ఇండియాలో పుట్టి… చైనీయుల ఇష్ట దైవంగా మారి… బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిన బోధిధర్మ గురించి మీలో ఎంత మందికి తెలుసు? జెన్ మత స్థాపకుడిగా… షావోలిన్ వంటి మార్షల్ ఆర్ట్స్ మూల గురువుగా… ఎంతో ఖ్యాతి గడించినప్పటికీ, అతని జీవితం, మరియు మరణం గురించి పురాణాలు ఎందుకు నిగూడంగా ఉంచాయో ఇప్పటికీ అంతు చిక్కట్లేదు. బోదిధర్మ మన తెలుగువారే అయినప్పటికీ ఆయన మరణమే మిస్టరీగా మారింది. చైనాయే ఆయన్ని చంపేసిందా? లేదా ఆయన ఇండియాకి తిరిగి వచ్చేశారా? చివరి రోజుల్లో అసలేం జరిగింది? ఇలాంటి ఇంటరెస్టింగ్ విషయాలను తెలుసుకోనేముందు సెమీ-లెజెండరీ బుద్దిస్ట్ మాంక్ అయిన బోధిధర్మ యొక్క లైఫ్ హిస్టరీ, అండ్ డెత్ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బోధిధర్మ ఎవరు?
సాంప్రదాయ కథనాల ప్రకారం, బోధిధర్మ 5, లేదా 6 శతాబ్దాల మధ్యకాలంలో తమిళనాడులోని కాంచీపురంలో జన్మించాడు. అప్పట్లో కాంచీపురాన్ని పాలిస్తున్న రాజు స్కందవర్మ యొక్క మూడో కుమారుడితను. అంటే… పల్లవ రాజవంశానికి చెందిన యువరాజు. బోదిధర్మ అసలు పేరు ధర్మ వర్మ. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత అతని గురువు బోదిధర్మగా పేరు మారుస్తాడు. బోదిధర్మ అంటే – సంస్కృతంలో “ధర్మాన్ని మేల్కొలుపు” అని అర్ధం.
బోదిధర్మ జీవితాన్ని మార్చేసిన లేఖ
బోదిధర్మ చూడటానికి ఎంతో అందంగా… గంభీరంగా… కనిపించేవారు. అలాగే మంచి బుద్ధిశాలి కూడా. అయితే, ఓ రోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ ఆస్థానానికి వస్తాడు. అతను వెళుతూ… వెళుతూ… ధర్మ వర్మ కోసం ఓ లేఖను అక్కడే వదిలి వెళతారు. అందులో ‘‘జననానికి ముందు నీవెవ్వరు? జన్మించిన తర్వాత నీవెవ్వరు’’ అని రాసి ఉంటుంది. ఆ లేఖలో అలా ఎందుకు రాసి ఉందో ధర్మవర్మకు అర్థం కాలేదు. దాని సమాధానం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. చివరికి జవాబు తెలుసుకోడానికి ఏకంగా ప్రజ్ఞతార ఆశ్రమానికే వెళ్ళారు.
సన్యాసం స్వీకరించటం
సమాధానాన్ని వెతుక్కుంటూ ప్రజ్ఞతార ఆశ్రమానికి వచ్చి చేరతాడు ధర్మవర్మ. ఆయనను కలిసినప్పటికీ సరైన సమాధానం మాత్రం దొరకలేదు. పైగా నీకు నువ్వుగానే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కో! అని చెప్తారు. బంధాలకు, సుఖాలకు, లోనై ఉన్నంత కాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. అందుకే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకో! అని ప్రజ్ఞతార చెప్తారు.
దీంతో ధర్మవర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానికి నిశ్చయించుకుంటాడు. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యరికానికి చేరాడు. ప్రజ్ఞతార ధర్మ వర్మ పేరును బోది ధర్మగా మారుస్తారు. అప్పటినుండీ బోది ధర్మ తన రాజ హోదాను త్యజించి సన్యాసి అయ్యాడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు.
యుద్ధ విద్యలు నేర్చుకోవటం
బోది ధర్మలో మానసిక స్థైర్యం ఎక్కవగా ఉన్నా… శారీరక శక్తి మాత్రం చాలా తక్కువగా ఉందని గురువు గమనించారు. ఈ సందర్భంగా కొన్నాళ్లు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని ఆదేశిస్తారు. దీంతో బోదిధర్మ దేశం మొత్తం తిరిగి యోగాతోపాటు, మర్మవిద్యలన్నీ నేర్చుకున్నారు. నాలుగేళ్ల తర్వాత శారీరక, మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు.
అప్పుడు గురువు బోదిధర్మకు తన పుట్టుకకు సంబందించిన అసలు రహశ్యం చెప్తారు. ‘‘నువ్వు సాధారణ సన్యాసివి కావు. నీ పుట్టకకు ఓ కారణం ఉంది. నువ్వు మరో బుద్ధుడిగా మారి బౌద్ధమతాన్ని, దాని యొక్క ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలి’’ అని ఆయన చెప్పారు.
చైనాకు ప్రయాణం
చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే, అక్కడి ప్రజలు మాత్రం బౌద్ధ ధర్మాలను విస్మరించి పూర్తిగా బుద్ధి హీనులుగా మారడం ప్రజ్ఞతారను కలిచివేసింది. అందుకే చైనాలో బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు నువ్వు రెండో బుద్ధుడిగా మారి అక్కడికి వెళ్లాలని బోదిధర్మను ఆదేశించారు. అంతకంటే ముందు బౌద్ధ గ్రంథాలు, చైనా భాష, మరియు సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని కూడా పేర్కొన్నారు. గురువు ఆదేశాల మేరకు బోదిధర్మ చైనా వెళ్ళాలని నిర్ణయించుకొంటాడు. అందుకోసం 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలన్నిటిపై పట్టు సాధిస్తారు. చివరికి 67 ఏళ్ల వయస్సులో చైనాకు బయల్దేరారు.
ఇది కూడా చదవండి: Mahavatar Babaji’s Life and Teachings
చక్రవర్తి ‘వు’ తో ఘర్షణ
బౌద్ధ దేవాలయాలను నిర్మించడంలో మరియు బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లియాంగ్ రాజవంశానికి చెందిన చక్రవర్తి ‘వు’ బోధిధర్మను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. బోదిధర్మ చైనాలో అడుగు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసుకుని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను అతని ద్వారా తీర్చుకోవాలని భావించాడు. తాను ఎన్నో దానధర్మాలు చేశానని, అలానే బౌద్ధ సన్యాసులను కూడా పోషిస్తున్నానని తెలుపుతాడు. ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తాను స్వర్గానికి వెళ్తానా? లేదా నరకానికి వెళ్తానా? అని అడిగాడు.
అందుకు సమాధానంగా ‘నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు. ఎందుకంటే, నీవు ధనంతో పుణ్యాన్ని కొంటున్నావు. అంతేకానీ, మంచి మనసుతో దానం చేయడం లేదు. స్వర్గానికి వెళ్లాలనే స్వార్థంతో పుణ్యాత్ముడిలా నటిస్తున్నావు. ఇలాంటివారు తప్పకుండా నరకానికే పోతారు’’ అని బోదిధర్మ తెలిపారు. అంతే, రాజుకు కోపం తన్నుకు వచ్చింది. వెంటనే అతన్ని కోట వదిలి వెళ్లాలని ఆదేశిస్తాడు. దీంతో బోది ధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనావైపు తన ప్రయాణం కొనసాగిస్తారు.
షావోలిన్ ఆలయానికి రాక
అనంతరం బోధిధర్మ హెనాన్ ప్రావిన్స్‌లోని షావోలిన్ ఆలయం సమీపానికి చేరుకొంటారు. అక్కడే ఓ గుహలో ధ్యానం చేయడం మొదలు పెట్టారు. అలా తొమ్మిదేళ్లపాటు బోధిధర్మ ఎవరితో మాట్లాడకుండా పూర్తిగా మౌనం వహిస్తూ ద్యానంలోనే ఉన్నారు. పురాణాల ప్రకారం, అతను తొమ్మిదేళ్లపాటు ఆ గుహలోనే ఉంటూ… గోడకు ఎదురుగా కూర్చొని ధ్యానం చేశారని చెప్తారు.
బోదిధర్మ మహిమలు
బోదిధర్మ గొప్పతనం గురించి తెలిసి ‘దాజూ ల్యూక్ అనే సన్యాసి బోదిధర్మ శిష్యుడిగా చేరాలని ఆయన దగ్గరికి వస్తాడు. కానీ, కఠోర ధ్యానంలో ఉన్న బోది ధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోరు. దీంతో ల్యూక్ అక్కడి వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోయినా సరే… బోది ధర్మ వద్దే కుర్చొని… ఆయన కోసం ఎదురుచూసేవాడు.
ఎంతకీ కళ్ళు తెరచి చూడకపోయేసరికి ఓర్పు నశించి చివరికి ఓ రోజు ల్యూక్ కత్తితో తన చేతిని నరికేసుకుంటాడు. ఆ రక్తం బోదిధర్మపై పడుతుంది. దీంతో బోదిధర్మ కళ్లు తెరిచి చూస్తారు. అతని పట్టుదలకి మెచ్చి… తన తపోశక్తితో అతనికి తిరిగి చేతిని ప్రసాదిస్తాడు. అనంతరం ల్యూక్‌ను తన శిష్యుడిగా చేర్చుకుంటారు. అప్పటినుంచీ ల్యూక్ పేరును బోదిధర్మ ‘షెన్ గ్యాంగ్’ గా మారుస్తాడు.