Pradyumna son of Sri Krishna, Hindu mythology

How was Pradyumna Born and What is his Story?

మహాభారతంలో ఎన్నో ముఖ్యమైన పాత్రల గురించి ఇప్పటివరకూ మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే,  అసలు మహాభారతం పేరు చెప్పగానే పిల్లలకీ పెద్దలకీ అందరికి వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీకృష్ణుడు. శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అయిన ఈ శ్రీకృష్ణుడిని ‘పాండవుల పక్షపాతి’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఈ శ్రీకృష్ణుడి వల్లనే పాండవులు అన్ని సమస్యలను దాటుకొని, మంచి మార్గంలో నడిచారు. అలానే, ఆయన ఆజ్ఞానుసారం నడుచుకొని, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచి, మాయా జూదంలో పోగొట్టుకున్న రాజ్యం తిరిగి సంపాదించుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడే ఎప్పుడు ఏది ఎలా జరగాలో నిర్ణయించి నడిపించాడు. అలాంటి శ్రీకృష్ణుడి ఫ్యామిలీ గురించి తెలుసుకోవటం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

శ్రీకృష్ణుడికి అష్ట భార్యలు ఉన్నారని మనందరికీ తెలుసు. వీళ్ళే కాకుండా ఇతనికి ఇంకా 16 వేలమంది గోపికలు కూడా ఉన్నారని, వారంతా ఇతనిని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటారని చెబుతారు. ఇదంతా పక్కన పెడితే, ఈ ఆర్టికల్ లో మనం శ్రీకృష్ణుడి కుమారుడు అయిన ప్రద్యుమ్నుడి గురించి వివరంగా తెలుసుకుందాము.

ప్రద్యుమ్నుడి జననం

శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో రుక్మిణి, సత్యభామ ముఖ్యమైనవారు. వీరిలో రుక్మిణీ కళ్యాణం గురించి మనందరికీ తెలిసిందే! చిన్నతనం నుండీ శ్రీకృష్ణుడే తన భర్త కావాలని కోరుకుంటూ… నిరంతరం కృష్ణుని ద్యానంలోనే గడిపేది రుక్మిణి. ఇక తనకి ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని… తనని ఎలాగైనా ఇక్కడినుండీ తప్పించమని కృష్ణుడ్ని వేడుకొంటుంది. రుక్మిణి కోరిక మేరకు ఆమెను స్వయంవరం సమయంలో విదర్భ రాజ్యం నుండి తీసుకొని వెళ్ళి వివాహమాడతాడు శ్రీకృష్ణుడు. 

రుక్మిణి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారం. కాబట్టి ఆమె ఎప్పుడూ నారాయణుడి మనసులోనే కొలువుంటుంది. అందుకే రుక్మిణి అంటే శ్రీకృష్ణునికి విపరీతమైన ప్రేమ, అభిమానం. ఇక వీరిద్దరికీ జన్మించిన కుమారుడే ఈ ప్రద్యుమ్నుడు.

విష్ణువు యొక్క వ్యూహ అవతారమే ప్రద్యుమ్నుడు

ప్రద్యుమ్న అంటే ‘అత్యుత్తమమైన శక్తిమంతుడు’ అని కూడా అర్ధం. శ్రీకృష్ణుడు ఇంకా అతని ప్రధాన భార్య అయిన రుక్మిణి యొక్క పెద్ద కుమారుడే ఈ ప్రద్యుమ్నుడు. ఇతనిని మహావిష్ణువు యొక్క నాలుగు వ్యూహ అవతారాలలో ఒకరిగా కూడా పరిగణిస్తారు. విష్ణుమూర్తి యొక్క 24 కేశవ నామాలలో ప్రద్యుమ్న కూడా ఒకటి అని చెబుతారు. భాగవతంలో ఇతనిని ఆదినారాయణుని 61వ మనవడు అని కూడా అంటారు.

శ్రీమహావిష్ణువు యొక్క చతుర్వ్యూహ అవతారాలలో ప్రతి వ్యుహ అవతారం కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది, మరియు కొన్ని విధులను నిర్వహిస్తుంది. 

ఈ 4 వ్యూహ అవతారాలలో మొదటిది వాసుదేవ – అంటే సృష్టికర్త. వాసుదేవుడు జీవాత్మలకు దైవిక ఆనందాన్ని అనుభవించడానికి, మరియు భగవంతుడిని సేవించే అవకాశాన్ని ఇవ్వడానికి ఉన్నాడు. ఇతను నేరుగా సమష్టి, సృష్టి, స్థితి మరియు లయ కారకాలకు బాధ్యత వహిస్తాడు. ఈ విశ్వంలో అందరికి ఇతడే సర్వోన్నత నియంత్రకుడు.

రెండవది సంకర్షణ – అంటే పోషకుడు. ఇతను జ్ఞానం, మరియు బలం కలిగి ఉంటాడు. ఈ విశ్వాన్ని రద్దు చేయటం, మరియు శాస్త్రాలను ప్రచారం చేయటం ఇతని యొక్క పని. 

మూడవది ప్రద్యుమ్న – అంటే నాశనము చేసేవాడు. ఇతను ఐశ్వర్యం, మరియు శౌర్యం కలిగి ఉంటాడు. ప్రద్యుమ్నుడికి విశ్వం యొక్క సృష్టి, మరియు ధర్మ నిర్వహణ బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇతను అవసరమైనప్పుడు బ్రహ్మ శరీరంలోకి ప్రవేశించి, అతని ద్వారా సృష్టి ప్రక్రియను నియంత్రిస్తాడు. మరోసారి రుద్రునిలోకి ప్రవేశించి, తద్వారా జీవులను అంతమొందించే ప్రక్రియను నియంత్రిస్తాడు.

నాల్గవది అనిరుద్ధ – అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రోత్సహించేవాడు. అందుకే ఇతను శక్తి, మరియు తేజస్సు  తో ప్రకాశిస్తాడు. అనిరుద్ధుడు విశ్వాన్ని రక్షిస్తాడు, మరియు అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం మనం చెప్పుకొంటున్న ప్రద్యుమ్నుడి స్టోరీ ఈ వ్యుహావతారాలలో ఒకటి కాబట్టి. ఈ వ్యుహావతారాలన్నీ సృష్టికి సంబంధించిన కార్యాలను నిర్వర్తించటంలో తోడ్పడతాయి. ఇందులో అతిముఖ్యమైన కార్యం ధర్మ నిర్వహణ చేయటం. ఈ బాధ్యతని నిర్వహించేవాడే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ప్రద్యుమ్నుడు. 

ప్రద్యుమ్నుడి గత జీవితం

దక్షప్రజాపతి కూతురైన సతీదేవి పరమశివుడిని ఇష్టపడి వివాహమాడుతుంది. ఒకరోజు తన తండ్రి చేస్తున్న మహాయజ్ఞానికి అనుమతి లేకుండా వెళ్లి అవమానించ బడుతుంది. ఆ అవమాన భారం తట్టుకోలేక వెంటనే ఆ హోమగుండంలో దూకి చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో ఆ దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేస్తాడు. కోపంతో, బాధతో చనిపోయిన తన భార్య నిర్జీవ దేహాన్ని తీసుకొని అక్కడినుండి వెళ్ళిపోతాడు. ఆలా వెళ్లిన శివుడు ఎన్నో సంవత్సరాలపాటు ధ్యానం చేసుకుంటూ ఉండిపోతాడు. 

అప్పటినుండీ పరమశివుడు ప్రాపంచిక విషయాలను మరచిపోయి… ఘోర తపస్సులో మునిగిపోవటంతో దైవిక విధులకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో దేవతలందరూ అతని తపస్సు భంగం చేయటం కోసం మన్మధుడిని శివునిపై ప్రేరేపిస్తారు. మన్మధుడు వేసిన ప్రేమ బాణాలకి ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు. అక్కడే ఓ మూల దాక్కున్న కామదేవుడిని చూసి కోపావేశంతో తన మూడవ కన్ను తెరిచి వెంటనే కాల్చి బూడిద చేశాడు.

ఊహించని ఈ పరిణామానికి మన్మధుడి భార్య అయిన రతీ దేవి పరమేశ్వరుడి పాదాల మీద పడి తప్పును క్షమించమని, తన భర్తని బతికించమని వేడుకుంటుంది. శాంతించిన పరమశివుడు భస్మం అయిపోయిన నీ భర్త మరుజన్మలో శ్రీకృష్ణుడి కుమారుడిగా జన్మిస్తాడని, నువ్వు మరో జన్మ ఎత్తి  అతనిని మళ్ళీ వివాహం చేసుకుంటావని ఆ విధంగా ఇద్దరూ మళ్లీ కలుస్తారని దీవిస్తాడు.

ఇలా మహాశివుడి ఉగ్ర ఆగ్రహ జ్వాలలో కాలి బూడిదయిపోయిన మన్మధుడి మరో జన్మే ఈ ప్రద్యుమ్నుడు. 

ప్రద్యుమ్నుడి ప్రారంభ జీవితం

ప్రద్యుమ్నుడు జన్మించిన 6వరోజునే తల్లిదండ్రులకు దూరమవుతాడు. కారణం ఇతను భూమిపై జన్మించే సమయంలో శంభరాసురుడు అనే ఒక రాక్షసుడు ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నాడు. శంభరాసురుడుకు ప్రద్యుమ్నుని చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేదన్న వరం ఒకటి ఉంది. దాంతో చిన్నప్పుడే ప్రద్యుమ్నుని వధించి తనకి శత్రుశేషం లేకుండా చూసుకోవాలనుకున్నాడు శంభరాసురుడు.

అందుకే రోజుల శిశువని కూడా చూడకుండా ఆ బాలుడ్ని ఎత్తుకుపోయి సముద్రంలో పడేస్తాడు.  అలా సముద్రంలో పడిపోయిన ప్రద్యుమ్నుడిని ఒక పెద్ద చేప మింగేస్తుంది. అదే చేప మత్స్యకారులు సముద్రంలో చేపలు పడుతుంటే వాళ్ళకి వలలో చిక్కుతుంది. ఆ మత్స్యకారులు వెంటనే ఆ చేపని తెచ్చి శంబరుడికి బహుమతిగా ఇస్తారు. 

రాజాస్థానంలోని వంటవాళ్ళు దానిని కోసిచూస్తే… ఓ అందమైన బాలుడు కనిపిస్తాడు. అదే ఆస్థానంలో ఉన్న ఒక యువతి ఆ బాలుని పెంచి పెద్ద చేస్తుంది. 

మన్మధుని భార్య రతీదేవి కూడా మరో జన్మలో  మాయావతిగా శంబరుని ఇంట పెరుగుతుంది. చేపనుండీ బయటపడిన ప్రద్యుమ్నుడిని ఈమే పెంచి పెద్ద చేస్తుంది. ఒకసారి నారద మహాముని ఈ మాయావతిని కలిసి ఆమెకి తన పూర్వ జన్మ వృత్తాంతం మొత్తం చెప్తాడు. అలాగే ప్రద్యుమ్నుడి కర్తవ్యం ఏమిటో కూడా తెలియచేస్తాడు. ఆ పిల్లవాడు పూర్వ జన్మలో తన భర్తేనన్న నిజం తెలుసుకున్న మాయావతి అప్పటి నుండి ప్రద్యుమ్నుడిపై ప్రేమ పెంచుకుంటుంది. అంతేకాదు, సర్వ శత్రు మాయావినాశినియైన మహామాయ యుద్ధ కళను ప్రద్యుమ్నుడికి నేర్పించి… గొప్ప యోధుడిగా తీర్చి దిద్దుతుంది.

ఇది కూడా చదవండి: Shalya in Mahabharata: Uncovering His Role and Significance

శంభరాసురున్ని చంపిన ప్రద్యుమ్నుడు

యుక్తవయసుకు వచ్చిన ప్రద్యుమ్నుడు ఒకనాడు శంభరాసురుని రాజ్యానికి వచ్చిన నారదుని ద్వారా తన అసలు తండ్రి ఎవరన్న విషయాన్ని తెలుసుకుంటాడు. తనని చంపతలపెట్టిన శంభరాసురుని మీద పగతీర్చుకునేందుకు బయల్దేరతాడు. శంబరుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. ఆగ్రహానికి గురైన శంబరుడు వెంటనే ప్రద్యుమ్నుడి మీదకి దూకుతాడు.  ఇద్దరి  మధ్య భీకర పోరు జరుగుతుంది. 

కొంతసేపటి తర్వాత ఇక ప్రద్యుమ్నుడితో డైరెక్ట్ గా తలపడటానికి తన శక్తి చాలదని గ్రహిస్తాడు. అప్పుడు వెంటనే శంబరుడు ఆకాశంలోకి ఎగిరి రకరకాల బాణాలు, మరియు ఆయుధాలతో ప్రద్యుమ్నుడి మీద దాడి చేస్తాడు. కానీ అవన్నీ అతి పరాక్రమవంతుడైన ప్రద్యుమ్నుడి ముందు పనిచేయవు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా  తాను నేర్చుకున్న మహామాయ కళను శంబరునిపై ప్రయోగిస్తాడు ప్రద్యుమ్నుడు. దీంతో ఒక్కొక్కటిగా శంబరుడి శక్తులన్నీ నాశనం అవుతాయి. 

చివరికి ప్రద్యుమ్నుడు తనవద్దనున్న అత్యంత శక్తివంత అస్త్రమైన వైష్ణవాస్త్రాన్ని శంబరుడి మీద ప్రయోగిస్తాడు. ఈ అస్త్రాన్ని శ్రీమహావిష్ణువు కాకుండా మరెవ్వరూ కూడా ఆపలేరు. ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేసే శక్తి దేవతలందరికి అధిపతి అయిన ఇంద్రుడికి కూడా లేదు. ప్రయోగించిన వెంటనే ఆ వైష్ణవాస్త్రం తన టార్గెట్ ని చేధించి… వెంటనే శత్రువుని అక్కడికక్కడే అంతమొందిస్తుంది. ఈ విధంగా ప్రద్యుమ్నుడు శంబరాసురుడిని అంతమొందిస్తాడు. 

ప్రద్యుమ్నుడు ద్వారకకు తిరిగి రావటం

మాయావతితో కలిసి ప్రద్యుమ్నుడు ఆకాశ మార్గం గుండా ప్రయాణం చేసి చివరకు ద్వారకకు చేరుకుంటారు. వీళ్లిద్దరూ కృష్ణుడి అంతఃపురం మీదగా వస్తుంటే… ద్వారక ప్రజలందరూ ప్రద్యుమ్నుడిని చూసి కృష్ణుడే అని పొరబడతారు. ఎందుకంటే, ప్రద్యుమ్నుడికి శ్రీకృష్ణుడి పోలికలు అంత దగ్గరగా ఉంటాయి. కానీ, పక్కనే ఉన్న మాయావతిని చూసి, ఆకాశంలో ఉన్నది శ్రీకృష్ణుడు కాదని గ్రహిస్తారు. 

అంతఃపురంలోకి వచ్చిన తరువాత, అచ్చం తన భర్త పోలికలతో ఉన్న ప్రద్యుమ్నుడిని చూసిన వెంటనే రుక్మిణికి పసిబిడ్డగా మాయమైపోయిన తన కుమారుడు గుర్తుకువస్తాడు. అప్పుడే శ్రీకృష్ణుడు కూడా తన తల్లిదండ్రులైన వసుదేవుడు ఇంకా దేవకితో కలిసి అక్కడికి వస్తాడు. ప్రద్యుమ్నుడు వెంటనే వారి పాదాలకు నమస్కరించి, అందరి ఆశీస్సులు తీసుకుంటాడు. 

కృష్ణుని ఆదేశానుసారం నారదుడు అక్కడికి వచ్చి, మొత్తం కథను అందరికీ వివరిస్తాడు. దీంతో పూర్వ జన్మలో భార్యాభర్తలైన రతీ మన్మథులే  ఈ జన్మలో మాయావతి, ప్రద్యుమ్నులని తెలిపి… ఈ జన్మలో కూడా భార్యాభర్తలుగా మళ్లీ ఒక్కటవ్వాలని అందరినీ ఒప్పిస్తాడు.

ఊహించని ఈ సంఘటనకి ద్వారకా వాసులు షాకవుతారు. అనంతరం పోగొట్టుకున్నామనుకున్న యువరాజు తిరిగి వచ్చినందుకు అంతా సంబరాలు చేసుకుంటారు. దీంతో ద్వారకా నగరమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.

ప్రద్యుమ్నుడి వివాహ జీవితం

శ్రీకృష్ణుడి ఆదేశానుసారం నారద ముని ద్వారా తమ గతజన్మ జీవితాన్ని తెలుసుకొని మాయావతిని వివాహమాడతాడు ప్రద్యుమ్నుడు. 

అలాగే, తన మేనమామ రుక్మి కూతురైన రుక్మావతిని కూడా స్వయంవరంలో పెళ్లి చేసుకొని తమ రెండు కుటుంబాల మధ్య గల వైరాన్ని దూరం చేస్తాడు. అంతేకాదు, వీరిరువురి కుమారుడైన అనిరుద్ధుడే చివరకు యదువంశాన్ని ముందుకు నడిపిస్తాడు. 

వీరిద్దరే కాక, ప్రద్యుమ్నుడికి ప్రభావతి అనే మరొక భార్య కూడా ఉన్నది. ఈమె తండ్రి వజ్రనాభ రాజు. మొదటిసారి ప్రభావతిని చూడటానికి వెళ్ళినప్పుడు, ఈ ప్రద్యుమ్నుడు ఒక తేనెటీగగా మారి… ఆమె వేసుకొనే పూలదండలో దూరి… ఆమెకు దగ్గరయ్యాడని పురాణాలలో ఆధారాలు చెబుతున్నాయి.

ప్రద్యుమ్నుడు నికుంభుడిని చంపడం

ద్వారకకు వచ్చిన తరువాత ప్రద్యుమ్నుడు తన తండ్రితో కలిసి ఎన్నో గొప్ప గొప్ప యుద్దాలు చేసి, శత్రువుల బారినుండి భూమిని కాపాడాడు. శ్రీకృష్ణుడు కూడా తన కుమారుడికి అనేక యుద్ధ మెళకువలు నేర్పించాడు. ఈక్రమంలోనే ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో ప్రద్యుమ్నుడు చురుకుగా పాల్గొన్నాడు. ఆ సమయంలో, కృష్ణుడితో కలిసి నికుంభుడు అనే రాక్షసుడితో పోరాడవలసి వచ్చింది.

హరివంశ పురాణం ప్రకారం నికుంభుడనే రాక్షసుడు పరమ శివభక్తుడు. దేవుని చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ, దానవుల చేతిలో కానీ తనకు చావు రాకూడదనే వరాన్ని పొందినవాడు. ఇక సామాన్య మానవులు తననేం చేస్తారులే! అన్న అహంకారంతో వారి నుంచి చావు రాకూడదన్న వరాన్ని మాత్రం కోరుకోలేదు నికుంభుడు. 

అయితే అదే అతని పాలిట శాపంగా మారింది. మానవ జన్మ ఎత్తిన శ్రీకృష్ణుని చేతిలో అతని చావు మూడింది. భానుమతి అనే యాదవ రాకుమార్తెని ఎత్తుకుపోయే ప్రయత్నంలో నికుంభుడు కృష్ణుని ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవైపు కృష్ణుడు, మరోవైపు ప్రద్యుమ్నుడు, ఇంకోవైపు అర్జునుడు ఈ  ముగ్గురు ఆ రాక్షసునితో భీకరంగా పోరాడతారు. 

ఈ ముగ్గురితో పోరాడటానికి నికుంబ మూడు మాయా రూపాలను ధరిస్తాడు. అందులో ఒకరూపం శ్రీకృష్ణునిపై దాడిచేసి గాయపరుస్తుంది. రెండో రూపం ప్రద్యుమ్నుడి చేతిలో మరణిస్తుంది. ఇక మూడో రూపం అర్జనుడిని  బంధించి గాల్లోకి తీసుకువెళుతుంది.

ఈ క్రమంలో అర్జనుడిని ఆకాశంలోనుంచీ కిందకి తల్లక్రిందులుగా వేలాడదీస్తాడు. అప్పుడు అర్జనుడు రక్తపు వాంతి చేసుకొంటాడు. వెంటనే కృష్ణుడు అర్జునుడిని రక్షించటానికి నికుంభుడి తల నరికేస్తాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న అర్జునుడు ఆకాశం నుండి కిందకు పడిపోతాడు. వెంటనే ప్రద్యుమ్నుడు భూమిని ఢీకొట్టబోతున్న అర్జునుడిని పట్టుకొని అతని ప్రాణాలను కాపాడతాడు.

ప్రద్యుమ్నుడు సాల్వాతో పోరాడటం

శ్రీకృష్ణుని చేతిలో తన అన్న శిశుపాలుడు మరణించాడని తెలుసుకొన్న సాల్వుడు అతనిపై కక్ష పెంచుకొంటాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సాల్వుడు దండెత్తి వస్తాడు. ప్రద్యుమ్నుడు అతణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు. కానీ, అతని బాణాల ధాటికి స్పృహ కోల్పోతాడు. మళ్ళీ కొంతసేపట్లోనే తేరుకొని ద్వారకను ఎలాగైనా కాపాడుకోవాలనే మనో సంకల్పంతో పోరాడతాడు. 

సాల్వుని ఇప్పటికి ద్వారక నుంచి మాత్రమే నీవు తరిమేయగలవు. ఎందుకంటే, సాల్వుని వధించగలవాడు ఒక్క శ్రీ కృష్ణుడేనన్న నారదుని సూచనతో తన ఆవేశాన్ని అణచుకొంటాడు ప్రద్యుమ్నుడు. అయినప్పటికీ,  వజ్రనాభపురాన్ని కాపాడేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. 

ఇంతలో ద్వారకలో పరిస్థితి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాల్వుని సంహరించేవరకు నేను ద్వారకలో కాలుపెట్టనని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కృష్ణుని గెలవడం కష్టమని తెలుసుకొన్న సాల్వుడు చిత్ర విచిత్రమైన వ్యూహాలను ప్రయోగిస్తాడు. కానీ, చివరికి కృష్ణుని సుదర్శన చక్రానికి బలవుతాడు.

ఇది కూడా చదవండి: The Tragic Story of Abhimanyu: How He Got Caught in Padmavyuham

మహారథి ప్రద్యుమ్నుడు

ఇలా అన్ని రకాల బాహ్య దాడుల నుండి ప్రజలను, మరియు  భూమిని రక్షించాడు ప్రద్యుమ్నుడు. అందుకే అతడు ద్వారకవాసులకు ప్రీతిపాత్రుడు. కాలక్రమేణా, అతను గొప్ప మహారథి, యోధుడు కూడా అయ్యాడు. అతను అరుదైన వైష్ణవస్త్రాన్ని కలిగి ఉండటమే కాకుండా, అత్యంత క్లిష్టమైన యుద్ధ నిర్మాణం అయిన చక్ర వ్యూహం యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోగలిగాడు. చక్రవ్యూహంలోకి సజీవంగా ప్రవేశించడం, మరియు బయటకు రావడం అనేది దాదాపు అసాధ్యం.

మహాభారతం ప్రకారం, ప్రద్యుమ్నుడు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు, మరియు ఉపపాండవులకు యుద్ధంలో శిక్షణ ఇచ్చాడు. అయితే, అతను స్వయంగా కురుక్షేత్ర మహా యుద్ధంలో పాల్గొనలేదు. దానికి బదులుగా, తన మేనమామ అయిన బలరాముడు, మరియు మరికొందరు యాదవులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.  

ప్రద్యుమ్నుడి జీవితానికి ముగింపు

ఈ విధంగా ఎంతో పరాక్రమశాలిగా తన పాలనలో ఎన్నో యుద్ధాలను గెలిచి… గొప్ప శక్తివంతమైన యోధుడిగా గుర్తించబడ్డాడు ప్రద్యుమ్నుడు. కానీ ఇంత గొప్ప పరాక్రమశాలి మద్యం మత్తులో జరిగిన పోరులో  బలవుతాడు. 

ప్రద్యుమ్నుడి అకాల మరణం యాదవ వంశ నాశనం సమయంలో జరుగుతుంది.  కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 35 సంవత్సరాల తర్వాత యుగాంతం పూర్తయ్యే సమయం ఆసన్నమవుతుంది. ద్వారకలో అందరూ మద్యానికి, జల్సాలకి అలవాటు పడతారు. ఒకరోజు కృష్ణుడికి జాంబవతితో కలిగిన కుమారుడు అయిన సాంబుడు ఋషులను ఎగతాళి చేస్తాడు. దాని పర్యవసానం ఆ ముని యాదవ వంశం మొత్తం నాశనమవుతుందని శపిస్తాడు. 

అకస్మాత్తుగా ఒక రోజు శ్రీకృష్ణుడు, మరియు బలరాముడి ఆయుధాలన్నీ మాయమవుతాయి. ఏదో విపత్తు పొంచి ఉందని ఊహించిన కృష్ణుడు యాదవులందరినీ ద్వారక నగరం వదిలి ప్రభస్సా సముద్రం దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అక్కడికి చేరుకొన్న అందరూ మద్యం మత్తులో ఒకరినొకరు నిందించుకుంటారు. ఈక్రమంలోనే సాత్యకి, మరియు కృతవర్మ కూడా ఒకరినొకరు విపరీతంగా నిందించుకుంటారు. 

అప్పుడు ప్రద్యుమ్నుడు సాత్యకిని రక్షించే ప్రయత్నంలో అవతలివారితో పోరాడుతూ… ఊహించని విధంగా శ్రీకృష్ణుడి కళ్ళ ముందే మరణిస్తాడు. ఇంక జరగబోయేది అంతా తెలిసిన శ్రీకృష్ణుడు ఏమీ చెయ్యలేక ఊరికే ఉండిపోతాడు. ఆ తరువాత జరిగిన వరుస సంఘటనల్లో శ్రీకృష్ణుడు, వసుదేవుడు, బలరాముడు, ఇంకా మిగిలిన యాదవ వంశం మొత్తం అంతరించిపోతుంది.

చివరిమాట 

తన ప్రమేయం లేకుండానే తన పుట్టుక జరగటం; అసుర వధకు కారణమనే నెపంతో తల్లిదండ్రులకు దూరంగా ఉండటం; తనవల్ల విడిపోయిన రెండు కుటుంబాలనూ  కలపటం; తన అవసరం ఉన్న ప్రతీచోటా తన కర్తవ్యం నిర్వహించటం; తనకి సంబంధం లేనిచోట చిరునవ్వుతో తప్పుకోవటం ఇదే ప్రద్యుమ్నుడి వ్యక్తిత్వం. 

కృష్ణుని పుత్రునిగానో, యదుకులంలో ప్రముఖుడిగానో, తన స్వీయ పరాక్రమం వల్లనో,  గర్వంతోనో ఏనాడూ బతుకలేదు. నిమిత్తమాత్రుడై, నిశ్చయ బుద్ధితో బతికిన ప్రద్యుమ్నుని జీవితమే ఆయనకు గొప్ప విజయాన్ని అందించింది. తన జీవితాన్ని ప్రేమిస్తూ… పరమాత్మని ధ్యానిస్తూ… సమాజం పట్ల గొప్ప ధర్మ నిరతి కలిగి ఉండాలనేదే ఇతని ముఖ్య ఉద్దేశ్యం. బహుశా ప్రద్యుమ్నుడు ప్రపంచానికి ఇదే మెసేజ్ ఇవ్వాలనుకున్నాడేమో! 

కథ యొక్క నీతి

మనకున్న కొద్దిపాటి పరిచయాలే మన బలాలుగా భావించి… గర్వంగా ఫీలవుతూ… గొప్పలకు పోతుంటాం. మన ఉనికి పదిమందికీ తెలిసేలా… ఆడంబరాలు పోతుంటాం. నిజానికి గొప్పవారిగా గుర్తించబడాలంటే… గొప్ప వంశంలోపుట్టడమో, మహాత్ముల కడుపున జన్మించడమో, యుద్ధ నైపుణ్యం కలిగి ఉండటమో, దానధర్మాలు చేయడమో, వినూత్న ఆవిష్కరణలు చేపట్టడమో చేయాల్సిన పనిలేదు. మనిషిగా పుట్టి, మానవత్వంతో బతికి, ధర్మానికి కట్టుబడి ఉంటే చాలు.

ప్రతీ పుట్టుకకూ విలువుంది; ప్రతీ బతుకులోనూ జీవముంది. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఆ జీవితాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే… మనం బతికే విధానంలోని పారదర్శకతను పరిచయం చేస్తుంది. ప్రద్యుమ్నుని జీవితమే దీనికి సరైన ఉదాహరణ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top