కొందరు కురుక్షేత్రంలో పాల్గొనకపోయినప్పటికీ మహాభారత ఇతిహాసంలో వారికి ఎంతో ప్రముఖమయిన స్థానం ఉంది. అలాంటి వారిలో సంజయుడు, విదురుడు ముఖ్యులు.. ఇక ఈ రోజు ఈ ఆర్టికల్ లో మనం విదురుడి గురించి వివరంగా తెలుసుకుందాము.
విదురుడిని క్షత్రి అని కూడా పిలుస్తారు. ఇతను హిందూ ఇతిహాసం అయిన మహాభారతంలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఇతను కురు రాజ్యానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఒక మంత్రిగానే కాకుండా ఇతను కౌరవులకు, పాండవులు మామ కూడా అవుతాడు.
విదురుడి పుట్టుక వెనుక కథ
విదురుడి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే మనం మాండవ్య మహాముని గురించి తెలుసుకోవాలి.
మహాభారత ఇతిహాసం ప్రకారం మాండవ్యుడు అనే మహాముని ఒకసారి తన ఆశ్రమం ముందు నిలబడి చేతులు పైకెత్తి అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు. ఆలా తపస్సు చేస్తున్నప్పుడు ఒక రోజు కొంత మంది దొంగలు ఆ రాజ్య కోశాగారంలోని ధనం దొంగిలించి పారిపోతూ మాండవ్య ముని ఆశ్రమం వైపు వస్తారు. రాజభటులు తమను వెంబడిస్తున్నారని గమనించిన దొంగలు ఏమి చెయ్యాలో తెలియక దొరికిపోతామేమో అనే భయంతో దోచుకున్న సొత్తును మాండవ్య ముని ఆశ్రమంలో వదిలి పారిపోతారు.
రాజభటులు అక్కడికి వచ్చి ఆశ్రమంలో ఉన్న సొత్తును చూసి ఈ ముని కూడా ఆ దొంగల సహచరుడు అని అనుకొని మాండవ్య మునిని బంధిస్తారు. అతనిని దొంగగా అనుకొని ప్రశ్నించినప్పుడు తనపై ఆరోపణలు చేసిన వారితో మాట్లాడేందుకు మాండవ్యుడు నిరాకరిస్తాడు. మరికొంత సేపటికి పారిపోయిన దొంగలు కూడా పట్టుబడతారు. రాజభటులు అందరినీ కలిపి రాజు ముందు హాజరు పరుస్తారు.
అందరిని దొంగలుగా గుర్తించి రాజ్య కోశాగారంలోని దొంగతనం చేసిన నేరానికి వారందరికీ మరణశిక్ష విధిస్తారు. దొంగలను, ఇంకా మాండవ్య మునిని త్రిశూలం కొనపైన నిలబెట్టి మరణించేలాగా ఏర్పాటు చేస్తారు. దొంగలు అందరూ మరణిస్తారు కానీ మాండవ్యుడు మాత్రం సజీవంగా ఉంటాడు.
మాండవ్యుడిని పరమశివుడు అనుగ్రహించి అతనికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు. ఇంకా ఇలా మాండవ్య మునికి శిక్ష విధించారని తెలుసుకొని ఎందరో గొప్ప మునులు, మహా ఋషులు అతని క్షేమం గురించి రాజ్యానికి వచ్చి విచారణ చేస్తారు. ఈ విషయం తెలుసున్న రాజు తాను తప్పు చేసానని గ్రహించి మాండవ్య మునిని క్షమాపణలు కోరతాడు. అతని శరీరానికి గుచ్చిన త్రిశూలాన్ని తియ్యటానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ అతని శరీరంలో గుచ్చుకున్న త్రిశూలం కొనని తీయలేకపోతారు.
ఇక వేరే దారి లేక ఆ కొనని అతని శరీరంలోనే ఉంచి మిగతా త్రిశూలాన్ని కత్తిరించి వేరు చేస్తారు. ఆ త్రిశూలం కొన మాండవ్య ముని శరీరంలో ఒక ఆణి లాగా ఉండిపోతుంది. అప్పటినుండి అతనిని ఆణి మాండవ్య అని కూడా పిలిచేవారు. ఆ త్రిశూలం కొన అలా శరీరంలో ఉండిపోవటం వలన మాండవ్యుడు ఎంతో బాధ అనుభవించేవాడు. ఏదన్నా వస్తువు ఆ ప్రదేశంలో తగిలినప్పుడు బాధతో విలవిల్లాడిపోయేవాడు.
ఒకసారి, మాండవ్యుడు యమధర్మరాజుని కలిసి అమాయకుడిని ఇంకా ఎవ్వరికీ హాని తలపెట్టని తనకు ఎందుకు ఇలాంటి కష్టాలు ఇచ్చావని ప్రశ్నిస్తాడు. అప్పుడు యమధర్మరాజు మాండవ్యుడితో ఇలా చెప్తాడు.
నీవు చిన్నతనంలో పక్షులను చాలా రకాలుగా హింసించేవాడవని ఆ పాపానికి ప్రతిఫలంగానే ఈ శిక్ష అనుభావిస్తున్నావు అని చెప్తాడు.
అయితే, పన్నెండు సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు చేసిన ఏ పని కూడా పాపం లాగా పరిగణించకూడదని ధర్మశాస్త్రాలు చెప్పాయని, బాల్యంలో చేసిన పనికి తనకు అన్యాయంగా శిక్ష వేశారని మాండవ్యుడు యమధర్మరాజుతో వాదిస్తాడు.
ఉత్తమ బ్రాహ్మణుడయిన తనను ఈ విధంగా శిక్షించి చంపాలని చూసిన యమధర్మరాజు చాలా పెద్ద పాపం చేసాడని చెప్పి అతనిని భూలోకంలో శూద్రునిగా పుట్టమని మాండవ్య మహాముని శపిస్తాడు. ఈ శాపం వల్ల, యమధర్మరాజు మహాభారత కాలంలో విదురుడిగా జన్మించాడని చెప్తారు.
విదురుడు ఎలా పుట్టాడు
ఇక ఇప్పుడు మనం విదురుడు ఎలా పుట్టాడో, ఎవరికి పుట్టాడో తెలుసుకుందాము.
మహాభారతంలో శంతన మహారాజుకి తన భార్య సత్యవతికి చిత్రాంగద, తరువాత విచిత్రవీర్య అనే కుమారులు కలుగుతారు. వీరికి భీష్ముడు, కృష్ణ ద్వైపాయన వ్యాసుడు సవతి సోదరులు.