అష్టాదశ పురాణాలలో ఒకటైన గరుడ పురాణం హిందువుల పవిత్ర గ్రంధం. జీవితం, మరణం, మరణానంతర జీవితం గురించి తెలియచేసే ఈ ఆధ్యాత్మిక గ్రంధాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు అతని వాహనమైన గరుడునికి చెప్పినట్లు ఆధారాలు చెప్తునాయి. అయితే, గరుడ పురాణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మనం మన జీవితంలో ఎవరితో ఎలా మెలగాలి? మరణించే సమయంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురుతాయి? మరణించిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలని ఈ గరుడ పురాణం వివరిస్తుంది. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గరుడ పురాణం అంటే ఏమిటి?
గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది విష్ణువు మరియు పక్షుల రాజైన గరుడికి మద్య జరిగిన సంభాషణ యొక్క రూపం. జనన, మరణాల గురించి వివరించే విష్ణు పురాణంలో ఇది ఒకటి. మరణం తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుందో ఇది చర్చిస్తుంది. విష్ణువు మరియు గరుడుడు మరణం, అంత్యక్రియలు, మరణానంతర జీవితం, పునర్జన్మ, స్వర్గం నరకం, పుణ్యం, పాపం మొదలైన వాటి గురించి ఇందులో చర్చిస్తారు.
గరుడుడు విష్ణువు వాహనం అని చెబుతారు. ఒకసారి శ్రీ మహా విష్ణువు అతని వాహనమైన గరుడునకు దీనిని ఉపదేశించటం జరిగింది. అందుకే ఈ పురాణానికి “గరుడ పురాణం” అని పేరు వచ్చింది.
గరుడ పురాణం చరిత్ర ఏమిటి?
గరుడ పురాణం అనేది వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. దీని తాలూకు గ్రంధాలు, ఆధారాలు అతి పురాతనమైనవి. ఈ గ్రంథాలు క్రీస్తు శకం 800 – 1000 మద్య కాలం నాటివని ఆధారాలు సూచిస్తున్నాయి.
గరుడ పురాణంలోని రత్నాల శాస్త్రం ఏమిటి?
గరుడ పురాణంలో 14 రత్నాలు, వాటి రకాలు మరియు వాటి నాణ్యతను ఎలా పరీక్షించాలో తెలియచేసే శ్లోకాలు ఉన్నాయి. ఇది రాళ్ల లక్షణాలను తెలియచేస్తుంది. దాన్ని బట్టి జ్యోతిషశాస్త్రానికి వివిధ రత్నాలకి మద్య ఉన్న సంబంధం గురించి కూడా చెబుతుంది.
గరుడ పురాణం ప్రకారం ఆభరణాలలో రత్నాలను ఎలా ధరించాలో, పగుళ్లు లేదా మచ్చలు ఉన్న వజ్రాలు ధరిస్తే ఏం జరుగుతుందో వివరిస్తుంది. నిజానికి ధరించే వజ్రాలు, లేదా రత్నాలను బట్టి మనిషికి అదృష్టం, లేదా దురదృష్టం వంటివి ఉంటాయని ఇది నిరూపిస్తుంది.
గరుడ పురాణం ఎవరు రచించారు?
గరుడ పురాణాన్ని ఎవరు రచించారనే దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు మొదట గరుడునికి చెప్తాడు. తరువాత, గరుడుడు ఆ పురాణాన్ని తన తండ్రైన ఋషి కశ్యపునికి వివరిస్తాడు. అది నైమిషారణ్యంలో దావానంలా వ్యాపించి వేద వ్యాస మహర్షికి చేరుకుంది. అతను గరుడ పురాణంలోని శ్లోకాలను వచన రూపంలో సంకలనం చేశాడు.
అసలు ఈ స్క్రిప్ట్ చాలా కష్టమైనది. దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి, శ్రీ హరి నారాయణ కుమారుడైన నవనిధిరాముడు, గరుడ పురాణంలోని సారాంశాన్ని సరళమైన పదాలలో సంకలనం చేశాడు. అప్పటినుంచే ఈ పురాణం సామాన్య మానవులకి కూడా చదవటానికి సులువుగా అర్ధమవుతుంది.
గరుడ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
గరుడ పురాణంలో దాదాపు 19,000 శ్లోకాలు ఉన్నాయి. కానీ వాటిలో 8,000 శ్లోకాలు మాత్రమే ఆధునిక యుగంలో భద్రపరిచారు. ఇవి 2 భాగాలుగా విభజించబడ్డాయి.
వాటిలో మొదటిది పూర్వ ఖండం – ఇది దాదాపు 229 అధ్యాయాలను కలిగి ఉంది. అందులో విశ్వాసం, మంచి పనులు, నైతిక చర్యలు, దాతృత్వం మొదలైన వాటి గురించి వివరిస్తుంది. ఇది ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆచరించాల్సిన సత్కర్మలు గురించి తెలుపుతుంది. ఇంకా రత్నాల శాస్త్రం మరియు జ్యోతిషశాస్త్రంలో దాగి ఉన్న కర్మల గురించి కూడా వివరిస్తుంది.
రెండవది ఉత్తర ఖండం లేదా ప్రేత ఖండం – సుమారు 34 నుండి 49 అధ్యాయాలను కలిగి ఉంది. ఈ ఖండం మరణం తర్వాత ఏమి జరుగుతుందో చర్చిస్తుంది. ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తుంది. ఈ ప్రత్యేక విభాగం ఇతర పురాణాలతో పోలిస్తే చాలా ప్రత్యేకంగాను మరియు ఆసక్తికరంగాను ఉంటుంది.
గరుడ పురాణం ఎందుకు చదవాలి?
గరుడ పురాణం మన చర్యల గురించి మనకు తెలియజేస్తుంది. మన జీవితంలో చేసే మంచి పనులు మనల్ని స్వర్గానికి తీసుకెళ్తాయని, స్వార్థపూరిత చర్యలు మనల్ని నరకానికి గురిచేస్తాయనే విషయాన్ని ఇది మనకు తెలియజేస్తుంది. గత జన్మలోని కర్మలను బట్టి విధిలో కలిగే బాధలు మరియు ఆనందాల గురించి మాట్లాడుతుంది.
ఇది పునర్జన్మను నొక్కి చెబుతుంది. ఇంకా మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుపుతుంది. అలాగే, ఒక వ్యక్తి తన జీవితంలో చేసే కర్మలని బట్టి స్వర్గం లేదా నరకంలో ఎలా అడుగుపెడతాడో వివరిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా ఈ గరుడ పురాణం చదవాలి.
గరుడ పురాణం ఎప్పుడు చదవాలి?
గరుడ పురాణం సనాతన హిందూ మతంలో మరణానంతరం మోక్షాన్ని అందిస్తుంది. అందుకే, హిందూ మతంలో, ఎవరైనా చనిపోయినప్పుడు, ఆ 12 రోజులపాటు వారి కుటుంబం గరుడ పురాణాన్ని చదవాల్సి ఉంటుంది. జీవి పుట్టుక నుండి మరణం వరకు ఆత్మ యొక్క ప్రయాణాన్ని గురించి గరుడ పురాణం వివరిస్తుంది. ఈ ప్రయాణంలో ఆ జీవి అనుభవించిన శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక బాధలను కూడా వివరిస్తుంది.