హైందవ సాంప్రదాయంలో సూర్య భగవానుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో ఒకటైన సూర్యుడ్ని ప్రధాన దేవతలలో ఒకడిగా మాత్రమే కాకుండా, కనిపించే ప్రత్యక్ష దైవంగా భావించి కొలుస్తుంటారు. ఇక సూర్య భగవానుడికి మన దేశంలో ఆలయాలు కూడా ఎక్కువే! వాటిలో ఒక్కో ఆలయానికీ ఒక్కో విశిష్టత ఉంది. అలాంటి ఆలయాల్లో ఒకటైన కతర్మల్ సూర్యదేవాలయం గురించి, ఆ ఆలయంలో దాగి ఉన్న మిస్టరీ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.
కతర్మల్ సూర్యదేవాలయం ఎక్కడ ఉంది?
కతర్మల్ సూర్య దేవాలయం భారతదేశంలో ఉన్న దేవభూమి అయినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఎంతో సుందరమయిన అల్మోరా ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నది. అల్మోరా ప్రాంతం హిమాలయ శ్రేణిలోని కుమావోన్ కొండల దక్షిణ అంచున ఉన్న శిఖరంపై ఉంది.
ఈ అల్మోరా ప్రాంతం హిమాలయాల శ్రేణితో, పెద్ద పెద్ద దేవదారు వృక్షాలతో, ఎన్నో గొప్ప దేవాలయాలతో, పర్యాటకులకు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. అలాంటి అందమైన ప్రదేశంలో నెలకొని ఉన్నదే ఈ కతర్మల్ సూర్య దేవాలయం.
శతాబ్దాల నాటి ఆలయంలోని నిశ్శబ్ద రాళ్ళు పర్యాటకులు వచ్చినప్పుడు గడిచిన కాలాల గురించి మాట్లాడతాయి. ఈ ప్రదేశంలో వీచే గాలి వాటినలా ప్రేరేపిస్తుంది. అంత అద్భుతమైన కట్టడం ఈ కతర్మల్ సూర్య దేవాలయం. అలాంటి ఆలయం యొక్క విశేషాలు, అద్భుతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కతర్మల్ దేవాలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు?
కతర్మల్ సూర్య దేవాలయం 9వ శతాబ్దానికి చెందిన కాటరమల్ల అనే కత్యూరి వంశానికి చెందిన రాజుచే నిర్మించబడింది. ఇది పురాతన కళాకారుల నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. ఈ హిందూ దేవాలయం సముద్ర మట్టానికి 2,116 మీటర్లు – అంటే సుమారుగా 6,939 అడుగులు ఎత్తులో, ఉంది.
కత్యూరి రాజవంశానికి చెందిన రాజులు ఆర్ట్ అండ్ అర్కిటె క్చర్ పట్ల ఎక్కవ ఆసక్తి కనపరిచేవారు. అందుకే, వారి పాలనా కాలంలో కట్టించిన నిర్మాణాలన్నీ అపురూప శిల్పకళకు ప్రసిద్ధి చెందాయి. ఆ కోవకు చెందిందే కతర్మల్ సూర్య దేవాలయం కూడా. ఈ ఆలయంతో పాటు ఇంకా ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, జగేశ్వర్ ఆలయం, బైజ్‌నాథ్ ఆలయం, మొదలైన అనేక ప్రసిద్ధ ఆలయాలే కాకుండా జోషిమత్‌లోని వాసుదేవ ఆలయంతో సహా అనేక దేవాలయాలని నిర్మించినట్లు ఆధారాలు చెప్తున్నాయి. మనకు తెలిసిన ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రాంతంలోనే కనీసం 400 దేవాలయాలను వీరే నిర్మించారని చెబుతారు.
కతర్మల్ సూర్య దేవాలయం చరిత్ర
కతర్మల్ సూర్య దేవాలయం భారతదేశంలోని అద్భుతమైన ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా నిలుస్తుంది. రాజు లేకపోయినప్పటికీ, రాజు యొక్క చరిత్ర కాల రంధ్రంలో కలిసి పోయినప్పటికీ, అతను నిర్మించిన కతర్మల్ సూర్య దేవాలయం మాత్రం ఇప్పటికీ ఉనికిలోనే ఉంది. ఈ అందమైన నిర్మాణంలో రాజు ఇప్పటికీ జీవించే ఉన్నాడు.
కాటర్మల్ల రాజు కత్యూరి రాజవంశంలో అంతగా తెలియని వ్యక్తి. ఈ రాజవంశం 9వ మరియు 12వ శతాబ్దాల మధ్య ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని ఒక పెద్ద సామ్రాజ్యంగా విస్తరింప చేసింది. వారి పాలన ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా నేపాల్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకి కూడా విస్తరించింది.
కతర్మల్ సూర్య దేవాలయానికి సంబంధించి పురాణ ప్రాశస్థ్యం
పురాణాల ప్రకారం చూస్తే, ఈ దేవాలయాన్ని పాండవులు ఒక్క రాత్రిలో నిర్మించ తలపెట్టారని, అయితే తెల్లవారుజామున సూర్య భగవానుడి మొదటి కిరణాలు ఆకాశాన్ని తాకడంతో, ఆశ్చర్యంగా ఈ నిర్మాణం ఆగిపోయిందని, అప్పటి నుండి ఈ దేవాలయం అలాగే ఉన్నదని చెబుతారు. పాండవుల మహిమ వల్లనే, ఈ దేవాలయ ప్రాంతం ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లలేదని చెబుతారు.
ప్రముఖంగా ఆంగ్లో-టిబెట్ యుద్ధం తప్ప ఈ దేవాలయం ఉన్న కుమావోన్ ప్రాంతం భారతదేశం ఎదుర్కొన్న యుద్ధాలకు, ఆక్రమణలకు దూరంగా ఉన్నదని చరిత్ర చెబుతోంది. అయితే, అంతర్గత కలహాలు ఈ ప్రాంతంలో ఎల్లప్పుడూ ఉండేవి. కుమావోనీలు మరియు గర్వాలీల మధ్య అంతర్గత కలహాలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని చెబుతారు.
ఇది కూడా చదవండి: సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం
కతర్మల్ సూర్య దేవాలయం విశిష్టత
పర్వతశ్రేణుల్లో ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా ఈ కతర్మల్ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎంతో క్లిష్టమయిన శిల్పకళతో నిండిన ఈ దేవాలయం కనీసం 800 సంవత్సరాల క్రితం నిర్మించినదిగా చెప్పుకుంటారు. ఈ సూర్య దేవాలయాన్ని ‘బడాదిత్య’ లేదా ‘బరాదిత్య’ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడి సూర్య భగవానుడిని ‘వ్రద్దాదిత్య’ అనే రూపంతో కొలుస్తారు.
ఇక్కడ సూర్య భగవానుడు పద్మాసనంలో కూర్చున్న ఆకారంలో మనకు దర్శనమిస్తాడు. ఇంకా ఇక్కడ శివపార్వతుల, మరియు లక్ష్మి నారాయణుల విగ్రహాలు కూడా ప్రతిష్టింపబడ్డాయి.
ఈ గుడి ప్రాంగణంలో వివిధ కాలాలలో నిర్మించబడ్డ ఇంకా 45 చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఈ సంఖ్య 44 అని అంటారు. ఈ ఉప ఆలయాలన్నీ ప్రధాన మందిరం యొక్క సూక్ష్మ రూపాలుగా చెప్తుంటారు.