ఒక దేశంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్, టెక్నికల్ స్కిల్స్ ఆ దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తే, హ్యూమన్ రిసోర్సెస్ మరో విధమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. దీనివల్లే ఆ దేశం ప్రపంచ దేశాలలో తానేంటో ప్రూవ్ చేసుకోగలుగుతుంది. ఈ కోవకి చెందిందే దుబాయి.
ఆర్ధిక ఇబ్బందులుతో సతమతమయ్యే వారెవరైనా సరే దుబాయి వెళితే చాలు, ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకుంటారు. ఎందుకంటే, ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్ అయిన కంట్రీ కాబట్టి ప్రపంచ నలుమూలలనుండీ ఉపాధి కోసం ఇక్కడికి వస్తుంటారు. అందుకే, ప్రపంచంలోని మిగతా దేశాలన్నిటికన్నా దుబాయి ప్రత్యేకతే వేరు.
నిజానికి దుబాయి రిచ్ కంట్రీ అయినప్పటికీ దానిలో చీకటి కోణం కూడా ఒకటి దాగి ఉంది. అక్కడికి వెళ్లి డెవలప్ అయినవాళ్ళ విషయం కొద్దిసేపు పక్కనపెడితే, సరయిన నైపుణ్యం లేకుండా ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో అక్కడికి వెళ్ళిన వాళ్ళ జీవితాలలోకి తొంగి చూస్తే ఎన్నో భయంకరమయిన నిజాలు వెలుగు చూస్తాయి. ముఖ్యంగా దుబాయిలో సంపాదన కోసం వెళ్లిన వారి కష్టాలు, వారి పరిస్థితులు గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము.
ఎమిరేట్స్ లో భాగం
దుబాయ్ గురించి తెలుసుకునే ముందు ఈ ఇస్లామిక్ దేశాలను ఎలా విభజించారో ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది దుబాయ్ ఒక దేశం అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే దుబాయ్ అనేది ఏడు ఎమిరేట్స్ సమూహంలో ఒక భాగం మాత్రమే.
అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఫుజైరా, ఉమ్ అల్ క్వైన్ మరియు రస్ అల్ ఖైమా – ఈ ఏడింటిని కలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అని పిలుస్తారు. ఇక మనందరికీ తెలిసిన మరొక పెద్ద ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా. ఇవి రెండూ కాకుండా సంపాదన కోసం ప్రజలు వెళ్లే ఇంకొక ఇస్లామిక్ ప్రాంతం కతార్.
కఠిన నియమాలు
ఈ మూడింటిలో సౌదీ అరేబియాలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ సరదాలకు, షికార్లకు కూడా చాలా ఆంక్షలు ఉన్నాయి. తమ మతాన్ని మాత్రమే ఇక్కడ ప్రోత్సహిస్తారు. వీరితో పోలిస్తే UAEలో ఉన్న దుబాయ్ లాంటి ప్రాంతాలలో కొంచెం వెసులుబాటు ఉంటుంది.
UAEలో ఉన్న దుబాయ్ లాంటి ప్రాంతాలలో ఆంక్షలు తక్కువ. కతార్ ఈ రెండిటికీ మధ్యస్థంగా ఉంటుంది. ఖర్చుల పరంగా UAEలో ఉన్న దుబాయ్ లో చాలా ఎక్కువ. ముఖ్యంగా అద్దెలు. కానీ అన్ని రకాల వాళ్ళు ఇక్కడ సంపాదన కోసం జీవిస్తూ ఉంటారు. అందుకే సౌదీ అరేబియాతో పోలిస్తే UAE సమూహంలో నగరాలకు, ముఖ్యంగా మన దేశం నుండి దుబాయ్ నగరానికి జీవనోపాథి కోసం వచ్చే వాళ్ళు చాలా చాలా ఎక్కువ.
ఇదంతా చూస్తే సంపాదన కోసం దుబాయికి వెళ్ళటం మంచిది అనిపిస్తోందా? ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
దుబాయ్ అంటే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది… అక్కడ చూపు తిప్పుకోనివ్వని మేఘాలలో కలిసిపోయేంత ఎత్తయిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుర్జ్ ఖలీఫా భవనం. దుబాయ్ నగరం ఇంకా ఇలాంటి ఎన్నో ఆకాశహర్మ్యాలకు, విలాసాలకు పేరుగాంచిన షాపింగ్ మాల్స్, క్రూరమృగాలను పెంపుడు జంతువులుగా ఇళ్లలో పెంచే అరబ్ సంపన్నులకు ప్రసిద్ధి. అయితే ఇది అంతా నాణానికి ఒక వైపు మాత్రమే. రెండవ వైపు ప్రపంచానికి అంతగా కనిపించని, తెలియని దుర్భర జీవితాలు, ఒక్క పూట కూడా తిండికి కష్టపడే కార్మికులు, జాతి వివక్షలు, ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్నో ఎనెన్నో…
ఇది కూడా చదవండి: Top 15 Most Dangerous Places on Earth
బానిసత్వానికి కేర్ అఫ్ అడ్రెస్
దుబాయ్ ప్రపంచం నలుమూలలలో పేద దేశాల నుండి ఇక్కడకు వచ్చి పని చేయడానికి లోకల్ వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లాంటి దేశాల నుండి ఎక్కువ మందిని కనీసం దశాబ్ద కాలం పాటు పని చేసే విధంగా ఒప్పందాలపై సంతకం చేయించుకొని తీసుకువస్తారు.
వీరిలో ముఖ్యంగా చదువుకోనివారు, సరయిన నైపుణ్యం లేనివారు ఎక్కువగా ఉంటారు. వీరు బ్రతుకుతెరువు కోసం సొంత దేశంలో భార్యా పిల్లలను, తల్లిదండ్రులను వదిలి సంపాదించాలనే ఆశతో ఇక్కడకు రావడానికి సిద్ధపడతారు. అలా వచ్చిన వెంటనే వీరి నుండి పాస్‌పోర్ట్‌లను తీసేసుకుంటారు. పాస్‌పోర్ట్‌లు తీసుకోవడం చట్టవిరుద్ధమని, అయినా వ్యాపారులు అలా తీసుకుంటున్నారని ప్రభుత్వానికి తెలిసినా కూడా, వీరి మీద చట్టపరమయిన చర్యలు తీసుకోరు.
ఈ పేదలకు నిర్దిష్ట వేతనం ప్రతి నెలా ఇస్తామని, నివాసం ఇంకా భోజనం ఉచితం అని ముందు వాగ్దానం చేస్తారు. కానీ ప్రతీ నెలా వారి జీవనానికి సంబందించిన ఖర్చు వారి జీతం నుండే తగ్గిస్తారు. దీని వలన ఇలా వచ్చినవారి నెల జీతం చాలా తగ్గిపోతుంది. ఒకొక్కసారి నెలల తరబడి చెల్లింపులను నిలిపివేస్తారు.
కనీసం రోజుకు 14 గంటలు పని చేయిస్తారు. అయినా కనీసం అడగటానికి కూడా అధికారం ఉండదు. ఎప్పుడయినా అందరూ కలిసి సమ్మె చేయాలని ప్రయత్నిస్తే వారిని జైలులో పెడతారు. ఎందుకంటే, ఇక్కడ నిరసన చేయడం చట్టవిరుద్ధం. ఇక్కడి వ్యాపారులు ఇచ్చే వసతి, భోజనం నచ్చకపోయినా బయట ఉండటానికి, తినటానికి డబ్బులు సరిపోవు. ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే.