Birth Week will Reflect your Personality

పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి!

సాదారణంగా ఏ వ్యక్తి స్వభావమైనా వారి జాతకం, పుట్టిన తేదీ, నక్షత్రం, జన్మరాశి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. కానీ, పుట్టిన వారాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా! వారంలో ఒక్కోరోజు దాని స్వంత శక్తి ని కలిగి ఉంటుంది. ఇది ఆ రోజు పుట్టిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు పుట్టిన వారమేదో తెలిస్తే, నేను చెప్పే వ్యక్తిత్వ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.

సోమవారం:

సోమవారాన్ని చంద్రుని వారంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజున పుట్టిన వ్యక్తులు కూడా చంద్రుని లానే చంచలమైన మనస్సు కలిగి ఉంటారు. ఏ విషయంపైనా ఎక్కువ కాలం నిలిచి ఉండలేరు. కాకపోతే, వీళ్ళు తాము సంతోషంగా ఉండటమే కాకుండా, తమ పక్కవారిని కూడా సంతోషపెట్టాలని తాపత్రయపడుతూ ఉంటారు. అందుకే వీరిని అందరూ ఇష్టపడతారు.

మంగళవారం:

మంగళవారాన్ని హనుమంతుని వారంగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున పుట్టిన వ్యక్తుల హృదయం కూడా హనుమంతుని హృదయం లానే ఉదారంగా ఉంటుంది. అవసరమైన వారికి సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. స్వభావం ప్రకారం చూస్తే, వీరు చాలా సెన్సిటివ్. కానీ, వారి కోపం మాత్రం చాలా బలంగా ఉంటుంది. అలాగని ఎవరిపైనా ద్వేషం పెంచుకోరు. వీరికి హనుమంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది.

బుధవారం:

బుధవారాన్ని వినాయకుని వారంగా పరిగణిస్తారు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు చాలా తెలివైనవారు. వీరు తమ కుటుంబం పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారు. కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పటికీ సులభంగా బయటకు వచ్చేయగలరు.

గురువారం:

గురువారాన్ని గురుని వారంగా పరిగణిస్తారు. ఈ రోజున పుట్టిన వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ఏ విషయంపై త్వరగా నోరు మెదపరు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. త్వరగా ధనవంతులు కూడా అవుతారు. వీరికి గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

శుక్రవారం:

శుక్రవారాన్ని లక్ష్మీ వారంగా పరిగణిస్తారు. ఈ రోజున పుట్టిన వ్యక్తులు చాలా ముక్కు సూటిగా మాట్లాడతారు. వీరిలో కొన్నిసార్లు అసూయాభావం కూడా కనిపిస్తుంది. వీరు సకల భోగాలు అనుభవిస్తారు. లక్ష్మీ కటాక్షం వీరిపై ఎప్పుడూ ఉంటుంది.

శనివారం:

శనివారాన్ని శనిదేవుని వారంగా పరిగణిస్తారు. ఈ రోజున పుట్టిన వ్యక్తులకి కోపం ఎక్కువ. వీరికి సంకల్ప బలం కూడా ఎక్కువ. ఏదైనా ఒక పనిలో నిమగ్నమైతే, అది పూర్తయ్యాక మాత్రమే ఊపిరి తీసుకుంటారు. వీరి జీవితం ఒక పోరాటం. కానీ, వారు తమ శ్రమతో తమ విధిని సైతం మార్చేసుకుంటారు. కోరుకున్నది ఏదైనా సరే తప్పక సాధిస్తారు. వీరికి శనిదేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.

ఆదివారం:

ఆదివారాన్ని సూర్యుని వారంగా పరిగణిస్తారు. ఈ రోజున పుట్టిన వ్యక్తులు తమ జీవితంలో అనేక విజయాలు సాధిస్తారు. వీరి కెరీర్ కూడా చాలా బాగుంటుంది. వీరి సంభాషణలు ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఎక్కడ తగ్గాలో… ఎక్కడ నెగ్గాలో… వీరికి బాగా తెలుసు. వీరికి సూర్యభగవానుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top