ప్రపంచానికి తెలిసిన పురాణాలు, వాటిలో జరిగిన పోరాటాలలో కురుక్షేత్ర మహా సంగ్రామం చాలా పెద్దది. మనకు తెలిసినంత వరకు ఇంత కన్నా పెద్ద యుద్ధం భూమి మీద ఇప్పటి వరకు జరగలేదు. ఈ యుథ్దాల గురించి మన పాఠ్యపుస్తకాలలో చాలా క్లుప్తంగా మాత్రమే చెప్తారు. అయితే ఇతిహాసాలను వివరంగా చదివితే ఈ యుథ్దాలు ఎలా జరిగాయి, ఎవరెవరు ఎటువంటి యుద్ద తంత్రాలు ప్రయత్నించారు అనే వివరాలు చాలా విపులంగా తెలుస్తాయి. ఇక్కడ యుద్దాలలో పాటించిన ఎన్నో రకాలయిన వ్యూహాలలో పద్మవ్యూహం చాలా ముఖ్యమయినది, కష్టమయినది కూడా.
దీని గురించి మనం ఎన్నో సందర్భాలలో వినే ఉంటాము. ఈ పేరు మనలో చాలా మందికి తప్పకుండా తెలుసు. కానీ దాని గురించి పూర్తి వివరాలు, కొద్ది మందికే తెలుసు. ఈ యుద్ధతంత్రం గురించి, దీనికి సంబందించిన పరిజ్ఞానం ఎవరెవరికి ఉంది? ఎవరెవరు దీనిని ఛేదించగలిగిన సామర్ధ్యం పొందారు? అభిమన్యుడు దీనిని ఎందుకు ఎదుర్కొన్నాడు? లాంటి వాటి గురించి నేను సేకరించిన ఎన్నో ఆసక్తికరమయిన విషయాలు ఈ ఆర్టికల్ లో మీతో షేర్ చేసుకుంటున్నాను.
ఈ యుద్దతంత్రం గురించి మరింత వివరంగా తెలుసుకునే ముందు అసలు ఇది ఏంటి, దీని గురించి మహాభారతంలో ఎవరెవరికి పరిజ్ఞానం ఉందో తెలుసుకుందాము.
పద్మవ్యూహం అంటే ఏమిటి?
పద్మవ్యూహం అనేది గొప్ప గొప్ప యుద్ధాలలో శత్రువుని మట్టుబెట్టడాన్ని వాడే ఒక క్లిష్టమయిన వ్యూహం. ఇందులో యోధులు తమ తమ సైన్యాలతో హద్దులు ఏర్పరచి లోపలికి వచ్చిన శత్రువుకు బయటకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా లోపలే మెరుపు దాడులు చేస్తూ చివరకి మట్టుబెడతారు.
ఇందులో, ఒకొక్క యోథుడు తన సైన్యంతో పద్మ పుష్పంలోని రేకులలాగా అన్ని వైపుల నుండీ వచ్చి యుద్ధం చేస్తూ శత్రువుకి తనను తాను కాపాడుకునే అవకాశం లేకుండా చేస్తారు. ఈ మొత్తం వ్యూహం లోపలికి వెళ్లే కొద్దీ ఒక విచ్చుకుంటున్న పద్మపుష్పం లాగా ఉంటుంది. ఒకొక్క శ్రేణి దాటుకుంటూ వెళ్తుంటే కొత్త పూరేకులలాగా శత్రువులు కమ్ముకొని వస్తారు.
ఈ పద్మవ్యూహం అమరికలో ఉన్న యోధులు, సైనికులు బయట నుండి చూస్తే ఈ పద్మవ్యూహం బయట ఉన్న సైనికులతో యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తారు. ఎప్పుడయితే శత్రువు ఈ పద్మవ్యూహం లోపలి వస్తాడో, వెంటనే బయటవారితో యుద్ధం చేస్తున్న యోధులు, సైనికులు అందరూ ఒక్కసారిగా లోపలికి తిరిగి పద్మవ్యూహం లోనికి వచ్చిన శత్రువు మీద మెరుపు దాడి చేస్తారు. అకస్మాత్తుగా జరిగే ఈ దాడిని గమనించే లోపే దాడి చేసి శత్రువును మట్టుబెడతారు. లోపలి వెళ్ళే కొద్దీ పోరాటం చెయ్యటం, అన్ని వైపుల నుండీ వచ్చే శత్రువులను, ఆయుధాలను ఎదుర్కోవటం మామూలు వారికి అసాధ్యం.
పైన నుండి చూస్తే ఈ మొత్తం పద్మవ్యూహం ఒక చక్రం ఆకారంలో కూడా కనిపిస్తుంది. అందుకే దీనిని చక్రవ్యూహం అని కూడా అంటారు. అయితే కొందరు పెద్దలు ఇవి రెండూ వేరు వేరు అని కూడా అంటారు… కానీ ఈ తేడా వివరంగా చెప్పడానికి మన ఇతిహాసాలలో సరయిన సందర్భాలు కానీ, సంఘటనలు కానీ లేవు. అందరికీ తెలిసినంతవరకూ, ఇవి రెండూ ఒకటే.
పద్మవ్యూహం ఎన్ని సార్లు ఏర్పరిచారు
మహాభారత ఇతిహాసానికి సంబందించిన రకరకాల కథలు పరీక్షించి చూస్తే ఈ పద్మవ్యూహం ఎన్ని సార్లు, ఏఏ సందర్భాలలో ఏర్పరిచారో తెలుస్తుంది. మనకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ వ్యూహాన్ని మూడు సార్లు ఏర్పరిచారు.
పాండవులు విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం పూర్తి చేస్తున్న సమయంలో వారిని బయటకు రప్పించడానికి దుర్యోధనుడి ఆదేశం మేరకు భీష్ముడు ఈ వ్యూహాన్ని ఏర్పరిచాడని చెప్తారు. అయితే అప్పటికే అజ్ఞాతవాసం దిగ్విజయంగా పూర్తి చేయటం వలన అర్జునుడు ధైర్యంగా వచ్చి ఈ వ్యూహాన్ని ఛేదిస్తాడు.
రెండవ సందర్భం కురుక్షేత్ర యుద్ధంలో పదమూడవ రోజున ధర్మరాజుని బంధించడానికి ద్రోణాచార్యుడు ఏర్పరచటం. అయితే, ధర్మరాజుకి బదులు అభిమన్యుడు ఇందులోకి వెళ్లి అన్యాయంగా బలయిపోతాడు.
ఇక మూడవ సందర్భం కురుక్షేత్ర యుద్ధంలో పద్నాలుగవ రోజు జయద్రథుడిని కాపాడటానికి ద్రోణాచార్యుడు ఏర్పరిచాడు. దీనిని కూడా అర్జునుడు దిగ్విజయంగా ఛేదిస్తాడు.
పద్మవ్యూహం గురించి ఎవరెవరికి తెలుసు
మహాభారత ఇతిహాసం ప్రకారం, ద్రోణాచార్యుడికి, అర్జునుడికి, శ్రీకృష్ణుడికి, ప్రద్యుమ్నుడికి, భీష్ముడికి మాత్రమే ఈ వ్యూహం గురించి పూర్తిగా తెలుసు. ద్రోణాచార్యుడి కుమారుడయిన అశ్వథామకు కూడా దీని గురించి తెలుసని చెప్తారు. వీరు కాకుండా అభిమన్యుడికి కూడా ఈ వ్యూహం గురించిన పరిజ్ఞానం కొంత ఉంది. అయితే, అభిమన్యుడికి ఈ వ్యూహంలోకి వెళ్లడమే కానీ ఛేదించి బయటకు రావడం తెలియదు. దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.