Nakul Sahadev, the most underrated Pandava

Most Underrated Characters in Mahabharata

మహాభారతం అంటే మనకందరికీ వెంటనే గుర్తుకి వచ్చే క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకి ఎన్నో మాయలు చేస్తూ మంచివాళ్ళకి మంచి జరిగేలా చేసే కృష్ణుడు; పాండవులలో అందరికంటే పెద్దవాడిగా, ఇంకా ఎప్పుడూ నిజాలే చెప్పే ధర్మరాజు; అలానే పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో అర్జునుడు, కర్ణుడు, భీముడు, దుర్యోధనుడు, ఇలా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ పాత్రలన్నీ మనం ఎప్పటికి గుర్తుపెట్టుకునేలాగా ఉన్నాయి. అయితే, వీళ్ళలాగా కాకుండా అంతగా పాపులర్ అవ్వని క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి  క్యారెక్టర్స్ లో, పాండవులలో ఉన్న నకులుడు, సహదేవుడు కూడా ఉన్నారు. అయితే మనం ఇప్పుడు వీళ్లిద్దరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 

నకుల, సహదేవుల పుట్టుక 

స్టోరీలోకి వెళ్లేముందు అసలు వీళ్ళు ఎలా పుట్టారు? ఎవరికి పుట్టారు? తెలుసుకుందాం. చాలామంది పాండవులు అందరూ కుంతీదేవికి పుట్టారు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పాండవుల తండ్రైన  పాండురాజుకి, కుంతి కాకుండా మరో భార్య కూడా ఉంది. ఆమే మద్ర రాజ్యానికి రాజైన శల్యుడి సోదరి మాద్రి. ఈమె పాండురాజు యొక్క రెండవ భార్య.  

ఒకసారి, పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు కిదమ ఋషిని, అతని భార్యని దూరం నుండీ చూసి జింకలని భావించి తెలియక బాణం వేసి చంపుతాడు. చనిపోయే ముందు ఆ ఋషి పాండురాజుని చూసి, ఎప్పుడయితే నీ భార్యల దగ్గరకు కోరికతో వెళతావో అప్పుడు నీవు చనిపోతావని శపిస్తాడు. ఆ శాప భయంతో, పాండురాజు రాజ్యాన్ని తన సోదరుడయిన ధృతరాష్ట్రుడికి ఇచ్చి తన భార్యలతో వనవాసానికి వెళ్ళిపోతాడు. అప్పుడు దుర్వాసముని కుంతీదేవికి ఒక గొప్ప వరం ఇస్తాడు. అది ఏంటంటే, కుంతీదేవి ఎవరయినా దేవుడిని స్మరిస్తే, వెంటనే ఆ దేవుడు ఒక బిడ్డను ఇస్తాడని వరం. ఆ వరం వలన కుంతీదేవికి యమధర్మరాజు వలన ధర్మరాజు, వరుణుడి వలన భీముడు, ఇంద్రుడి వలన అర్జునుడు పుడతారు. ఆ విషయం తెలిసి తనకి పిల్లలు లేనందుకు మాద్రి చాలా బాధ పడుతుంది. అప్పుడు, కుంతీదేవి ఆమెని ఓదారుస్తూ తనకు తెలిసిన ఆ వరాన్ని మాద్రికి కూడా చెప్తుంది. అప్పుడు, మాద్రి అశ్విని దేవతలను స్మరించి ఇద్దరు కుమారులను పొందుతుంది. వారే నకులుడు, సహదేవుడు. అశ్విని దేవతలలో నాసత్యుడు వలన నకులుడు, ఇంకా దనుడు వలన సహదేవుడు పుట్టారు.

పాండురాజు, మాద్రి చనిపోయిన తరువాత, కుంతీదేవి అందరికీ తల్లి అవుతుంది. ఈ విషయం తెలియని చాలామంది, పాండవులు అందరికీ కుంతీనే తల్లి అని అనుకుంటారు. 

నకుల, సహదేవుల బాల్యం

నకుల అంటే చాలా అందమైనవాడు అని, ఇంకా సహదేవ్ అంటే దేవతలతో ఉండేవాడు అని అర్ధం. వేదవ్యాసుడు తాను రాసిన మహాభారతంలో, నకులుడు ఈ భూమండలం పైనే చాలా అందగాడు అని చెప్పాడు. అదే విధంగా సహదేవుడు, తన సోదరులైన పాండవులు కౌరవులు అందరిలోకి చాలా తెలివికలవాడు అని చెప్పారు. మిగతా కౌరవులతో, పాండవులతో, నకుల సహదేవులు కూడా ద్రోణాచార్యుడి దగ్గర అన్నీ విద్యలు నేర్చుకున్నారు. అందరిలోకి, వీరిద్దరూ చాలా గొప్ప విద్యావంతులు, మరియు కత్తి యుద్ధంలో గొప్ప ప్రావీణ్యం కలవారు. ఇవే కాకుండా, వీళ్ళు ఇద్దరూ జ్యోతిష్యం, వైద్యం, పరిపాలన, ఆర్థిక విషయాలు ఇంకా సాంస్కృతిక కళలలో కూడా సమర్ధులు.

ఇది కూడా చదవండి: The Unknown Story of Barbarik in Mahabharata

నకుల, సహదేవుల వివాహాలు

మనకందరికీ తెలుసు… పాండవులు ఐదుగురికి భార్య ద్రౌపది అని. ఈమెను అర్జునుడు స్వయంవరంలో గెలుచుకొని వివాహం చేసుకుంటాడు. కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం, నకుల, సహదేవులతో సహా పాండవులందరూ ద్రౌపదిని భార్యగా అంగీకరిస్తారు. 

అయితే, ద్రౌపది కాకుండా నకులుడికి ఇంకొక భార్య కూడా ఉంది. ఆమె పేరు కరేణుమతి. ఈమె, చేది అనే రాజ్యానికి చెందిన యువరాణి. కరేణుమతి ద్వారా నకులుడికి నిరమిత్ర అనే కొడుకు పుట్టాడు. అదే విధంగా, నకులుడికి ద్రౌపదితో కూడా ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు, వారి పేర్లు శతానికుడు, ప్రింత.

ఇదే విధంగా, సహదేవుడికి కూడా ద్రౌపదితో పాటుగా ఇంకొక భార్య ఉంది. ఈమె పేరు విజయ. ఈమె ద్వారా సహదేవుడికి కలిగిన కుమారుడు సుహోత్రుడు. సహదేవుడికి కూడా ద్రౌపదితో ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పేరు శ్రుతసేనుడు, ఇంకా కూతురు పేరు సుమిత్ర. 

సహదేవుని రహస్య శక్తులు

వ్యాస మహాభారతంలో సహదేవునికి చాలా ప్రత్యేక శక్తులు ఉన్నాయని వివరంగా చెప్పారు. సహదేవుడికి భవిష్యత్తుని తెలుసుకునే గొప్ప శక్తి ఉంది. అతనికి ఈ శక్తి తన తండ్రి అయిన పాండురాజు నుండి వచ్చింది. పాండురాజుకి తాను ఎలా చనిపోతాడో ముందే తెలుసు. అతను ఎన్నో సంవత్సరాలు ధ్యానంలో ఉండి గొప్ప తపస్సు చేసాడు. ఈ తపస్సు వలన అతను గతం, వర్తమానం, ఇంకా భవిష్యత్తు గురించి గొప్ప జ్ఞానాన్ని పొందాడు. 

పాండురాజు తన ఐదుగురు కుమారులను పిలిచి ఈ రహశ్యం  చెప్పాడు. కానీ పాండురాజు నుండి అతని తరువాత ఆ శక్తి పొందాలంటే పాండురాజు మరణించిన తర్వాత అతని మాంసాన్ని తినాలి అని చెప్పాడు. కానీ పంచ పాండవులలో ఎవరు కూడా పాండురాజు మరణించిన తరువాత అతని మాంసాన్ని తినడానికి అంగీకరించలేదు. 

The Untold Story of Barbarik in Mahabharata
The Unknown Story of Barbarik in Mahabharata

మరణించిన తర్వాత అతని శరీరాన్ని కాల్చేశారు. అప్పుడు ఆ మృతదేహంలోని ఒక చిన్న మాంసం ముక్కను చీమలు మోసుకెళ్ళటం సహదేవుడు చూసి, వెంటనే ఆ మాంసం ముక్కనుని నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే, సహదేవుడికి భూత, వర్తమాన, భవిష్యత్తును తెలుసుకునే శక్తులు వచ్చాయి. అందుకే సహదేవుడిని ‘త్రికాలజ్ఞాని’ అని కూడా పిలుస్తారు.

ఈ రహశ్యాన్ని పంచుకోవటానికి సహదేవుడు వెంటనే తన సోదరుల వద్దకు వెళ్తాడు. కానీ దారిలో అతనికి ఒక బ్రాహ్మణుడు రూపంలో వచ్చిన కృష్ణుడు అడ్డగిస్తాడు. సహదేవుడికి వున్న శక్తుల వలన తనను ఆపినది ఎవరో వెంటనే తెలిసిపోతుంది. తనకు వచ్చిన ఈ ప్రతేక శక్తులు గురించి ఎవ్వరికి చెప్పకూడదని కృష్ణుడు అంటాడు. అందుకు సహదేవుడు అబద్ధం చెప్పలేనని చెప్తాడు. 

అప్పుడు కృష్ణుడు ఆలోచించి, ఎవరైనా వచ్చి ఎమన్నా అడిగితే అప్పుడు సహదేవుడు ఇచ్చే సమాధానం కూడా ఒక ప్రశ్న లాగానే ఉండాలని కృష్ణుడు చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ఈ సలహాని తాను పాటించాలంటే… తన సోదరులయిన మిగతా పాండవులను ఎప్పుడూ కృష్ణుడు రక్షిస్తూ ఉంటానని మాట ఇమ్మంటాడు. ఒకవేళ, పాండవులలో ఎవరయినా మరణిస్తే వెంటనే కృష్ణుడు కూడా మరణించాలని కండిషన్ పెడతాడు. ఇష్టం లేకపోయినా, కృష్ణుడు ఈ కండిషన్ కి ఒప్పుకుంటాడు. 

కృష్ణుడికి ఇచ్చిన ఈ మాట వలన ఎప్పుడూ చాలా అల్లరిచిల్లరిగా ఉండే సహదేవుడు అప్పటి నుండి చాలా మౌనంగా ఉండిపోతాడు. ఎవరయినా వచ్చి సరయిన ప్రశ్న అడుగుతారేమో అని ఎదురు చూస్తూ ఉండిపోతాడు. అంత మౌనంగా ఉండటానికి, సహదేవుడు మానసికంగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో, ఎంత సహనం చూపించాడో కదా… 

జూదంలో ఓడిపోయిన పాండవులు ఉన్న లక్క ఇల్లుని తగలబెట్టటం కోసం దుర్యోధనుడు పన్నిన ఉపాయం గురించి సహదేవుడికి ముందే తెలుసు. ఇంకా దుర్యోధనుడు వేసిన అన్ని మోసపూరిత ఆలోచనలు, శకుని చేసిన రాజకీయ చాకచక్యం, పాచికల ఆట, ఇంకా ద్రౌపదికి దుశ్శాసనుడు వలన జరిగిన అవమానం, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారో… అన్నీ సహదేవుడికి ముందుగానే తెలుసు. 

పాండవుల పిల్లలను అందరిని అశ్వథామ చంపేస్తాడని కూడా అతనికి తెలుసు. తన కుమారుడిని చూసిన ప్రతిసారీ అతను ఎలా మరణిస్తాడో అనే విషయం గుర్తుకువచ్చి ఎంతగానో బాధపడేవాడు. ఇంకా ఇలా ఎన్నో విషయాలు ముందుగానే తెలిసినా కూడా, వాటి గురించి ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. సహదేవుని రహశ్యాలు అన్నీ తెలిసిన ద్రౌపదికి కూడా సహదేవుడు ఎప్పుడూ ఈ రహశ్యం గురించి చెప్పలేదు. ఇన్ని ఘోరమయిన విషయాలు ఎవ్వరితో పంచుకోలేక సహదేవుడు ఎంతో బాధ పడేవాడు. అతను మనో నిబ్బరం కోల్పోకుండా, ఎంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నాడు.

శకుని చేసిన మాయా జూదపు పథకం గురించి సహదేవుడికి ముందే తెలుసు. కౌరవుల ప్రతి మోసపూరిత ఆలోచన వెనుక శకుని ఉన్నాడని సహదేవుడు ముందే కనిపెట్టాడు. అందువలనే, యుద్ధ సమయంలో శకునిని చంపేస్తానని అతను శపథం చేసాడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు సహదేవుడు శకునితో యుద్ధం చేసాడు. సహదేవుడు ఒక్కసారిగా 1000 బాణాలను శకుని మీద ప్రయోగించాడు. తరువాత అతను తన ఖడ్గ నైపుణ్యంతో శకుని తలను నరికివేశాడు.

మహాభారతంలో నకులుడు

నకులుడు ఈ భూమి మీద ఉన్న అందరిలోకీ చాలా అందగాడు అని వ్యాస మహాభారతంలో చెప్పారు. ఒక విధంగా, నకులుడు ఈ విషయంలో చాలా గొప్పగా, గర్వంగా ఫీలయ్యేవాడు. అందరితో ఆ విషయంలో గొప్పలు చెప్పుకునేవాడు. నకులుడు తన పినతల్లి అయిన కుంతీదేవి, ఇంకా ఆమె కుమారులంటే ఎంతో ప్రేమ చూపించేవాడు. 

తన మామ అయిన శల్యుడు మద్ర రాజ్యాన్ని పాలించుకోమని నకుల సహదేవుళ్లకు చెప్పినప్పుడు, అందుకు ఇష్టపడక… మిగతా పాండవులతో కలిసి హస్తినాపురంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరుల కోసం ఏమి చెయ్యటానికయినా వెనుకాడేవాడు కాదు. మాయాజూదంలో ధర్మరాజు మొదటగా నకులుడినే పణంగా పెట్టినప్పుడు కూడా ఏవిధంగా కూడా ధర్మరాజుని నిందించకుండా, అన్న మాటను గౌరవించి వెంటనే అంగీకరించాడు. తన సోదరులకు అంత ప్రాముఖ్యం ఇచ్చాడు.

ఇక పాండవ కౌరవులందరిలోకీ నకులుడు ఖడ్గ విద్యలో చాలా నిపుణుడు మరియు సమర్ధుడు. అతనిని ఓడించినవాళ్లు లేరు. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు స్వయంగా ఈ ఖడ్గం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి నకులుడికి చెప్పాడు. ఇదే కాకుండా, నకులుడుకి ఉన్న ఇంకొక గొప్ప నైపుణ్యం గుర్రాలను పెంచటం. గుర్రాలకు వచ్చే రకరకాల వ్యాధులని ఇతను నయం చెయ్యగలడు. 

గుర్రాల గురించి ఎంతో తెలిసి ఉండటం వలన నకులుడు గొప్ప రథసారధి కూడా అయ్యాడు. అతను ఎంత నిపుణుడు అంటే… వర్షం పడేటప్పుడు గుర్రపుస్వారీ చేస్తూ ఆ వర్షపు చినుకులను అన్నింటినీ వేగంగా తన ఖడ్గంతో తిప్పికొట్టగలడు. ఆ సమయంలో ఒక్క  వర్షపు చుక్క కూడా తన మీద పడకుండా చెయ్యగలడు. ఇంత గొప్ప నైపుణ్యం పాండవులలో, కౌరవులలో ఎవ్వరికీ లేదు. 

The Untold Story of Vrishasena in Mahabharat
The Untold Story of Vrishasena

ఇక కురుక్షేత్ర యుద్ధంలో నకులుడు తన యుద్ధ నైపుణ్యాలతో కౌరవులతో చాలా బాగా యుద్ధం చేసాడు. మొదటి రోజు, యుద్ధంలో నకులుడు దుశ్శాసనుడిని ఓడించాడు. అతనిని చంపటానికి అవకాశం ఉన్నా కూడా, తన సోదరుడు భీముడు దుశ్శాసనుడిని చంపుతానని చేసిన ప్రతిజ్ఞ వలన అతనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. యుద్ధం మొదలయిన 11వ రోజు శల్యుడిని, ఇంకా 14వ రోజు శకునిని ఓడించాడు.  యుద్ధం మొదలైన 16వ రోజు, యుద్ధంలో కర్ణుడు నకులుడిని ఓడిస్తాడు. కానీ నకులుడితో యుద్ధం చేసేటప్పుడు కర్ణుడు చాలా భయపడ్డాడు. ఎందుకంటే  యుద్ధ రంగంలో నకులుడి గర్జన చాలా పెద్దగా, భయంకరంగా ఉంటుంది. 10,000 ఏనుగులు  ఒక్కసారిగా అరిస్తే ఎలా ఉంటుందో అంత శక్తివంతంగా ఉంటుంది. యుద్ధంలో 17వ రోజు, నకులుడు శకుని కొడుకు అయిన విర్కాసురుడిని చంపాడు. అదే విధంగా 18వ రోజు కూడా, కర్ణుని ముగ్గురు కుమారులైన చిత్రసేనుడు, సుషేణ, సత్యసేనులను చంపేస్తాడు. 

ఇది కూడా చదవండి: The Untold Story of Vrishasena

నకుల, సహదేవులు తమ జీవితాన్ని ముంగించటం 

కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తరువాత, ధర్మరాజు నకులుడిని మద్ర రాజ్యానికి ఉత్తర దిక్కు రాజుగా, ఇంకా సహదేవుడిని దక్షిణ దిక్కు రాజుగా నియమిస్తాడు. 

అలా చాలా కాలం, నకుల సహదేవులు ఎంతో గొప్పగా రాజ్యపాలన చేశారు. చాలా సంవత్సరాలకి, శ్రీ కృష్ణుడి మరణ సమయం ఇంకా కలియుగ ప్రారంభ సమయం వచ్చింది. తమ జీవితాన్ని ముగించే సమయం వచ్చిందని తెలుసుకున్న పాండవులు స్వర్గానికి బయలుదేరతారు. నకుల సహదేవులు తమ రాజ్యాలను తమ కుమారులకు అప్పగిస్తారు. మిగతా పాండవులు కూడా పదవీ విరమణ చేసి, అభిమన్యుడి కుమారుడవైన పరీక్షిత్తుని రాజుగా చేసి, స్వర్గానికి బయలు దేరతారు. వీళ్ళతో పాటుగా ఒక కుక్క కూడా బయలుదేరుతుంది. వీరంతా హిమాలయాల వైపు నడుచుకొంటూ వెళతారు. కొంత దూరం అలా వెళ్ళిన తర్వాత, దారిలో, ధర్మరాజు తప్ప మిగిలిన పాండవులు అందరూ ఒక్కొక్కరుగా పడిపోతూ ఉంటారు.  ఎత్తైన  పర్వతాల మీద నుండీ కింద పడిపోవటం వల్ల వీరంతా చనిపోతారు. 

మొదటగా ద్రౌపది కింద పడి చనిపోతుంది. ఆ తరువాత సహదేవుడు కింద పడి చనిపోతాడు. ఆ సంఘటన చూసిన భీముడు భయపడిపోయి ధర్మరాజుని కారణం అడుగుతాడు. సహదేవుడు ఎప్పుడూ అందరికంటే తానే గొప్పవాడినని, విద్యావంతుడిని అని గర్వంగా ఫీలయ్యేవాడు, ఆ గర్వం వల్లనే ఇప్పుడు ఇలా మరణించాడు అని ధర్మరాజు చెప్తాడు. 

ఆ తరువాత, వరుసలో కింద పడి మరణించింది నకులుడు. తన సోదరుడు అయిన సహదేవుడు, ఇంకా తన భార్య అయిన ద్రౌపది కళ్ళముందే చనిపోవటం చూసిన ఎంతో శక్తిమంతుడయిన నకులుడు భయంతో, బాధతో నిరాశపడిపోతాడు. ఆ ఆలోచనలతోనే నకులుడు కూడా మరణిస్తాడు. 

నకులుడు ఎప్పుడూ ప్రపంచంలో అందరికంటే తానే గొప్ప అందగాడు అని ఎప్పుడూ అహంకారంగా ఉండేవాడు. ఆ గర్వం వల్లనే ఇప్పుడు ఇలా మరణించాడు అని, భీముడికి ఇంకా అర్జునుడికి, ధర్మరాజు చెప్తాడు. ఈ ఆలోచనలతో, సోదరులను కోల్పోయిన బాధతో అర్జునుడు, భీముడు కూడా మరణిస్తారు. ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరుకుంటాడు. ధర్మరాజుతో పాటుగా వచ్చిన ఆ కుక్క యమధర్మరాజుగా మారి ధర్మరాజుని ఆశీర్వదిస్తాడు. 

స్వర్గానికి వచ్చిన ధర్మరాజు అక్కడ కౌరవులందరినీ చూసి ఆశ్చర్యపోతాడు. తన భార్య ఇంకా సోదరులు నరకంలో ఉండటం చూసి చాలా బాధ పడతాడు. ఇలా ఎందుకు జరిగిందని యమధర్మరాజుని అడుగుతాడు. కౌరవులు చేసిన చిన్న చిన్న పుణ్యాలకు కొంతసేపు స్వర్గంలో ఉన్నారని, వెంటనే వాళ్ళు అందరూ నరకానికి వెళతారని, అదే విధంగా ద్రౌపది ఇంకా నలుగురు పాండవులు వారు చేసిన చిన్న చిన్న పాపాల కారణంగా ఇప్పుడు నరకంలో ఉన్నారని, వెంటనే వాళ్ళు అందరూ స్వర్గానికి చేరుకుంటారని యముడు సమాధానం చెప్తాడు. అలా ద్రౌపదితో సహా పాండవులు అందరూ చివరకు స్వర్గానికి చేరుకొని మోక్ష జీవితం గడుపుతారు. 

ముగింపు 

పాండవుల్లో నకుల, సహదేవుల గురించి ఈ ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసినప్పటికీ, వీళ్ళు ధైర్యానికి మారుపేరు. ఖడ్గ విద్యలో, గుర్రపు స్వారీలో తనకి వేరొకరు సాటిలేరని నిరూపించాడు నకులుడు. ఇక భవిష్యత్తు తన కళ్ళముందే కనిపిస్తున్నా విధికి తలవంచి, గొప్ప మనో నిబ్బరంతో గడిపాడు సహదేవుడు. ఇప్పటివరకూ మనకి తెలిసిన పాండవులలో ధర్మరాజు, భీముడు, అర్జనుడి శక్తుల గురించే విన్నాం. కానీ, వీరు కూడా మహాభారత యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. వీరి శక్తియుక్తుల ముందు మిగిలిన పాండవ సోదరులు సాటిరారు. అందుకే నకుల, సహదేవుల కధ మహాభారతంలో ఓ రిమైండర్‌గా పనిచేస్తుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top