పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలని పరామర్శించి…ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. అందుకోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటివరకూ, ఈ  కార్యక్రమానికి పవన్ తన సొంత నిధులను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. 

పవన్ చేస్తున్న ఈ మంచి పనికి తమ వంతు సాయం అందించాలని, పవన్ కు అండగా నిలవాలని ఇప్పుడు ఆయన ఫ్యామిలీ కూడా ముందుకొచ్చింది. ఈమధ్యనే రీసెంట్ గా మెగా హీరోస్  వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5లక్షలు, అలాగే మెగా డాటర్ నిహారిక రూ.5లక్షల చొప్పున విరాళంగా అందజేశారు.

ఇక తాజాగా పవన్ మాతృమూర్తి అంజనా దేవి కూడా విరాళం అందించారు. పవన్ తండ్రి కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా ఆయన సతీమణి అంజనాదేవి తన పెన్షన్ డబ్బుల నుంచి రూ.లక్షన్నర విరాళం అందచేశారు. ఈ విరాళాన్ని నేరుగా కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి చెందేలా అందచేశారు. దీంతో పాటు మరో రూ. లక్ష విరాళం జనసేన పార్టీకి అందించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పవన్‌ని కలిసి దీని తాలూకు చెక్కలను ఆమె  అందజేశారు.

ఈ విషయమై స్పందించిన పవన్ కళ్యాణ్…  ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలకు మా అమ్మ తన పెన్షన్ డబ్బులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మా తండ్రిగారు అబ్కారీ శాఖలో పనిచేసేవారు. ఆయనకొచ్చే ఆ కొద్దిపాటి జీతంతోనే మమ్మల్ని పోషించేవారు. 2007లో ఆయన కాలం చేశారు. అప్పటినుంచి మా అమ్మకు పెన్షన్ వస్తోంది. అయితే,  అమ్మ ఆ పెన్షన్ డబ్బులు దాచి… సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అలవాటు. అలానే,  ఈసారి కౌలు రైతు భరోసా కార్యక్రమానికి సాయం చేసింది అని తెలిపారు.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top