ప్యారిస్ పేరు చెపితే మనకి గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. కానీ ఈ టాపిక్ చదివాక మీకు గుర్తొచ్చేది క్యాటకోంబ్స్. అంత భయానకంగా ఉంటుంది ఈ ప్రదేశం. కానీ, చాలామందికి దీని గురించి తెలియదు.
ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ ఓ బ్యూటిఫుల్ సిటీ, మరియు వండర్ఫుల్ టూరిస్ట్ స్పాట్. ప్యారీస్ అందాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకసారి అక్కడికి వెళ్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంటుంది. అలాంటి అందమైన ప్రాంతంలో ఒక మిస్టీరియస్ ప్లేస్ కూడా ఉంది. ఆ ప్రాంతంలోని దృశ్యాలు మనకి వెన్నులో ఒణుకు పుట్టిస్తాయి. ఒక్కసారి అక్కడికి వెళ్తే… ఇక జీవితంలో కోలుకోలేరు. అలాంటి రహశ్యమైన ప్రాంతమది.
ప్యారిస్ అందమైన నగరాన్నే కాదు; భయంకరమైన సొరంగాన్ని కూడా కలిగి ఉందని నిరూపించేదే ఈ క్యాటకోంబ్స్. నిజానికి ఇది ఓ మ్యూజియం. ఇక్కడ దాదాపు 60 లక్షల మృతదేహాలని భద్రపరిచి ఉంచారు. ఇది 18వ శతాబ్దానికి చెందినదిగా ఆధారాలు చెప్తున్నాయి. ఇంతకీ ప్యారీస్ కాటకోంబ్స్ ఎలా ఏర్పడిందంటే…
ఆ కాలంలో ప్యారీస్ లో చనిపోయినవారిని పాతిపెట్టడానికి అస్సలు ఖాళీ స్థలమనేదే లేకుండా పోయింది. 1785లో నగరంలోని మరే ఇతర శ్మశానవాటికల్లోనూ అంత్యక్రియలు చేయలేనంతగా మరణాలు సంభవించాయి. దీనికితోడు భారీ వర్షాల కారణంగా శ్మశానవాటికల్లో పూడ్చిపెట్టిన శవాలు ఒక్కసారిగా వీధుల్లోకి కొట్టుకు వచ్చాయి.
దీంతో ఏం చేయాలో తోచక… మృతదేహాలన్నిటినీ సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఆ తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలని తీసుకువచ్చి ఇక్కడ పడవేసేవారట. ఈ కారణంగా కొద్దిరోజులకే ఈ సొరంగం మొత్తం మృతదేహాలతో నిండిపోయింది.
ఆ తర్వాత ఈ సొరంగాన్ని మ్యూజియంలా మార్చాలని అనుకున్నారట. అందుకే, టన్నెల్ లో మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల మేర పొడవైన గోడను నిర్మించారు. దీనిని ‘మిస్టరీ వాల్’ అని అంటారు. ఈ గోడని భూమిలోపల 20 మీటర్ల లోతులో నిర్మించారు. ఇక ఈ సొరంగాన్ని ‘సమాధుల నేలమాళిగ’ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ క్యాటకోంబ్స్ ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారు.