Mahabharata Historical Proof, Archaeological Evidence

Archaeological Discoveries Proving Mahabharata

దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు మన దగ్గర ఖచ్చితమైన సమాధానం లేనట్టే…  పురాణాలు, ఇతిహాసాలు నిజంగా జరిగాయా అనే ప్రశ్నకి కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ అఖండ భారతావనిలో ఇటువంటి పురాణాల గురించిన చర్చలకు అంతమే లేదు. సాంకేతికంగా మనం ఎంత ముందుకు వెళ్లినా వీటి గురించి వివాదాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. 

వాస్తవానికి  పురాణ ఇతిహాసాలుగా చెప్పుకొనే రామాయణం, మహాభారతాలు నిజంగా జరిగాయని చెప్పటానికి కావాల్సిన ఆధారాలు, అందుకు బలం చేకూర్చే ప్రదేశాలు, సంఘటనలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. మరి  మహాభారతం నిజంగా జరిగింది అని తెలియచేసే అసలైన సాక్షాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. 

పురావస్తు ఆధారాలు

పురావస్తు శాఖ వారు మన దేశం మొత్తం మీద ఎన్నో సంవత్సరాల పాటు, ఎంతో శ్రమతో, ఎంతో ఖర్చుతో కూడుకున్న పరిశోధనలు నిరంతరాయంగా చేసి ఎన్నో ఆశ్చర్యపోయే ఆధారాలను బయట ప్రపంచానికి పరిచయం చేశారు. 

భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో జరిపిన త్రవ్వకాల్లో మహాభారతంలో వివరించిన వాటికి సమానమైన కళాఖండాలు, మరియు నిర్మాణాలు ఎన్నో బయటపడ్డాయి. ఉదాహరణకు, కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లు భావిస్తున్న ప్రదేశంలో జరిపిన లోతయిన త్రవ్వకాల్లో, కొన్ని బాణాలను, ఈటెలను గుర్తించారు. ఈ వస్తువులను సుమారుగా క్రీస్తు పూర్వం 2,800 సంవత్సరంలో ఉపయోగించినట్లుగా సాంకేతిక పరిజ్ఞానంతో కనిపెట్టారు. అంతే కాకుండా, మహాభారత కాలానికి చెందిన పురాతన కుండలు, ఆయుధాలు, మరియు ఇతర కళాఖండాలు చాలా బయటపడ్డాయి. 

మెరైన్ ఆర్కియాలజీ వారు భారతదేశంలోని గుజరాత్‌ రాష్ట్రంలో జరిపిన తవ్వకాలలో ఒక పురాతన ఓడరేవు నగరాన్ని ద్వారక తీరంలో గుర్తించారు. మహాభారతం మరియు ఇతర వేద సాహిత్యాలలో వివరించిన విధంగా, ద్వారక వద్ద మునిగిపోయిన ఒక మహా నగరం, దాని భారీ కోట గోడలను, తీరం నుండి సముద్రంలోకి స్తంభాలపై ఏర్పరచిన పెద్ద వేదిక లాంటి ప్రదేశం ఆనవాళ్లు, భారీ ఓడలలో సరుకులను చేరవేయడానికి లంగరు వేసే ప్రాంతాలకు సంబందించిన అవశేషాలను, ఓడరేవుల్లో ఉపయోగించదగిన పనిముట్లను కూడా గుర్తించారు. 

మహాభారతంలోని మౌసల పర్వంలోని ఒక సంస్కృత శ్లోకంలోని ఈ ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయి అదృశ్యమైన విషయాన్ని వివరించారు. ఎన్నో సిరిసంపదలతో నిండి ఉన్న ద్వారక నగరం ప్రజలందరూ ఆ ప్రాంతం నుండి బయలుదేరిన తర్వాత, సముద్రం ఆ నగరాన్ని ముంచెత్తింది అని ఆ శ్లోకం తాత్పర్యం. 

ఈ బలమయిన పురావస్తు ఆధారాలు, ఇంకా మహాభారతంలో వీటికి సంబందించిన వివరణ అన్నీ మహాభారతం నిజంగా జరిగిందనే ఆలోచనకు బలమయిన మద్దతు ఇస్తున్నాయి. 

ఇవే కాకుండా ఉత్తర భారతదేశంలోని కనీసం ముప్పై ఐదు కంటే ఎక్కువ ప్రదేశాలలో లభించిన పురావస్తు ఆధారాలు కూడా ఈ సత్యాన్ని బలపరుస్తున్నాయి. 1950-1952 మద్య కాలంలో, ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బి.బి.లాల్ పురావస్తు తనిఖీల ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలోని హస్తినాపుర ప్రదేశాన్ని తవ్వారు. 

ఈ ప్రదేశాలలో రాగి పాత్రలు, ఇనుము, బంగారం, వెండి ఆభరణాలు, టెర్రకోట పాత్రలు, చిత్రాలు వేసిన మట్టి కుండలు అన్నీ కనుగొనబడ్డాయి. ఇక్కడ, ఇంకా అనేక ప్రదేశాలలో దొరికిన వస్తువులు, పనిముట్లు, కళాఖండాలు అన్నీ ఆర్యన్ నాగరికతకు పూర్వ కాలాన్ని బలంగా సూచించాయి. ఇంకా మహాభారతంలో వివరించిన పురాతన నగరాలకు ఈ ఆధారాలు సాక్ష్యాలుగా గుర్తించబడ్డాయి.

భౌగోళిక ఆధారాలు

మహాభారత ఇతిహాసం ఇప్పుడు మనం చూస్తున్న, మనకు తెలిసిన భారతదేశమే కాకుండా ఇంకా ఎక్కువగా విస్తరించిన ఒకప్పటి భరతఖండానికి ప్రతీక. మనకు తెలుసు… భరతుడు ఈ ఖండాన్ని ఒకప్పుడు పాలించాడని, అతని పేరు మీదుగానే ఈ సువిశాల ప్రాంతానికి భరతఖండం అనే పేరు వచ్చిందని. ఇక్కడ భరతుడు అంటే రామాయణంలో రాముడి సోదరుడు అని పొరబడవద్దు, ఈ భరతుడు దుశ్యంతుడికి, శకుంతలకు జన్మించిన కుమారుడు. మన దేశానికి ఇతని వలనే భరతఖండం అనే పేరు వచ్చింది. 

ప్రస్తుత వాయువ్య పాకిస్తాన్ మరియు తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను చుట్టుముట్టిన ఒక ప్రాంతం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ ప్రాంతం పెషావర్ లోయకు అనుగుణంగా మరియు కాబూల్ మరియు స్వాత్ నదుల దిగువ లోయలలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్నే మహాభారత ఇతిహాసంలో మనకు తెలిసిన గాంధార రాజ్యం అని అంటారు. ఇంకా సులువుగా అందరికీ తెలిసిన పేరుతో చెప్పాలంటే మహాభారతంలోని గాంధార రాజ్యం ఇప్పుడు మనకు తెలిసిన కాందహార్‌. ఇక కర్ణుడు పాలించిన అంగరాజ్యాన్ని ఇప్పటి బంగ్లాదేశ్ అని చెబుతారు.

మహాభారతం ప్రాచీన భారతదేశంలోని వివిధ ప్రదేశాలు మరియు ప్రాంతాలకు సంబంధించిన వివరణాత్మక వర్ణనలను అందిస్తుంది. మహాభారతంలో వివరించిన సంఘటనలు వాస్తవానికి జరిగాయని సూచిస్తున్న ఈ ప్రదేశాలలో చాలా వరకు ఈనాటికీ గుర్తించవచ్చు. ఉదాహరణకు, కురు రాజ్యానికి రాజధానిగా ఉన్న హస్తినాపురం నగరం ఇప్పటి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న హస్తినాపూర్ అని నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థ నగరం ఇప్పటి ఢిల్లీ ప్రాంతంలో ఉందని చెబుతారు.

ఇది కూడా చదవండి: Mahabharata’s Magical Weapons

శాసన ఆధారాలు

ఇవే కాకుండా మహాభారతం నిజంగానే జరిగింది అని చెప్పే కొన్ని బలమయిన శాసన ఆధారాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. శ్రీ కోట వెంకటాచలం గారు రచించిన ‘Age of Mahabharata War’ అనే పుస్తకంలో ఈ శాసన ఆధారాల గురించి వివరంగా చెప్పారు. మహాభారత యుద్ధం క్రీ.పూ. 3138లో లేదా కలి కంటే 36 సంవత్సరాల క్రితం జరిగిందని నిశ్చయాత్మకంగా రుజువు చేసే ప్రధానంగా నాలుగు శాసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి అని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.

దీని ప్రకారం క్రీ.పూ. 3041లో పరీక్షిత్తు మహారాజు మరణించిన తర్వాత అతని కుమారుడు అయిన జనమేజయుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అతని పాలనలోని 29వ సంవత్సరం అంటే క్రీ.పూ.3013-3012 సంవత్సరంలో, అతను రెండు మత సంస్థలకు రెండు గ్రామాలను విరాళంగా ఇచ్చాడు, వీటికి సంబంధించి రెండు బహుమతి పత్రాలు కూడా నిర్దేశించబడ్డాయి. 

మొదటి శాసనం భారతీయ పురాతన కాలం నాటి 333, 334 పేజీలలో ప్రచురించబడింది, ఇది జనమేజయుడు సీతారామ పూజ కోసం భూమిని బహుమతిగా ఇచ్చాడని స్పష్టంగా శాసనంలో వివరించారు. 

ఇక రెండవ శాసనం బహుమతి పత్రం చెక్కబడిన ఒక రాగి ఫలకం. ఇప్పటికీ ఈ రాగి ఫలకం హిమాలయాల్లోని కేదార క్షేత్రంలో భద్రపరచబడి ఉంది. కేదారనాథ స్వామి పూజ కోసం జనమేజయ చక్రవర్తి ఇలాంటి భూమిని కానుకగా ఇచ్చాడు అని శాసన ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి.  

మూడవ శాసనం ధార్వార్ జిల్లాలోని “ఇబల్లి” గ్రామంలోని ఒక శివాలయం గోడ మీద చెక్కబడి ఉన్నది. ఇది క్రీ.పూ. 634లో రాజు పులకేసిన్ పర్యవేక్షణలో చెక్కబడింది అని ఆధారాలు ఉన్నాయి. 

ఇక చివరిది, నాలుగవది అయిన రాగి ఫలకం శాసనం గుజరాత్‌ ప్రాంతాన్ని పరిపాలించిన సుధన్వ చక్రవర్తి కాలానికి సంబందించినది. ఇది శ్రీ శంకరునికి సుధన్వ చక్రవర్తి సమర్పించిన జ్ఞాపిక. యుధిష్ఠిర శకం 2663 సంవత్సరంలో రాగి ఫలకంపై వ్రాయబడింది. సుధన్వ చక్రవర్తి యొక్క ఈ రాగి ఫలకం శాసనం శ్రీ శంకరుడు మరణించిన సంవత్సరం 2663 నాటిది. యుధిష్ఠిర శకం ప్రారంభం క్రీ.పూ. 477-76 అంటే 2662+476 = క్రీ.పూ.3138, ఇది ఖచ్చితంగా మహాభారత యుద్ధ సమయం. 

ఇవే కాకుండా అందుబాటులో మరి కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి. (1) గుప్త యుగం నాటి బహుమతి పత్రాలు (2) యుధిష్ఠిర శకం 168 నాటి ఉత్తర కెనరా జిల్లాలోని బనవాసి గ్రామంలోని మధుకేశ్వర ఆలయంలో కనుగొనబడిన శాసనం. (3) మైసూరు రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో గుర్తించిన శాసనం కూడా యుధిష్ఠిర శకం నాటిదే. 

ఈ శాసనాలు చాలు… మహాభారతం నిజంగా జరిగిందని చెప్పటానికి ప్రత్యక్ష ఆధారాలు.

చారిత్రక ఆధారాలు

మహాభారతంలో వివరించిన అనేక సంఘటనలను సూచించే సందర్భాలు బౌద్దులు మరియు జైనులు పవిత్రంగా భావించే గ్రంథాలలో ప్రస్తావించారు కూడా. మహాభారతం ఒక కల్పిత కథే అయితే ఇన్ని మతపరమైన గ్రంథాలలో దాని గురించి వివరించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇంకా ముఖ్యంగా ఈ గ్రంధాలు అన్నీ ఒకే కాలంలో రాసినవి కూడా కావు. అందుకే ఈ గ్రంథాలను, అందులో ప్రస్తావించిన విషయాలను మహాభారతం వాస్తవం అని చెప్పడానికి బలమయిన ఆధారాలుగా చూపించవచ్చు. 

ఉదాహరణకు, మహాపరినిబ్బన సుత్త అనే బౌద్ధ గ్రంథంలో కురు రాజ్యం, ఇంకా హస్తినాపురం గురించిన వివరణ కనిపిస్తుంది. ఈ రెండూ మహాభారతంలో ఎంత ప్రముఖమయిన ప్రదేశాలు మనందరికీ తెలుసు.

ఇది కూడా చదవండి:Uncovering the Mysteries of Krishna’s Mahasamadhi

మెగస్తనీస్ పరిశోధనలు

మన దేశంలో లభించిన ఆధారాలే కాకుండా ఇతర దేశస్థులు కూడా తమ పరిశోధనలలో పేర్కొన్న విషయాలు మహాభారతం ఖచ్చితంగా జరిగిందనే వాదనను బలపరుస్తున్నాయి. ఉదాహరణకు, గ్రీకు చరిత్రకారుడు అయిన మెగస్తనీస్ తన పరిశోధనలలో చంద్రగుప్త మౌర్య రాజును శ్రీ కృష్ణుని వంశంలో 138వ రాజుగా పేర్కొన్నాడు. అంటే శ్రీ కృష్ణుడు పూర్వ కాలంలో ఉన్నాడని, అతని వారసులలో వచ్చిన ఒకడే ఈ చంద్రగుప్త మౌర్య మహారాజు. 

మనం చూస్తున్న అణుసాంకేతికత ఎప్పటిది?

మహాభారతం గురించి చెప్పుకునేటప్పుడు ఏది మరిచిపోయినా కురుక్షేత్ర సంగ్రామం గురించి, దాని ద్వారా జరిగిన విధ్వంసం గురించి ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్నో లక్షల మంది ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆ కాలంలో ఇంత విధ్వంసం ఎలా జరిగింది అనే సందేహం రావటం సహజం. జపాన్‌పై మొదటి అణు బాంబు పడేంత వరకూ ఆ స్థాయిలో విధ్వంసం జరగటం మానవాళికి తెలియదు. అయితే, ఈ తరహా విధ్వంసం ఎంతో ముందుగానే మహాభారత కాలంలో జరిగిందని కొందరు గొప్ప శాస్త్రవేత్తలు కూడా నమ్మారు. 

మహాభారత శ్లోకాలలో కొన్ని పదాలు ఈ ఆలోచనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కొన్ని శ్లోకాలలో వేగవంతమైన మరియు శక్తివంతమైన విమానాలు ఎగరటం గురించి, విశ్వం యొక్క శక్తితో ఏర్పడిన రాకెట్  ని విసిరారని చెప్పారు. దాని ప్రభావంతో పదివేల సూర్యుల వెలుతురును, వేడిని, పొగ, ఇంకా అగ్ని జ్వాలలు ఏర్పడ్డాయని కూడా చెప్పారు.  

హరప్పా మరియు మొహెంజో-దారో త్రవ్వకాలు పూర్తి స్థాయిలో జరిగినప్పుడు, శాస్త్రవేత్తలు అక్కడి నగరాలలో చెల్లాచెదురుగా పడిఉన్న అస్థిపంజరాలను కనుగొన్నారు. అందులో చాలా మంది చేతులు పట్టుకుని చనిపోయినట్లు, దీనిని ఏదో భయంకరమైన వినాశనం జరిగిన దానికి సంకేతంగా గుర్తించారు. 

ఈ అస్థిపంజరాలు వేల సంవత్సరాల నాటివి అని, అన్ని సంవత్సరాల క్రితం ఇటువంటి వినాశనం జరగడానికి కారణం ఏమి కావచ్చు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఈ అస్థిపంజరాలలో గుర్తించిన రేడియోధార్మికత హిరోషిమా మరియు నాగసాకిలో జరిగిన అణుదాడిలో ఏర్పడిన అత్యంత రేడియోధార్మికతకు సమానంగా ఉన్నదని కూడా గుర్తించారు. మహాభారత యుద్ధం ఖచ్చితంగా జరిగింది అని, దాని వలన జరిగిన వినాశనానికి ఇవే ఆధారాలని కొందరు చెప్పారు. 

ఈ త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు, ఒక ప్రదేశంలో, సోవియట్ శాస్త్రవేత్తలు సాధారణం కంటే 50 రెట్లు ఎక్కువ రేడియోధార్మిక స్థాయిని కలిగి ఉన్న ఒక అస్థిపంజరాన్ని కనుగొన్నారు అని చెప్తారు. ఉత్తర భారతదేశంలో పురావస్తుశాఖ వారు కనుగొన్న కొన్ని నగరాల్లో గొప్ప పరిమాణంలో పేలుళ్ల సంకేతాలను గుర్తించారని చెబుతారు. గంగానది మరియు రాజ్‌మహల్ పర్వతాల మధ్య కనుగొన్న అలాంటి ఒక నగరం తీవ్రమైన వేడికి లోనైనట్లు కనిపిస్తోంది అని చెప్పారు. 

భారతదేశంలో జరిగిన అణు సంఘటనకు సంబంధించిన ఈ ఆధారాలు, సంకేతాలు, మహాభారత యుద్ధం వాస్తవానికి జరిగిందని చెప్పడానికి బలమైన సాక్ష్యాలలో ఒకటిగా చూపబడినది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణు సాంకేతికతను ఉపయోగించుకొని అణ్వాయుధాలను తయారు చేయడానికి ఏర్పడిన పరిశోధనా కార్యక్రమం అయిన మాన్హట్టన్ ప్రాజెక్ట్  (Manhattan Project) గురించి వినే ఉంటారు. ఈ ప్రాజెక్ట్ ను భౌతిక శాస్త్రవేత్త అయిన J. Robert Oppenheimer పర్యవేక్షించాడు. భూమిపై మొట్టమొదటి అణు బాంబును పేల్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ శాస్త్రవేత్త “మొదటి అణు బాంబు కాదు, మనకు తెలిసిన ఆధునిక కాలంలో మొదటి అణు బాంబు” అని సంబోదించాడు. అంటే ఇతను పూర్వకాలంలో అణుసామర్ధ్యం ఉండటం గురించి ఏకీభవించాడు. 

ప్రాచీన భారతఖండంలో అణ్వాయుధాలను ఉపయోగించారని అతను బలంగా నమ్మాడు. ఇతిహాసాలలో లభించిన ఖచ్చితమైన వివరణల ప్రకారం, మహాభారత యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు ఆధునిక అణ్వాయుధాలతో సరిపోలే విధంగా ఉన్నాయని ఓపెన్‌హీమర్‌ని నమ్మేలా చేసింది. అయితే దానికి తగ్గ సరయిన ఆధారాలను ప్రపంచానికి చూపించలేకపోయారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఒక ప్రాంతంలో ఇప్పటికీ రేడియోధార్మికత ఎక్కువగా ఉందని కూడా కొందరు చెబుతారు. అయితే ఇందులో నిజం ఎంత అంటే ఖచ్చితమయిన సమాధానం దొరకలేదనే  చెప్పాలి.

చివరిమాట 

తెలిసింది కదా Friends! ఇన్ని వివరాలు, ఆధారాలు తెలిసిన తరువాత మహాభారతం నిజంగా జరిగిందా లేదా అనే సందేహానికి మీకు సమాధానం దొరికిందా? లేదా? అనేది కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top