మహాభారత ఇతిహాసంలోని చాలా క్యారెక్టర్ల గురించి మనం కధలు కధలుగా చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర విన్నాము, ఇంకా చాలా సినిమాల్లో కూడా చూసాము. ఈ సినిమాలు చూడటానికి చాలా ఆసక్తిగా ఉండేవి. అయితే వీటిలో మనకు తెలిసిన పాత్రలు కొన్ని అయితే, మనకు తెలియని పాత్రలు ఎన్నో!
పాండవులను హీరోలుగా, కౌరవులను విలన్లుగా చాలా సినిమాల్లో చూసాము. వాళ్లతో పాటుగా, ఇంకా కొన్ని ఆసక్తికరమైన పాత్రలుకూడా మనకు ఈ సినిమాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకి, మాయాబజార్ సినిమా చూసిన వాళ్లందరికీ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఘటోత్కచుడు. చిన్న పిల్లలకి అయితే ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. పాండవులకు సహాయం చేస్తూ, కౌరవులకు సరదాగా సమస్యలు సృష్టించే పాత్రలో ఘటోత్కచుడు మనల్ని చాలా నవ్వించాడు.
ఈ ఘటోత్కచుడి కుటుంబం గురించి సినిమాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కువ ఆధారాలు లేవు. అయితే ఇతనికి మౌర్వి అనే భార్య, ఇంకా ముగ్గురు కుమారులు ఉన్నారు. వారి పేర్లు అంజనపర్వన్, మేఘవర్ణ, ఇంకా బార్బరిక. వీరు కూడా మహాభారత ఇతిహాసంలోని చెప్పుకోదగ్గ క్యారెక్టర్ల లిస్టులో ఉంటారు. ఈ రోజు మనం ఘటోత్కచుడి భార్య అయిన మౌర్వి గురించి, ఆమె అసలు పేరు, పూర్వజన్మ వృత్తాంతం, ఇంకా ఆమెకు కృష్ణుడితో ఉన్న వైరం, ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాము.
మౌర్వి ఎవరు?
మౌర్వికి పూర్వ జన్మలో ఉన్న పేరు అహిలావతి. ఈమెకు ఈ రెండు పేర్లు కాకుండా, ఇంకా “కామ్కాంతిక” అనే పేరు కూడా ఉంది.
ఒక పురాణేతిహాసం ప్రకారం అహిలావతి గొప్ప నాగకన్య. ఈమె తండ్రి నాగలోకానికి అధిపతి అయిన వాసుకి. ఈమె తల్లి నాగయక్షి. వాసుకి శివుని మెడలో ఉండే పవిత్ర సర్పమని మనందరికీ తెలుసు. అయితే, అహిలావతి కైలాసంలో పార్వతి పరమేశ్వరులను పూజిస్తూ ఉంటుంది. ఈమె పార్వతీ దేవికి గొప్ప భక్తురాలు ఇంకా నమ్మకమైన సేవకురాలు కూడా. ఈ అహిలావతి రోజూ పార్వతీ దేవికి శివ పూజ చేయటానికి పువ్వులు అందిస్తూ ఉంటుంది. ఇది ఆమె ప్రతిరోజూ బాధ్యత.
అయితే ఒక రోజు, అహిలావతి పొరపాటున పార్వతీ దేవికి శివ పూజ సమయంలో వాడిపోయిన పూలను అందిస్తుంది. ఇది గమనించిన పార్వతీ దేవికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో పార్వతీ దేవి అహిలావతిని శపిస్తుంది. రాక్షసుల వంశంలో పుట్టి, అసుర యువరాణిగా పెరిగి, ఒక భయంకరమయిన ఇంకా భయానకంగా కనిపించే పెద్ద రాక్షసుడిని పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడతావని శపిస్తుంది. పార్వతీ దేవి కోపానికి, ఇంకా ఆమె ఇచ్చిన శాపానికి అహిలావతి చాలా భయపడి పోతుంది. తాను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకొని, వెంటనే పార్వతీ దేవి పాదాల మీద పడి శరణు వేడుకుంటుంది. తనను క్షమించమని ఎన్నో విధాలుగా పార్వతీ దేవికి క్షమాపణలు చెప్పి ప్రార్థిస్తుంది.
అయితే, జగన్మాత అయిన పార్వతీ దేవి తాను ఇచ్చిన శాపం చాలా శక్తివంతమైంది కాబట్టి, ఒక్క సారి తాను శాపం ఇస్తే దాని నుండి విముక్తి పొందటం అసాధ్యం అని పార్వతీ దేవి అహిలావతికి గుర్తు చేస్తుంది. చివరికి కొంత శాంతించిన పార్వతీ దేవి తన శాపం వెనక్కి తీసుకోలేకపోయినా, అహిలావతికి లభించే భర్త మంచి దయగల వ్యక్తి అవుతాడని ఇంకా గొప్ప యోధుడు కూడా అయి ఉంటాడని దీవిస్తుంది. అంతే కాకుండా, తమను ఇంత కాలం ఎంతో భక్తితో పూజించి, సేవించిన కారణంగా… అహిలావతిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటానని, తనకి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటానని దీవిస్తుంది.
మౌర్విగా అహిలావతి జననం
జగన్మాత అయిన పార్వతీ దేవి ఇచ్చిన ఈ శాపం కారణంగా, కైలాసంలో శివపార్వతులను పూజిస్తూ ఉండాల్సిన భక్తురాలయిన అహిలావతి… నరకాసురుని సేనా నాయకుడు అయిన మురాసురునికి కూతురుగా జన్మిస్తుంది. ఈమెకు మౌర్వి అని పేరు పెడతాడు. మురాసురుడు చాలా భయంకరమయిన రాక్షసుడు. ఇతను నరకాసురుడికి చెందిన గొప్ప రాక్షస సైన్యానికి నాయకత్వం వహిస్తూ ఉంటాడు.
మురాసురుడు ఐదు తలలతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. ఇతను చాలా గొప్ప యోధుడు. అందుకే నరకాసురుడు తన రాక్షస సైన్యం బాధ్యత మొత్తం మురాసురునికి ఇస్తాడు. మురాసురునికి నరకాసుర రాజ్యాన్ని అన్ని వేళలా కాపాడటానికి కావాల్సిన శక్తులు అన్నీ ఉన్నాయి. అటువంటి శక్తులకు సంబందించి మురాసురునికి పూర్తి జ్ఞానం ఉంది.
మౌర్వి జన్మించిన తరువాత ఆమె తన తల్లిని కోల్పోతుంది. మురాసురునికి మౌర్వి కాకుండా ఇంకా ఏడుగురు కుమారులు కూడా ఉంటారు. వీరు అందరూ గొప్ప యోధులుగా తయారయి తమ తండ్రితో పాటుగా నరకాసురుడు రాజ్యాన్ని కాపాడుతూ, అతని సైన్యానికి నాయకత్వం వహిస్తూ, ఇంకా దేవతలని చాలా హింసిస్తూ ఉండేవారు. దేవతలపైన ఈ భయంకరమైన రాక్షసుల అరాచకాలు ఎక్కువయిపోయి దేవతలు అందరూ కృష్ణుడి దగ్గరకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకొని తమని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు శ్రీ కృష్ణుడు నరకాసురుడిని సంహరిస్తానని దేవతలకు ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఆ తరువాత, శ్రీ కృష్ణుడు, తన ప్రియమయిన భార్య మరియు సత్రాజిత్తు కూతురు అయిన సత్యభామతో కలిసి నరకాసురుడు మీదకు యుద్ధం చెయ్యటానికి బయలుదేరి వెళతాడు.
ఇది కూడా చదవండి: Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife
శ్రీ కృష్ణుడిని ఓడించడానికి మౌర్వి ప్రయత్నం
శ్రీకృష్ణుడు నరకాసురుని మీద యుద్ధం చెయ్యటానికి వచ్చినప్పుడు, ముందుగా నరకాసురుని సేనా నాయకుడు అయిన మురాసురుడు కృష్ణుడి మీద దాడి చేస్తాడు. వీళ్ళు ఇద్దరూ భీకరంగా యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం లో మురాసురుడితో పాటుగా అతని ఏడుగురు కుమారులు కూడా ఒక్కసారిగా కలిసి కృష్ణుడి మీదకు యుద్ధం చెయ్యటానికి వస్తారు. ఎంతో భీకరంగా జరిగిన ఈ యుద్ధంలో, చివరికి కృష్ణుడు మురాసురుడిని, అతని ఏడుగురు కుమారులను దిగ్విజయంగా చంపేస్తాడు. ఆ యుద్ధంలోనే సత్యభామ రాక్షసుడయిన నరకాసురుడిని కూడా ధైర్యంగా యుద్ధం చేసి చంపేస్తుంది. నరకాసురుడిని సత్యభామ చంపటం గురించిన కథ మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాము, ఇంకా సినిమాలలో కూడా చూసాము. ఈ విధంగా నరకాసురుడు కోసం, అతని రాజ్యాన్ని కాపాడటం కోసం మురాసురుడు, ఇంకా అతని ఏడుగురు కుమారులు కృష్ణుడి చేతిలో మరణిస్తారు.
అలా మౌర్వి శ్రీకృష్ణుడు, సత్యభామ చేసిన ఈ యుద్ధంలో తన తండ్రి అయిన మురాసురుడిని, ఇంకా తన ఏడుగురు సోదరులను కూడా పోగొట్టుకుని ఒంటరి అయిపోతుంది. తన తండ్రిని, సోదరులను చంపినందుకు శ్రీకృష్ణుడిని మౌర్వి ఎంతగానో ద్వేషిస్తుంది. తన ఈ పరిస్థితికి కారణం కృష్ణుడే అని అతనిని ఆ రోజు నుండీ బాగా అసహ్యించుకుంటుంది. అప్పటి నుండి, ఎలాగయినా శ్రీకృష్ణుడిని చంపాలని బలంగా మనసులో అనుకుంటుంది.
తన జీవితానికి ఉన్న ఒకే ఒక్క పరమార్ధం అదే అని నమ్మి, శ్రీకృష్ణుడిని చంపాలి అనే ఉద్దేశ్యంతో తనను ఒక గొప్ప యోధురాలిగా మార్చుకుంటుంది. అందుకోసం ఎంతో కఠినమయిన శిక్షణ తీసుకుంటుంది. అన్ని రకాల యుద్ధ విద్యలలో నైపుణ్యం సాధించి చివరికి గొప్ప యోధురాలిగా మారుతుంది. రాక్షస వంశంలో పుట్టినా కూడా మౌర్వి పార్వతీ దేవి స్వరూపం అయిన కామాఖ్య దేవికి గొప్ప భక్తురాలుగా ఉంటుంది. యుక్త వయస్సు వచ్చిన తరువాత, మౌర్వి శ్రీకృష్ణుడితో పోరాడటానికి అతని మీద యుద్ధానికి వెళుతుంది.