పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. ఈ జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు. అది తెలిసి కూడా ఏ మనిషి తనకి తాను నచ్చచెప్పుకోలేక పోతున్నాడు. మరణం పేరు చెబితేనే చాలు భయపడిపోతున్నాడు.
బతికినంతకాలం అయినవాళ్ళతో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా… చనిపోయేటప్పుడు మాత్రం వారిని విడిచిపెట్టాలని అనిపించదు. ఆ సమయంలో తాను రియలైజ్ కావడం మొదలు పెడతాడు. మరణం సమీపిస్తున్నప్పుడు ఏవేవో వారితో చెప్పాలని చాలా తాపత్రయపడతాడు. కానీ, చెప్పాలని ఎంత ప్రయత్నించినా… గొంతు దాటి మాట బయటకి రాదు. అలా ప్రయత్నించీ, ప్రయత్నించీ చివరికి చెప్పకుండానే వెళ్ళిపోతాడు. అసలు ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? ఈ విషయాలన్నిటి గురించి గరుడ పురాణం మనకి ఏం చెప్తుంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుక మూసుకుపోతుంది:
గరుడ పురాణం ప్రకారం, మరణం ఆసన్నమైనప్పుడు ఇద్దరు యమ దూతలు ఆ మరణిస్తున్న వ్యక్తి ఎదురుగా వచ్చి నిలబడతారు. అయితే, మరణించబోయే వ్యక్తి కంటికి వాళ్ళు ప్రత్యక్షంగా కనిపిస్తారు. ఎప్పుడైతే, వారిని ఆ వ్యక్తి చూస్తాడో… అప్పుడు వారి భయంకర రూపం చూసి భయపడతాడు. తాను ఇకపై జీవించలేడని కూడా గ్రహిస్తాడు. అటువంటి పరిస్థితిలో, ఆ విషయాన్ని తన వాళ్ళతో చెప్పాలని చాలా ట్రై చేస్తాడు. కానీ, అప్పటికే యమ భటులు పాశాన్ని విసిరి… భౌతిక శరీరం నుండి ఆత్మని వేరుచేయడం ప్రారంభిస్తారు. అందుకే ఏమీ మాట్లాడలేకపోతాడు.
కళ్ల ముందే కర్మ వెళ్ళిపోతుంది:
యమభటులు మరణించబోవు వ్యక్తి శరీరం నుండి జీవం లాక్కునే సమయంలో, తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఆవ్యక్తికి ఒక్కసారిగా తన కళ్ల ముందు వెళ్ళిపోతుంటాయి. అంటే… అతని కర్మ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని యమధర్మరాజు ఆ వ్యక్తి జీవితానికి న్యాయం చేస్తాడు. అందుకే చెబుతారు, జీవితంలో మంచి పనులు మాత్రమే చేయాలని. దీనిద్వారా మరణ సమయంలో, అతను మంచినే తనతో తీసుకువెళతాడు.
ఏ బంధాలు లేని వ్యక్తి పెద్దగా బాధపడడు:
గీతలో శ్రీ కృష్ణుడు ఏమని చెప్పాడంటే, పుట్టిన ఏ వ్యక్తయినా తాను చేయవలసిన కార్యం చేసుకుంటూ పోవాలి అంతేకానీ, ఎలాంటి బంధాలలో చిక్కుకోకూడదని చెప్తాడు. కానీ, మానవులు మాత్రం ఈ భూమిపైకి వచ్చిన తరువాత, రకరకాల బంధాల్లో చిక్కుకుంటారు. అందుకే, మరణ సమయంలో కూడా వాళ్ళు ఆ అనుబంధాన్ని వదులుకోలేక పోతారు. అప్పుడు వారి జీవితాన్ని యమదూతలు బలవంతంగా తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. బంధాల్లో బతికినవాడు తన జీవితాన్ని వదులుకునేటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. అలాకాక, బంధాలకి అతీతంగా బతికినవాడుతన జీవితాన్ని త్యాగం చేయ వలసి వచ్చినా పెద్దగా బాధపడడు.