మహాభారతంలో పాండవులకు ఉన్న ప్రాముఖ్యత ఉపపాండవులకు ఉండదు. అభిమన్యుడు, ఘటోత్కచుడు వంటి వీరులకు దక్కిన ప్రాధాన్యత కూడా వీరికి దక్కలేదు. వీరిద్దరూ పాండవులకి ద్రౌపది వల్ల కాకుండా ఇతర భార్యల వల్ల కలిగిన సంతానం. అయినప్పటికీ కురుక్షేత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఉపపాండవులు పాండవులకి ద్రౌపది వల్ల కలిగిన సంతానమే అయినప్పటికీ, పరాక్రమమంలో పాండవులంత వారే అయినప్పటికీ, కురుక్షేత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూడా వీరికి అంత ప్రాముఖ్యత లేదు. అది ఎందుకో..! పురాణాలు దాచిన ఈ ఉపపాండవుల జన్మ రహశ్యం ఏమిటో..! ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సత్య హరిశ్చంద్రుని కథ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మహాభారతంలోని ఉపపాండవులకీ, సత్య హరిశ్చంద్రునికీ దగ్గరి సంబంధం ఉంది. ద్వాపర యుగం నాటి ఉపపాండవులకి, త్రేతా యుగం నాటి సత్య హరిశ్చంద్రులకీ లింక్ ఏమిటి? అసలు ఉపపాండవుల కథ సత్య హరిశ్చంద్రుని కాలానికి ఎందుకు వెళ్ళింది? అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది.
నిజానికి ఈ ఉపపాండవులనే వాళ్ళు హరిశ్చంద్రుని కాలానికి చెందినవాళ్ళే! శాపవశాత్తూ వీళ్ళు ద్వాపర యుగంలో పాండవుల పుత్రులుగా జన్మించవలసి వచ్చింది. ఆ శాపం కారణంగానే ఆయుష్షు తీరకుండానే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించ వలసి వచ్చింది. వీరి శాపమేమిటో… వీరి జన్మ రహశ్యమేమిటో… తెలుసుకోవాలంటే వీరి పూర్వ జన్మ వృత్తాంతం గురించి చెప్పుకోవాల్సిందే!
పూర్వజన్మ వృత్తాంతం
త్రేతాయుగంలో హరిశ్చంద్రుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీపరుడు. ఎల్లప్పుడూ అతను తన రాజ్య ప్రజల క్షేమాన్నే కోరుకొనేవాడు. ప్రజలంతా ఇతని పాలనలో శాంతిని, సుఖ సంతోషాలని అనుభవించేవారు.
ఒకసారి అతను మహాబాహు అడవిలో వేటాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక స్త్రీ బిగ్గరగా కేకలు పెట్టటం విన్నాడు. ‘నన్ను రక్షించు! నన్ను కాపాడు!’ అంటూ ఇంకా కొంతమంది మహిళల రోదనలు కూడా వినిపించాయి. ఆ ఆర్తనాదాలు విన్న హరిశ్చంద్ర రాజు వారిని కాపాడేందుకు ఆ దిశలో పరుగెత్తాడు.
వాస్తవానికి ఆ కేకలు నిజమైనవి కావు, అడ్డంకులను సృష్టించే ప్రభువైన విఘ్నరాజు కల్పించిన భ్రమ. ఇక ఆ ఆర్తనాదాలు వినిపించే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఆ అడవిలో తపస్సు చేసుకొంటూ ఉంటాడు. ఈసారి హరిశ్చంద్రుని నైపుణ్యాన్ని పరీక్షించడానికి, విఘ్నరాజు నేరుగా అతని శరీరంలోకే ప్రవేశిస్తాడు. వెంటనే సహనం కోల్పోయిన హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడిని దుర్భాషలాడడం మొదలుపెడతాడు.
హరిశ్చంద్రుని మాటల కారణంగా తన కఠోర తపస్సు భంగమై… అప్పటిదాకా తాను సంపాదించిన జ్ఞానమంతా నాశనమవుతుంది. కోపంతో విశ్వామిత్రుడు శపించబోతాడు. విఘ్నరాజు తన శరీరం నుంచీ బయటికి వెళ్లి పోవటంతో తన తప్పు తెలుసుకున్న హరిశ్చంద్రుడు తనని క్షమించమని వేడుకుంటాడు. వెంటనే ఓ మహా ఋషి! ప్రజలను రక్షించడం నా కర్తవ్యం. దయతో నన్ను క్షమించు.. మీ ఆగ్రహం రాజుగా నా విధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని ప్రాధేయ పడుతాడు.
అందుకు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని నిజాయితీని పరీక్షించేందుకు గాను తాను పెట్టే పరీక్ష నెగ్గి చూపించమంది శపథం చేస్తాడు. హరిశ్చంద్రుడు దానికి అంగీకరిస్తాడు.
ఆ ప్రకారం, విశ్వామిత్రుడు అతడి కుటుంబాన్ని నానా కష్టాలూ పెడతాడు. వారి సంపదనంతా తీసుకోవడమే కాకుండా, రాజ్యం నుంచి కూడా వెళ్లగొట్టేస్తాడు. విశ్వామిత్రుని కఠినత్వానికి ముల్లోకాలు ఆశ్చర్య పోయాయి. దేవతలు సైతం ఏమీ చేయలేక చూస్తుండి పోయారు.
కానీ, దేవలోకం నుంచి ఇదంతా గమనిస్తున్న ‘విశ్వులు’ అనే అయిదుగురు దేవతలు మాత్రం ఆయన్ని తప్పు పట్టారు. విశ్వామిత్రుని వంటి రాజర్షికి ఇలాంటి ప్రవర్తన తగదంటూ వాదించారు. వెంటనే కోపావేశంతో విశ్వామిత్రడు వారిని నరులుగా జన్మించమని శపిస్తాడు.
భయపడిన విశ్వులు ఆయన్ని క్షమించమని వేడుకొంటారు. దీంతో విశ్వామిత్ర ముని వారిని మరుసటి జన్మలో ఎలాంటి భవబంధాలలోనూ చిక్కుకోకుండా మరణిస్తారని చెప్పి, కొంత ఉపశమనాన్ని కలిగిస్తాడు. అలా నరులుగా జన్మించిన ఆ విశ్వులే… ఈ ఉపపాండవులు. ఇప్పుడు మనం చెప్పుకొంటున్న ఈ ఉపపాండవుల కథ అలా మొదలయింది.
ఉపపాండవులు ఎంతమంది?
పాండవులలాగే ఉపపాండవులు కూడా అయిదుగురే! ఉప పాండవులు ద్రౌపదికి పాండవుల వల్ల కలిగిన సంతానం. వీరి పేర్లు వరుసగా – ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు.
ప్రతివింధ్యుడు
ఉపపాండవులలో మొదటివాడు మరియు ధర్మరాజుకీ ద్రౌపదికీ జన్మించినవాడు ప్రతివింధ్యుడు. ఇతను వింధ్యపర్వతానికి సాటి అయినవాడని చెప్తారు. అందుకే ఇతనికి ఆ పేరు వచ్చిందట. ప్రతివింధ్యుడికి శ్రుతవింధ్యుడనే పేరు కూడా ఉంది. కొన్ని జానపద కథలు ఆయనను చిత్రరథ గంధర్వుని అవతారంగా పేర్కొంటాయి.
ఇతను శిశువుగా ఉన్నప్పుడే ఏకచక్ర నగరిలో వదిలివేయబడతాడు. తరువాత యుధిష్ఠిరుడు చేసిన రాజసూయ యజ్ఞ ప్రచారంలో తన పిన తండ్రైన అర్జునుడితో యుద్ధం చేస్తాడు. ధర్మరాజు తనయుడు మరియు ఉపపాండవులలో పెద్దవాడు కాబట్టి, ఆయన తరువాత హస్తినాపురాన్ని ఏలే అర్హత కలిగినవాడు.