దసరాకి మారుపేరు మైసూర్. మైసూర్ లో జరిగినంత గ్రాండ్ గా విజయదశమి వేడుకలు దేశంలో మరెక్కడా జరగవు. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ, నిబంధనలకి కట్టుబడి వరుసగా రెండో ఏడాది కూడా ప్యాలెస్ లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మైసూర్ దసరా సెలెబ్రేషన్స్ కి కేవలం 500 మందిని మాత్రమే అనుమతించారు.
ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మైసూర్‌లో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. అక్టోబర్4 నుంచీ అక్టోబర్16 వరకు విజయదశమి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతీయేటా జరిగినట్లుగానే ఈ ఏడు కూడా ప్యాలెస్ లో సాంప్రదాయ రీతిలో ఆయుధపూజని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. జంబూ సవారీ కోసం గజరాజులని అందంగా ముస్తాబు చేశారు.
మైసూరు దసరా ఉత్సవాలకు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. మొట్టమొదటగా ఈ ఉత్సవాలను 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. విజయనగర సామ్రాజ్య పతనానంతరం మైసూరు రాజులైన వడయార్లు నవరాత్రి ఉత్సవాలని మొదట శ్రీరంగపట్నంలో ప్రారంభించారట. ఆ తర్వాత 1805లో కృష్ణరాజ వడయార్ III దసరా ఉత్సవాలని మైసూర్ ప్యాలెస్ లోనే… ప్రత్యేక రాజదర్బారు నిర్వహించి చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇక అది ఆచారంగా మారిపోయింది.
ఈ ఆచారాన్నే నేటికీ వడయార్ వారసులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా దసరా ఉత్సవాలు ప్రారంభమవగానే మైసూర్ ప్యాలెస్‌లో ఈనెల 7వ తేదీన ప్రైవేట్ దర్భారు నిర్వహించారు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్. కాకపోతే, ఈసారి ప్రజలని, మీడియాని అనుమతించలేదు. కేవలం రాజకుటుంబీకులు, ప్యాలెస్ సిబ్బంది మధ్యే ఈ దర్భార్ నిర్వహించారు
దసరా సందర్భంగా మైసూర్ ప్యాలెస్‌లో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుత మైసూర్ మహారాజైన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్… నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మహర్నవమి నాడు… తమ పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలకి ఎంతో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఈ ఆయుధాలకి ఎన్నో యుద్దాలని జయించిన ఘనత ఉంది. అందుకే ఆ ఆయుధాలని కొన్ని వందల ఏళ్లుగా ఎంతో జాగ్రత్తగా భద్రపర్చారు.
మహారాజు ఉపయోగించిన రాచఖడ్గాన్ని, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి… ఊరేగింపుగా తీసుకువచ్చి… దానికి పూజలు నిర్వహించారు. అశ్వాలని, గజాలని ఈ ఆయుధపూజలో భాగంగా అందంగా అలంకరించి… గజాశ్వాది పూజని కూడా నిర్వహించారు. భక్తికి సంస్కృతిని జోడిస్తూ… మైసూర్ చాముండేశ్వరి అమ్మవారిని కొలుస్తూ… ఇలా శరన్నవరాత్రులని నిర్వహించడం ఆనవాయితీ!
అయితే, మైసూర్ లో దసరా ఉత్సవాలు మొదలుపెట్టి నేటికి 411 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల కోసం ముస్తాబైన మైసూర్ ప్యాలెస్… దీప కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చాముండీ కొండ కూడా దీప కాంతుల్లో జిగేల్ అనిపిస్తుంది. సాంప్రదాయం ప్రకారం శ్రీరంగపట్నంలో కూడా ఈ ఉత్సవాలని నిర్వహించారు.
ఇక ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది జంబూ సవారీ. విజయదశమి రోజున జరిగే జంబూ సవారీలో… గజరాజు అభిమన్యు… అంబారీని మోస్తుంది. అభిమన్యుతోపాటు కావేరి, చైత్ర, లక్ష్మి, అశ్వత్థామ, ధనంజయ, గోపాలస్వామి అనే ఏనుగులు ఈ దాని వెంట నడుస్తూ ఈ సవారీలో పాల్గొంటాయి.
మైసూరులో జరిగే దసరా ఉత్సవాలని కర్ణాటక రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. కన్నడంలో దసరా పండుగని “నాదహబ్బ” అని పిలుస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో కలిపి వరుసగా పదిరోజులు జరుపుకుంటారు. ఎక్కువగా దసరా పండుగ సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లోనే వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయమే… ఈ విజయదశమి. మొత్తం పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలని చూసేందుకు దేశ విదేశాల నుండీ లక్షలాదిమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.