పునీత్ మరణం ఇండస్ట్రీ ని కుదిపివేసింది. ముఖ్యంగా కన్నడిగుల చేత కంట తడి పెట్టించింది. పునీత్ కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకన్నా గొప్ప దాత కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈ కారణంగానే చనిపోయిన తర్వాత కూడా పునీత్ ప్రజలందరి హృదయాల్లో బతికే ఉన్నారు, మరీ ముఖ్యంగా నలుగురు వ్యక్తుల కళ్ళతో ఈ లోకాన్ని చూస్తున్నారు.
మొదటినుంచీ పునీత్ సేవాభావం కలిగి ఉండేవాడు. తనకి చేతనైనంతలో నలుగురికీ సహాయపడాలి అనుకొనేవారు. ఆయనకున్న ఈ గొప్ప గుణం కారణంగా… చనిపోయిన తర్వాత అయన కళ్లు ఇతరులకు ఉపయోగపడాలని నేత్ర దానం చేశారు. దీంతో పునీత్ ఫ్యామిలీ ఆయన కళ్ళని బెంగుళూరులోని నారాయణ నేత్రాలయానికి అప్పగించారు.
అయితే ఇప్పుడు ఆయన నేత్రాలని నలుగురికి అమర్చినట్టు నారాయణ నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణంగా ఒక వ్యక్తి డొనేట్ చేసిన కళ్లని ఇతరులకి అమర్చినప్పుడు ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుంది. కానీ, ఇప్పుడు నలుగురికి చూపు వచ్చే విధంగా అమర్చామని తెలిపారు. అందుకోసం, పునీత్ కంటిలోపల కార్నియాలో గల సుపీరియర్ లేయర్, డీపర్ లేయర్ ని సపరేట్ చేశారు. ‘సూపర్ ఫీషియల్ కార్నియల్’ వ్యాధి ఉన్న వారికి సుపీరియర్ లేయర్ నీ, ‘డీప్ కార్నియల్ లేయర్’ వ్యాధి ఉన్న వారికి డీపర్ లేయర్ నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయటం జరిగింది. ఈ విధంగా పునీత్ కళ్ళు మొత్తం నలుగురికి చూపునిచ్చాయి. బహుశా కర్ణాటకలో ఎక్కడా కూడా ఇలాంటి ఐ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగి ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. మరి అదే పునీత్ కళ్లకున్న ప్రత్యేకత.