ఇప్పటివరకూ వినాయకుడు పాలు తాగటం, సాయి బాబా కళ్ళు తెరవటం వంటి వార్తలని చాలా సార్లు విని ఉన్నాం. కానీ, అయ్యప్ప స్వామీ కళ్ళు తెరవటం గురించి ఎప్పుడూ వినలేదు. కానీ, ఈసారి విచిత్రంగా అయ్యప్ప స్వామి విగ్రహం కళ్ళు తెరిచింది, అది కూడా భక్తులందరి సమక్షంలో.
కోయంబత్తూర్ లో ఉన్న మణికంఠ స్వామి ఆలయంలో… 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని మణికంఠుడిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 3 వేల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజారులు మణికంఠుడికి అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు.
వేద మంత్రాల నడుమ అభిషేకం జరుగుతున్న సమయంలో… మణికంఠుడు కళ్ళు తెరవడం భక్తులు గమనించారు. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి భక్తులు నిశ్చేష్టులయ్యారు. విగ్రహం దాదాపు నాలుగుసార్లు కళ్ళు తెరుస్తూ… మూస్తూ… ఉండటం అక్కడి భక్తులందరూ చూశారు.
ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ సర్క్యులేట్ అవుతుంది. దీంతో ఈ వింతని చూడటానికి చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలంతా అక్కడికి వస్తున్నారు.
అయితే, నిజానికి ఈ విగ్రహం అసలు కళ్ళే తెరవలేదట. అభిషేకం జరుగుతున్న సమయంలో కెమేరాలని కిందనుండీ తీయడంతో ఆ విగ్రహం కాస్తా కళ్ళు తెరిచినట్లు కనిపించింది. కానీ, అసలు విషయాన్ని ఒదిలేసి విగ్రహం కళ్ళు తెరిచిందంటూ ఆ నోటా… ఈ నోటా… వినపడేసరికి ఈ రూమర్ కొద్దిసేపటికే చాలా చోట్ల స్ప్రెడ్ అయింది.