Sunday, October 2, 2022
spot_img

వినాయకుడి జీవితం నుంచి ఈ 5 విషయాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి!

హిందువుల ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. ఏ శుభకార్యం తలపెట్టినా…   నిర్విఘ్నంగా కొనసాగటానికి గణేశ ప్రార్ధనతో ప్రారంభిస్తాం. వినాయకుడంటే విఘ్నాలని తొలగించే దేవుడు మాత్రమే కాదు, మనందరికీ గురువు కూడా. వినాయకుని వృత్తాంతం అందరికీ గొప్ప జీవిత పాఠాలని అందిస్తుంది. అలాంటి వినాయకుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ 5 విషయాలని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విషయాలేంటో మరి ఇప్పుడు తెలుసుకుందామా..!

లక్ష్య సాధనలో కర్తవ్య నిర్వహణకంటే ఏదీ గొప్పకాదు:

పార్వతి దేవి తాను స్నానానికి వెళ్తూ… తన ఒంటికి పెట్టిన నలుగుపిండితో పిండిబొమ్మని చేసి… దానికి ప్రాణం పోసి… ఆ బాలుడిని ద్వారం ముందు కాపలా ఉంచి వెళ్తుంది. అలా ప్రాణం పోసుకున్న వినాయకుడు సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే వచ్చి లోపలి వెళ్ళబోతే అడ్డుకున్నాడు. తానెవరో తెలిపినా కూడా లోపలికి అనుమతించడు గణేషుడు. కారణం కర్తవ్య నిర్వహణ కంటే ఏదీ గొప్ప కాదనేది అతని ఉద్దేశ్యం. ఇలా  విధి నిర్వహణలో తన ప్రాణాలుసైతం పోగొట్టుకుంటాడు. అయినా తను లక్ష్యాన్ని పూర్తి చేశాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటే! ఎవరైనా మనకి ఒక పనిని అప్పగిస్తే… దాన్ని పూర్తిచేసేంతవరకూ వెనుదిరగకూడదు. అప్పుడే కెరీర్‌లో దూసుకెళ్తాం.

ప్రపంచంలో తల్లిదండ్రులకే మొదటి స్థానం: 

గణాధిపతిగా ఎవరిని నియమించాలి? అనే సందేహం కలిగినప్పుడు శివ పార్వతుల పుత్రులైన కుమారస్వామి, వినాయకుడు పోటీపడతారు. అయితే, వీరి తల్లిదండ్రులు వీరికి ఒక పరీక్ష పెడతారు. ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను ఎవరితే ముందుగా చుట్టి వస్తారో… వారికే ఆధిపత్యాన్ని అప్పచెప్పనున్నట్లు చెప్తారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి యాత్రలకు బయలు దేరతాడు. కానీ, గణేషుడు మాత్రం అలా వెళ్ళలేక… ముల్లోకాలకీ అధిపతులు అయిన శివపార్వతులనే దేవుళ్లుగా భావించి… తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షణాలు చేస్తాడు. ఈ కారణంగా ప్రతిసారీ తన సోదరునికంటే తానే ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటాడు. దీన్నిబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి చూసుకోవాలి అని. ప్రపంచంలో అందరికంటే తల్లిదండ్రులకే మొదటిస్థానం ఇవ్వాలి అని.

తప్పుచేసిన వారిని క్షమించే గుణం: 

వినాయక చవితినాడు భక్తులు తనకి భక్తితో సమర్పించిన కుడుములు, ఉండ్రాళ్ళు తిని భుక్తాయాసంతో నడుస్తూ ఉండగా… తనను చూసి చంద్రుడు పగలబడి నవ్వుతాడు. అట్టి చంద్రుడు చేసిన తప్పుని కూడా మంచి మనసుతో క్షమిస్తాడు వినాయకుడు. దీనిని బట్టి మనల్ని ఎగతాళి చేసేవారిని క్షమించే గుణం నేర్చుకోవాలని అర్ధమవుతుంది.

చేపట్టిన పనిని పూర్తిచేయడం:

మహాభారతాన్ని రాసింది వేద వ్యాసుడు అంటారు. కానీ, నిజానికి భారతాన్ని వ్యాసుడు చెప్తుంటే… గణేశుడు రాస్తాడు. అయితే, ఈ  గ్రంధాన్ని రాస్తున్న సమయంలో తన ఘంటం విరిగిపోతుంది. కానీ, విఘ్నేశ్వరుడు ఆ ఘంటానికి బదులుగా…  తన దంతాల్లోంచి ఒక దాన్ని పీకి గ్రంథం రాయడం పూర్తి చేశాడు. అంతేకాని మధ్యలో ఆపలేదు. దీన్నిబట్టి మనిషి ఏ పనిచేపట్టినా… ఎన్ని అవరోధాలు వచ్చినా… ఆ పనిని పూర్తి చేసేంత వరకూ ఆపకూడదు అని.

ఆత్మ గౌరవం: 

ఒకసారి శ్రీమహావిష్ణువు ఒక శుభ కార్యం చేపట్టి… దానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. దేవతలు వెళ్తూ…వెళ్తూ..  స్వర్గలోకానికి కాపలాగా గణేషున్ని ఉంచుతారు. దీనికి కారణం ఆయన ఆకారమే! దీంతో  ఎలాగైనా దేవతలకు గుణపాఠం  చెప్పాలని అనుకుంటాడు. వాళ్ళు వెళ్లే దారి మొత్తం గోతులు పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం అలానే చేస్తుంది. ఆ గుంతల్లో దేవతల రథం ఒక్కొక్కటిగా దిగబడుతుంది. ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు. ఇంతలో  ఓ రైతు అటుగా వెళ్ళటం చూసి, పిలిచి సహాయం చేయమంటారు. ఆ రైతు గణేషున్ని ప్రార్థించి, ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని పైకి లాగుతాడు. వారికప్పుడు అర్ధమవుతుంది విఘ్నాలని తొలగించే దైవం విఘ్నేశ్వరుడు, అతనిని ప్రార్ధించడం తప్ప వేరొక మార్గం లేదు అని. దీంతో దేవతలు తమ తప్పు తాము తెలుసుకుంటారు. వినాయకుడిని క్షమించమని కోరతారు.  ఇక్కడ వినాయకుడు తన ఆత్మ గౌరవాన్ని ప్రదర్శించబట్టే… దేవతలు సైతం దిగివచ్చారు. దీన్ని బట్టి మనం ఎట్టి  పరిస్థితిలోనూ ఆత్మ గౌరవాన్ని కోల్పోకూడదని అర్ధమవుతుంది.

కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 5 విషయాలని వినాయకుని జీవితం నుంచి ఆదర్శంగా తీసుకోవాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,506FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles