Ravanasura, Ravana's secrets, Hindu mythology

Exploring the Hidden Story of Ravana

లంకాధిపతి అయిన రావణుడిని హిందూ పురాణాలు ఒక రాక్షసుడిగా చిత్రీకరించాయి. కానీ, అతనిలో ఓ మహా జ్ఞాని దాగున్నాడని ఎంతమందికి తెలుసు. నాణేనికి బొమ్మా, బొరుసు ఉన్నట్లే… రావణుడిలో కూడా ఇద్దరు ఉన్నారు. మనకి తెలిసిన కథనాలన్నీ సీతని అపహరించిన దుర్మార్గుడిగానే చెప్తున్నాయి కానీ, చెప్పలేని రహశ్యాలు మరెన్నో ఉన్నాయి. అలాంటి మిస్టరీస్ ని ఈ ఆర్టికల్ లో రివీల్ చేస్తున్నాము. మరింకెందుకు ఆలస్యం పదండి. 

రావణాసురుని పూర్వ జన్మ వృత్తాంతం

భాగవత పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు ఒకసారి వైకుంఠం చేరుకొంటారు. సనత్ కుమారులు రూపంలో చాలా చిన్నవారుగా ఉండటం వల్ల… వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు వారిని చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. వెంటనే ఆగ్రహించిన సనత్ కుమారులు జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. 

విషయాన్ని గ్రహించిన  జయ విజయులు పశ్చాత్తాపంతో శాప విమోచనాన్ని కలిగించమని అర్థిస్తారు.  అప్పుడు వారిని హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా తాము జీవించలేమని, మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు 3 జన్మలెత్తుతారు. అవి:

  • కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు.
  • త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు.
  • ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవకృడు.

ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ, కుంభకర్ణులనే అన్నదమ్ములు. అంటే ఇప్పుడు మనం చెప్పుకొంటున్న రావణుడు తన పూర్వ జన్మలో సనత్ కుమారులచే శపించబడిన విష్ణువు యొక్క  ద్వారపాలకులలో ఒకరు.

రావణాసురుని ప్రారంభ జీవితం

స్కంద పురాణములోని బ్రహ్మఖండంలో రామేశ్వర సేతు మహాత్మ్యంలో చెప్పబడిన ప్రకారం, బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వవసు బ్రహ్మకు, మరియు దైత్య రాకుమారియైన కైకసికి జన్మించిన కుమారుడే రావణాసురుడు. తన తల్లి దండ్రులిద్దరూ అసుర సంధ్యా సమయంలో సంబోగించడం వల్ల రావణాసురుడు రాక్షసుడిగా పుట్టాడు.

కైకసి యొక్క పది మంది కొడుకులలో రావణుడు పెద్దవాడు. చిన్నప్పటి నుండి అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉండి… శారీరక పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు.  ఏకసంథాగ్రాహిగా ఉండేవాడు. వేదవిద్యలు తన తండ్రి విశ్వ వసు బ్రహ్మ నుండి నేర్చుకొని గొప్ప విద్వాంసుడుగా మారతాడు. వివిధ రకాల ఆయుధాలు మరియు యుద్ధ కళలలో రాణించాడు. నైపుణ్యం కలిగిన యోధుడుగా మారాడు.  కైకసి తండ్రి తనకు తాత అయిన సుమాలి వద్ద నుండి రాజ్యపాలనా విషయాలు, నేర్చుకుంటాడు. అందుకే, రావణుడు లంకలో అత్యంత శక్తివంతమైన రాజు అయ్యాడు.

రావణాసురుడుకి మొత్తం ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కుబేరుడు, విభీషణుడు, కుంబ కర్ణుడు, ఖరుడు, దూషణుడు, అహిరావణుడు అనే ఆరుగురు ఇతని సోదరులు. అలాగే కుంభిని, శూర్పణఖ అనే ఇద్దరు సోదరీమణులు. 

కుంభిని గురించి ఎవరికీ తెలియకపోయినప్పటికీ… శూర్పణఖ గురించి మాత్రం చాలా మందికి తెలుసు. అసలు రావణాసురుడు సీతను అపహరించడానికి కారణమే ఈమె. శూర్పణఖ రావణాసురుడిని రాముడిపై ఉసిగొల్పడం వల్లే ఈ కథంతా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

రావణాసురుని ఇతర పేర్లు

  • రావణుడికి పుట్టుకతో పెట్టిన పేరు ‘దశగ్రీవుడు’.
  • రావణాసురుడు ఇంకా అనేక పేర్లని కలిగి ఉన్నాడు. పది మంది జ్ఞానులతో సమానమైన జ్ఞానం కలిగి ఉండటం చేత ఇతనిని ‘దశకంఠుడు’ అంటారు.
  • 10 తలల్ని కలిగి ఉండటం చేత ‘దశముఖుడు’ అని పిలుస్తారు.
  • కైలాస పర్వతాన్ని రావణాసురుడు తన చేతులతో పెకలిస్తున్నప్పుడు శంకరుడు ఇతని చేతివ్రేళ్ళని కాలితో త్రోక్కుతాడు. ఆ బాధ  భరించలేక రావణాసురుడు అతి బిగ్గరగా అరుస్తాడు. ‘ఇక్కడ రావణ’ అంటే అరుపు అని అర్ధం. అందువల్లనే ఇతనికి ‘రావణుడు’ అనే పేరు వచ్చింది.

మాతృవాక్య పరిపాలకుడు

ఒకానొక సందర్భంలో రావణుడి తల్లి కైకసి లంకలో సముద్రపు ఒడ్డున ఇసుకతో సైకత లింగం తయారుచేసి ప్రతిష్టించుకొని పూజిస్తూ ఉంటుంది. అలా పూజించే సమయంలో సముద్రంలో అలలు ఎగసి పడి ఆ లింగం సముద్రంలో కలిసి పోతుంది. 

పూజ మధ్యలో సైకతలింగం సముద్రం పాలవటంతో  ఆమె తన దు:ఖాన్ని రావణుడి దగ్గర తెలుపుతుంది. తల్లి దు:ఖాన్ని చూడలేక వెంటనే శివుడి ఆత్మ లింగమే తెచ్చి ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. శివ భక్తుడిగా అకుంఠిత దీక్షతో తపస్సు చేసి, అన్ని అడ్డంకులను అధిగమించి శివుడి ఆత్మ లింగాన్ని సంపాదిస్తాడు

అయితే, ఆ లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లంక చేరే వరకు కింది పెట్టకూడదని నియమం ఉంది. కానీ దేవతలు కుట్ర చేసి వినాయకుడిని పంపించి రావణాసురుడి చేత దాన్ని కింద పెట్టించడం చేస్తారు. ఆ ప్రదేశమే ఇప్పుడు ‘గోకర్ణం క్షేత్రం’ అయిందని ఒక కథ ఉంది.

ఇది కూడా చదవండి: Mandodari’s Significance in Hindu Mythology

బ్రహ్మ నుండి వరం 

పురాణాల ప్రకారం రావణుడు 11,000 సంవత్సరాలు గోకర్ణ పర్వతంపై తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలను పొందాడు. తన తపస్సు సమయంలో బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు తన తలను పదిసార్లు నరికి బలిస్తాడు. అతను తన తలను నరికిన ప్రతిసారీ ఒక కొత్త తల పుట్టుకొచ్చేది.

అప్పుడు బ్రహ్మ దేవుడు రావణుడి తపస్సుకి మెచ్చి…అతని ముందు ప్రత్యక్షమై వరం కోరమని చెప్పాడు. రావణుడు అమరత్వాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ దానిని నిరాకరించాడు. బదులుగా తనకి దేవతల ద్వారా గానీ, రాక్షసుల ద్వారా గానీ, సర్పాల ద్వారా గానీ, పిశాచాల ద్వారా గానీ మరణం ఉండకూడదనే వరాన్ని కోరుకొంటాడు. బ్రహ్మ దానికి అంగీకరించి ఈ వరంతో పాటు అద్వితీయమైన అస్త్రాలు,  ఒక రథం, అలాగే రూపాంతరం చెందగల సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు.ఆ విధంగా రావణుడు పది తలలు, ఇరవై చేతులను పొందాడు. 

Nakul Sahadev, the most underrated Pandava
Most Underrated Characters in Mahabharata

కుటుంబ జీవితం  

రావణాసురుని భార్య మండోదరి. ఈమె మహా పతివ్రత. మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ మరియు దేవకన్యయైన హేమకు గలిగిన పుత్రిక. రావణాసురుడు ఈమెను మోహించి పెళ్ళాడాడు. 

రావణాసురుడికి మొత్తం ఏడుగురు కుమారులు. వారు మేఘనాద, అతికాయ, అక్షయకుమార, నరాంతక, దేవాంతక, త్రిశిర మరియు ప్రహస్త మొదలైన వారు.

రావణాసురుని గురించి ఇంతవరకూ మనం చెప్పుకున్న విషయాలన్నీ అందరికీ తెలిసినవే! అయితే, ఎవరికీ తెలియని మరికొన్ని విషయాలు అతనిలో దాగున్నాయి. వాటి గురించి ఇపుడు చెప్పుకుదాం.

గొప్ప పండితుడు మరియు విద్వాంసుడు

రావణుడు 64 రకాల కళలలో నిష్ణాతుడు. రావణుని యొక్క 10 తలలు అతని 10 లక్షణాలను సూచిస్తాయి. వీటిలో 6 తలలు 6 శాస్త్రాలను సూచిస్తే… 4 తలలు 4 వేదాలను  సూచిస్తాయి. కాబట్టి అతన్ని గొప్ప పండితుడిగా చెప్పుకోవటమే కాకుండా, అతని కాలంలోని అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరిగా మార్చాయి. 

రావ‌ణాసురుడు తన సొంత మేథాశ‌క్తితో పుష్పక విమానాన్ని త‌యారు చేశాడ‌ట‌. శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో అత‌ను ఆరితేరి ఉండ‌డం వ‌ల్లే పుష్పక విమానాన్ని రావణాసురుడు త‌యారు చేశాడ‌ని చెబుతారు.

ఖ‌గోళ‌, జ్యోతిష్య శాస్త్రాల్లో కూడా రావ‌ణాసురుడు దిట్ట. ఆయా శాస్త్రాల‌ను అవపోసిన ప‌ట్టిన అతి కొద్ది మంది వ్యక్తులలో రావ‌ణాసురుడు కూడా ఒక‌రు.

రావణుడు నైపుణ్యం కలిగిన గొప్ప సంగీత విద్వాంసుడు మరియు స్వరకర్త కూడా, అతను రుద్ర వీణ అనే తీగ వాయిద్యాన్ని కనుగొన్నట్లు చెబుతారు. 

శక్తివంతమైన యోధుడు

బ్రహ్మ నుండీ వరం పొందిన తరువాత రావణుడు, లంకా నగరానికి తన తాత అయిన సుమాలిని తొలగించి ఆ సేనలకు తానే రాజుగా మారాడు. 

నిజానికి సుమాలి ఓ రాక్షస రాజు. లంకానగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం ఎంతో సుందర నగరంగా నిర్మిస్తాడు. అయితే, మొదటినుంచీ రాక్షసులంటేనే భయపడే ఇంద్రుడు తానెప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. దాంతో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడయిన సుకేశుని కుమారులకి ఇస్తాడు. 

సుకేశునికి మాలి, సుమాలి, మాల్యవంతుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా లంకా నగరాన్ని పరిపాలించేవారు. వీరి రాక్షస కృత్యాలు మితి మీరటంతో శ్రీ హరి ఒక రోజు తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకి వదిలాడు. దానితో మాలితో పాటు ఇంకొంతమంది చనిపోతారు, ఇక మిగిలి ఉన్న రాక్షసులంతా పాతాళంలోకి వెళ్లిపోతారు. అప్పటినుంచీ సుమాలి మనవడైన కుబేరుడు తన తల్లిదండ్రులతో కలిసి లంకను చేరి పరిపాలించసాగాడు.

కుబేరుని తల్లి విశ్రవ బ్రహ్మ యొక్క రెండవ భార్య. అంటే సుమాలి కుమార్తె కైకసికి కుబేరుడు సవతి కొడుకు అవుతాడు. ఒకరకంగా చెప్పాలంటే, కుబేరుడు రావణాసురుడి సవతి సోదరుడనమాట! 

రావణాసురుడు రాక్షసుడు కావడం చేత తన తాత అయినటువంటి సుమాలి దగ్గర పాతాళంలో ఉండే నివసించేవాడు. కానీ, కుబేరుడు మాత్రం సకల భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేసేవాడు. అది  చూసి సుమాలి చాలా అసూయ పడేవాడు. రావణుడిని లంకకు రాజుగా చేయడంలో కీలకపాత్ర పోషించాడు, అతనికి బ్రహ్మ నుండి వరం పొందమని, కుబేరుడిని ఓడించి, మూడు లోకాలలో రాక్షస పాలనను స్థాపించమని సలహా ఇచ్చాడు.

అప్పటినుండీ రావణుడి దృష్టి లంకా నగరంపై పడింది. లంకా నగరాన్ని పూర్తిగా తన వశం చేసుకోవలెనని కుబేరుని బెదిరించ సాగాడు. రావణుని యుధ్ధములో ఓడించటం సాధ్యము కాదని తెలిసి, విశ్రవసుడు లంకా నగరాన్ని ఇచ్చి వైదొలగవలసినదిగా కుబేరునికి చెప్తాడు. 

ఈ విధముగా రావణుడు లంకకి రాజైనప్పటికీ, ఎంతో ఉదారశీలిగా, సమర్థవంతమైన పాలకుడిగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాడు. అతని పాలనలో లంకా నగరం సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండేది. ఆ రాజ్యములో  కటిక పేదలు కూడా బంగారు పాత్రలలో తింటూ, ఆకలి అంటే ఏమిటో తెలియక ఉండేవారు.

The Untold Story of Barbarik in Mahabharata
The Unknown Story of Barbarik in Mahabharata

అనితర సాధ్యమైన శక్తులను సంపాదించిన రావణుడు వరుసగా నరులు, దేవతలు, ఇతర రాక్షసులపై యుద్ధాలు చేశాడు. పాతాళ లోకాన్ని పూర్తిగా తన వశం చేసుకొని దానికి తన కొడుకైన అతిరావణున్ని రాజుగా నియమించాడు. ముల్లోకాలలోని రాక్షసులనూ జయించి, అజేయులయిన నివాతకవచులతోనూ, కాలకేయులతోనూ రాజీ కుదుర్చుకున్నాడు. 

భూలోకంలోని ఎన్నో సామ్రాజ్యాలను జయించటం ద్వారా చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. కుబేరుడు ఒకసారి రావణుని క్రూరత్వాన్నీ, దురాశనీ నిందిస్తాడు.  కోపించిన రావణుడు స్వర్గంపై దండెత్తి అందరు దేవతలనూ ఓడించి కుబేరుని కించపరిచాడు. 

తన బలాధిక్యతతో దేవతలనూ, సర్పజాతులనూ తన పాలనలోకి తెచ్చుకున్నాడు. ఇదంతా జరిగిన కొన్ని వందల ఏళ్ళ తరువాత రామాయణకాలం వస్తుంది. అప్పటికి  రావణుడు సర్వ మానవులను, దేవతలను జయించి, సూర్యుని గతిని కూడా మార్చగలిగే శక్తి సంపాయించినట్లు  రామాయణకావ్యంలో చెప్పబడింది.

ఇది కూడా చదవండి: Forgotten Vishnu Avatars in Hindu Mythology

రావణాసురుని పతనం

రావణుడు రాక్షస రాజే అయినా… గొప్ప శివభక్తి కలవాడు. లంకను జయించిన తర్వాత రావణుడు తన బలాన్ని నిరూపించుకోవటానికి కైలాసపర్వతాన్ని పెకలించి ఎత్తటానికి ప్రయత్నిస్తాడు. రావణుని గర్వానికి కోపించిన శివుడు తన కాలి చిటికెన వేలితో కైలాస పర్వతాన్ని నొక్కి, దాని కింద రావణున్ని అణగదొక్కాడు. అప్పుడు రావణాసురుడు బాధ భరించలేక అతి బిగ్గరగా ఆర్తనాదం చేశాడు. 

అతని అరుపుకి భూమి కంపించింది. శివునితో తలపడటం తప్పుని ప్రమథగణాలు తెలియచేస్తాయి. వెంటనే రావణుడు పశ్ఛాత్తాపానికి లోనవుతాడు. అప్పుడు శివుని మెప్పించుటకు ఎన్నో విధాలుగా, స్తుతించగా, అతని శౌర్యానికీ భక్తికీ మెచ్చిన ముక్కంటి ఎన్నో వరాలతో పాటుగా ‘చంద్రహాస’ ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తాడు.

రావణుడు గొప్ప శివ భక్తుడు. జన్మతః అతనో బ్రాహ్మణుడు, వేదాలను అభ్యసించాడు, శాస్త్రాలను ఔపోసనపట్టాడు. అంతులేని ఐశ్వర్యంతో దేవతలను కూడా ధిక్కరించాడు. అపరిమిత శౌర్య పరాక్రమాలతో అందరినీ గడగడలాడించాడు. ముల్లోకాలను తన అదుపులో ఉంచుకున్నాడు. ఇన్ని గొప్ప అర్హతలు కలిగి ఉన్నప్పటికీ సీతను అపహరించి రాముడితో వైరం పెంచుకున్నాడన్న ఒకే ఒక్క అనర్హతతో ఆయన అసురుడయ్యాడు.

బ్రహ్మ సృష్టిలో ఒక్క మానవులు తప్ప మరే ఇతర జీవులతోనూ తనకి మరణం సంభవించని విధంగా బ్రహ్మ నుండీ వరాన్ని పొందాడు రావణుడు. అందుకే, శ్రీహరి  మానవునిగా రాముని అవతారం ఎత్తి తనని సంహరిస్తానని రావణుడికి వరం ఇచ్చాడు.

ఇక రావణుడి ఆగడాలు రోజు రోజుకీ మితిమీరి పోతుంటాయి. సీతాదేవిని అపహరించటంతో ఆయనని సంహరించే సమయం ఆసన్నమయిందని నిర్ణయించుకొంటాడు శ్రీరాముడు. అందుకోసం మంచి ముహూర్తం నిర్ణయించమని అతనినే కోరతాడు రాముడు.  రావణుడు సకల శాస్త్రాలు తెలిసిన పండితుడు కావటంతో తన చావుకి తానే ముహూర్తం పెట్టుకొంటాడు. 

రావణాసురుడు ఎంత గొప్ప పండితుడో… అంత గొప్ప  గర్విష్టి కూడా. ముల్లోకాలని జయించి అజేయుడుగా నిలిచినప్పటికీ, తన అహంకారమే చివరికి అతని పతనానికి దారితీసింది.

రావణాసురుని వారసత్వం

రావణాసురుడు అత్యంత శక్తివంతమైన రాజుగా, నైపుణ్యం కలిగిన యోధుడిగా మరియు సకల కళా పోషకుడిగా గుర్తుండిపోతాడు. అయినప్పటికీ, అతను సీతను అపహరించడం మరియు రాముడితో జరిగిన యుద్ధం అతని ప్రతిష్టను దిగజార్చాయి.  అందుకే, అతనికి సంబంధించిన కధలన్నీ తరచూ అతనిని రాక్షస వ్యక్తిగా మాత్రమే చిత్రీకరించాయి. ఇక చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి ఏడాది దసరా నాడు అతని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.

రావణాసురుని దేవాలయాలు

మనదేశంలో రావణాసురునికి కూడా ఆలయాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న దశనన్ ఆలయం; అలాగే, ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ లో ఉన్న రావణ దేవాలయం; ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఉన్న రావణ దేవాలయం; మధ్యప్రదేశ్ లోని  విదిషలో ఉన్న రావన్‌గ్రామ్ రావణ దేవాలయం; అలాగే, మధ్యప్రదేశ్ లో ఉన్న మందసౌర్ ఆలయం, జోధ్‌పూర్ లో ఉన్న మండోర్ రావన్ టెంపుల్; ఇంకా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజనాథ్ ఆలయం ముఖ్యమైనవి. 

నీతి 

రావణాసురిడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎన్ని గొప్ప గుణాలున్నా, ఎంతగా ప్రశంసించబడినా కూడా వ్యక్తిత్వంలో ఉండే చిన్న చిన్న లోపాలను సరిచేసుకేలేక పోతే అవి పూర్తి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి. గొప్ప రాజుగా, మంచి తండ్రిగా, చెల్లి కి జరిగిన అవమానాన్ని సహించలేని అన్నగా, పరిపాలనా దక్షుడుగా, గొప్ప భక్తుడిగా ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ యుగ యుగాలుగా చెడ్డవాడిగా మిగిలిపోయాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top