సైన్స్‌కి అందని ఓ అద్భుతం… సైంటిస్టులకి కూడా అంతుచిక్కని ఓ మిస్టరీ ఇది. స్మార్ట్ యుగంలో కూడా పునర్జన్మలు ఉన్నాయని… అవి సైన్స్ కే సవాలు విసిరాయని…పొల్లాక్ సిస్టర్స్ స్టోరీ వింటే అర్ధమవుతుంది.
జాన్-ఫ్లోరెన్స్ అనే అమెరికన్ కపుల్ కి 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్ అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. 1957లో, చర్చ్ రోడ్‌లో వీరి స్నేహితుడు ఆంథోనీతో కలిసి నడుస్తున్న సమయంలో వీరి మీదకి ఓ కారు దూసుకొచ్చింది. దీంతో ఆ ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు.
చాలాకాలం వరకూ జాన్ దంపతులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. మెల్లిగా కొన్నేళ్ళకి ఆ యాక్సిడెంట్ ట్రాజెడీని మరచిపోవడం ప్రారంభించారు. 1964లో, ఫ్లోరెన్స్ మళ్లీ తల్లి అయ్యింది. ఈసారి తనకి కవలలు పుట్టారు. వాళ్లకి గిలియన్, జెన్నిఫర్ అని పేర్లు పెట్టారు. వారి బోసి నవ్వులతో, బుడి బుడి అడుగులతో గతాన్ని పూర్తిగా మర్చిపోయి… మళ్ళీ వారింట సంతోషం నిండింది.
ఇదిలా ఉండగా… ఒకరోజు ఈ ట్విన్ సిస్టర్స్ ‘అటకపై దాచి ఉంచిన పాత బొమ్మలు కావాలి, వాటితో ఆడుకుంటాం’ అని తల్లిని అడిగారు. అప్పటి దాకా చూడని ఆ బొమ్మల గురించి వీళ్ళకి ఎలా తెలిసింది? అని ఫ్లోరెన్స్ షాకయింది. అయినా చిన్నారుల కోరిక కాదనలేక… అటకమీద నుంచి ఆ బొమ్మలని తీసి ఇచ్చింది. వాటిని అందుకున్న పిల్లలు వెంటనే ‘ఇవి నా బొమ్మలు… ఇవి నీ బొమ్మలు…’ అని పంచుకోవటం మొదలు పెట్టారు. ఇందులో జొవాన్నా బొమ్మల్ని గిల్లియన్, జాక్వెలిన్ బొమ్మల్ని జెన్నిఫర్ షేర్ చేసుకున్నారు. ఇదంతా జరిగినప్పుడు వాళ్ల వయసు కేవలం 3 సంవత్సరాలే!
ఈసారి ఫ్లోరెన్స్ కి మరో షాకిచ్చారు ఈ కవలలు. చనిపోయిన ఇద్దరు పిల్లల ఫొటోని చూసి ‘ఇది నువ్వు… ఇది నేను…’ అని గుర్తుపట్టడం ఆ తల్లి కళ్లారా చూసింది. పిల్లల మాటలు విన్న ఆమె నోట మాట రాలేదు. వెంటనే ఆ ఫోటో దాచేసింది. అంతేకాదు, వీరి స్వభావాలు కూడా గత జన్మలో ఎలా అయితే ఉండేవో… ఇప్పుడు కూడా అలానే ఉన్నాయట.
వీటన్నిటికన్నా గొప్ప ట్విస్ట్ ఏంటంటే… పిల్లలిద్దరినీ తీసుకొని జాన్ దంపతులు ఎప్పుడైనా గతంలో యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళితే, ఆ ప్లేస్ నీ, వాళ్ళు చదివిన స్కూల్ నీ గుర్తుపట్టే వారట. అంతేకాదు, రోడ్డుపై ఏదైనా కారు వెళ్తుంటే చాలు, అది తమవైపే దూసుకొస్తుందని భావించి ఏడ్చేవారట. ఇలా తల్లిదండ్రులకి షాకుల మీద షాకులిచ్చిన ఈ కవలలు… ఐదారు సంవత్సరాలు వచ్చే వరకూ అచ్చం పొల్లాక్ సిస్టర్స్ లానే బిహేవ్ చేసేవారట.
దీంతో చనిపోయిన తమ పిల్లలు జొవాన్నా, జాక్వెలిన్ లే… గిల్లియన్, జెన్నిఫర్ రూపంలో మళ్ళీ పుట్టారని నమ్మడం మొదలుపెట్టారు. తమకు కలిగిన ఈ అనుభవాలను అందరితో పంచుకోవడం మొదలుపెట్టారు. ఇక ఏడేళ్ల వయసు వచ్చేసరికి.. వీరు గత జన్మ స్మృతులని పూర్తిగా మరచిపోయి… సాధారణ పిల్లల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కానీ, ఇదంతా ఎలా సాధ్యం అనేది మాత్రం నేటికీ అంతుచిక్కని మిస్టరీయే అయినప్పటికీ, ఈ పొల్లాక్ సిస్టర్స్ పునర్జన్మ కథ మాత్రం వినటానికి చాలా వింతగాను, విచిత్రంగాను ఉంది.