివరిస్తున్నప్పుడు ఆమె నిద్రలోకి జారుకుంటుంది. అయితే ఆ సమయంలో ఆమె గర్భంలోని శిశువు శ్రద్ధగా ఆ వ్యూహం గురించి వింటుంటాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళటం గురించి చెప్పి, దాన్ని ఛేదించటం ఎలానో చెప్పేలోగా శ్రీకృష్ణుడు వచ్చి ఇంక చెప్పకుండా అడ్డుకుంటాడు. ఆ విధంగా సుభద్ర గర్భంలోని శిశువు పద్మవ్యూహంలోకి వెళ్లడం గురించి వివరంగా తెలుసుకున్నా, ఛేదించి బయటకు రావడం తెలుసుకోలేకపోతాడు.

అయితే మహాభారతానికి సంబందించిన మరికొన్ని కథలలో చక్రవ్యూహంలోకి ప్రవేశించడం ఎలానో అభిమన్యుడు అర్జునుడి నుండే నేర్చుకున్నాడు అని చెబుతారు. 

మాయాజూదంలో ఓడిపోయిన తరువాత, ద్రౌపదితో కలిసి పాండవులు అందరూ 13 సంవత్సరాల అరణ్యవాసం చెయ్యడానికి వెళ్ళినప్పుడు సుభద్ర ద్వారకలో తన సోదరుల దగ్గర ఉంటుంది. అక్కడే అభిమాన్యుడు జన్మిస్తాడు. అతనికి యుద్ధవిద్యలలో శ్రీకృష్ణుడు, ఇంకా బలరాముడు శిక్షణ ఇస్తారు. వారి శిక్షణలో అభిమన్యుడు గొప్ప ధైర్యవంతుడిగా, వీరుడిగా, యుద్దకుశలుడిగా ఎదుగుతాడు. అభిమన్యుడి వీరత్వానికి మెచ్చి బలరాముడు అతనికి రౌద్ర ధనుస్సును కూడా ఇస్తాడు. 

కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు

కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు కూడా పాండవులవైపు ఉండి వీరోచితంగా పోరాడాడు. అత్యంత పిన్న వయస్కుడయినా, యుద్ధంలో అతను ఎంతో గొప్ప శౌర్యాన్ని చూపుతాడు. యుద్ధంలో అభిమన్యుడు రుక్మర్థ, బృహద్బల, దుర్యోధనుడి కొడుకయిన లక్ష్మణ కుమారుడిని, ఇంకా దుశ్శాసనుడి రెండవ కుమారుడయిన దుష్మనరుడిని చంపుతాడు. 

అంతే కాకుండా, మహా మహా శక్తివంతమయిన యోథులయినటువంటి ద్రోణాచార్యుడిని, కర్ణుడిని, అశ్వథామను, కృపాచార్యుడిని, దుర్యోధనుడి, దుశ్శాసనుడిని, వృషసేనుడిని ఎదుర్కొంటాడు. పాండవ మహారథులతో కలిసి కౌరవులను ధైర్యంగా ఎదిరించి పోరాడుతాడు. భీష్ముడిని కూడా ఒక సందర్భంలో ఎదుర్కొని పోరాడుతాడు. 

అసలు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎందుకు వెళ్ళాడు?

కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు నేలకొరిగిన తరువాత, కౌరవ సైన్యాన్ని నడిపించే బాధ్యత ద్రోణాచార్యుడు తీసుకుంటాడు. అతని పర్యవేక్షణలో, యుద్ధం జరుగుతున్న పదమూడవ రోజున అర్జునుడిని యుద్ధక్షేత్రంలో సుశర్మ, ఇంకా త్రిగర్త సేనలు దక్షిణ దిక్కుకి మళ్లిస్తారు. దీనిని గమనించిన దుర్యోధనుడు వెంటనే ద్రోణాచార్యుడిని పిలిచి ధర్మరాజుని బంధించడానికి ఇదే సరయిన సమయం అని చెప్పి ఒక గొప్ప వ్యూహాన్ని ఏర్పరచమని చెబుతారు. ధర్మరాజుని బంధిస్తే, ఇంక తమ వైపు ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా యుద్ధం గెలవవచ్చని దుర్యోధనుడి ఆలోచన.

దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం, ధర్మరాజుని బంధించడానికి ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని ఏర్పరుస్తాడు. ఆ వ్యూహాన్ని ఛేదించటానికి అర్జునుడు లేకపోవడంతో ఏమి చెయ్యాలో తెలియక మిగిలిన పాండవులు చిన్నవాడయిన అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి వెళ్ళమని చెపుతారు. అంతేకాదు, తాము అందరం అతనికి తోడుగా వెనకాలే వస్తామని, అందరం కలిసి పద్మవ్యూహాన్ని ఛేదించవచ్చని చెప్పి పంపుతారు. ఇలా అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. 

ఇది కూడా చదవండి: Mahabharata’s Magical Weapons

పద్మవ్యూహంలో అభిమన్యుడి వీరోచిత పోరాటం

తండ్రి సమానులైన తన పినతండ్రుల ఆజ్ఞ మేరకు అభిమన్యుడు ధైర్యంగా పద్మవ్యూహంలోకి వెళ్తాడు. మిగతా పాండవులు అందరూ అతడిని అనుసరిస్తారు. అయితే ఈ నలుగురిని జయద్రథుడు అడ్డుకుంటాడు. తనకు ఉన్న వరం వలన అతనిని ఎదుర్కొనటం ఈ నలుగురు పాండవులకు సాధ్యం కాదు. ఎంత పోరాడినా జయద్రథుడిని దాటి వెళ్లలేకపోతారు. వెనకాలే వస్తున్న ద్రుపదుడిని కూడా బంధిస్తారు. కృతవర్మ, ఇంకా అశ్వథామ కలిసి అభిమన్యుడికి సహాయంగా వస్తున్న ధృష్టద్యుమ్నుడిని, ఇంకా ఉపపాండవులను అందరినీ ఓడిస్తారు. ఎవ్వరూ తోడుగా లేకపోవడంతో అభిమన్యుడు ఒంటరి అయిపోతాడు.

అయినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా అభిమన్యుడు పద్మవ్యూహంలో ముందుకు వెళ్తాడు. తనకు ఎదురు వచ్చిన ఎంతోమంది యోధులను వీరోచితంగా చంపి సమర్ధంగా పద్మవ్యూహం మధ్యలోకి చేరుకుంటాడు. అక్కడ ఆరవ శ్రేణిలో మహామహులయిన ద్రోణాచార్యుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, దుర్యోధనుడు, వృషసేనుడు, శకుని అందరూ ఒక్కసారిగా ఒంటరివాడయిన అభిమన్యుడి మీద దాడి చేస్తారు. ఇలా చేయటం యుద్ధనీతికి సంబందించిన నియమాలకు పూర్తిగా విరుద్ధం. 

అయితే అప్పటికే ఎందరో యోధులను ఎదుర్కొని అలసిపోయిన అభిమన్యుడు ఏమాత్రం భయపడకుండా అందరితో ఒక్కడే యుద్ధం చేస్తాడు. ఇలా చాలాసేపు పోరాడిన అభిమన్యుడు బయటకు వచ్చే దారి లేక తీవ్రంగా అలసిపోతాడు. చివరికి అందరూ కలిసి దొంగదెబ్బ తీసి అభిమన్యుడిని అన్ని వైపుల నుండీ బాణాలతో, కత్తులతో దాడి చేసి దారుణంగా చంపుతారు. ఎంతో వీరత్వంతో పోరాడిన అభిమన్యుడు చివరికి ఇలా అధర్మయుద్ధంలో ప్రాణాలు వదులుతాడు.

పద్మవ్యూహాన్ని రెండు సార్లు ఛేదించిన అర్జునుడు

పైన చెప్పుకున్న విధంగా, మన ఇతిహాసాలను బట్టి అర్జునుడు పద్మవ్యూహాన్ని రెండు సందర్భాలలో ఛేదిస్తాడు. అందులో మొదటిది, అజ్ఞాతవాసం చివరలో విరాట రాజ్యం మీద దాడికి వచ్చిన కౌరవులను ఓడించినప్పుడు. ఇక రెండవది, కురుక్షేత్ర యుద్ధం పద్నాలుగవ రోజున జయద్రథుడిని చంపినప్పుడు.

కురుక్షేత్ర యుద్ధం జరిగిన పద్నాలుగవ రోజున అర్జునుడు మూడు గొప్ప వ్యూహాలను ఛేదించాడని, అందులో చక్రవ్యూహం కూడా ఒకటని చెప్పారు. తన ప్రియపుత్రుడిని అందరూ కలిసి అన్యాయంగా చంపడానికి ముఖ్య కారణమయిన జయద్రథుడిని పద్నాలుగవ రోజు సూర్యాస్తమయం జరిగే లోగా చంపుతానని, ఆలా చెయ్యలేకపోతే అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తానని శపథం చేస్తాడు. 

సూర్యాస్తమయం వరకు ఎలాగయినా అర్జునుడిని ఆపాలని ద్రోణాచార్యుడు మూడు వ్యూహాలు కలిసిన ఒక క్లిష్టమయిన యుద్ధతంత్రాన్ని ఏర్పరుస్తాడు. అవి శకటవ్యూహం, చక్రవ్యూహం, సుచివ్యూహం. వీటి అన్నిటికి చివరన జయద్రథుడు కురుసేనల రక్షణలో ఉంటాడు.

అయితే అర్జునుడు వీటిని అన్నిటినీ విజయవంతంగా ఛేదిస్తాడు. వీటిల్లో, చక్రవ్యూహానికి ద్రోణాచార్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ద్రోణాచార్యుడి శిష్యుడయిన అర్జునుడు తన గురువునే పూర్తిగా ఓడించి చక్రవ్యూహాన్ని దాటి జయద్రథుడిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు.

ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అర్జునుడి శపథం పూర్తవడానికి సహాయం చేస్తాడు. అర్జునుడు ఈ మూడు వ్యూహాలను ఛేదిస్తుంటే, శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెడతాడు. దాని వలన, సూర్యాస్తమయం అయ్యిందని అందరూ భావిస్తారు. జయద్రథుడు కూడా అర్జునుడు ఇంక తనను ఏమీ చెయ్యలేడని, అర్జునుడు అగ్నిప్రవేశం చెయ్యటం తప్పదని భావించి బయటకు వస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డు తీస్తాడు. అప్పుడుగానీ సూర్యాస్తమయం ఇంకా అవ్వలేదనే విషయాన్నీ కౌరవులు అందరూ గమనించి తమ పొరపాటును తెలుసుకుంటారు. వెంటనే అర్జునుడు పరమశివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి జయద్రథుడి తల వేరు చేసి అది జయద్రథుడి తండ్రి ఒడిలో పడేలాగా చేస్తాడు.

దీని గురించి కూడా ఒక కథ మనకు ఇతిహాసాలలో కనిపిస్తుంది. ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాము. సింథు దేశానికి రాజయిన జయద్రథుడు కౌరవుల చెల్లెలు అయిన దుశ్చలను వివాహం చేసుకుంటాడు. కౌరవులతో వియ్యం పొందిన తరువాత ఈ జయద్రథుడికి గర్వం పెరుగుతుంది. ఆ గర్వంతో, ఒక సందర్భంలో ద్రౌపది మీద వ్యామోహం పెంచుకొని ఆమెతో అగౌరవంగా ప్రవర్తించి భీముడి చేతిలో అవమానం పొందుతాడు. భీముడు జయద్రథుడికి గుండు గీసి ఘోరంగా అవమానం చేస్తాడు. ఈ అవమానం తట్టుకోలేక పాండవుల మీద పగ పెంచుకుంటాడు. సరయిన అవకాశం కోసం ఎదురు చూస్తూ చివరికి అభిమన్యుడి మరణానికి కారణం అవుతాడు. 

ఇంకా, అతని తండ్రి అయిన బృహద్క్షత్ర తన కుమారుడికి భూమి మీద ఉన్నటువంటి గొప్ప యోధుడి వల్ల, ఇంకా విశ్వములోని గొప్ప ఆయుధం వల్లనే మరణం ఉండాలని వరం పొందుతాడు. ఇంకా తన తపోమహిమతో మరొక వరం కూడా పొందుతాడు. అదేమిటంటే, తన కొడుకు తల ఎవరి వల్ల అయితే నేల మీద పడుతుందో వారి తల కూడా ముక్కలయిపోతుంది. 

అందుకే, పాశుపతాస్త్రం వేసినప్పుడు జయద్రథుడి తల అతని తండ్రి ఒడిలో పడేలాగా చెయ్యమని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు వేసిన బాణానికి జయద్రథుడి తల తెగి ఆ సమయంలో తపస్సులో ఉన్న బృహద్క్షత్ర ఒడిలో పడుతుంది. ఊహించని ఈ సంఘటనకి బృహద్క్షత్ర వెంటనే లేచి నిలబడతాడు. అప్పుడు అతని ఒడిలో నుండి జయద్రథుడి తల జారి నేల మీద పడుతుంది. అతను కోరిన కోరిక ప్రకారం, వెంటనే బృహద్క్షత్ర తల కూడా ముక్కలయిపోతుంది.

చివరిమాట 

మహాభారతంలో అభిమన్యు కథ ధైర్యం, త్యాగం మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత గురించి విలువైన పాఠాలను అందిస్తుంది. ధైర్యవంతులైన యోధులు కూడా పరిస్థితులకు బలైపోతారని అతని విషాద విధి మనకి తెలియచేస్తుంది. అభిమన్యు కథ ఇతరుల నుండి నేర్చుకోవడం మరియు మార్గదర్శకత్వం కోరడం యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. అంతిమంగా, అతని వారసత్వం ధైర్యం, వినయం మరియు నేర్చుకునే సుముఖతను పెంపొందించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, భారతీయ పురాణాలలో అతనిని వీరత్వానికి శాశ్వత చిహ్నంగా చేస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top