Garuda Purana Hell Punishments, Hindu Afterlife

Punishments for Sins in Garuda Purana

జీవితం గురించి మనకు ఖచ్చితంగా తెలిసిన ఒకేఒక  నిజం  ఏమిటంటే, అది ఏదో ఒక రోజు ముగుస్తుందని. ఈ కఠినమైన నిజం మనం ఏమి చేస్తున్నాం? మనం చేసే పనుల వల్ల ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. హిందూమతంలో ఉన్న దాదాపు అన్ని గ్రంథాలు కూడా మనం ఎలా జీవించాలో చెప్పాయి కానీ మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పనేలేదు. కేవలం గరుడ పురాణం ఒక్కటే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మనకు తెలియచేస్తుంది. మనం చేసే  కర్మలు ఏవీ వ్యర్థం కావు, కర్మ మాత్రమే ముఖ్యమైనది అనే ఓదార్పుని ఇస్తుంది. మరి అలాంటి గరుడపురాణంలో మనం చేసే కర్మలకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 

గరుడ పురాణం ఏం చెబుతోంది?

గరుడ పురాణం హిందూ మతంలోని వేద పురాణాలలో ఒకటి. హిందూ మతంలో మరణానంతరం మోక్షాన్ని ఇచ్చేది గరుడ పురాణం, అందుకే మరణానంతరం గరుడ పురాణం కథను వినాలని లేదా చదవాలనే నిబంధన ఉంది. ఈ గరుడ పురాణానికి అధిపతి విష్ణువు, అందుకే ఇది వైష్ణవ పురాణం.

గరుడ పురాణం ప్రకారం, మన జీవితంలో మనం చేసిన కర్మల ఫలాలు మనకు లభిస్తాయి, కానీ మరణానంతరం కూడా మనం చేసిన కర్మలకు మంచి మరియు చెడు ఫలాలు లభిస్తాయి. ఈ కారణంగా, ఇంట్లో ఒక సభ్యుడు మరణించిన తర్వాత ఈ జ్ఞానాన్ని పొందేందుకు ఇది ఒక అవకాశంగా నిర్ణయించబడింది. దీని ద్వారా జనన మరణాలకి సంబంధించిన అన్ని సత్యాలను మనం తెలుసుకోవచ్చు అంతేకాదు, మరణంతో విడిపోయిన సభ్యునిపట్ల దుఃఖాన్ని తగ్గించుకోవటానికి కూడా ఇదో అవకాశం.

గరుడ పురాణం సారాంశం

ప్రపంచంలో ఉన్న ఏ మతమైనా ఒక వ్యక్తిని ప్రేరేపించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పురాణాలు మరియు గ్రంధాలు ఒక వ్యక్తి తన జీవితకాలంలో  తన కర్మల ప్రకారం ఫలితాలను పొందుతారని పేర్కొన్నాయి. ఇక హిందూ మతమైతే, తన కథలలో స్వర్గం మరియు నరకం గురించి అనేక రకాలుగా వివరించింది.

పురాణాలు ఏమని చెప్పాయంటే, దేవతలు నివసించే ప్రదేశాన్ని స్వర్గమనీ,  మరణానంతరం పుణ్యం చేసే వ్యక్తులు అక్కడికి వెళ్తారని పేర్కొన్నాయి. అందుకు విరుద్ధంగా రాక్షసులు నివసించే ప్రదేశాన్ని నరకమనీ, మరణానంతరం పాపం చేసే వ్యక్తులు అక్కడికి వెళ్తారని పేర్కొన్నాయి.

ఇక గరుడ పురాణంలో, ఒక వ్యక్తి తాను చేసిన కర్మలను బట్టి మరణానంతరం ఎలాంటి ఫలాలని పొందుతారో చాలా క్లియర్ గా వివరించటం జరిగింది. మనిషి యొక్క పాపాలను బట్టి వివిధ రకాల శిక్షల ఉంటాయని వివరంగా చెప్పబడ్డాయి. ప్రతి మనిషికీ మొత్తం 84 లక్షల జన్మలు ఎలా ఉంటాయో, అలాగే 84 లక్షల నరకాలు ఉన్నాయి, మనిషి తన కర్మల ఫలితంగా వాటిని అనుభవిస్తాడు

గరుడ పురాణంలోని శ్లోకాలు మరియు అంశాలు

గరుడ పురాణం యొక్క మరణానంతర జ్ఞానం హిందూ మతాన్ని ఆచరించే వారికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణంలో మొత్తం పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఎనిమిది వేల శ్లోకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ శ్లోకాలని కూడా రెండు భాగాలుగా విభజించారు.

మొదటి భాగంలో విష్ణువుతో ముడిపడి ఉన్న భక్తి మరియు పూజా విధానాలను ప్రస్తావించారు. ఈ విభాగంలో, మరణానంతరం జీవితంలో జరిగే చర్యల యొక్క  ప్రాముఖ్యతను గురించి గరుడ పురాణంలో మనం చదువుకోవచ్చు. 

రెండవ భాగంలో రాక్షస యుగానికి సంబంధించిన  వివరణలను ప్రస్తావించారు. మరణం తర్వాత జీవి ప్రవర్తన ఏమిటి? ఇది ప్రేతంలా ఎలా మారుతుంది? ఆ ప్రేత రూపాన్ని ఎలా వదిలించుకోవాలి? శ్రాద్ధ మరియు పవిత్ర కార్యాలు ఎలా చేయాలి? మరియు నరకంలోని దుఃఖాల నుండి ఎలా బయటపడవచ్చు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ గరుడ పురాణంలో వివరంగా చెప్పబడ్డాయి.

మరణం తర్వాత ఏమి జరుగుతుంది?

ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. ఈ ప్రశ్నకి గరుడ పురాణం కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. మనిషి చేసే కర్మలని బట్టి దీనిని 3 దశలుగా విభజించటం జరిగింది. 

మొదటి దశలో, మానవుడు తన జీవితంలో మంచి చెడులకు సంబంధించిన అన్ని కర్మల ఫలాలను పొందుతాడు.

రెండవ దశలో, మరణానంతరం, మనిషి తన కర్మల ప్రకారం 84 లక్షల జన్మలలో ఏదైనా ఒక జన్మలో జన్మిస్తాడు.

మూడవ దశలో, అతను తన కర్మల ప్రకారం స్వర్గానికి లేదా నరకానికి వెళ్తాడు.

ఇది కూడా చదవండి: Garuda Puranam’s Predictions for the Future

గరుడ పురాణం ప్రకారం శిక్షలు

పక్షుల రాజైన గరుడుడు మనిషి చేసే కర్మల ప్రకారం అతనికి ఎలాంటి శిక్షలు పడతాయని విష్ణుమూర్తిని అడుగుతాడు. ఆ సమయంలో గరుడుడు రెండు విషయాలపై విష్ణువుని ప్రశ్నిస్తాడు, మొదటిది నరకానికి ఎవరు వెళతారు? అక్కడ ఎలాంటి హింసలు ఉంటాయి? రెండవది స్వర్గంలో ఉండే సుఖాలు ఏమిటి? వాటికి ఎవరు అర్హులు?

దీనికి సమాధానంగా గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత శిక్షలు అనుభవించటానికి 28 రకాల నరకాల గురించి ప్రస్తావించబడింది. అందులో మనిషి కర్మలకి శిక్షలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 

తమీశ్ర 

ఇతరుల సంపదను దోచుకునే వారిని యమ భటులు  తాళ్ళతో బంధించి తమీశ్ర అని పిలువబడే నరకంలో వేస్తారు. అక్కడ వారిని రక్తం కక్కుకొని మూర్ఛపోయేంత  వరకు కొట్టడం జరుగుతుంది. దెబ్బలకు తట్టుకోలేక గావుకేకలు పెట్టినా పట్టించుకోరు. తిరిగి సృహలోకి రాగానే మళ్ళీ కొట్టడం మొదలు పెడతారు. వారి శిక్షా కాలం ముగిసే వరకు ఇలా చావబాదుతూనే ఉంటారు.

ఆంధాతమిశ్ర 

అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలించుకొనే వారినీ, నిష్కారణంగా విడాకులిచ్చే భార్య, లేదా భర్తను ఇక్కడకు పంపుతారు. చిమ్మ చీకటిలో కట్టేసి పదే పదే కొరడాలతో కొడుతూ ఉండటం వల్ల బాధితులు స్పృహ తప్పి పడిపోతారు. అయినా సరే వదిలి పెట్టక శిక్ష పూర్తయ్యే వరకూ ఇలానే కంటిన్యూ చేస్తారు. 

రౌరవం 

వేరొకరి ఆస్తిని లేదా రిసోర్సెస్ ని స్వాధీనం చేసుకుని ఆనందించే పాపులను శిక్షించే నరకం ఇది. పాపం చేసినవారిని ఈ నరకంలోకి విసిరినప్పుడు, వారు భయంకరమైన పాము అయిన “రురు” చేత హింసించబడతారు.  వారి శిక్షా సమయం పూర్తయ్యే వరకు ఆ పాము వారిని తీవ్రంగా హింసిస్తుంది.

మహారౌరవం  

ఇక్కడ ఉండే రూరు పాములు చాలా భయంకరమైనవి. న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, లేదా ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారిని ఇక్కడ విసిరేస్తారు. వీళ్ళను భయంకరమైన విషనాగులు చుట్టచుట్టుకుని మెలిబెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వీటినే క్రవ్యాదులు అంటారు. ఆ బాధ భరించలేక విలవిలలాడిపోతుంటే, ఆ పాములు పాపిని చప్పరించుకుంటూ మింగుతాయి.

కుంభిపాకం 

వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను అత్యంత కిరాతకంగా హత మార్చి కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఎప్పుడూ సలసల కాగే నూనె ఉంటుంది. పాపుల్ని అందులో పడేసి వేపుతారు.

కాలసూత్రం  

ఇక్కడ కణకణలాడే రాగి కొలిమి ఉంటుంది. పైన సూర్యుడు, కింద మంటతో ఆ రాగి కొలిమి భయంకరమైన వేడెక్కి ఉంటుంది. బాధ్యతలన్నీ తీరిపోయి వయసు ఉడిగి పోయిన పెద్దవారిని గౌరవించకుండా, ఆదరించకుండా ఉండేవాళ్ళు ఇక్కడకు వస్తారు. కూర్చోడానికి ఉండదు, నించోడానికి ఉండదు. తప్పించుకునే మార్గంలేని ఈ నరకంలో శిక్ష పూర్తయ్యేదాకా  పరిగెత్తించి పరిగెత్తించి ఆ తరువాత ఈడ్చిపారేస్తారు.

అసితపత్రవనం 

తాము పాటించవలసిన ధర్మాలను గాలికి వదిలేస్తారు, ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొడతారు. ఈ కోవకి చెందిన వారంతా ఇక్కడకు వస్తారు. అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి ఇదే గొప్ప జీవితం అని వాదించే వాళ్ళు కూడా ఈ నరకానికే వస్తారు. కత్తులలాగా మహా పదునుగా ఉండే ముళ్ళ చెట్లు, రాళ్ళూ ఉండే నరకం ఇది. ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ, కర్రలతో కొడుతూ పరుగు లెత్తిస్తారు. ఒళ్ళంతా కోసుకుపోయినా… చీరుకు పోయినా… పాపి హాహా కారాలు చేస్తున్నా… వదలిపెట్టరు. వారి వెంట పడి మరీ హింసిస్తారు. పాపి స్పృహతప్పి పడిపోతే కొంచెం బ్రేక్ ఇస్తారు. తెలివి వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తారు. యమధర్మరాజు వీరికి విధించిన శిక్ష పూర్తయ్యే వరకూ ఈ శిక్ష అమలు చేస్తూనే ఉంటారు.

సుకరముఖం 

అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలు చేసి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. ఇక్కడ వాళ్ళను చితక్కొట్టి పచ్చడి పచ్చడి చేస్తారు. చెరకుగడను పిండి పిప్పి చేసినట్టే పాపిని భయంకరంగా శిక్షిస్తారు. తెలివితప్పి పడిపోయినా ఉపేక్షించరు. తెలివి రాగానే మళ్ళీ ఈ శిక్ష అమలు జరుగుతుంది.

అంధకూపం  

చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. అలాగే ఉత్త పుణ్యానికి సాటి జీవులను చంపిపారేసే వాళ్ళు కూడా ఇక్కడకు చేరతారు. వీళ్ళను పులులు, సింహాలు, గద్దలు, తేళ్ళూ, పాములు నిండి ఉండే లోయలో పారేస్తారు. చేసిన పాపం పూర్తయ్యే వరకు ఈ క్రూరమృగాలు అదే పనిగా వారిపై దాడి చేస్తూ చంపుకు తింటాయి. ఎదుటి ప్రాణిని హింసిస్తే అవి ఎంతగా బాధపడతాయో తెలియడానికే యముడు ఈ నరకంలోకి పాపులను నెడతాడు.

తప్తమూర్తి 

ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ మంటలు కోరలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, రత్నాలు, విలువైన ఆభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.

క్రిమిభోజనం 

ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విగల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు. అవి ప్రాణాలుండగానే ఆవురావురంటూ కండలు పీక్కుతింటాయి. ఇదో రకం చిత్రహింస. పాపి శరీరాన్ని పీక్కుతినడం పూర్తయిపోయినంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టుకాదు. వాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలుచేస్తారు. ఇలా పాపి చేసిన పాపానికి శిక్షాకాలం పూర్తయ్యే వరకు శరీరాలు ఇస్తూ ఈ శిక్ష విధిస్తూనే ఉంటారు.

శాల్మలి 

దీన్నే తప్తశాల్మలి అని కూడా పిలుస్తారు. వావీ వరస లేకుండా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొనే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు. ఇక్కడ కణకణమండే ఒక ఇనప బొమ్మ ఉంటుంది. ఒంటికి పట్టిన మదం ఒదిలిపోయేదాక ఆ బొమ్మను కౌగిలించుకోవాలి. మగవాళ్ళు ఆడబొమ్మను, ఆడవాళ్ళు మగబొమ్మను కౌగలించుకోవాలి. ఒళ్ళంతా భగ భగ మండిపోతున్నా వదలకుండా పాపి ఈ బొమ్మను కౌగలించుకోవాలి. పారిపోడానికి ప్రయత్నిస్తే చితకబాది మరీ తీసుకువస్తారు.

వజ్రకంటకశాలి 

జాతి, నీతి లేకుండా జంతువులతో సెక్స్ చేసే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ  పదునుదేలిన వజ్రాలతో తయారుచేసిన బొమ్మ ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా దాన్ని కౌగలించుకు తీరాలి. అలా కౌగలించుకోగానే ఆ మొనదేరిన వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని తూట్లు పొడుస్తాయి. అంతేకాదు అక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టెక్కమని అక్కణ్ణుంచి కిందికి బరబరా ఈడ్చేస్తారు. దాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది. శిక్ష తీరెంతవరకూ ఇదంతా వాళ్ళు భరించాల్సిందే.

వైతరణి 

అధికార దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు  ఇక్కడికి వస్తారు. మరణం పొందిన వ్యక్తి పైలోకాలకు చేరాలంటే ఈ వైతరణి అడ్డంగా ఉంటుంది. దీన్ని దాటి వెళ్ళాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. దీంట్లో పడకుండా బైటపడాలని చాలా మంది కోరుకుంటారు. ఇదొక భయంకరమైన నది. ఈ మహానదిలో మలమూత్రాలు, ఉమ్మి, వెంట్రుకలు, చీము, నెత్తురు, ఎముకలు, మాంసఖండాల వంటివి ఉంటాయి. ఇవన్నీ మురిగిపోయి, ముక్కిపోయి గబ్బుకంపు కొడుతుంటాయి. చూడడానికే చాలా రోతగా, ఊహించుకుంటేనే చాల అసహ్యంగా ఉండే ఈ నదిలోకి పాపుల్ని విసిరేస్తారు. ఈ దుర్గంధ భరితమైన నదిలో క్రిమికీటకాల్లా బతుకుతూ… ఆ నీటినే తాగుతూ… అందులో దొరికేవే తింటూ… శిక్షా కాలం పూర్తిచేయాల్సి ఉంటుంది.

పూయోదకం 

వైతరిణిలో ఉండే దుర్గంధ జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పుంగవులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. ఆడపిల్ల శీలాన్ని పాయసంలా జుర్రుకునే నిత్యపెళ్ళికొడకులు ఎందఱో ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ఇదే శిక్ష పడుతుంది. ఇక్కడా పాపి ఆ బావిలో నీటినే తాగి బతకాల్సి ఉంటుంది.

ప్రాణరోధం  

కుక్కలు వంటి జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి. పాపి ఇతర జంతువుల ప్రాణాలను తీసేందుకు కుక్కలను ఎలా ఉసిగొల్పుతాడో…  అలాగే ఇక్కడ పాపిని వేటాడమని వారి మీదికి క్రూర జంతువులను వదులుతారు. అవి పాపిని కండకొక ముక్కగా కొరుక్కు తింటుంటే అతను  భయంకరమైన మరణవేదన అనుభవిస్తాడు.

వైశాసనం 

పేదలు ఆకలి దప్పికలతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలివారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. వీరికి ఈ లోకంలో మింగమెతుకు ఇవ్వకుండా, తాగడానికి నీటి  చుక్క కూడా జార్చకుండా చేస్తారు. యమబటులు మాత్రం వారి ఎదుటే ఘుమఘుమలాడే రుచికరమైన వంటకాలు తింటూ పాపిని శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. ఇక్కడ ఉన్నంత కాలం పాపి ఆకలి దప్పికలతో మలమలా మాడిపోతాడు. 

లాలభక్షణం 

అతిగా సెక్స్ కోరుకొనేవాళ్ళు, భార్యను కట్టుబానిస కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి భార్య చేత వీర్యం తాగిస్తారు. అలాంటి పొగరుబోతుల పని పట్టేందుకే ఈ నరకం ఉంది. అలాంటి దుష్టాత్ములను ఇక్కడికి తెచ్చి వాడి వీర్యాన్నే కాదు, మరి కొంతమంది వీర్యాన్ని కూడా తాగిస్తారు. అలా చేయడం వల్ల వాడి భార్య ఒకనాడు ఎలాంటి బాధపడిందో వాడికి తెలిసి రావాలని ఈ పని చేస్తారు. అక్కడితో అయిపోలేదు, వీర్యంతో నిండి ఉన్న సముద్రంలో పడేస్తారు. అందులో మునుగుతూ అదే తాగుతూ శిక్షాకాలం పూర్తిచేయాల్సి ఉంటుంది.

సారమేయాదానం 

ఆహారంలో విషం కలిపి పెట్టేవాడు, ఊచకోత కోసేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరులా చేసే వారికి ఈ నరకంలో తినడానికి కేవలం కుక్కమాంసం తప్ప వేరొకటి దొరకదు. గత్యంతరం లేక పాపి దాన్ని తిన్నాడో… ఇక అంతే… వెంటనే ఆ లోకంలో ఉండే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి ఆ పాపి మీద పడి వాడి మాంసాన్ని పీక్కుతింటాయి.

అవీచి  

తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి వెూసం చేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకు వస్తారు. ఇక్కడ ఎంతో ఎత్తయిన కొండ ఉంటుంది. దాని మీది నుంచి కిందికి పడదోస్తారు. పాపి సముద్రంలోకి పడిపోతున్నానేవెూనని కంగారు పడతాడు. కానీ కొండకింద సముద్రం ఉండదు. రాతిపలక ఉంటుంది. దాని మీద పడి ముక్కలుముక్కలవుతాడు. కానీ చావడు. ఈ శిక్షను అదే పనిగా అమలుచేస్తారు.

అయోపానం 

ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడా, మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉన్నప్పుడు తమ లోకంలో  ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీస్తారు. అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు సోమపానం చేయడం ఆనవాయితీ! ఆ ముసుగులో మద్యం పుచ్చుకునేవారికి కూడా ఇక్కడే శిక్షపడుతుంది. యముడు స్వయంగా పాపి గుండెపై నించుని ఈ శిక్షను అమలుచేస్తాడు.

రక్షోభక్ష 

జంతుబలులు, నరబలులు విచ్చలవిడిగా చేసేవారు, మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారి కోసం ఈ నరకం ఉంది. బలిపశువు ఎంత బాధపడుతూ తన ప్రాణాలు వదులుతుందో అదేవిధంగా ఆ పాపి కూడా హింసపడుతూ మరణించేలా చేస్తారు. వాడిచేతిలో బలైన జీవులు, మనుషులు ఈ లోకంలోకి వచ్చి వాణ్ణి కొరికి, తొక్కి, పొడిచి, చీల్చి చెండాడి మరీ కసి తీర్చుకుంటాయి.

శూలప్రోతం 

ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను, నమ్మకద్రోహం చేసే వాళ్ళను ఈ నరకంలోకి పంపుతాడు యముడు. అక్కడ వాళ్ళను శూలానికి గుచ్చి వేలాడదీస్తారు. భరించరాని ఆ బాధకు తోడు అన్నం పెట్టరు, తాగడానికి నీళ్ళూ ఇవ్వరు. దీనికి తోడు దెబ్బలతో హింసిస్తారు.

క్షరకర్దమం 

మంచివాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్ళను ఈ నరకానికి తీసుకువస్తారు. వాళ్ళను తలకిందులుగా వేలాడదీసి అనేక రకాలుగా హింసిస్తారు.

దందశూకం 

తనతోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడడం, తక్కువ చూపు చూడడం, మానవహక్కులను హరించి వేయడం లాంటివి ఎవడైతే చేస్తాడో అలాంటివాడు ఈ నరకానికి వస్తాడు. అతడు ఏయే జంతువులను హీనంగా భావింవి ఆ జంతువుల్లా సాటి మనిషిని పరిగణించి కిరాతకంగా వేధిస్తాడో వాణ్ణి ఆ జంతువులు అత్యంత దారుణంగా చీల్చి చెండాడతాయి.

వాతరోదం 

అడవులలో, చెట్లమీద, కొండ కొమ్ములలో ఉంటూ ఎవ్వరి జోలికీ రాని జంతువులను పట్టి పల్లార్చే వారి కోసం ఈ నరకం ఉంది. అలాంటి వాళ్ళను నిప్పుతో కాల్చి, విషమిచ్చి, వివిధ ఆయుధాలతో హింసిస్తారు. పాపి ఎంత బాధపడుతుంటే అంతగా హింస ఉంటుంది.

పర్యావర్తనకం 

ఆకలితో అలమటించిపోయే వాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని ఈ నరకంలో పడేస్తారు. ఇక్కడకు రాగానే పాపిని కాకులు, గద్దలు కళ్లు పొడిచి ఎక్కడికీ పారిపోడానికి వీలులేకుండా చేస్తాయి. ఆ తరువాత రోజూ పాపిని రక్తవెూడేలా పొడుస్తూ ముక్కలుగా ముక్కలుగా కండలూడదీస్తాయి.

సూచీముఖం 

గర్వం, పిసినారితనం ఉన్న వారు, రోజువారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు ఇక్కడికి వస్తారు. వీళ్ళు తమ కడుపు కోసం తినరు. ఇంకొకరికి పెట్టరు. అప్పు చేసి తీర్చకుండా ఎగనామం పెట్టే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడకు వచ్చే వారిని నిరంతరం సూదులతో పొడుస్తుంటారు.

ఇవేకాక అర్బుదం, నిరర్బుదం, హహవ, యెయెయె, పద్మ, మహాపద్మ, ఉత్పల వంటి చల్లటి నరకాలున్నాయి. ఈ నరకాలలో పడిన పాపులు చలికి బిగుసుకుపోయి గడ్డకట్టుకుపోతారు.

చివరిమాట 

ఫైనల్ గా మనం తెలుసుకొనేది ఏంటంటే, మరణం తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుందో ఎవరూ సమాధానం చెప్పలేరు. అలాంటి విషయాలన్నిటినీ గరుడ పురాణం వివరంగా తెలియచేయటమే కాకుండా మనం చేసే కర్మ యొక్క ప్రభావం మన జీవితంపై ఎంత భయంకరమైన ఎఫెక్ట్ చూపిస్తుందో క్లియర్ గా తెలియచేస్తుంది. ఇంకా మనం ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి స్ఫూర్తినిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top