హిందూ పురాణాలలో హనుమంతుడిని భక్తికి ప్రతిరూపంగా చెప్తుంటారు. రాముని పట్ల ఆయనకున్న విధేయత దేన్నయినా జయించే శక్తినిస్తే, నిరంతరం చేసే రామ నామమే ఆయనకున్న గొప్ప బలం. అలాంటి హనుమాన్ గురించి పురాణాలలో, ఇతిహాసాలలో చాలా కథలు ఉన్నాయి. కానీ, ఆయన గురించి ఇంతకు ముందెప్పుడూ వినని ప్రత్యేకమైన కథలు కొన్ని ఉన్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని ఈరోజు మేము మీతో షేర్ చేసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలశ్యం టాపిక్ లోకి వెళ్లిపోదాం పదండి.
హనుమంతుడు ఎవరు?
పురాణాల ప్రకారం, హనుమంతుడి తల్లి పేరు అంజనా దేవి అనీ, అందుకే హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా అంటుంటారు. అయితే, నిజానికి అంజనా దేవి శాపం కారణంగా భూమిపై జన్మించిన ఒక అప్సరసని తెలుసా!
ఇంద్రదేవుని రాజభవనంలో నివసించే “పుంజికస్థల” అనే అప్సరస ఈమె. చూడటానికి ఆమె ఎంతో అందంగా ఉండేది. అయితే, ఒకసారి తీవ్ర ధ్యానంలో నిమగ్నమైన దుర్వాస మహర్షి దృష్టిని మరల్చడానికి ఇంద్రుడు ఈమెని భూలోకానికి పంపుతాడు. అతని ఆదేశాన్ని పాటించి భూలోకానికి వచ్చిన పుంజికస్థలని ఆగ్రహించిన ఆ ఋషి ఆమెని కోతిలా బతకమని శపిస్తాడు.
అలా శాపానికి గురైన తర్వాత పుంజికస్థల తన తప్పును గ్రహించి క్షమించమని వేడుకొంటుంది. అది చూసిన దుర్వాసునికి కోపం తగ్గి, తన శాపాన్ని వనక్కి తీసుకోలేననీ, అయితే భూమిపై ఉన్న వానర రాజును వివాహం చేసుకుంటావని చెప్పాడు. అలాగే, శక్తివంతమైన కుమారునికి తల్లివి అవుతావని అంటాడు. అంతేకాదు, ఈ మానవాళి మొత్తం నిన్ను గౌరవిస్తారని కూడా వరమిస్తాడు.
కొద్దికాలానికి ఆమె వానర రాజైన కుంజరుని కుమార్తె అంజనగా జన్మించింది. “కేసరి” అనే వానరరాజుని వివాహం చేసుకుంది. అనంతరం పరమశివుని కోసం తీవ్ర తపస్సు చేసింది. సరిగ్గా అదే సమయంలో, దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఆ యాగ ఫలితంగా, వచ్చిన పవిత్రమైన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు ఇవ్వవలసి వచ్చింది.
అయితే, దశరథుడు తన భార్యలైన కౌసల్యకి, కైకేయికి పాయసం ఇచ్చాడు. సుమిత్రకి ఇవ్వబోతుండగా, ఒక పక్షి ఆ పాయసాన్ని లాక్కొని అక్కడి నుండి ఎగిరిపోయింది. వెంటనే, కౌసల్య మరియు కైకేయి ఇద్దరూ కూడా తమకిచ్చిన పాయసంలో కొంత భాగాన్ని సుమిత్రకు ఇచ్చారు. దాని ఫలితమే రాణి సుమిత్ర కవలలకు జన్మనిచ్చింది. వారే లక్ష్మణ మరియు శత్రుజ్ఞులు. రాణి కౌసల్య రాముడికి, కైకేయి భరతుడికి జన్మనిచ్చారు.
నిజానికి ఆ పాయసాన్ని దొంగిలించిన పక్షి మరెవరో కాదు, సువర్చల అనే అప్సరస. ఆమె చాలా ఉద్వేగభరితమైన ప్రవర్తన కలిగి ఉండేది. అందుకే బ్రహ్మ దేవుడు ఆమెని భూలోకంలో పక్షిగా మారి తిరుగుతుండమని శపిస్తాడు. ఆమె పశ్చాత్తాపపడి బ్రహ్మను వేడుకోగా, అగ్నిదేవుడు దశరథుడికి ఇచ్చిన పాయసాన్ని తాకితే శాపవిముక్తి పొందుతావని చెప్తాడు. అందుకే, తన శాపం తొలగిపోవాలనే ఆత్రుతతో సువర్చల రాణి సుమిత్ర నుండి పాయసం లాక్కుంది. వెంటనే రూపం మార్చుకుని అప్సరస అయింది.
సరిగ్గా అదే సమయంలో, శివుడు అంజనాదేవి తపస్సుకు మెచ్చి గొప్ప రామభక్తుడు ఇంకా అపారమైన శక్తి మరియు జ్ఞానాన్ని కలిగి ఉండే కొడుకును కనే వరం ఇచ్చాడు. ఇంకోపక్క శివుని ఆజ్ఞను అనుసరించి వాయుదేవుడు ఆ పాయసంలో కొద్దిగా కిందకి పడిపోయేట్లు విపరీతంగా గాలి వీస్తాడు. అప్పుడు పాయసంలో కొంతభాగం పక్షి గోళ్ల నుండి జారి నేలమీద పడిపోతుంది, అది అంజనాదేవి యొక్క చేతుల్లో పడుతుంది. ఫలితంగా ఆమెకు హనుమంతుడు జన్మించాడు.
వర ప్రభావం చేత వానరుల రాజు అంజనా మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు. అందుకే, హనుమంతుడిని అంజనీ పుత్ర, కేసరి నందన, ఆంజనేయ అని పిలుస్తారు. ఇలా ఆంజనేయుడు ఒక అప్సరస కుమారుడు.
మరో విధంగా చూస్తే, హనుమంతుడిని వాయుదేవుడి కుమారుడు అని అంటారు. అందుకే పవన పుత్ర హనుమాన్ అని కూడా అంటారు. ఆ కథ కూడా ఇప్పుడు చెప్పుకుందాం.
హనుమంతుడు వానర రాజు కేసరి మరియు అంజనా దేవి పుత్రుడు అయినప్పటికీ, హనుమంతుని పుట్టుకలో వాయు దేవుని పాత్ర కూడా ఉంది.
ఎలాగంటే, అంజన ముని శాపానికి గురైన తర్వాత పరమ శివుడ్ని ధ్యానిస్తూ, కఠోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చిన పరమ శివుడు తన దివ్యశక్తిని మరియు ఆశీర్వాదాన్ని వాయువు ద్వారా అంజన గర్భంలోకి ప్రవేశ పెడతాడు. ఆ సమయంలో వాయువు ఆ పాయసాన్ని అంజన తినేలా చేస్తాడు. ఆమె దానిని తినే హనుమంతునికి జన్మనిచ్చింది. అప్పటినుండీ వాయుదేవుడు ఆంజనేయుడిని తన సొంత కొడుకులా చూసుకొంటున్నాడు.
హనుమంతుని భార్య ఎవరు?
పురాణాల ప్రకారం, హనుమంతునికి గురువు అయిన సూర్య భగవానుడు అతనికి 9 రకాల విద్యలు నేర్పించవలసి ఉంది. కానీ, అందులో 5 రకాల విద్యలను మాత్రమే నేర్పించాడు. కారణం అతను బ్రహ్మచారి కావటం చేత. వివాహితులు మాత్రమే సంపూర్ణ విద్యలు నేర్చుకోగలరు.
కాబట్టి మిగిలిన ఆ 4 విద్యలను కూడా నేర్చుకొనేందుకు గాను సూర్యుడు తన కుమార్తెను వివాహం చేసుకోమని చెప్తాడు. తన కుమార్తె అయిన సువర్చల కూడా హనుమంతుని లాగే బ్రహ్మచారిణి. అందుకే, ఆమెని వివాహం చేసుకొంటే తన బ్రహ్మచర్యం తప్పిపోదని కూడా చెప్పాడు. అదీకాక, వివాహం జరిగిన వెంటనే ఆమె తపస్సుకు బయలు దేరుతుందని సూర్యుడు హామీ ఇచ్చాడు.