నవ గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శని గ్రహం. శనిదేవుడు కర్మలని ఇచ్చేవాడు అంటారు. మనం చేసిన పాప పుణ్యాల ఫలాలన్నీ ఇక్కడే అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు. ప్రతి మనిషి జీవితంలోనూ శనిదశ అనేది ఉంటుంది. ఆ సమయంలో శనిదేవుడు మనచేత మంచి పనులు చేయిస్తూ… మనల్ని సక్రమమైన దారిలో నడిపిస్తూ ఉంటాడు.
అయితే, శని దేవుడు స్వభావంలో చాలా కోపంగాను… రంగులో… నల్లగాను ఉంటాడు. అంతేకాదు, ఇంకా మనం ఆయనకి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, నల్ల వస్తువులు వంటివి కూడా సమర్పిస్తూ ఉంటాం. ఇలా అంతా ఎందుకు చేస్తామో ఎప్పుడైనా ఆలోచించారా..!
శనిదేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో… ఆయన నలుపుని మాత్రమే ఎందుకు ఇష్టపడతాడో… ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం, సూర్య భగవానుడు దక్ష ప్రజాపతి కూతురైన సంధ్యని వివాహం చేసుకుంటాడు. ఈ దంపతులకి యముడు, యమున, మనువు అనే వారు పుడుతారు.
అయితే, రానురాను సూర్యుని తేజస్సుని సంధ్య భరించలేకపోతుంది. తనకోసం కొంత తేజస్సుని తగ్గించుకోవలసినదిగా కోరుతుంది. కానీ, సూర్య భగవానుడు తనకి ఆ తేజస్సు పుట్టుకతో వచ్చిందని… దానిని తగ్గించుకోవటం కుదరదని చెప్తాడు.
దీంతో చేసేదేమీ లేక సంధ్య తన ఛాయకి ప్రాణం పోసి దానిని సూర్యుని వద్ద వదిలి… తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇదేమీ తెలియని సూర్య భగవానుడు… ఛాయే తన భార్య సంధ్య అని భావించి… ఆమెతో యదావిధిగా కాపురం చేస్తాడు.
కొంతకాలం తర్వాత ఛాయ గర్భవతి అవుతుంది. అప్పటినుంచీ ఆమె పరమశివుడిని గురించి తపస్సు చేస్తుంది. ఆ క్రమంలో ఆమె సరైనా ఆహారం తీసుకోలేకపోతుంది. దీంతో కొంత కాలానికి పోషకాహార లోపంతో శని దేవుడు పుడతాడు. అంతేకాక, నల్లటిరంగు కలిగి ఉంటాడు. కానీ, గర్భంతో ఉన్నప్పుడు ఛాయ పరమశివుడిని ధ్యానించింది కాబట్టి, పుట్టుకతోనే శని దేవుడికి మహాదేవుడి అనుగ్రహం ఉంటుంది. అంతేకాక, పుట్టుకతోనే కొన్ని శక్తులని కూడా కలిగి ఉంటాడు.
శనీశ్వరుడి రంగు చూసిన సూర్య భగవానుడు తన పోలికలు ఏమాత్రం లేకపోవటంతో… నా బిడ్డ కాదు పొమ్మంటాడు. అలా తండ్రి తిరస్కరించాడన్న కోపంతో… సూర్యునివైపు తీవ్రంగా చూస్తాడు శనిదేవుడు. వెంటనే, సూర్యుడు కాస్తా… నల్లగా మారిపోతాడు. ఇంకా కుష్టు వ్యాధి కూడా వస్తుంది. దీంతో శనిదేవుడు తన తప్పుతెలుసుకొని క్షమాపణ కోరడానికి శివుని వద్దకు వెళుతాడు.
అప్పుడు శని దేవుడిని గ్రహాలన్నిటిలోనూ శక్తివంతమైన గ్రహంగా మార్చి… ప్రజలకి కర్మలు ఇచ్చేవాడిగా ఉండమని వరం ఇస్తాడు.
ఇక తన నల్లటి రంగు కారణంగా ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాడో తెలుసు కాబట్టే… శని దేవునికి నలుపు రంగు అంటే విపరీతమైన ఇష్టం. అప్పటి నుంచి శని దేవుడికి నల్లటి బట్టలు, నల్ల నువ్వులు, నల్లటి వస్తువులు సమర్పించడం ఆనవాయితీ అయింది.
ఇలా చేయటం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. అంతేకాక, ఆపదలో ఉన్న వ్యక్తికి సాయమందిస్తే… శనిదేవుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి.