Katarmal Sun Temple, Almora, Uttarakhand

Mysterious Powers of Katarmal Sun Temple

హైందవ సాంప్రదాయంలో సూర్య భగవానుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో ఒకటైన సూర్యుడ్ని ప్రధాన దేవతలలో ఒకడిగా మాత్రమే కాకుండా, కనిపించే ప్రత్యక్ష దైవంగా భావించి కొలుస్తుంటారు. ఇక సూర్య భగవానుడికి మన దేశంలో ఆలయాలు కూడా ఎక్కువే! వాటిలో ఒక్కో ఆలయానికీ ఒక్కో విశిష్టత ఉంది. అలాంటి ఆలయాల్లో ఒకటైన కతర్మల్ సూర్యదేవాలయం గురించి, ఆ ఆలయంలో దాగి ఉన్న మిస్టరీ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.

కతర్మల్ సూర్యదేవాలయం ఎక్కడ ఉంది?

కతర్మల్ సూర్య దేవాలయం భారతదేశంలో ఉన్న  దేవభూమి అయినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఎంతో సుందరమయిన అల్మోరా ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నది. అల్మోరా ప్రాంతం హిమాలయ శ్రేణిలోని కుమావోన్ కొండల దక్షిణ అంచున ఉన్న శిఖరంపై ఉంది. 

ఈ అల్మోరా ప్రాంతం హిమాలయాల శ్రేణితో, పెద్ద పెద్ద దేవదారు వృక్షాలతో, ఎన్నో గొప్ప దేవాలయాలతో, పర్యాటకులకు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. అలాంటి అందమైన ప్రదేశంలో నెలకొని ఉన్నదే ఈ కతర్మల్ సూర్య దేవాలయం. 

శతాబ్దాల నాటి ఆలయంలోని నిశ్శబ్ద రాళ్ళు పర్యాటకులు వచ్చినప్పుడు గడిచిన కాలాల గురించి మాట్లాడతాయి. ఈ ప్రదేశంలో వీచే గాలి వాటినలా ప్రేరేపిస్తుంది. అంత అద్భుతమైన కట్టడం ఈ కతర్మల్ సూర్య దేవాలయం. అలాంటి ఆలయం యొక్క విశేషాలు, అద్భుతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కతర్మల్ దేవాలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? 

కతర్మల్ సూర్య దేవాలయం 9వ శతాబ్దానికి చెందిన కాటరమల్ల అనే కత్యూరి వంశానికి చెందిన రాజుచే నిర్మించబడింది. ఇది పురాతన కళాకారుల నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. ఈ హిందూ దేవాలయం సముద్ర మట్టానికి 2,116 మీటర్లు – అంటే సుమారుగా 6,939 అడుగులు ఎత్తులో, ఉంది.  

కత్యూరి రాజవంశానికి చెందిన రాజులు ఆర్ట్ అండ్ అర్కిటె క్చర్ పట్ల ఎక్కవ ఆసక్తి కనపరిచేవారు. అందుకే, వారి పాలనా కాలంలో కట్టించిన నిర్మాణాలన్నీ అపురూప శిల్పకళకు ప్రసిద్ధి చెందాయి. ఆ కోవకు చెందిందే కతర్మల్ సూర్య దేవాలయం కూడా. ఈ ఆలయంతో పాటు ఇంకా ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, జగేశ్వర్ ఆలయం, బైజ్‌నాథ్ ఆలయం, మొదలైన అనేక ప్రసిద్ధ ఆలయాలే కాకుండా జోషిమత్‌లోని వాసుదేవ ఆలయంతో సహా అనేక దేవాలయాలని  నిర్మించినట్లు ఆధారాలు చెప్తున్నాయి. మనకు తెలిసిన ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రాంతంలోనే కనీసం 400 దేవాలయాలను వీరే నిర్మించారని చెబుతారు.   

కతర్మల్ సూర్య దేవాలయం చరిత్ర

కతర్మల్ సూర్య దేవాలయం భారతదేశంలోని అద్భుతమైన ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా నిలుస్తుంది. రాజు లేకపోయినప్పటికీ, రాజు యొక్క చరిత్ర కాల రంధ్రంలో కలిసి పోయినప్పటికీ, అతను నిర్మించిన కతర్మల్ సూర్య దేవాలయం మాత్రం ఇప్పటికీ ఉనికిలోనే ఉంది. ఈ అందమైన నిర్మాణంలో రాజు ఇప్పటికీ జీవించే ఉన్నాడు. 

కాటర్మల్ల రాజు కత్యూరి రాజవంశంలో అంతగా తెలియని వ్యక్తి. ఈ రాజవంశం 9వ మరియు 12వ శతాబ్దాల మధ్య ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని ఒక పెద్ద సామ్రాజ్యంగా విస్తరింప చేసింది. వారి పాలన ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా నేపాల్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకి  కూడా విస్తరించింది.

కతర్మల్ సూర్య దేవాలయానికి సంబంధించి పురాణ ప్రాశస్థ్యం

పురాణాల ప్రకారం చూస్తే, ఈ దేవాలయాన్ని పాండవులు ఒక్క రాత్రిలో నిర్మించ తలపెట్టారని, అయితే తెల్లవారుజామున సూర్య భగవానుడి మొదటి కిరణాలు ఆకాశాన్ని తాకడంతో, ఆశ్చర్యంగా ఈ నిర్మాణం ఆగిపోయిందని, అప్పటి నుండి ఈ దేవాలయం అలాగే ఉన్నదని చెబుతారు. పాండవుల మహిమ వల్లనే, ఈ దేవాలయ ప్రాంతం ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లలేదని చెబుతారు. 

ప్రముఖంగా ఆంగ్లో-టిబెట్ యుద్ధం తప్ప ఈ దేవాలయం ఉన్న కుమావోన్ ప్రాంతం భారతదేశం ఎదుర్కొన్న యుద్ధాలకు, ఆక్రమణలకు దూరంగా ఉన్నదని చరిత్ర చెబుతోంది. అయితే, అంతర్గత కలహాలు ఈ ప్రాంతంలో  ఎల్లప్పుడూ ఉండేవి. కుమావోనీలు మరియు గర్వాలీల మధ్య అంతర్గత కలహాలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని చెబుతారు.

ఇది కూడా చదవండి: సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం

కతర్మల్ సూర్య దేవాలయం విశిష్టత 

పర్వతశ్రేణుల్లో ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా ఈ కతర్మల్ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎంతో క్లిష్టమయిన శిల్పకళతో నిండిన ఈ దేవాలయం కనీసం 800 సంవత్సరాల క్రితం నిర్మించినదిగా చెప్పుకుంటారు. ఈ సూర్య దేవాలయాన్ని ‘బడాదిత్య’ లేదా ‘బరాదిత్య’ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడి సూర్య భగవానుడిని ‘వ్రద్దాదిత్య’ అనే రూపంతో కొలుస్తారు. 

ఇక్కడ సూర్య భగవానుడు పద్మాసనంలో కూర్చున్న ఆకారంలో మనకు దర్శనమిస్తాడు. ఇంకా ఇక్కడ శివపార్వతుల, మరియు లక్ష్మి నారాయణుల విగ్రహాలు కూడా ప్రతిష్టింపబడ్డాయి. 

ఈ గుడి ప్రాంగణంలో వివిధ కాలాలలో నిర్మించబడ్డ ఇంకా 45 చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఈ సంఖ్య 44 అని అంటారు. ఈ ఉప ఆలయాలన్నీ ప్రధాన మందిరం యొక్క సూక్ష్మ రూపాలుగా చెప్తుంటారు.

Bodhidharma's disappearance, mysterious Buddhist legend
Unraveling the Mystery of Bodhidharma’s Disappearance

సూర్యుని కిరణాలు ఈ గుడి మీద పడినప్పుడు, వ్రద్దాదిత్య రూపం అంటే –  సూర్యభగవానుడి విగ్రహం అద్భుతంగా మెరిసిపోతుంది. ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వచ్చి ఆ సూర్య భగవానుడిని దర్శించుకొని, ఆయన అనుగ్రహం పొందుతారు.   

కోణార్క్ సూర్య దేవాలయం తరువాత అంత విశిష్టత, ప్రాముఖ్యత సంపాదించుకున్న సూర్య దేవాలయంగా ఈ కతర్మల్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. 

కతర్మల్ సూర్య దేవాలయం నిర్మాణం మరియు శిల్పకళ

నివాసప్రాంతాలకు దూరంగా ఉండటం ఒక విధంగా ఈ దేవాలయం పూర్తిగా శిధిలమవ్వకుండా ఉండటానికి ఉపయోగపడింది. ఈ దేవాలయం కట్టుబడిలో మనకు నగారా మరియు ద్రావిడ నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఈ దేవాలయం నిర్మాణంలో చూపించిన సంక్లిష్టమైన శైలి ఈ దేవాలయానికి మరింత ప్రత్యేకత తెచ్చింది. ఈ ఆలయాన్ని పూర్తిగా స్థానికంగా దొరికే కొండ రాళ్లతో, సున్నం మరియు కాయధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మించారు అని చెబుతారు. 

ఈ ఆలయం కట్టడంలో ఉపయోగించిన కొన్ని భారీ కొండ రాళ్ళను చూస్తే అసలు సామాన్య మానవులు అంత ఎత్తులోకి ఆ రాళ్లను ఎలా తీసుకువెళ్లారు, ఆ రాళ్లను సరయిన ఆకృతిలో ఎలా చెక్కారు, అని ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అందుకేనేమో, ఈ గుడిని మహిమలు కలిగిన పాండవులు కట్టారని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.

గర్భగుడిని ఆకాశం వైపుకు చేరే సూర్య కిరణాలను సూచించే అద్భుతమైన శిఖరంతో అలంకరించబడింది. ఈ గుడి ఆవరణలో నుండి పర్యాటకులకు గంభీరమైన నందా దేవి శిఖరం అత్యద్భుతంగా కనిపిస్తుంది.

ఆలయం యొక్క లేఅవుట్ మరియు ఆర్కిటెక్చర్ ఆస్ట్రోనామికల్ కాలిక్యులేషన్స్ తో రూపొందించబడ్డాయి. ఇంకా ఇక్కడ ఈస్ట్ – వెస్ట్ అలైన్ మెంట్ ఏదైతే ఉందో… అది సంవత్సరంలో నిర్దిష్ట సమయాల్లో గర్భగుడిని ప్రకాశవంతం చేయడానికి సూర్య కిరణాలను ప్రసరింపచేసేలా నిర్మించారు. 

ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు గర్భగుడి లోపల ఉన్న ప్రధాన విగ్రహాన్ని తాకే విధంగా దీన్ని నిర్మించారు. ఈ ఆలయం పైకప్పులోని చిన్న ద్వారం గుండా సూర్యరశ్మిని ప్రసరించే విధంగా నిర్మించారు. ఈ విధానం ద్వారా ఆలయ పూజారులు, ప్రతీ రోజూ సమయాన్ని మరియు గ్రహాల స్థానాన్ని ఖచ్చితంగా లెక్కించేవారని చెబుతారు.

హిందూ ఆస్ట్రోలాజికల్ సిస్టమ్ లోని 9 సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్  గురించి వర్ణించే “నవగ్రహ” ప్యానెల్ కతర్మల్ సూర్య దేవాలయం యొక్క అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటి. ఈ ప్యానెల్‌లోని స్కల్ప్చర్స్ ఆ కాలంలోని కళాకారుల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి.

కతర్మల్ సూర్య దేవాలయం ఎదుర్కొన్న సవాళ్లు 

పరాయి రాజుల పాలనలో ఈ గుడి కొంచెం శిధిలమయినప్పటికీ, ఈ గుడి ప్రాముఖ్యత మాత్రం కోల్పోలేదు. వీటిలో కొన్ని ఆలయాలు మరీ శిధిలావస్థలో ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే కొన్ని చిన్న ఆలయాలు పూర్తిగా వాలిపోయి ఎప్పుడు పడిపోతాయా అన్నట్లుగా ఉంటాయి. వాటిలో ఒకటి కేవలం ఒకే స్తంభంపై మాత్రమే నిలబడి మనుగడ సాగిస్తోంది. కారణం ఈ ఆలయాన్ని సంరక్షించటానికి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నియమించిన ఒంటరి కేర్‌టేకర్ తప్ప అక్కడ మరెవరూ లేరకపోవటమే! 

ప్రస్తుతం ఇక్కడ మనం చూడగలిగే విగ్రహం 12వ శతాబ్దంలో ప్రతిష్టించారని చెబుతారు. దీని కన్నా ముందు ఈ గుడిలో 10వ శతాబ్దానికి చెందిన సూర్య భగవానుడి విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని  ముష్కరులు దొంగిలించిన తరువాత… మిగిలి ఉన్న విలువయిన శిల్ప కళా సంపదను కోల్పోకూడదని, అద్భుతంగా చెక్కబడిన చెక్క తలుపులను, మిగతా విలువయిన శిల్పాలను అప్పటి ప్రభుత్వ పాలకులు ఢిల్లీ లోని నేషనల్ మ్యూజియంకు తరలించారు.

ఈ గుడి ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్యేలో ఉన్నది. భారత ప్రభుత్వం యొక్క ఏన్షియంట్ మాన్యుమెంట్స్, ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ప్రకారం ఈ దేవాలయం నేషనల్ సిగ్నిఫికెన్స్ కలిగిన ఓ మాన్యుమెంట్ గా ప్రకటించబడింది. 

కతర్మల్ సూర్య దేవాలయం గురించి దాగి ఉన్న రహస్యం 

శక్తివంతమైన హిమాలయాల ఒడిలో ఉన్న ఓ రిమోట్ ఏరియా అల్మోరా. ఈ ప్రాంతంలో ఉన్న మిస్టీరియస్ స్పాట్ కతర్మల్ సన్ టెంపుల్. ఈ ఆలయం సూర్య భగవానుడికి డెడికేట్ చేయబడింది. అలాగే ఇక్కడి రాతి శిల్పాలు మత విశ్వాసాలకి ప్రతిరూపం. ఈ రహస్యమైన ఆలయానికి, విశ్వానికి లోతైన సంబంధం ఉంది, అది మనలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఎలాగంటే, ఈ అందమైన కొండపై ఉన్న ఆలయం చుట్టుపక్కల హిమాలయ ప్రకృతి దృశ్యం యొక్క కొన్ని ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. నిజానికిది మారుమూల ప్రాంతం కావటంతో, శతాబ్దాల తరబడి  దాని చారిత్రక, నిర్మాణ మరియు సహజ సౌందర్యాన్ని సంరక్షించుకోవడంలో సహాయపడింది.

కతర్మల్ సూర్య దేవాలయానికి ఎలా చేరుకోవాలి?

అల్మోరా ప్రాంతం నుండి ఈ దేవాలయం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అల్మోరా బాగేశ్వర్ రోడ్ మార్గంలో కోసి గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉన్నది. నైనిటాల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

The Dark Side of Dubai, Human Rights Concerns
Dubai’s Hidden Poverty

కోసి గ్రామానికి వచ్చి, అక్కడి నుండి ఆ గ్రామం గుండా 1.5 కిలోమీటర్లు పైకి నడిస్తే ఈ గుడికి చేరుకోవచ్చు. పైకి వెళ్ళేకొద్దీ వాతావరణం మారిపోతూ ఉంటుంది. సాదారణంగానే ఉత్తరాఖండ్‌ లో ఎక్స్ ట్రీం వెదర్ కండిషన్స్ ఉంటుంటాయి. అయినప్పటికీ, అలాంటి వాతావరణాన్ని తట్టుకొని ఆలయ సముదాయానికి చేరుకున్నట్లైతే… అక్కడ పరిసరాలు మనలను కట్టిపడేస్తాయి. 

అక్కడ దైవత్వం, ఆధ్యాత్మికత పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. స్వచ్ఛమైన గాలి, ఎటువంటి శబ్దాలు లేని ప్రశాంతత, పరిశుభ్రత మరియు అందమయిన లోయ ప్రాంతం వీక్షకులకు చూపు తిప్పుకోనివ్వవు. విశ్రాంతిగా కూర్చోవడానికి, ప్రశాంతంగా ధ్యానం చేయడానికి ఈ ప్రాంతం సరైన ప్రదేశం. ఎంతో ఎత్తుగా పెరిగిన దేవదారు వృక్షాల మధ్యన, హిమాలయాల సమీపంలో ఈ గుడిని చూడటం ఒక మరిచిపోలేని అనుభూతి.

ఇది కూడా చదవండి: Jwalamukhi Temple’s Eternal Flame Secret 

కతర్మల్ ఆలయం చుట్టుప్రక్కల చూడదగ్గ ప్రదేశాలు 

హిమాలయాలకు సంబంధించి, ముఖ్యంగా ఉత్తరాఖండ్ చూడాలని వచ్చే పర్యాటకులకు, ఈ గుడి ఒక ఆకర్షణీయమైన, అద్భుతమయిన పర్యాటక ప్రదేశం అని చెప్పవచ్చు. ఇక్కడ నుండి సమీప అల్మోరా పట్టణం మరియు హవాబాగ్ లోయ ఎంతో అందంగా కనిపిస్తుంది.

అల్మోరా దగ్గరలోనే ఉన్న కాసర దేవి ఆలయం, బాగేశ్వర్, జాగేశ్వర్, పితోరాఘర్, ఇంకా హిమాలయ పర్వత శ్రేణుల అందాలను చూపించే అల్మోరా పట్టణం, ఇవే కాకుండా ఇంకా ఎన్నో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఈ ప్రాంతం చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి.

తప్పకుండా చూడవలసిన జాగేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణంలో శివునికి అంకితం చేయబడిన 124 చిన్న మరియు పెద్ద ఉప ఆలయాలు ఉన్నాయి అని చెబుతారు. 

ఆలయం చుట్టూ ఉన్న దృశ్యాలు చాలా ప్రశాంతంగా, భారీ దేవదారు చెట్లతో నిండి ఉంటుంది. ఈ ఆహ్లాదకరమైన ప్రదేశంలో నందిని మరియు సురభి నదులు కొండ మీద నుండి దిగువకు ప్రవహిస్తూ చూపు తిప్పుకోనివ్వవు.

ఇంకా ఇక్కడకు దగ్గరలో చితాయ్ ఆలయం, బిన్సర్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు జింకల పార్క్ ప్రత్యేక ఆకర్షణలు మరియు చూడదగ్గ ప్రదేశాలు.

కతర్మల్ దేవాలయం దర్శించడానికి వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోవలసిన, గమనించవలసిన విషయాలు

వర్షాకాలం తర్వాత నెలలు, వసంత ఋతువు మరియు వేసవి కాలం ఈ ప్రాంతం సందర్శించడానికి ఉత్తమ సమయం. వేసవిలో కూడా సగటు ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు దాటవు. శీతాకాలపు కనిష్టాలు 9 డిగ్రీల కంటే కూడా తగ్గుతాయి. వేసవి కాలం అంతా చాలా సౌకర్యవంతమైన వాతావరణం ఉంటుంది. మిగతా కాలాలు ఎంతో చల్లగా ఉంటాయి. 

వర్షాకాలంలో ఈ ప్రాంతానికి వెళ్లకపోవటమే మంచిది.  ఎందుకంటే వర్షం సమయంలో ఈ కొండల ప్రాంతాల్లో ప్రయాణం చాలా కష్టం. మరీ ముఖ్యంగా, ఈ ఆలయానికి చేరుకోవాలంటే చివరగా నడిచి వెళ్లే మార్గం వర్షాలు పడే సమయంలో చాలా బురద మయంగా ఉంటుంది.

ప్రతి రోజూ ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 వరకు. ఈ ఆలయాన్ని సందర్శించే వేళలు. అయినప్పటికీ, సందర్శన వేళలపై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్ చేయడం మంచిది. ఎందుకంటే, రకరకాల కారణాల వలన ఎలాంటి ప్రీకాషన్స్ లేకుండానే  ఒక్కోసారి ఈ ఆలయానికి వెళ్లే మార్గం మూసివేస్తారు. 

వీకెండ్స్, అలానే స్పెషల్ డేస్ లో మిగతా రోజుల కంటే ఎక్కువ మంది వస్తుంటారు. ప్రశాంతంగా కొంచెం ఎక్కువసేపు గడపాలి అనుకుంటే మిగతా రోజుల్లో వెళ్ళటమే మంచిది.

ముగింపు 

ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, కతర్మల్ సూర్య దేవాలయం నిర్మాణపరంగా ఓ అద్భుతం. ఇది భారతదేశం యొక్క గొప్ప వారసత్వం. అద్భుతమైన గతానికి నిదర్శనం. యాత్రికులు మరియు భక్తులు ఈ దివ్య ప్రదేశానికి తరలివస్తున్నందున, రాబోయే తరాలకు ఇటువంటి సాంస్కృతిక ఆనవాళ్లను సంరక్షించడం చాలా ముఖ్యం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top