మహాభారత ఇతిహాసంలో మనకి తెలిసిన పాత్రలన్నీ చాలా వరకు యోధుల గురించి, కురుక్షేత్ర సంగ్రామంలో వారి ప్రాముఖ్యత గురించి, ఇంకా యుద్ధ సమయంలో వారు ఎవరెవరిని ఓడించారు, ఎవరు ఎలా మరణించారు అనే విషయాల గురించి మాత్రమే. అయితే, కొందరు ఈ కురుక్షేత్రంలో పాల్గొనకపోయినప్పటికీ ఈ ఇతిహాసంలో వారికి ఎంతో ప్రముఖమయిన స్థానం ఉంది. అలాంటి వారిలో సంజయుడు ముఖ్యుడు. ఇతను ఎన్నో ధర్మాలు తెలిసిన రాజనీతి పరుడు. ఇప్పుడు మనం ఈ సంజయుడి గురించి, మహాభారతంలో ఇతని ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాము.
సంజయుడు ఎవరు?
సంజయ అంటే సంస్కృత భాషలో విజయం అని అర్ధం. సంజయుడు సూత కుమారుడు. ఇతని తండ్రి అయిన గవల్గణ ఒక రథసారధి. సంజయుడు వ్యాస మహాముని దగ్గర విద్యాభ్యాసం చేసాడు. కొన్ని కథలలో సంజయుడు, ఇంకా దృతరాష్ట్రుడు ఇద్దరూ వ్యాస మహాముని దగ్గర కలిసి శిష్యరికం చేసారని చెబుతారు. పెద్దయిన తరువాత సంజయుడు కురు సామ్రాజ్యానికి రాజయిన, అంధుడైన ధృతరాష్ట్రుడికి రథసారథిగా ఇంకా సలహాదారుడిగా కూడా ఉన్నాడు. సంజయుడి జననం గురించి, వ్యాస మహాముని దగ్గర అతని విద్యాభ్యాసం గురించి, ఇంకా ధృతరాష్ట్రుడికి అతను రథసారథిగా, నమ్మకమయిన సలహాదారుడిగా ఉన్న విషయాల గురించి మహాభారత ఇతిహాసంలోని ఆది పర్వంలో వివరించారు.
కురుసభలో సంజయుడి ప్రాముఖ్యత
దృతరాష్ట్రుడు రాజ్యపాలన చెయ్యటంలో సంజయుడి పాత్ర చాలా ముఖ్యమయినది. ఎల్లప్పుడూ దృతరాష్ట్రుడితో ఉంటూ, అతనికి అంధత్వం ఉన్నదనే లోపం తెలియకుండా ధృతరాష్ట్రుడికి రెండు కళ్ళ లాగా నడుచుకున్నాడు. ఎంతో నమ్మకంగా దృతరాష్ట్రుడిని అంటి పెట్టుకొని ఉండి, అతనికి నమ్మకమైన సలహాదారుడిగా కూడా గుర్తింపు పొందాడు. సభలోని అందరూ కురు పెద్దలలో ఒకరిగా సంజయుడిని కూడా గౌరవించేవారు.
సంజయుడికి వ్యాస మహాముని ఇచ్చిన గొప్ప వరం
అంధుడయిన ధృతరాష్ట్రుడికి సలహాదారుడిగా ఉండటం మినహా సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం కూడా చెయ్యలేదు. మరి మహాభారతంలో ఇతని ప్రాముఖ్యత ఏమిటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
రథసారథికి జన్మించినప్పటికీ సంజయుడు కృష్ణ ద్వైపాయన మహాముని దగ్గర శిష్యరికం చేసాడు. కృష్ణ ద్వైపాయన అంటే మరెవరో కాదు…మహాభారత ఇతిహాసాన్ని రచించిన, మనందరికీ తెలిసిన వేదవ్యాసుడు.
రాయబారం ముగిసి ఇంక యుద్ధం అనివార్యం అని తెలిసినప్పుడు దృతరాష్ట్రుడు ఎంతగానో కుమిలిపోతాడు. దృతరాష్ట్రుడి ఈ పరిస్థితి దివ్య దృష్టితో తెలుసుకున్న వ్యాస మహాముని వెంటనే అక్కడకు వచ్చి యుద్దానికి సంబంధించిన అన్ని సంఘటనలు కనిపించే విధంగా ధృతరాష్ట్రుడికి చూపు ప్రసాదిస్తానని చెప్తాడు.
అయితే దృతరాష్ట్రుడు వ్యాసుడి ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. తాను ఆ భయంకరమయిన, భీతి గొలిపే హింసను, యుద్ధంలో జరిగే హత్యలు చూడలేనని, యుద్ధనికి సంబంధించిన వార్తలను వినగలిగితే చాలని వ్యాస మహామునిని వేడుకుంటాడు. అప్పుడు వ్యాస మహాముని దృతరాష్ట్రుడి పరిస్థితిని అర్ధం చేసుకొని సంజయుడికి యుద్ధభూమిలో అక్కడ జరుగుతున్న సంఘటనలు అన్నీ చూసేలాగా శక్తి ప్రసాదించి, సంజయుడి ద్వారా అన్నీ తెలుసుకోమని ధృతరాష్ట్రుడికి చెప్తాడు.
దీని వలన సంజయుడు తనకు ఎదురుగా ఎంతో దూరంలో ఉన్న సంఘటనలను కూడా అక్కడే ఉన్నట్లుగా చూడగలడు. కేవలం చూడటమే కాకుండా అక్కడ జరుగుతున్న సంభాషణలు, ఇంకా ఇతర శబ్దాలు కూడా స్పష్టంగా వినగలిగే శక్తి సంపాదిస్తాడు. దీని గురించి మహాభారతంలోని భీష్మ పర్వంలో వివరంగా చెప్పారు.
చాలా మంది ఋషులకు, దేవతలకు సూక్షదృష్టి ఉంటుంది. ఈ శక్తి వలన, వీళ్ళు తమ జ్ఞానంతో భూత, భవిష్యత్ కాలాలలో జరిగిన విషయాలను తెలుసుకునేవారు. అయితే సంజయుడికి ఉన్నది దివ్యదృష్టి. దీని వలన జరుగుతున్న సంఘటనలను ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ సంఘటన జరుగుతున్న ప్రదేశంలోనే ఉన్నట్లుగా అన్నీ వివరంగా తెలుస్తాయి. ఒక సాధారణ వ్యక్తి విని భయపడేటటువంటి శబ్దాలను కూడా సంజయుడు చాలా స్పష్టంగా వినగలడు.
ఇది కూడా చదవండి: Shalya in Mahabharata: Uncovering His Role and Significance
సంజయుడి కళ్ళతో కురుక్షేత్ర సంగ్రామాన్ని చూసిన దృతరాష్ట్రుడు
వ్యాస మహాముని ఇచ్చిన శక్తితో అంధుడయిన ధృతరాష్ట్రుడికి సంజయుడే యుద్ధ సమయంలో రెండు కళ్ళు అయ్యాడు. హస్తినాపురంలో రాజమందిరంలో దృతరాష్ట్రుడి పక్కనే కూర్చొని ఉంటూ, ధృతరాష్ట్రుడికి అన్ని విషయాలూ పక్షపాతం లేకుండా జరిగింది జరిగినట్లుగా వివరించి చెప్పేవాడు.
అయితే మరి కొన్ని గ్రంథాలలో, సంజయుడు దృతరాష్ట్రుడి పక్కన కూర్చొని యుద్ధభూమిలో జరిగే సంఘటనలు చూడలేదు అని చెప్పారు. అతనికి యుద్ధభూమిలో ఉన్నా కూడా ఎవరి కంటికీ కనపడకుండా, ఇంకా ఎటువంటి గాయాలు అవ్వకుండా వ్యాస మహాముని శక్తి ప్రసాదించాడని… ఆ శక్తి వల్లనే సంజయుడు ప్రతి పది రోజులకు ఒకసారి దృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి యుద్ధభూమిలో జరిగిన విషయాలు వివరించాడని అంటారు.
కానీ, కురుక్షేత్ర యుద్ధం మొత్తం జరిగినది 18 రోజులు మాత్రమే కదా! ఈ ప్రకారంగా చూసుకుంటే, సంజయుడు కేవలం ఒక్కసారి మాత్రమే యుద్ధం మధ్యలో దృతరాష్ట్రుడిని కలవడానికి హస్తినాపురానికి వచ్చాడని అనుకోవాలి. అయితే ఈ తార్కికం అంత సమంజసంగా అనిపించటం లేదు.
యుద్ధానికి సంబంధించిన వివరాలు చెప్పటానికి ముందు, దృతరాష్ట్రుడు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు. సంజయుడు భరత వర్షం గురించి అంధుడయిన ధృతరాష్ట్రుడికి ఎంతో వివరంగా చెప్తాడు. భూమి గురించి, ఇతర గ్రహాల గురించి, భరత ఖండంలో ఉన్న వందల రాజ్యాలు వాటిలోని రకరకాల తెగల గురించి, పట్టణాల గురించి, గ్రామాల గురించి, ఇంకా నదులు, పర్వతాలు, అడవులు గురించి కూడా వివరంగా విపులంగా చెప్తాడు.