మహాభారతంలో మనందరికీ తెలిసిన పాండవులను, శ్రీకృష్ణుడిని పక్కన పెడితే, కురువంశంలో కూడా ఎందరో ముఖ్యులు ఉన్నారు. వీరిలో ఎన్నో ధర్మాలు తెలిసిన రాజనీతిజ్ఞులు, యుద్ధవీరులు, మహారథులు కూడా ఉన్నారు. వారిలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వథామ, విదురుడు లాంటి వాళ్ళు ముఖ్యులు. వీరిలో చాలామంది కౌరవులు చేసే పనులు అధర్మమైనవి అని తెలిసి కూడా, వేరే దారి లేక తమ జీవితం అంతా కురు సామ్రాజ్యాన్ని అన్ని రకాలుగా కాపాడటం కోసమే పని చేశారు. వీళ్ళలో ద్రోణాచార్యుడు ఎంతో ముఖ్యుడు. ఇతని వల్లనే పాండవులు, ఇంకా కౌరవులు అనేక యుద్ధ విద్యలలో ఆరితేరారు. మహాభారతంలో, ఇంకా ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడి పాత్ర చెప్పుకోదగినది. ఈ ఆర్టికల్ లో ఇప్పుడు మనం ద్రోణాచార్యుడి జననం గురించి, అతని జీవితం గురించి వివరంగా తెలుసుకుందాము.
ద్రోణుడి పుట్టుక
ద్రోణుడు కురుసామ్రాజ్యంలో పాండవులకు, కౌరవులకు అందరికీ రాజగురువుగా ఉండి వాళ్ళను గొప్ప యుద్ధవీరులుగా తీర్చిదిద్దాడు. అంతే కాకుండా ఇతను దృతరాష్ట్రుడికి ఉన్న ముఖ్యమయిన సలహాదారులలో, యోధులలో ఒకరు. ఇతను రాక్షసుల గురువయిన శుక్రాచార్యుడికి మంచి స్నేహితుడు కూడా. ద్రోణాచార్యుడు అంగీరస మహాముని వంశస్థుడు. ఇతని తండ్రి భరద్వాజ మహాముని. కొన్ని పురాణాల ప్రకారం ద్రోణాచార్యుడిని బృహస్పతి అవతారమని కూడా చెబుతారు.
ద్రోణుడి పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. మహాభారతంలోని ఆదిపర్వంలో ఘృతాచి అనే ఒక అప్సరస గురించి చెప్పబడి ఉంది. ఈమె ఎంతో అందంగా ఉంటుంది. ఒకసారి ఈమె నదిలో స్నానం చేస్తున్నప్పుడు భరద్వాజ మహాముని అటువైపు నుండి వెళ్తూ ఆమెను చూసి మోహిస్తాడు. ఆమెను అలా చూసి అతని మనసు కోరికతో నిండిపోతుంది. ఆ కోరిక వలన విడుదల అయిన భరద్వాజుడి ఇంద్రియం ఒక కుండలో పడి అది ఒక చిన్న బాలుడిగా మారుతుంది. ఇలా పుట్టడంవలనే అతనికి ద్రోణ అని పేరు వచ్చింది. అలా కుండలో పుట్టిన ద్రోణుడిని భరద్వాజుడు తన ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచుతాడు.
ద్రుపదునితో ద్రోణుడి వైరం
భరద్వాజ మహాముని ఆశ్రమంలో ఈ ద్రోణుడు, ఇంకా యువరాజు అయిన ద్రుపదుడు ఇద్దరూ కలిసి విద్యాభ్యాసం చేస్తారు. అక్కడ ద్రోణుడు, ద్రుపదుడు చాలా మంచి స్నేహితులు అవుతారు. ఆ స్నేహంతో, కాబోయే రాజు అయిన ద్రుపదుడు అవసరమయినప్పుడు ద్రోణుడికి సహాయం చేస్తానని మాట ఇస్తాడు.
అలా కొంతకాలం తరువాత ఇద్దరూ విద్యాభ్యాసం పూర్తి చేస్తారు. ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అవుతాడు, ద్రోణుడు మాత్రం ధనం సంపాదించాలనే కోరికలు ఏమి లేకుండా, అక్కడే ఉండిపోయి, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండిపోతాడు. అలా ద్రోణుడు ద్రోణాచార్యుడుగా పిలువబడతాడు. అక్కడే ద్రోణునికి క్రిపితో వివాహం అవుతుంది. వీళ్ళకి అశ్వత్థామ అనే కొడుకు పుడతాడు.
ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ ఒకసారి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు మిగతావాళ్ళు అందరూ పాలు తాగటం చూసి, తాను కూడా తాగాలని ఆశపడి వాళ్ళని అడుగుతాడు. అయితే ఆ స్నేహితులు పిండిని నీళ్లలో కలిపి అవే పాలు అని చెప్పి ఇచ్చి ఎగతాళి చేస్తారు. ఇది చూసిన ద్రోణాచార్యుడికి చాలా కోపం వస్తుంది. వెంటనే తన పేదరికాన్ని తలుచుకొని బాధపడతాడు. ఆ సమయంలో తన స్నేహితుడు అయిన ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి అతనిని సహాయం అడగడానికి వెళ్తాడు.
రాజ్యంలో ద్రుపదుడిని కలిసి తన పేదరికం గురించి చెప్పి, బంగారం లాంటివి ఏమీ అడగకుండా చిన్న పిల్లవాడయిన తన కుమారుడికి పాలు ఇవ్వడానికి ఒక ఆవుని మాత్రం ఇవ్వమని అడుగుతాడు. అయితే, ద్రుపదుడు గర్వంతో ద్రోణాచార్యుడిని మర్చిపోయి ఇంత పేదవాడు నాకు మిత్రుడు ఎలా అవుతాడు అని ఎగతాళి చేస్తాడు. ఆ అవమానానికి ద్రోణాచార్యుడి మరింత కోపం వచ్చి ఎలాగయినా ద్రుపదుడి మీద ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తాడు. కానీ ఆ సమయంలో ఏమి చెయ్యలేక బాధతో, అవమానంతో, అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ తన గురుకులానికి తిరిగి వచ్చి కాలం గడుపుతూ ఉంటాడు.
ఇది కూడా చదవండి: How was Pradyumna Born and What is his Story?
పాండవులకు, కౌరవులకు ద్రోణాచార్యుడి విద్యాబోధన
ఒకసారి భీష్ముడు అడవిలో వెళుతూ ద్రోణాచార్యుడి విలువిద్య నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే, ద్రోణాచార్యుడిని, అతని భార్యాపిల్లలను రాజమందిరానికి తీసుకువస్తాడు. కౌరవులకు, పాండవులకు విద్య నేర్పించటం కోసం అతనిని నియమిస్తాడు. ఈ విధంగా ద్రోణుడి పేదరికం పోయి కురు సామ్రాజ్యంలో ఒక ముఖ్యమయిన వ్యక్తిగా మారతాడు.
భీముడు భోజనప్రియుడని మనకందరికీ తెలుసు. ఒకసారి, భీముడు రాత్రి సమయంలో ఏమీ కనపడని కటిక చీకటిలో హాయిగా భోజనం చేసి రావటం అర్జునుడు చూస్తాడు. వెంటనే అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇంత చీకటిలో భోజనం చెయ్యటం కుదిరినప్పుడు బాణాలు వెయ్యటం ఎందుకు కుదరదు అని ఆలోచిస్తాడు. అప్పటినుండి ఎంతో శ్రమతో ప్రయత్నించి కటిక చీకటిలో కూడా ఖచ్చితంగా బాణాలు వేయటం నేర్చుకుంటాడు.
అతని పట్టుదలను, ఏకాగ్రతను, విలువిద్యా ప్రావీణ్యాన్ని, ధృడ సంకల్పాన్ని ప్రత్యక్షంగా చూసిన ద్రోణాచార్యుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. భూమండలం మొత్తం మీద అర్జునుడిని గొప్ప విలుకాడిని చేస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పటినుండి, అర్జునుడు ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు అవుతాడు. ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగించటం అర్జునుడికి వివరంగా నేర్పిస్తాడు. బ్రహ్మ యొక్క అత్యంత శక్తివంతమైన బ్రహ్మశీర్షాస్త్రం ప్రయోగించే మంత్రాలు కూడా అర్జునుడికి నేర్పిస్తాడు. ఇవే కాకుండా ద్రోణాచార్యుడు అర్జునుడికి ధనుర్వేదంలో కూడా విశేష జ్ఞానాన్ని ఇస్తాడు.
ద్రోణాచార్యుడి గురించి చెప్పుకునేటప్పుడు మనం తెలుసుకోవలసిన ఇంకొక ముఖ్యమైన పాత్ర ఏకలవ్యుడు. ఇతను నిషాద అనే ఒక వేటగాళ్ల తెగకి చెందినవాడు. హస్తినాపురంలోని అడవులలో ఉండే నిషాద వేటగాళ్ళకు అధిపతి అయిన హిరణ్యధనస్సు ఇతని తండ్రి. ఇతను మగధ రాజ్య పాలకుడు అయిన జరాసంధుడికి సర్వసైన్యాధ్యక్షుడిగా పని చేసేవాడు.
ఇదిలా ఉంటే, ఏకలవ్యుడు మాత్రం ద్రోణాచార్యుడి దగ్గర శిష్యరికం చెయ్యాలని ఎంతగానో ఆశపడతాడు. కానీ, ద్రోణాచార్యుడు ఇతనికి పాండవులతో, కౌరవులతో కలిపి విద్య నేర్పించడానికి నిరాకరిస్తాడు. కారణం… ఏకలవ్యుడి తండ్రి సైన్యాధ్యక్షుడిగా పని చేస్తున్న మగధ రాజ్యం… యాదవులకు శత్రురాజ్యం అవ్వటం వలన, ఇంకా ఏకలవ్యుడు అర్జునుడిని మించిన విలుకాడు అవుతాడేమో అనే భయంతో కూడా ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని దూరంగా ఉంచుతాడు. అయినా అధైర్యపడకుండా, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి మట్టి ప్రతిమను తయారుచేసి, ఆ విగ్రహాన్నే గురువుగా భావించి స్వయంగా విలువిద్య అభ్యాసం చేస్తాడు.
ఒక రోజు, ఏకలవ్యుడు విలువిద్య అభ్యాసం చేస్తుండగా ఒక కుక్క అరుపులకి అతని ఏకాగ్రత పోతుంది. అప్పుడు ఏకలవ్యుడు ఆ కుక్కకు ఏమాత్రం గాయం కాకుండా, కొంచెం కూడా రక్తం చిందకుండా, దాని నోటిలో మొత్తం బాణాలు వేస్తాడు. అతని విలువిద్యా నైపుణ్యం చూసి పాండవులు, కౌరవులు, ఇంకా ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతారు. అతని గురించి అడిగితే తాను ద్రోణాచార్యుడి శిష్యుడిని అని పరిచయం చేసుకుంటాడు.
అది విని అర్జునుడు, ద్రోణాచార్యుడు కూడా ఆశ్చర్యపోతారు. ఒక పక్క ఏకలవ్యుడి విలువిద్యా నైపుణ్యం చూసి ఎంతో సంతోషించిన అర్జునుడు, ఇంకొక పక్క ఏకలవ్యుడు తన కన్నా గొప్ప విలుకాడు అవుతాడేమో అని దిగులుపడతాడు. ద్రోణాచార్యుడు కూడా వేరే దారి లేక ఏకలవ్యుడి సామర్ధ్యాన్ని, అతని అంకితభావాన్ని మెచ్చుకొని అతనిని శిష్యుడిగా స్వీకరిస్తాడు.
అయితే, అర్జునుడికన్నా గొప్పవాడు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఏకలవ్యుడి కుడిచేయి బొటనవేలుని గురుదక్షిణగా అడుగుతాడు. గురువు స్థానంలోని వ్యక్తి అడగకూడని గురుదక్షిణ అడుగుతాడు. ఊహించని ఈ కోరికకు ఏకలవ్యుడు ఆశ్చర్యపోతాడు. అయినప్పటికీ, గురువు అడిగిన కోరికను కాదనకుండా వెంటనే తన కుడిచేయి బొటనవేలుని కత్తిరించి ద్రోణాచార్యుడికి కానుకగా సమర్పిస్తాడు. అతని భక్తికి అందరూ ఆశ్చర్యపోతారు. ఏకలవ్యుడి త్యాగానికి చలించిపోయిన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని ఆశీర్వదించి, బొటనవేలు లేకపోయినా కూడా అతనికి మంచి విలువిద్యా నైపుణ్యం వచ్చేలాగా దీవిస్తాడు. ఈ విధంగా అర్జునుడికి ఏకలవ్యుడు పోటీ అయ్యే అవకాశాన్ని ద్రోణాచార్యుడు ఆదిలోనే తుంచేస్తాడు.
ఇలానే మరొక సందర్భంలో కర్ణుడు అర్జునుడికి పోటీ కాకుండా ఉండేందుకు ద్రోణాచార్యుడు అడ్డుపడతాడు. ఎలాగంటే… ద్రోణాచార్యుని వద్ద విద్య నేర్చుకోవాలని ఆశపడతాడు కర్ణుడు. కానీ అతడు సూతపుత్రుడనే కారణంతో తన శిష్యుడిగా స్వీకరించడానికి ఒప్పుకోడు. ఆ అవమానంతో పరశురాముడి వద్దకు వెళ్లి విద్య నేర్చుకుంటాడు కర్ణుడు.
కొంతకాలానికి కౌరవులకు, పాండవులకు విద్యాభ్యాసం పూర్తవుతుంది. వాళ్ళ నైపుణ్యాలను ప్రదర్శించే సమయం వస్తుంది. దృతరాష్ట్రుడి అనుమతితో వేదిక సిద్ధం చేస్తారు. మొదటగా దుర్యోధనుడు మరియు భీముడు గదాయుద్ధం చేసి తమ నైపుణ్యాలను చూపిస్తారు. ఒకానొక సందర్భంలో ఈ విద్యా ప్రదర్శన అచ్చం యుద్థాన్ని తలపిస్తుంది. వెంటనే అశ్వత్థామ ఇద్దరినీ విడదీస్తాడు. తరువాత, అర్జునుడు తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. అతని అద్భుతమైన విలువిద్యా నైపుణ్యాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్య పోతారు. దీంతో తన ప్రియ శిష్యుడిని ఈ భూమి మొత్తం మీద గొప్ప విలుకాడు అని ద్రోణాచార్యుడు ప్రకటిస్తాడు.
ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా కర్ణుడు అక్కడకు వచ్చి తన విలువిద్య ప్రదర్శించి అక్కడి వారందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అంతేకాక, ద్వంద్వ యుద్ధానికి రమ్మని అర్జునుడికి సవాలు కూడా విసురుతాడు. ఈ ఊహించని పరిణామానికి ద్రోణుడు ఆశ్చర్యపోతాడు. కర్ణుడు ఎక్కడ అర్జనుడిని మించి పోతాడోనన్న భయంతో… అతను సూత పుత్రుడు కాబట్టి, ఈ పోటీలో పాల్గొనడానికి అనర్హుడు అని చెప్తాడు. ఈ విధంగా కర్ణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడితో పోటీ పడకుండా ఆపుతాడు.
అయితే, అర్జునుడిని కర్ణుడు ఎదిరించగలడని నమ్మకం కలిగిన దుర్యోధనుడు వెంటనే కర్ణుడిని అంగ రాజ్యానికి అధిపతిగా ప్రకటించి అక్కడే అతనిని రాజుని చేస్తాడు. అయితే అప్పటికే సూర్యాస్తమయం సమయం కావచ్చిందని, ఇంక పోటీ నిర్వహించటం కుదరదని చెప్పి ద్రోణాచార్యుడు కర్ణార్జునుల మద్య పోటీ జరగకుండా ఆపేస్తాడు.
ఈ రెండు సంఘటనలు మనకు ద్రోణాచార్యుడు అర్జునుడిని ఎంతగా ప్రేమించాడో, అతనికంటే ఎవరూ విలువిద్యలో గొప్ప కాకూడదని ఎంతగా ప్రయత్నించాడో తెలుస్తుంది.
ద్రోణాచార్యుడికి గురుదక్షిణ – ద్రుపదుని గర్వభంగం
విద్యాభ్యాసం అయిపోయిన తరువాత గురుదక్షిణగా ఏమి కావాలని కురు రాకుమారులు ద్రోణాచార్యుడిని అడుగుతారు. అప్పుడు ద్రోణుడు ద్రుపదుడి వలన తనకు జరిగిన అవమానం గురించి వాళ్లకు చెప్పి, ద్రుపద రాజ్యం మీద యుద్ధం చేసి ద్రుపదుడిని బందీగా తీసుకురావాలని గురుదక్షిణ కోరతాడు.
కౌరవులు, పాండవులు అందరూ పాంచాల రాజ్యం మీద యుద్ధనికి వెళతారు. అక్కడ ద్రుపదుడు కౌరవులను దీటుగా ఎదుర్కొంటాడు. అప్పుడు అర్జునుడు భీకరంగా ద్రుపదుడితో యుద్ధం చేసి అతనిని బంధిస్తాడు. ద్రుపదుడిని తన రథానికి తాళ్లతో కట్టి తీసుకువచ్చి ద్రోణాచార్యుడి పాదాల ముందు పడేస్తాడు. ద్రోణుడు అప్పుడు ద్రుపదుడు తనకు ఇచ్చిన వాగ్దానాన్ని, దాన్ని మర్చిపోయి తనని అవమానించిన విషయం గుర్తుచేసి పాంచాల రాజ్యంలో సగభాగాన్ని స్వాధీనం చేసుకొని మిగిలిన సగభాగాన్ని ఇచ్చేస్తాడు.
అలా స్వాధీనం చేసుకున్న సగభాగానికి అశ్వత్థామను రాజుని చేస్తాడు. ఈ అవమానం తట్టుకోలేక ద్రుపదుడు ద్రోణాచార్యుడిని చంపగలిగిన శక్తివంతమయిన కుమారుడు కావాలని యాగం చేస్తాడు. అప్పుడు యజ, ఇంకా ఉపయజ ఋషులు ద్రుపదుడిని అనుగ్రహిస్తారు. అలా ద్రుపదరాజుకి కలిగిన కుమారుడే ధృష్టద్యుమ్నుడు. అదే యాగంలో అగ్ని నుండి ద్రౌపది అనే కుమార్తె కూడా ద్రుపదుడికి కలుగుతుంది.
ఇది కూడా చదవండి: Shalya in Mahabharata: Uncovering His Role and Significance
కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడి పాత్ర
ద్రోణాచార్యుడు ఎన్నో అద్భుతమయిన దివ్యాస్త్రాలను ఉపయోగించడంలో నిష్ణాతుడు. ఇతనికి పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి, దానిని ఎలా ప్రయోగించాలి? ఎలా ఉపసంహరించాలి? అనే రహస్యాలను కూడా చెప్పాడు. ఇదే కాకుండా ద్రోణుడి దగ్గర నారాయణాస్త్రం, బ్రహ్మశిర, వజ్ర, రుద్ర, ఆగ్నేయ అస్త్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడి దగ్గర నుండి ఒక అజేయమయిన ఖడ్గాన్ని ద్రోణుడు సంపాదించాడు. భీష్ముడు ఈ ఖడ్గం గురించి ఒకసారి నకులుడికి వివరించాడు. ఈ ఖడ్గం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు తప్పకుండా విజయం సాధిస్తారు. విద్యాభ్యాసం ముగిసే సమయంలో ద్రోణాచార్యుడు ఈ ఖడ్గాన్ని నకులుడికి అందజేశాడు.
ద్రోణాచార్యుడికి ప్రత్యేకమయిన యుద్ద మరియు సైనిక కళలు చాలా తెలుసు. ఇతని సామర్ధ్యం మీద ఎంతో నమ్మకం ఉండటం వల్లనే భీష్ముడు కురుపాండవుల విద్యాభ్యాసం ఇతని పర్యవేక్షణలో జరిపించాడు. మహాభారత యుద్ధంలోని రెండు వైపులా చాలా మందికి యుద్ధ విద్యలు నేర్పించింది ద్రోణాచార్యుడే.
పాండవులను రాజ్యం నుండి భహిష్కరించడాన్ని తప్పుపట్టిన వాళ్లలో ద్రోణుడు కూడా ఒకడు. కానీ భీష్ముడి వలెనే ఇతను కూడా హస్తినాపురానికి సేవకుడిగా ఉండటంవలన, తప్పనిసరి పరిస్థితులలో కౌరవులవైపు ఉండి పాండవులతో పోరాడతాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు నేలకొరిగిన తరువాత అపారమయిన కౌరవ సైన్యాన్ని నడిపించడానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడిని నియమించారు. యుద్ధంలో పదకొండవ రోజు నుండి పదిహేనవ రోజు వరకు కౌరవ సైన్యాన్ని నడిపించాడు.
యుద్ధంలో ధర్మరాజుని బందీగా పట్టుకుంటే విజయం లభిస్తుందని తలచి దుర్యోధనుడు ధర్మరాజుని బంధించే ప్రయత్నం చెయ్యమని ద్రోణుడిని అడుగుతాడు. ఎంతో గొప్ప యోధుడయిన ద్రోణుడు యుద్ధంలో వేలమంది పాండవుల సైనికులను చంపగలిగినా, ధర్మరాజుని బందీగా పట్టుకోవాలని నాలుగు సార్లు ప్రయత్నించి ప్రతిసారీ విఫలమయ్యాడు. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడూ ద్రోణుడి యుద్ధతంత్రాన్ని దీటుగా ఎదుర్కొని ధర్మరాజుని కాపాడేవాడు.
యుద్ధం జరుగుతున్న పదమూడవ రోజు, ధర్మరాజుని బంధించడానికి ద్రోణుడు పద్మవ్యూహాన్ని ఏర్పరుస్తాడు. ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో కేవలం, కృష్ణుడికి, అర్జునుడికి మాత్రమే తెలుసు. అయితే, యుద్ధం పదమూడవ రోజున త్రిగర్త సేనలు యుద్ధభూమిలో భీకరంగా పోరాడుతున్న అర్జునుడిని వేరే వైపుకు మళ్లిస్తారు. వేరే మార్గం లేక, బాలుడయిన అభిమన్యుడిని ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్లాలని ధర్మరాజు అడుగుతాడు.
అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళటం మాత్రమే తెలుసు, బయటకు రావటం తెలియదు. ముందుగా అభిమన్యుడిని వెళ్ళమని, వెనుకనే తామంతా వస్తామని చెప్పి అభిమన్యుడిని పంపిస్తారు. కానీ, జయద్రథుడు మాత్రం మిగిలిన పాండవులను అడ్డుకొని వారిని అభిమన్యుడి వెనుక వెళ్లనీయకుండా నిలిపివేస్తాడు. ఒంటిరి వాడయిపోయిన అభిమన్యుడు అయినా అధర్య పడకుండా కౌరవులందరినీ ఎదుర్కొంటాడు.
అతని పరాక్రమానికి ముగ్ధుడయిన ద్రోణుడు, దుర్యోధనుడి ఎదురుగానే అభిమన్యుడిని గొప్పగా పొగిడి కోపం తెప్పిస్తాడు. దుర్యోధనుడు కోపం పట్టలేక ద్రోణుడిని నిందిస్తాడు. ఆ నిందలు భరించలేక అన్ని వైపుల నుండి ఒక్కసారిగా అభిమన్యుడిపై దాడి చెయ్యాలని చెప్తాడు. చాలాసేపు వీళ్లందరితో భీకరంగా పోరాడిన అభిమన్యుడిని చివరికి అందరూ కలిసి చంపేస్తారు. ఇందులో పాల్గొన్న యోధులయిన ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు యుద్ధనీతికి వ్యతిరేకంగా ఒక బాలుడిని చుట్టుముట్టి చంపుతారు.
యుద్ధం పద్నాలుగవ రోజున, అభిమన్యుడి మరణానికి కారణమయిన జయద్రథుడిని సూర్యాస్తమయంలోగా చంపుతానని, లేకపోతే అగ్నిలో దూకుతానని అర్జునుడు శపథం చేస్తాడు. ద్రోణుడు ఎంత ప్రయత్నించినా జయద్రథుడిని కాపాడలేకపోతాడు. దుర్యోధనుడు కోపంతో ద్రోణాచార్యుడిని చాలా నిందిస్తాడు. ధర్మరాజుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ద్రోణుడిని ద్రుపదుడి కుమారుడవైన ధృష్టద్యుమ్నుడు ఎదిరిస్తాడు.
పద్నాలుగవ రోజున రాత్రి ద్రోణుడు పాండవ జనాలపైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది చూసిన సప్తఋషులు వెంటనే సాధారణ సైనికులపై ఆ ఆయుధం ప్రయోగించటం తప్పని, వెంటనే ఉపసంహరించుకోమని కోరతారు. వారి మాటలకు కట్టుబడి ద్రోణుడు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అయితే, యుద్ధ నియమాలను తప్పినందుకు, దివ్యాస్త్రాలని సాధారణ సైనికులపైన ప్రయోగించినందుకు, సప్తఋషులు ద్రోణుడిని నిందిస్తారు. అయితే, హస్తినాపురాన్ని కాపాడటానికి, దృతరాష్ట్రుడు తనకు ఇచ్చిన జీవితానికి తగిన విధంగా సేవ చెయ్యటానికే ఇలా చేశానని చెబుతాడు. అలా యుద్ధంలో తన స్నేహితుడయిన ద్రుపదుడిని కూడా చంపేస్తాడు. యుద్ధంలో చంపినప్పటికీ చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ద్రుపదుడి శవానికి నివాళులర్పిస్తాడు.
ద్రోణాచార్యుడి మరణం
ఆయుధాలు ధరించిన ద్రోణుడిని ఎదిరించి ఓడించడం జరగదని తెలిసిన శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెబుతాడు. ఆ ఉపాయం ప్రకారం భీమసేనుడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపి, అదే పేరు ఉన్న ద్రోణాచార్యుడి కుమారుడిని చంపినట్లుగా అరిచి చెబుతాడు. కానీ ద్రోణాచార్యుడు భీముడి మాటలు నమ్మకుండా, ఎప్పుడూ అసత్యం చెప్పనటువంటి ధర్మరాజు వైపు చూస్తాడు.
ధర్మరాజు ద్రోణాచార్యుడితో “అశ్వత్థామ చనిపోయాడు. అయితే చనిపోయింది ఒక ఏనుగు, నీ కుమారుడు కాదు” అని చెబుతాడు. కానీ ధర్మరాజు ఆ మాటలు చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం “అశ్వత్థామ చనిపోయాడు” అనే మాటలు మాత్రం పెద్ద స్వరంతో పలుకుతాడు. మిగిలినవి కావాలనే చిన్న స్వరంతో పలుకుతాడు.
ధర్మరాజు మాటలు నమ్మిన ద్రోణుడు వెంటనే అస్త్ర సన్యాసం చేసి దుఃఖంలో మునిగిపోతాడు. కుమారుడిని కోల్పోయాననే భావనలో దుఃఖంతో ద్రోణుడు ఆయుధాలను విడిచి, రథం దిగి, ప్రాణాలు వదలటానికి సిద్ధపడి ధ్యానంలో కూర్చుంటాడు. ఇదే సమయంలో, తన తండ్రిని చంపాడనే కోపంతో ధృష్టద్యుమ్నుడు వెంటనే కత్తి తీసుకొని ద్రోణుడి తల నరికి చంపేస్తాడు. ఇది యుద్ధనీతికి వ్యతిరేకం అని కొందరు చెప్పినా కూడా, అభిమన్యుడి దారుణ హత్యలో ద్రోణాచార్యుడి ప్రమేయం కారణంగా చూపించి శ్రీకృష్ణుడు ధృష్టద్యుమ్నుడు చేసిన పని సరయినదే అని సమర్థిస్తాడు. ఈ విధంగా ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుడి చేతిలో మరణిస్తాడు.
నీతి
ఎంతో గొప్పవాడయిన ద్రోణాచార్యుడు భీష్ముడిలాగే హస్తినాపురం క్షేమం కోసం తన జీవితాన్ని ధారపోశాడు. కారణం ఏదయినా, జరుగుతున్నది న్యాయమా అన్యాయమా అనే విషయంతో సంబంధం లేకుండా తనకు జీవితాన్ని ఇచ్చిన రాజ్యం కోసం, ఆ రాజు కోసం ఏమి చెయ్యడానికయినా ద్రోణుడు సిద్ధపడ్డాడు. పాండవులు ధర్మం కోసం పోరాడుతున్నారు అని తెలిసి కూడా ద్రోణాచార్యుడు అధర్మం వైపే నిలబడ్డాడు.
గురువుగా కురుపాండవులకు విద్య ప్రసాదించే విషయంలో కూడా అనేక సార్లు తాను చేసిన పనులకు విమర్శలు ఎదుర్కున్నాడు. బ్రాహ్మణుడిగా, రాజగురువుగా ఉన్న ద్రోణుడు క్షత్రియుడిలాగా యుద్ధంలో పాల్గొనటం తప్పని చాలామంది అంటారు. అదే విధంగా యుద్ధసమయంలో కూడా యుద్ధనీతిని కాదని ఎన్నో తప్పులు చేశాడని చాలా మంది భావిస్తారు. ద్రోణుడి పర్యవేక్షణలో యుద్ధనీతికి వ్యతిరేకంగా రాత్రిపూట అంతా యుద్ధం జరిగింది. సాధారణ సైనికులపైన దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. ఇలాంటి ఎన్నో తప్పులు చేశాడని పురాణ పరిశీలకులు భావిస్తారు. అయితే ఒక గురువుగా మంచి కీర్తి కూడా సంపాదించుకున్నాడు.
గురువుని దేవునితో సమానంగా పూజించే భారతదేశ సంస్కృతిలో ద్రోణాచార్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. మన దేశంలో క్రీడలకు సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గురువులకు, ప్రతి సంవత్సరం ద్రోణుడి పేరు మీదుగా ద్రోణాచార్య అవార్డును ఇస్తున్నారు. నేటి తరాలు తమ జీవితాలలో గురువుల పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవటం, ఇటువంటి మహాగురువులను స్మరించుకోవడం, వారి జీవితాల గురించి తెలుసుకోవటం ఎంతో అవసరం కూడా.