ఏదైనా చిన్న కష్టం వస్తేనే విలవిలలాడిపోతాం. మనుషులమై ఉండి… ఆలోచనా శక్తి కలిగి ఉండి… ఏదైనా చేయగల సత్తా ఉండీ కూడా ఒక్కోసారి ఏమీ చేతగాని వాళ్ళు లాగా మిగిలిపోతాం.
చిన్న విషయానికే అంతలా భయపడే మనం ఇక పక్షవాతం వస్తే… అంతే సంగతులు. ఇక మన పని అయిపోయిందిరా బాబూ అనుకుంటాం. కానీ, ఒక చిన్న ఏనుగుపిల్ల పక్షవాతాన్ని సైతం జయించిందంటే… దాని సంకల్ప బలం ముందు మనం కూడా వేస్ట్ అనిపిస్తుంది.
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో యానిమల్ వీడియోస్ కూడా తక్కువేం కాదు. ఆ కోవకి చెందిందే ఈ వీడియో కూడా.
సాదారణంగా గున్న ఏనుగులన్నాక ఏదో ఒక అల్లరి చేస్తుంటాయి. అవి చేసే ముద్దు పనులు చూస్తుంటే మనకి కూడా ముచ్చటేస్తుంది. కానీ, ఇక్కడ ఒక గున్న ఏనుగు పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ… తనూ అందరిలా నడవాలని చేసే తాపత్రయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
పక్షవాతానికి గురైన కెరియో అనే ఓ అనాథ ఏనుగుపిల్ల తనకొచ్చిన జబ్బుని చూసి ఏనాడూ బాధపడలేదు. ఎంతో గుండె నిబ్బరంతో ఎదుర్కొంది. తన సంరక్షకుని సాయంతో… ఈ జబ్బుని జయించడానికి ప్రయత్నించింది.
పక్షవాతానికి గురై… తన వెనుక రెండు కాళ్ళూ చచ్చుబడిపోవటంతో… రోజులు గడిచేకొద్దీ ఆ కాళ్ళలో బలం పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది. దీంతో బలవంతంగా శక్తిని కూడదీసుకొని… చిన్నగా ఒక్కో కాలు తన స్వాధీనంలోకి తెచ్చుకుని… మెల్లిగా ఒక్కో అడుగూ వేస్తూ… నడవటానికి ప్రయత్నించింది. అలా ప్రయత్నించి… ప్రయత్నించి… ఇప్పుడు పూర్తిగా విజయం సాధించింది.
ఈ గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరారై పోయింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు గున్న ఏనుగు పట్టుదలకి ఫిదా అయిపోయారు.