మహాభారతం అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో పాల్గొన్న ఎందరో శక్తివంతమైన వీరుల గురించి మనం కధలు కధలుగా తెలుసుకున్నాము. అందులో కొన్ని పాత్రలు బాగా పాపులర్ అయితే మరికొన్ని పాత్రలు గురించి ఎవ్వరికి ఎక్కువగా తెలియదు. అలాంటి కొన్ని ఆసక్తికరమైన పాత్రలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒకటి. అదే కర్ణుడి కొడుకయిన వృషసేనుడి గురించి. ఇంతకీ వృషసేనుడి గొప్పతనం ఏమిటో… ఎందుకతను ఓ ప్రత్యేకమైన వ్యక్తో… ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
వృషసేనుడి కుటుంబ వృక్షం
మహాభారత పురాణం ప్రకారం కర్ణుడికి వృశాలి మరియు సుప్రియ అని ఇద్దరు భార్యలు ఉండేవారు. కర్ణుడిలాగే, వృశాలి కూడా సూత వర్గానికి చెందినది. అంటే – రథసారథి వర్గానికి చెందినది. ఈమె దుర్యోధనుడి రథసారథి అయిన సత్యసేనుడి సోదరి. అంతే కాదు, కర్ణుడికి వృశాలి చిన్ననాటి స్నేహితురాలు కూడా.
మొదటినుంచీ వృశాలి మంచి గుణవంతురాలు. అందువల్లే కర్ణుడు పెద్దయ్యాక, అతని తండ్రి అధిరథుడు వృశాలే కర్ణుడికి అన్ని విధాలుగా తగిన భార్య అని తలచి… కోరి కర్ణుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. పురాణాల ప్రకారం వృశాలి చాలా తెలివైనది, ఇంకా ఆమెను గొప్ప పతివ్రతగా కూడా చూపించారు.
దుర్యోధనుడు తన మిత్రుడైన కర్ణుడిని అంగ రాజ్యానికి రాజుగా ప్రకటించినప్పుడు వృశాలి చాలా బాధపడింది. ఎందుకంటే, వృశాలికి తన భర్త కర్ణుడు రాజు అవడం ఇష్టం లేదు. అతనెప్పుడూ ఎవరి కిందా పని చేయకుండా, ఎవరికీ రుణపడి ఉండకుండా ఉండాలని వృశాలి కోరుకునేది. కానీ చివరికి కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంతం రుణపడి ఉండటం తనకి ఎంతో అసంతృప్తిని మిగిల్చింది. కురుక్షేత్ర యుద్ధంలో తన భర్తను, కుమారులను ఒక్కసారిగా కోల్పోయిన తరువాత, వృశాలి బాధా హృదయంతో తన భర్త చితిపైనే సతీ సహగమనం చేసి జీవితానని ముగించుకుంది అని చెబుతారు.
కర్ణుడి రెండవ భార్య పేరు సుప్రియ. ఈమె దుర్యోధనుని భార్య అయిన భానుమతికి మంచి స్నేహితురాలు. తన భార్య కోరిక మేరకు సుప్రియని వివాహమాడవలసిందిగా స్నేహితుడిని కోరతాడు దుర్యోధనుడు. అయితే, ఈమె గురించి పురాణాలలో అంతగా ప్రస్తావించలేదు.
కర్ణుడికి మొత్తం తొమ్మిది మంది సంతానం. వారిలో తన మొదటి భార్య అయిన వృశాలి కి ఏడుగురు కుమారులు. రెండవ భార్య సుప్రియకి ఇద్దరు కుమారులు కలిగారు. అందులో ఈ వృషసేనుడు మొదటివాడు, అందరికన్నా పెద్దవాడు. ఇతని తరువాత కర్ణుడికి సుధామ, చిత్రసేన, సత్యసేన, సుషేణ, శత్రుంజయ, ద్విపథ, బాణసేన (సుశర్మ), వృషకేతు అని ఎనిమిది మంది కొడుకులు ఉన్నారు. వృషకేతు తప్ప మిగిలిన వారు అందరూ కూడా పాండవుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి కర్ణుడి తొమ్మిది మంది కొడుకులలో వృషకేతు ఒక్కడే ప్రాణాలతో మిగిలాడు. పాండవులు అతనిని తమతో పాటుగా తీసుకెళ్లారు. అర్జునుడికి వృషకేతు మీద అమితమైన వాత్సల్యం ఉంది, అతనిని తన సొంత కొడుకులాగా చూసుకునేవాడు. శ్రీ కృష్ణుడు కూడా వృషకేతువు పట్ల ఎంతో ప్రేమ చూపించాడు.
మహాభారతం ప్రకారం బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం వంటి దివ్యాస్త్రాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఈ భూమిపై మిగిలిన చివరి మానవుడు వృషకేతు మాత్రమే. ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని శ్రీకృష్ణుడు ఆదేశిస్తాడు. అర్జునుడికి బబ్రువాహనుడితో జరిగిన యుద్ధంలో బబ్రువాహనుడు వృషకేతుని చంపేస్తాడు. వృషకేతుని మరణంతో ఆ రహస్యాలు ఎవరికీ తెలియకుండానే పూర్తిగా ముగిసిపోయాయి అని చెబుతారు.
ఇది కూడా చదవండి: The Tragic Story of Abhimanyu: How He Got Caught in Padmavyuham
వృషసేనుడు మరియు కర్ణుని మధ్య ఉన్న అనుబంధం
ఒక పురాణ గ్రంథంలో కర్ణుడికి వృషసేనుడికి ఉన్న అనుబంధం గురించి ఒక సంఘఠన కూడా చెప్పారు. వీరిని అర్జునుడికి అభిమన్యుడికి ఉన్న అనుబంధంతో పోల్చి చెప్పారు. ఒకసారి కర్ణుడు అర్జునుడికి అభిమన్యుడితో ఉన్న బంధం చూసే సందర్భం వస్తుంది. ఎప్పుడూ ఎవరినీ పట్టించుకోకుండా, దాదాపుగా తన జీవితమంతా శ్రీకృష్ణుడికి నీడగా ఉండిపోయాడు అర్జునుడు. కానీ, అభిమన్యుడి విషయంలో మాత్రం చాలా అనుబంధంతో ఉండటం చూసి కర్ణుడు ఆశ్చర్యపోతాడు.
మన భాషలో చెప్పాలంటే అర్జునుడు అభిమన్యుడి విషయంలో చాలా ఎటాచ్మెంట్ కలిగి ఉన్నాడని తెలుసుకుంటాడు. అలాగే అభిమన్యుడు కూడా తన తండ్రితోనే మంచి రిలేషన్ షిప్ ఏర్పరుచుకున్నాడు. తండ్రితో కొంత సమయం గడపాలని అభిమన్యుడు ఎంతలా ఆరాటపడే వాడో స్వయంగా చూసి తెలుసుకుంటాడు. అప్పుడు వెంటనే కర్ణునికి తన పెద్ద కుమారుడు అయిన వృషసేనుడు గుర్తుకు వస్తాడు. ఇప్పటిదాకా కొడుకు విషయంలో తానేమి తప్పు చేశాడో తెలుసుకున్నాడు. మనసులో ఏదో తెలియని అశాంతి, ఆందోళన అనుభవిస్తాడు.
వెంటనే తన ప్రియమైన కుమారుడు, ఇంకా యువరాజు అయిన వృషసేనుడిని కలవాలని, తనని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని కర్ణుడు ఆరాటపడతాడు. తనకు మొదటగా తండ్రి అయ్యే అవకాశాన్ని, ఆనందాన్ని ఇచ్చినవాడు వృషసేనుడు. ఇంకా తన జీవితాన్ని పరిపూర్ణం చేసిన వ్యక్తి కూడా వృషసేనుడే. అలాంటి తన ప్రియ కుమారుడిని ఆలింగనం చేసుకోవాలని అతని దగ్గరకు వెళతాడు.
కర్ణుడికి వృషసేనుడు కాకుండా ఇంకా ఎనిమిది మంది సంతానం ఉన్నారు కదా… కానీ వృషసేనుడి మీద మాత్రమే ఇంత అనుబంధం ఉండటానికి కారణం… అతను పుట్టినప్పుడు కర్ణుడు అనుభవించిన ఆనందం, మిగతావారు పుట్టినప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. తాను ఎంతగానో ప్రేమించే తన భార్య వృశాలి ఎంతో అందంగా మరియు పరాక్రమాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాంటి తన ప్రియమయిన భార్య పోలికలతో ఉండటం, అలాగే అంతే అందంతో, పరాక్రమంతో ఉన్న కుమారుడు కలగటం వల్ల కర్ణుడికి మిగతా అందరికంటే వృషసేనుడు ప్రియమయిన వాడు అనటంలో ఆశ్చర్యం లేదు.
మరొక్క సందర్భంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు అవ్వటానికి కొన్ని రోజుల ముందు ఒకసారి కర్ణుడు వృషసేనుడి మందిరానికి వస్తాడు. అప్పుడు అక్కడ వృషసేనుడు ఆయుధాలను జాగ్రత్తగా పరీక్షించటం చూస్తాడు. అలాగే, కొంచెం దూరంలో వృషసేనుడి 5 ఏళ్ల కుమారుడుని కూడా చూస్తాడు. ఆ పిల్లవాడు తన తండ్రి దగ్గరకు వెళ్ళటానికి భయపడి దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోతాడు.