How are Hurricanes Named

ఇకపై తుఫాన్లకు మనం కూడా పేర్లు పెట్టొచ్చు!

తుఫాను అంటేనే ఒక మోస్తరు జల ప్రళయం. భారీ గాలులతో, ఎడతెరిపిలేని వర్షాలతో రహదారులు, పట్టణాలు ఏకమై సముద్రాలను తలపిస్తుంటాయి. మరి అలాంటి తుఫానులు ఎలా ఏర్పడతాయి? ప్రాంతాలవారీగా వీటిని ఎలా పిలుస్తారు? తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు? తుఫానులకు పేర్లు పెట్టడంతో పాటించాల్సిన నిబంధనలు ఏమిటి? ఫైనల్ గా మనం కూడా వీటికి పేర్లు పెట్టొచ్చా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ ఆర్టికల్ లో చెప్పుకొందాం.

తుఫాను ఎలా ఏర్పడుతుంది?

గాలులు తక్కువ ఉంటే దానిని ‘అల్పపీడనం’ అంటారు. ఈ అల్పపీడనం తీవ్రమైతే అది ‘వాయుగుండం’గా మారుతుంది. ఆ వాయుగుండం బలపడితే ‘తుఫాను’ ఏర్పడుతుంది. ఈ తుఫాను సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని గ్రహించి, సుడులు తిరుగుతుంది. అలా సముద్రంలో సుడులు తిరుగుతున్న తుఫాను భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్ని ‘తీరం దాటటం’ అంటారు. 

తుఫాన్లను ప్రాంతాలవారీగా ఎలా పిలుస్తారు?

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రం, మరియు హిందూ మహాసముద్రంలో పుట్టే అలజడులను ‘సైక్లోన్‌’ అంటారు. ఉత్తర అట్లాంటిక్‌, మధ్య ఉత్తర పసిఫిక్‌, మరియు తూర్పు ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రాలలో పుట్టే తుఫాన్లను ‘హరికేన్‌లు’గా పిలుస్తారు. వాయవ్య పసిఫిక్‌ మహాసముద్రంలో పుట్టే చక్రవాతాలను ‘టైఫూన్లు’గా వ్యవహరిస్తారు.

తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు? 

అసలు తుఫాన్లకు పేరు పెట్టే సంప్రదాయం 2000 సంవత్సరంలో  మొదలయ్యింది. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్లు కలిసి మొదలు పెట్టాయి. అప్పటినుంచీ బంగాళాఖాతం, మరియు అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులకు రకరకాల పేర్లు పెడుతూ వస్తున్నారు. మొత్తం 7 దేశాలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఈ నిర్ణయాన్ని తీసుకొన్నాయి. అందులో భారత్, బంగ్లాదేశ్, ఒమన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, మరియు థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. ఈ 7 దేశాల్లో…  ఒక్కో దేశం 13 రకాల పేర్లను సూచిస్తుంది. వీటన్నింటినీ కలిపి ఒక జాబితాలా చేసి వరుసగా పేర్లు పెట్టుకుంటూ వస్తున్నారు.

2018 తరువాత ఈ గ్రూపులో సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్,  ఇరాన్, మరియు ఖతార్ దేశాలు కూడా వచ్చి చేరాయి. దీంతో ఈ పేర్ల జాబితాని కూడా అప్డేట్ చేశారు. ఈ 13 దేశాల సభ్యులంతా కలిసి ఓ పానెల్ లా ఏర్పడి తుఫాన్ ల పేర్లను నిర్ణయిస్తుంది. 

ఈ  దేశాలు సమర్పించిన లిస్టు ప్రకారం తుఫాన్లకు పేర్లను పెడతారు. అది కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి. 13 సభ్య దేశాలకు చెందిన తుఫాను పేర్ల యొక్క సమాచారాన్ని అందించడమే వీటి లక్ష్యం. 6 ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది.

ఈ గ్రూపులో ఉన్న అన్ని దేశాలు  సమర్పించిన పేర్లతో తయారైన జాబితాలో ఉన్న పేర్లని వరుస క్రమంలో ఒక్కోటి పెట్టుకుంటూ వస్తారు. 

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 వాతావరణ కేంద్రాలు  తుఫాను  తీవ్రతల మీద పనిచేస్తున్నాయి. ఇవి ప్రపంచ వాతావరణంతో పాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్ లను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ కిందే ఈ 6 వాతావరణ కేంద్రాలు పనిచేస్తాయి. ఈ ఆరింటితో పాటు  ప్రాంతీయ ఉష్ణ మండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు తుఫానులకు సంబంధించిన హెచ్చరికలు, మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సూచనలు చేస్తుంటాయి.

తుపాన్లకు పేర్లు ఎందుకు పెడతారు?

  • తుఫానులకు పేర్లుపెట్టడం వల్ల అటు అధికారులు, సైంటిస్టులు, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియాతోపాటు ఇటు సామాన్య ప్రజలకు సైతం సౌకర్యవంతంగా ఉంటుంది.
  • ప్రతి ఒక్క తుఫానునీ గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది.
  • తుఫాను కదలికల మీద హెచ్చరికలు జారీ చేయడానికి వీలుంటుంది.
  • ఒకేసారి రెండు, మూడు తుఫానులు వచ్చినప్పుడు వాటిని గుర్తించడానికి సులువవుతుంది.
  • ఇలా పేర్లు పెట్టటం వల్ల ఏ తుపాను ఎప్పుడు వచ్చిందన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 
  • ముందుగానే ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి వీలవుతుంది.

తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ఏయే నిబంధనలు పాటించాలి?

  • తుఫాన్ల పేర్లని రాజకీయ, మత, సాంస్కృతిక, లింగ భేదాలకు, చిహ్నాలకు అతీతంగా ఉండాలి. ఇష్టానుసారంగా పేర్లు పెట్టకూడదు.
  • ఏ వర్గం యొక్క మనోభావాలు దెబ్బతినని విధంగా సభ్యదేశాలు పేర్లని  సూచించాలి.
  • తుఫాన్ల పేర్లలో క్రూరత్వానికి తావు లేదు. 
  • తుఫాన్ల పేర్లు పలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి సులువుగా ఉండాలి.
  • పెట్టే పేరు ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే మించి ఉండకూడదు.
  • పేరు ప్రతిపాదించడమే కాదు, దాని స్పెల్లింగ్‌, ఉచ్ఛారణ ఏవిధంగా ఉండాలో కూడా సూచించే  బాధ్యత సభ్య దేశాలదే.
  • నచ్చకపోతే సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణం చేతనైనా తిరస్కరించేందుకు ప్యానెల్‌కు అధికారం ఉంటుంది.
  • ఒకసారి ప్రకటించిన పేర్ల జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు వంటివి చేయవచ్చు.
  • ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు పెట్టిన పేర్లను కేవలం ఒక్కసారి మాత్రమే వాడాలి. మరోసారి ఉపయోగించ కూడదు.

తుఫాన్ల పేర్లు మనం కూడా సూచించవచ్చా?

భారత్‌ ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో ప్రతి పౌరునికీ స్వేచ్చ ఉంది. అందుకే, తుఫాన్ల పేర్లను సూచించడానికి సామాన్య ప్రజలకు సైతం అవకాశం కల్పించారు. అయితే ఈ పేర్లను సూచించేవారు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది.

ఎవరి మనోభావాలు దెబ్బతినని  విధంగా, ఎలాంటి వివాదాలకు చోటివ్వని విధంగా జాగ్రత్త వహించాలి. ఆసక్తి ఉన్నవారు తుఫాన్ల పేర్లని ఈ క్రింది అడ్రెస్ కి పంపించాల్సి ఉంటుంది. 

అడ్రెస్:

ది డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెట్రాలజీ, 

భారత వాతావరణ శాఖ, 

లోధీ రోడ్‌, 

న్యూఢిల్లీ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top