మహాభారతం ఎప్పటికీ చెక్కుచెదరని ఒక అద్భుత కావ్యం. దీనిలోని ప్రతి పాత్రా ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఇతిహాసంలో మనకు ఎన్నో రకాల పాత్రలను పరిచయం చేస్తుంది. అందులో శకుని పాత్ర చాలా కీలక మయినది. కౌరవ పక్షాన ఉండి… రాజకీయ ఎత్తుగడలతో పాండవులను రెచ్చగొట్టేవాడు. చివరికి వీరి మద్య పోరు చిలికి చిలికి గాలి వానై… కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసేలా చేశాడు. చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి ఈ శకుని మామ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాము.
శకుని పుట్టుక, మరియు అతని తల్లిదండ్రులు
శకుని అంటే సంస్కృతంలో ‘పెద్ద పక్షి’ అని అర్ధం. శకుని తల్లి పేరు సుధర్మ, తండ్రి పేరు సుబల. వీళ్ళు గాంధార రాజ్యానికి చెందినవారు. గాంధార రాజ్యానికి రాజయిన సుబల రాజుకి మొత్తం నూరుగురు సంతానం. 99 మంది కుమారులు కలిగిన తరువాత పుట్టిన 100వ కుమారుడే ఈ శకుని. అందుకే ఇతనికి ‘సౌబల’ అనే పేరు కూడా వచ్చింది. ఇంకా ఇతనికి గాంధారపతి, పర్వతీయ, కితవ అనే పేర్లు కూడా ఉన్నాయి.
ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారికి శకుని స్వయానా సోదరుడు. అపారమైన తెలివితేటలు కలవాడు. అంతేకాదు ఎత్తులు పై ఎత్తులు కూడా తెలిసినవాడు.
కురు వంశాన్ని ద్వేషించిన శకుని
గాంధారి జన్మించినప్పుడు జ్యోతిష్కులు ఆమె జాతకం చూసి, ఆమెను పెళ్ళిచేసుకునే భర్తకు ఆయుష్షు తక్కువగా ఉంటుందని, పెళ్లి జరిగిన వెంటనే అతను మరణిస్తాడని చెప్తారు. అయితే ఈ దోషం పోవటం కోసం ముందుగా ఆమెకి ఒక మేకతో వివాహం జరిపించి, వెంటనే ఆ మేకను బలి ఇచ్చి చంపేస్తారు. ఈ విధంగా గాంధారి విధవరాలు అవుతుంది.
ఆ తరువాత ఆమెకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని తగిన వరుడిని వెదుకుతున్న సమయంలో భీష్ముడు సుబలుడి వద్ద ధృతరాష్ట్రుడి ప్రస్తావన తెస్తాడు. పుట్టుకతోనే గుడ్డివాడైన ద్రుతరాష్ట్రుడికి గాంధారే తగిన భార్య అని తలచి… వివాహం జరిపించాలని అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ద్రుతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం బీష్ముడు తెలియనీయకుండా చాలా జాగ్రత్త పడతాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ ఒప్పుకోదని తెలిసి భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెడతాడు.
ఇదిలా ఉంటే… గాంధారి విధవరాలు అన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంటాడు ధృతరాష్ట్రుడు. తీవ్ర ఆగ్రహంతో ఆ కుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించేవరకు చిత్రహింసలకు గురిచేయండి! అంటూ ఆదేశిస్తాడు. ఈ సంఘటన జరిగేనాటికి శకుని చాలా చిన్నవాడు.
రాజాజ్ఞ మేరకు తన తండ్రిని, సోదరులను బందించి కారాగారంలో వేస్తారు. అయితే, రాజధర్మం ప్రకారం కారాగారంలో వేసిన వాళ్ళందరికీ ఆహరం తప్పకుండా ఇవ్వాలి. కానీ ఒక్కొక్కరికీ ఒక్కో అన్నం మెతుకు మాత్రమే ఇచ్చేవారు. తమ కుటుంబానికి ఇన్ని కష్టాలు కలగడానికి కారణం బీష్ముడు కాబట్టి అతనిపై పగ పెంచుకుంటాడు సుబలుడు.
భీష్ముడిని, ఇంకా కురువంశం మొత్తాన్ని నాశనం చెయ్యాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం అందరిలోకీ తెలివయిన శకునిని ఎలాగయినా బతికించాలని అనుకొంటాడు. ఈ క్రమంలో వారందరి అన్నం మెతుకులను కలిపి ఒక ముద్దగా చేసి శకునికి పెట్టి… అతనిని బతికిస్తారు. శకుని తండ్రి, మరియు మిగతా సోదరులు మాత్రం ఆకలితో అలమటించి జైల్లోనే మరణిస్తారు.
మరణించే ముందు సబలుడు శకునితో ఇలా అంటాడు. మేమెన్ని నరకయాతనలు అనుభవించి చనిపోతున్నామో నువ్వు కళ్లారా చూశావు కదా! మేమంతా కలిసి నిన్ను బతికించింది మన పగ తీరుస్తాతావని. భవిష్యత్తులో నీకు రాజభోగాలు కలిగి మన పగను మరిచిపోతే మా ఈ ప్రాణ త్యాగాలకు అర్ధం ఉండదు అని చెబుతాడు. అంతేకాదు, కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తుచేయడానికి శకుని తొడ ఎముకను విరిచి అవిటివాడిగా కూడా మారుస్తాడు.
ఆ క్షణం నుంచి శకుని నరనరాల్లోనూ పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటాడు. ఒకపక్క కురువంశాన్ని రక్షిస్తున్నట్లు నటిస్తూ… మరోపక్క మనసులో ప్రతీకారాన్ని ఎవ్వరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాడు.
గాంధారికి తోడుగా శకుని
గాంధార రాజ్యానికి యువరాజుగా ఉన్న శకుని, తన తండ్రి సుబల మరణించిన తరువాత రాజు అవుతాడు. మొదటినుండీ తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం. ఆ అభిమానంతోనే గాంధారి వివాహం గుడ్డివాడయిన దృతరాష్ట్రుడితో జరిగిన తరువాత, తన ప్రియమయిన సోదరికి తోడుగా ఉండటం కోసం శకుని కూడా గాంధారితో పాటుగా హస్తినాపురానికి వచ్చేస్తాడు. అక్కడే తన సోదరితో ఉండిపోతాడు.
కానీ శకుని గాంధారితో పాటు హస్తినాపురంలో ఉండటం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయి. అవి: తన ప్రియమయిన చెల్లికి ఒక గుడ్డివాడితో పెళ్లి చేసి ఆమె జీవితం నాశనం చేశారనే కోపం ఒక పక్క; తన కుటుంబాన్ని చెరసాలలో బంధించి ఆకలితో అలమటించి మరణించేలా చేశారని మరోపక్క. ఈ రెండు బలమైన కారణాలతో కురువంశాన్ని అంతమొందించటమే లక్షంగా పెట్టుకొంటాడు. అందుకోసం హస్తినలో తిష్టవేస్తాడు.
హస్తినాపురంలో కౌరవులకు అండగా శకుని
అంధుడయిన దృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకున్న గాంధారికి తోడుగా శకుని హస్తినాపురంలోనే ఉండిపోతాడు. అక్కడ, గాంధారికి పుట్టిన పిల్లలను ప్రేమగా చూసుకుంటాడు. అందరికన్నా దుర్యోధనుడి మీద శకునికి ఎంతో ప్రేమ. తన మేనల్లుడు అన్ని విషయాలలో ముందుండాలని, అందరి మీద విజయం సాధించాలని, కురువంశానికి అతనే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు. ఎల్లప్పుడూ కౌరవులకు సహాయం చేస్తూ వారి నమ్మకం సంపాదిస్తాడు.
మహాభారతంలో శకునిని ఒక జిత్తులమారిగా, మోసగాడిగా చెప్పుకొంటారు. ఎందుకంటే, ఇతను కౌరవుల వైపు ఉండి, ఎన్నో రకాలుగా పాండవులను కష్టాలపాలు చేశాడు. దుర్యోధనుడు కురువంశానికి చక్రవర్తి అవ్వడానికి అడ్డుగా ఉన్న పాండవులను అన్ని రకాలుగా రాజ్యానికి దూరం చెయ్యాలని ఎన్నో కుట్రలు పన్నుతాడు.