విజయవాడ అనగానే భక్తులకు గుర్తుకొచ్చేది ఇంద్రకీలాద్రి. అలాంటి విజయవాడలో… ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ విషయంలో… 1955వ సంవత్సరంలో… ఒక అద్భుతం జరిగింది. అది అద్భుతం అనేకంటే… కనకదుర్గమ్మ మహిమ అంటే బాగుంటుందేమో!
“అమ్మా!” అని పిలిచినప్పుడు మనసుకు కలిగే ధైర్యాన్ని మాటల్లో చెప్పడం కష్టం. బాధలో ఉన్నప్పుడు ఓదార్పుగా, భయంతో ఉన్నప్పుడు అండగా, దారితోచని సమయంలో ఆశగా నిలిచేది ఆ పిలుపే.
విజయవాడ కనకదుర్గమ్మను భక్తులు కూడా అంతే ఆత్మీయంగా తలచుకుంటారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని తమ కష్టాలు చెప్పుకోగల తల్లిగా భావిస్తారు.
అలాంటి అమ్మకు, ఒక సాధారణ రిక్షా కార్మికుడికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే కథ ఇది. ఇందులో మనసును తాకేది అద్భుతం ఒక్కటే కాదు… “తల్లి దగ్గర బిడ్డకు భయమెందుకు?” అనే భక్తుడి నమ్మకం.
భక్తుల బాగోగులు చూసే తల్లిగా కనకదుర్గమ్మ
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా… వరాలిచ్చే వరలక్ష్మిగా… నమ్మిన వారి కొంగు బంగారంగా… ఇంద్రకీలాద్రిపై వెలసింది కనకదుర్గమ్మ. అలాంటి ఆ తల్లి… తన భక్తుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి… ప్రతిరోజూ కొండ దిగి వచ్చి… విజయవాడ నగర సంచారం చేస్తుంది. ఇందుకు సాక్షం కొండపై రాత్రి నిద్రించే భక్తులు, మరియు అక్కడ ఉండే దేవీ ఉపాసకులే! రాత్రి పూట ఆ తల్లి గజ్జెల సవ్వడి విన్నవాళ్ళు ఎందఱో ఉన్నారు.
ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కనకదుర్గమ్మ ఆలయ అధికారిక సమాచారం చూడండి.
అర్ధరాత్రి ఎదురైన పెద్దావిడ
1955వ సంవత్సరంలో, విజయవాడ మారుతీ టాకీస్ లో ‘రోజులు మారాయి’ సినిమా ఆడుతుంది. ఆ సినిమా సెకండ్ షో అయిపోగానే ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళదామని ఎదురు చూస్తున్నాడు వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు. నిజానికతడు అమ్మవారి భక్తుడు. కాయకష్టం మీద బతికే వాడు. ఈ కారణంగానే అర్ధరాత్రి వేళ అయినా సరే మంచి బేరం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఇంతలో సినిమా హాల్ లో నుంచి ఒక పెద్దావిడ బయటికి వచ్చింది. ఆమె ఎర్ర చీర కట్టుకొని… పెద్ద బొట్టు పెట్టుకొని… చూడటానికి నిండు ముత్తైదువలా ఉంది. ఆమె వెంకన్న దగ్గరికి వచ్చి రిక్షా వస్తుందా బాబూ! అని అడిగింది. ఎక్కడ దించాలో చెప్పమంటాడు వెంకన్న. ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని చెప్పి… రిక్షా ఎక్కి కూర్చుంది ఆ పెద్దావిడ.
తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు?
వెళ్ళేదారిలో వెంకన్నని ఉద్దేశించి ఆవిడ ఇలా అంటుంది. “బాబూ! ఇప్పుడు సమయం 12 గంటలు అయింది. ఊరంతా నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి పూట ఆ దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుందని వినే ఉంటావు కదా! మరి నీకు భయం వేయట్లేదా..!” అని అడుగుతుంది. దానికి వెంకన్న ఇలా సమాధానం చెప్పాడు. “ఆ… అమ్మ దుర్గమ్మ… మా అందరి తల్లి! తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు ఉంటుందమ్మా..?” అని చెప్తాడు.
ఇంద్రకీలాద్రి వద్ద కనకదుర్గమ్మ మహిమ
ఇక కొంతదూరం వెళ్ళగానే ఇంద్రకీలాద్రి కొండ వచ్చేస్తుంది. దీంతో ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా..! అని ఆమెని అడుగుతాడు. కానీ, వెనుక నుండి సమాధానం లేదు. ఏమిటని వెనక్కి తిరిగి చూస్తే… రిక్షా లో ఆమె లేదు. ఖంగారుగా చుట్టూ వెతుకుతాడు. ఇంతలో పక్కనే ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది.
వెంటనే, అదేంటమ్మా..! డబ్బులు ఇవ్వనేలేదు అని వెంకన్న అడగగా… నీ తలపాగలో పెట్టాను చూడు అంటుంది. వెంటనే అతను తన తలపాగా తీసి చూడగా… అందులో అమ్మవారి బంగారు గాజు, 10 రూపాయల నోటు ఉన్నాయి. దీంతో వెంటనే ఆయనకి అర్ధమయింది తన రిక్షా ఎక్కింది మరెవరో కాదు, అమ్మలగన్న అమ్మ ఆ కనక దుర్గమ్మే అని. తిరిగి చూడగా ఆమె మాయమైపోతుంది.
దీంతో ఆనందంతో ఒక్కసారిగా వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి… ఏమైందో అని కంగారు పడతారు. జరిగిన విషయం చెప్పి… ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతుంటాడు.
ఆంధ్రకేసరి పత్రిక ప్రస్తావన
అయితే, ఈ సంఘటన నిజమా..! కాదా..! తెలియచేసేందుకు అప్పట్లో వచ్చే ‘ఆంధ్రకేసరి’ పత్రిక’ ఈ కధనాన్ని ఫోటోలతో సహా ప్రచురించినట్లు పేర్కొన్నారు.
అయితే ఆ పత్రిక సంచిక తేదీ, పేజీ వివరాలు లేదా అసలు ప్రచురణ ప్రతిని ప్రస్తుతం నిర్ధారించలేకపోయాం. అందువల్ల ఈ విషయాన్ని నిర్ధారిత ఆధారంగా చూపకుండా, కథనంలో ఉన్న ఒక ప్రస్తావనగా మాత్రమే తెలియజేస్తున్నాం.
అమ్మపై నమ్మకానికి అద్దం పట్టే కథ
వెంకన్న కథలో మనం ఆలోచించదగిన విషయం—దేవుడితో మన అనుబంధం ఎలా ఉండాలనేది.
ప్రార్థనలో కోరికలు చెప్పుకోవచ్చు. బాధలను పంచుకోవచ్చు. మనసులో ఉన్న భయాన్ని కూడా దాచుకోకుండా చెప్పుకోవచ్చు.
అమ్మను తల్లిగా భావించే భక్తుడికి ప్రార్థన ఒక ఆత్మీయ సంభాషణగా మారుతుంది. అన్ని సమస్యలూ వెంటనే తొలగిపోకపోయినా, వాటిని ఎదుర్కోవడానికి తగిన విశ్వాసం ధైర్యాన్ని ఇవ్వవచ్చు.
అలాగే, అమ్మను ప్రేమగా తలచుకునే మనసు, తోటి మనుషుల బాధనూ అర్థం చేసుకోగలిగితే ఆ భక్తికి మరింత అర్థం ఉంటుంది.
ఈ కథ మనకు చెప్పే జీవిత సందేశం
కనకదుర్గమ్మ మహిమ గురించి భక్తులు చెప్పుకునే వెంకన్న కథలో మనసును హత్తుకునేది బంగారు గాజు మాత్రమే కాదు… అమ్మవారిని తన సొంత తల్లిగా భావించిన అతని నమ్మకం. “తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకమ్మా?” అనే ఒక్క మాటలో ఆ ఆత్మీయతంతా కనిపిస్తుంది.
భక్తుల మధ్య ప్రచారంలో ఉన్న ఈ కథనం మనకు ఒక అందమైన సందేశాన్ని అందిస్తుంది. అమ్మపై విశ్వాసం మనలో ధైర్యాన్ని పెంచాలి. ఆ భక్తి మన ప్రయత్నాన్ని కొనసాగించడానికి, తోటి మనుషుల పట్ల దయతో ఉండటానికి స్ఫూర్తినివ్వాలి.
ఈ కథలో మీ మనసును తాకిన విషయం ఏది? వెంకన్నకు అమ్మపై ఉన్న నమ్మకమా? తల్లీబిడ్డల అనుబంధాన్ని గుర్తుచేసే అతని సమాధానమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి.
ఇలాంటి ఆధ్యాత్మిక కథనాలు, వాటిలోని జీవిత సందేశాల కోసం Telugu Trendings చదువుతూ ఉండండి.
ఇది కూడా చదవండి: అంబరాన్ని అంటిన మైసూర్ దసరా ఉత్సవాలు
జై కనకదుర్గమ్మ తల్లీ! 🙏


