రాయబారాలు, రాజకీయ ఎత్తుగడలు, వెన్నుపోట్లు మహాభారతంలో కొత్తేమీ కాదు. అలాంటి మహాభారతంలో కొంతమంది కోవర్టులు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణగా మనం శల్యుడి గురించి చెప్పుకోవచ్చు. నిజానికి శల్యుడు పాండవుల పక్షపాతే అయినా… కౌరవుల పక్షపాతిగా ఉంటూ వారి పతనానికి కారణమవుతాడు. అందుకే నమ్మి దొంగదెబ్బ తీసినవాడిని ‘శల్య సారధ్యం’ అంటుంటాం. ఇంతకీ అసలు ఈ శల్యుడు ఎవరు? పాండవులకి ఏమవుతాడు? వారి పక్షాన ఉంటూనే కౌరవుల్ని ఎందుకు దెబ్బ తీయాలని అనుకొంటాడు? కర్ణుడి మరణానికి శల్యుడు కారణం ఎలా అయ్యాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇప్పుడీ ఆర్టికల్ లో డీటైల్డ్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా అసలు ఈ శల్యుడు ఎవరో తెలుసుకుందాము.
శల్యుడు ఎవరు?
మనకు తెలుసు కదా పాండవులకు తల్లి అయిన కుంతీదేవికి పాండురాజు భర్త. ఇతనికి కుంతీదేవి కాకుండా ఇంకొక భార్య కూడా ఉంది. ఆమె పేరు మాద్రి. ఈమె పాండవులలో చివరి వారయిన నకుల సహదేవులకు తల్లి. ఈ మాద్రి సోదరుడే శల్యుడు. ఇతను మద్ర రాజ్యానికి అధిపతి.
శల్యుడికి కురు వంశానికి మద్య సంబంధం ఏంటి?
ఒకసారి పాండురాజు హస్తినాపురానికి వెళుతుండగా దారిలో శల్యుడి సైన్యానికి ఎదురుపడతారు. అప్పుడు శల్యుడు, అతని సేనాధిపతి ఇద్దరూ పాండురాజుని కలుస్తారు. వారు చేసిన మర్యాదలకు ముగ్ధుడయిన పాండురాజు శల్యుడికి మంచి స్నేహితుడు కూడా అవుతాడు. పాండురాజు ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు వెంటనే శల్యుడి గురించి వేగుల ద్వారా పూర్తి వివరాలు తెప్పించుకుంటాడు.
అందులో భాగంగానే మద్ర రాజ్యానికి అధిపతి అయిన శల్యుడికి మాద్రి అనే ఒక అందమయిన సోదరి కూడా ఉన్నదని తెలుసుకుంటాడు. ఆమెతో పాండురాజుకి రెండవ వివాహం చెయ్యాలని తలచి శల్యుడికి కబురు పంపుతాడు. ముందు సందేహించినా చివరికి స్నేహితుడితో వియ్యం అందుకోవటం మంచిదే అని గ్రహించి మాద్రిని పాండురాజుకి ఇచ్చి వివాహం చెయ్యటానికి అంగీకరిస్తాడు.
ఈ సందర్భంలో శల్యుడు భీష్ముడితో తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం గురించి వివరిస్తాడు. తమ ఆచారం ప్రకారం, వరుడి వైపు నుండి వధువు రక్తసంబంధీకులకు కట్నం ఇవ్వాలని, ఇది మంచి అయినా చెడు అయినా తాను ఈ పూర్వీకుల నుండీ వచ్చిన ఈ ఆచారాన్ని అతిక్రమించలేనని భీష్ముడికి చెప్తాడు. అయితే భీష్ముడు దీనికి అంగీకరిస్తాడు. వివాహం జరిగే సమయంలో భీష్ముడు కురు వంశం తరఫున శల్యుడికి ఎన్నో ఆభరణాలను, ఇంకా చాలా బంగారాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ విధంగా మద్ర రాజ్యానికి కురు వంశంతో వియ్యం ఏర్పడుతుంది.
శల్యుని వారసులు ఎవరు?
ఒకసారి, పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు జింకల రూపంలో ఉన్న కిదమ ఋషిని, అతని భార్యను తెలియక బాణం వేసి చంపుతాడు. చనిపోయే ముందు ఆ ఋషి పాండురాజుని ఎప్పుడయితే అతను భార్యల దగ్గరకు కోరికతో వెళతాడో అప్పుడు చనిపోతాడని శపిస్తాడు. ఆ శాప భయంతో, పాండురాజు రాజ్యాన్ని తన సోదరుడయిన ధృతరాష్ట్రుడికి ఇచ్చి తన భార్యలయిన కుంతి, మాద్రితో వనవాసానికి వెళ్ళిపోతాడు.
అక్కడ దుర్వాసముని కుంతీదేవికి ఒక గొప్ప వరం ఇస్తాడు. అది ఏంటంటే, కుంతీదేవి ఎవరయినా దేవుడిని స్మరిస్తే, వెంటనే ఆ దేవుడు ఒక బిడ్డను ఇస్తాడని వరం. ఆ వరం వలన కుంతీదేవికి యమధర్మరాజు వలన ధర్మరాజు, వాయుదేవుడి వలన భీముడు, ఇంద్రుడి వలన అర్జునుడు కలుగుతారు. ఇది చూసిన మాద్రి తనకు పిల్లలు లేరని బాధపడుతుంది. అప్పుడు, కుంతీదేవి తనకు తెలిసిన ఆ వరాన్ని మాద్రికి కూడా చెప్తుంది. అప్పుడు, మాద్రి అశ్విని దేవతలను స్మరించి ఇద్దరు కుమారులను పొందుతుంది. వారే నకులుడు, సహదేవుడు. అశ్విని దేవతలలో నాసత్యుడు వలన నకులుడు, ఇంకా దనుడు వలన సహదేవుడు పుట్టారు.
ఇలా కొంత కాలం గడిచిన తరువాత, ఒక రోజు కోరికతో మాద్రి దగ్గరకు వచ్చిన పాండురాజు ముని శాపం వలన మరణిస్తాడు. తను ఆపలేకపోవటం వల్లనే ఈ ఘోరం జరిగిందని భావించిన మాద్రి తన పిల్లలను కూడా కుంతీదేవికి అప్పగించి తన భర్త శవంతో పాటుగా ఆత్మాహుతి చేసుకుంటుంది.
శల్యుడికి కూడా ముగ్గురు సంతానం కలుగుతారు. వారి పేర్లు రుక్మాంగద, రుక్మరథ మరియు మద్రాంజయ. తన సోదరిని కోల్పోయిన కొన్ని సంవత్సరాలకు శల్యుడు నకులుడిని సహదేవుడిని తన మద్ర రాజ్యానికి ఆహ్వానిస్తాడు.
నకులుడిని సహదేవుడిని తన దగ్గరే ఉంచుకొని వారిని తన వారసులుగా చేయాలని అనుకుంటాడు. వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన సందర్భంగా తన మనసులోని కోరికను నకుల సహదేవులతో చెప్తాడు. హస్తినాపురంలో ఉండి ధర్మరాజు చక్రవర్తి అవుతాడని, మీరు ఇద్దరూ పాండవులలో నాలుగవ, అయిదవ స్థానాలలో ఉండిపోతారని, అలా కాకుండా ఇక్కడే ఉంటే మద్ర రాజ్యానికి అధిపతులుగా ఉండవచ్చని చెప్తాడు.
శల్యుడు ప్రతిపాదించిన ఈ ఆలోచనను నకులుడు మొదట సందేహిస్తాడు. తన సంతానాన్ని వదులుకొని చెల్లెలి కుమారులకు రాజ్యం ఇవ్వాలని అనుకోవటంలో ఏదో దురాలోచన ఉన్నదని, తాము దేవతల వలన పుట్టిన సంతానం అవ్వటం వల్లనే శల్యుడు ఈ ఆలోచన చేశాడని భావిస్తాడు. వెంటనే శల్యుడి ఆలోచనను నకుల సహదేవులు తిరస్కరిస్తారు.
పాండవులతో ఉండటం వలన తమకు రాజ్యాధికారం రాదని తెలుసునని, అయినా కూడా తమ సోదరులు ఇంకా కుంతీదేవి తమను ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూస్తున్నారని, అవకాశం కోసం పావులుగా తమను వాడుకోరని, తమను సేవకులుగా ఎప్పటికీ చూడరని శల్యుడికి వివరించి చెప్తాడు. ఇలా కొంతసేపు శల్యుడితో మాట్లాడిన తరువాత శల్యుడి మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేదని నకుల సహదేవులు గ్రహిస్తారు. చివరికి, అతని మంచి ఉద్దేశ్యం గ్రహించి తమను ఎప్పటికీ మిగతా సోదరుల నుండి వేరు చేయకుండా ఎప్పుడూ వాళ్ళతోనే ఉండనిస్తే శల్యుడి సింహాసనానికి వారసులుగా ఉండటానికి తమకు సమ్మతమే అని చెప్తారు.
ఇది కూడా చదవండి: What Are the Timeless Lessons from Vidura’s Teachings?
శల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు ఎందుకు వెళ్ళాడు?
పాండవులకు కౌరవులకు సంధి కుదరక ఇక కురుక్షేత్ర యుద్ధం అనివార్యం అని తెలిసిన శల్యుడు తన రాజ్య సైన్యాన్ని మొత్తం తీసుకొని పాండవులతో కలిసి యుద్ధం చెయ్యటానికి బయలుదేరతాడు.
అయితే శల్యుడు అస్త్ర విద్యలోనూ, గదాయుద్ధంలోనూ ప్రతి భావంతుడు. రథాన్ని తోలడంలో ప్రత్యేకించి ఇతను శ్రీకృష్ణ భగవానుడతటి వాడు. శల్యుని ప్రతిభ అంతాఇంతా కాదు. అలాంటి శల్యుడు కనుక పాండవుల పక్షాన నిలిస్తే ఇక తమ పని అంతే అని గ్రహిస్తాడు దుర్యోధనుడు. అందుకని ఎలాగైనా శల్యుని తమ గూటికి చేర్చుకునేందుకు వ్యూహాలు, పన్నాగాలు పన్నుతాడు.
ఎలాగయినా శల్యుడిని తన వైపు రప్పించుకోవాలనే దురాలోచనతో ఉన్న దుర్యోధనుడు మార్గమద్యంలో శల్యుడికీ, అతని సైన్యానికి భారీ విందు ఏర్పాటు చేస్తాడు. గంటల తరబడి శల్యుడిని విందు విలాసాలలో మునిగిపోయేలాగా చేసి వినోదం పంచుతాడు. ఈ ఆతిథ్యంతో ముగ్ధుడయిన శల్యుడు ఈ ఆతిథ్యం అంతా ధర్మరాజు ఏర్పాటు చేశాడని భావించి ఈ ఆతిథ్యం ఇచ్చిన వారి కోరిక తప్పక నెరవేరుస్తానని వాగ్దానం చేస్తాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన దుర్యోధనుడు ఈ ఆతిథ్యం తానే ఏర్పాటు చేశానని చెప్పి తన కోరిక నెరవేర్చమని కోరతాడు. ఇచ్చినమాట వెనక్కి తీసుకోలేక… చేసేదేమీ లేక… యుద్ధ సమయంలో తాను కౌరవుల పక్షానే ఉండి యుద్ధం చేస్తానని మాట ఇస్తాడు. ఆతిథ్యం స్వీకరించిన కారణంగా దుర్యోధనుడి కోరిక కాదనలేకపోతాడు. తప్పనిసరి పరిస్థితులలో కౌరవులకు సహాయం చేస్తానని మాట ఇస్తాడు. అయితే తరువాత పాండవులను కలిసి జరిగినది అంతా చెప్పి తన వల్ల జరిగిన తప్పుకు క్షమాపణలు కోరతాడు.
అయితే మేనమామ శల్యుడు చేసిన ఈ పనికి నకులుడు సహదేవుడు చాలా ఆగ్రహిస్తారు. దీని వలన తాము మిగిలిన పాండవులకు నిజమైన సోదరులు కామని, సవతి సోదరులు అవ్వటం వల్లనే ఇలా జరిగిందనే అభిప్రాయం ప్రపంచానికి శల్యుడు కలిగించాడని అతనిని నిందిస్తారు.
వెంటనే ధర్మరాజు కలుగజేసుకొని సోదరులను మందలిస్తాడు. మళ్ళీ ఎప్పుడూ తమను సవతి సోదరులుగా పరిగణించవద్దని, తమ స్థాయిని ఎప్పటికీ తగ్గించుకోవద్దని సూచిస్తాడు. అక్కడే ఉన్న శల్యుడు కూడా మిగతా పాండవులకు నకుల సహదేవులు మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో స్వయంగా చూసి తెలుసుకుంటాడు. అయితే శల్యుడు చేసిన ఈ తప్పుకు అతనిని యుద్ధంలో తానే అంతమొందిస్తానని చెప్తాడు.
కురుక్షేత్రంలో శల్యుడి పాత్ర
ఇక కురుక్షేత్ర యుద్ధం మొదలవటానికి ముందు ధర్మరాజు సోదరులందరితో కలిసి కురువృద్దులను, మిగతా పెద్దలను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ సమయంలో శల్యుడు కొంచెం కూడా సంకోచించకుండా పాండవులకు తప్పక విజయం చేకూరాలని ధర్మరాజుని ఆశీర్వదిస్తాడు.
కురుక్షేత్ర యుద్ధం జరిగిన మొదటి పదమూడు రోజులూ శల్యుడి పరాక్రమం గురించి మనకు ఇతిహాసాలలో ఎక్కువ వివరాలు కనిపించవు. అయితే శల్యుడు పాండవుల వైపు ఉన్న ఎందరో యోధులను ఎదుర్కొని ఓడించాడు. యుద్ధం జరిగిన మొదటి రోజు అతను ధర్మరాజుతో భీకరంగా యుద్ధం చేస్తాడు. ముందు ధర్మరాజు మీద పైచేయి సాధించి అతని విల్లు విరిచేస్తాడు. ధర్మరాజు కూడా శల్యుడిని దీటుగా ఎదుర్కొని అతనిని గాయపరుస్తాడు. ఇంకా ఉత్తర కుమారుడిని కూడా ద్వంద్వ పోరాటం చేసి చంపేస్తాడు. అయితే ఇందుకు ప్రతీకారంగా, శల్యుడి కుమారుడయిన మద్రాంజయుడిని విరాట రాజు చంపేస్తాడు.
ఇక కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజున, అభిమన్యుడి చేతిలో శల్యుడి మిగతా కుమారులయిన రుక్మాంగద, రుక్మరథ మరణిస్తారు. శల్యుడు కూడా అభిమన్యుడి పరాక్రమం ముందు ఏమి చెయ్యలేక పారిపోతాడు. ఇక అభిమన్యుడి మరణం తరువాత, కురుక్షేత్ర యుద్ధం పద్నాలుగవ రోజున జయద్రథుడిని చంపటానికి వెళ్తున్న అర్జునుడిని శల్యుడు అడ్డగిస్తాడు. అయితే అర్జునుడి పరాక్రమం ముందు శల్యుడు నిలువలేక పోతాడు. అర్జునుడి బాణాల ధాటికి కనీసం కూర్చోలేని విధంగా తీవ్రంగా గాయపడతాడు. ఆ రోజు జరిగిన రాత్రి యుద్ధంలో విరాట రాజుని ఓడించి పారిపోయేలాగా చేస్తాడు.
పదహారవ రోజున కర్ణుడు యుద్ధంలో నకులుడిని సహదేవుడిని ఓడిస్తాడు. అయితే, అర్జునుడిని తప్ప మిగతా పాండవులను చంపనని కుంతీదేవికి మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళను చంపకుండా వదిలిపెడతాడు. అక్కడి నుండి వెళ్లి అర్జునుడిని ఎదుర్కొంటాడు. అర్జునుడిని ఓడించటానికి కర్ణుడు అశ్వసేన అనే నాగాస్త్రాన్ని అర్జునుడి మీదకు ప్రయోగించడానికి సిద్ధపడతాడు.
శల్యుడు వెంటనే అక్కడకు వచ్చి ఆ బాణాన్ని అర్జునుడి ఛాతి మీదకు గురిపెట్టి వదలమని సలహా ఇస్తాడు. అయితే శల్యుడు పాండవ పక్షపాతి అనే అభిప్రాయం ఉన్న కర్ణుడు శల్యుడి మాట వినకుండా ఆ బాణాన్ని అర్జునుడి తల మీదకు గురిపెట్టి వదులుతాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన పాదంతో రథాన్ని గట్టిగా తొక్కి భూమిలోకి కొంచెం కుంగేలాగా చేస్తాడు. దీని వలన కర్ణుడు వదిలిన బాణం గురి తప్పుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడిని రక్షిస్తాడు.
కర్ణుడి మరణానికి కారణమయిన శల్యుడు
యుద్ధంలో కర్ణుడు పాండవులను చంపేస్తాడేమో అనే ఆందోళన ధర్మరాజుకు కలిగి శల్యుడి సహాయం కోరతాడు. కర్ణుడికి రథసారథిగా ఉన్న సమయంలో పాండవులను, ముఖ్యంగా అర్జునుడిని పొగుడుతూ, కర్ణుడిని తక్కువ చేసి హేళనగా మాట్లాడి అతని ఏకాగ్రత సడలే విధంగా ప్రవర్తించమని ధర్మరాజు శల్యుడిని కోరతాడు.
ధర్మరాజుకి ఇచ్చిన మాట ప్రకారం, కర్ణుడితో ఉన్నంతసేపూ అతనిని కించపరిచేలాగా మాట్లాడుతూ, అతనిని నిరుత్సాహపరుస్తాడు. అర్జునుడిని హంసతో పోల్చి, కర్ణుడిని కాకితో పోల్చి అవమానపరుస్తాడు. కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజున శల్యుడి అవహేళన మాటల వలన కర్ణుడు యుద్ధం ఏకాగ్రతతో చేయలేకపోతాడు. అతని ఏకాగ్రత పూర్తిగా సడలుతుంది.
ఇక భూదేవి శాపం వలన రథచక్రం భూమిలో కుంగినప్పుడు కూడా శల్యుడు కర్ణుడికి సహాయం చెయ్యడు. తాను క్షత్రియుడినని ఒక రథసారథి కుమారుడు యుద్ధం చేస్తుంటే రథం నడపటమే తనకు అవమానము హేళనగా మాట్లాడతాడు. తనకు రథ చక్రాలను సరి చేసే అలవాటు లేదని కర్ణుడే ఆ పని చేసుకోవాలని అంటాడు.
ఒకపక్క శల్యుడి మాటలు, ఇంకోపక్క శాపాలు అన్నీ కలిసి కర్ణుడి చావుకి కారణాలు అవుతాయి. ఇలా కర్ణుడి మరణానికి ఉన్న అనేక కారణాలలో శల్యుడు ఒకడు. అదెలాగంటే, శల్యుడు నిరాకరించటంతో ఇక వేరే దారి లేక భూమిలో కుంగిపోయిన రథచక్రాన్ని తీసే పనిలో ఉండగా, కృష్ణుడి ఆదేశానుసారం అర్జునుడు బాణం వేసి కర్ణుడిని చంపేస్తాడు. ఈ విధంగా శల్యుడు కూడా కర్ణుడి మరణానికి కారణం అవుతాడు. అయితే కర్ణుడికి రథసారధిగా ఉన్న శల్యుడు కర్ణుడి యుద్ధ నైపుణ్యాన్ని, అతని పరాక్రమాన్ని, నీతిని దగ్గరగా చూసి తనకు తెలియకుండానే అతని పట్ల గౌరవం పెంచుకుంటాడు.
ఇది కూడా చదవండి: The Tragic Story of Abhimanyu: How He Got Caught in Padmavyuham
కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడి మరణం
నీతిమంతుడయిన కర్ణుడు ఈ విధంగా అన్యాయంగా అర్జునుడి చేతిలో చంపబడ్డాడని శల్యుడు తీవ్రంగా బాధపడతాడు. ఇంకా చాలా పశ్చాత్తాప్పం పడతాడు కూడా. తన వల్ల జరిగిన తప్పుకు పరిహారంగా కర్ణుడి కోసం అతని పేరు మీద పోరాడతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక కర్ణుడి మరణానంతరం పద్దెనిమిదవ రోజున దుర్యోధనుడు శల్యుడిని కౌరవ సేనలను నడిపించటానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా నియమిస్తాడు.
సైన్యాధ్యక్షుడిగా నియమించబడ్డ శల్యుడు కౌరవుల గెలుపు లక్ష్యం కోసం తీవ్రంగా పోరాడతాడు. అయితే పాండవ జ్యేష్ఠుడు అయిన ధర్మరాజు ఒక వీరుడిని చంపాలని అందుకు శల్యుడిని ఎంచుకోవాలని ధర్మరాజుకి సూచిస్తాడు శ్రీకృష్ణుడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ధర్మరాజు శల్యుడిని యుద్ధనికి రమ్మని సవాలు చేస్తాడు. ఇద్దరూ భీకరంగా యుద్ధం చేస్తుండగా ధర్మరాజు ఈటెతో శల్యుడిని చంపేస్తాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడి పాత్ర ముగుస్తుంది.
శల్యుడికి ఇచ్చిన మాట ప్రకారం, నకులుడు ఇంకా సహదేవుడు యుద్దానంతరం మద్ర రాజ్య సింహాసనాన్ని అధిష్టించారు.
ఇలా వీరుడయిన కర్ణుడి మరణానికి శల్యుడు ఏ విధంగా కారణం అయ్యాడో… శల్యుడు కర్ణుడికి సహకరించి ఉంటే కురుక్షేత్ర యుద్ధం వేరే విధంగా ముగిసేదేమో కదా…
చివరిమాట
శల్యుడు చేసిన ఈ పని వల్ల మహాభారతం మనందరికీ ఒక గొప్ప నీతిని చెప్తుంది. దీని గురించి చెప్తూ మన పెద్దలు ‘శల్య సారథ్యం’ అని అనటం మనం వినే ఉంటాము. ఏదన్నా పని చేసేటప్పుడు మన పక్కన ఉన్నవాళ్ళు మనతో కలిసి పని చేసేవాళ్ళు శల్యుడి లాగా మనల్ని నిరుత్సాహపరచకుండా, మన ఓటమి కోరుకోకుండా ఉండాలని అంటారు. అటువంటి వాళ్ళని దూరంగా పెట్టాలని, వాళ్ళ వల్ల మంచి కన్నా కీడు జరుగుతుందని ఈ కథ సారాంశం.